MohanPublications Print Books Online store clik Here Devullu.com

బాల్యంలోకి అడుగులేద్దాం_GotoPastChildLife


 బాల్యంలోకి అడుగులేద్దాం GotoPastChildLife GotoPastLife Childhood ChildhoodMemories ChildhoodLife Bhakthi Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu Bhakti Pustakalu Eenadu EenaduEditorialNews EenaduSundayPaper


బాల్యంలోకి అడుగులేద్దాం!

అప్పుడే మనసుకు ఆరోగ్యం, ఆనందం


బాల్యం... ఓ మధుర జ్ఞాపకం. చిరకాలం నిలిచిపోయే శిలాక్షరం. కల్లాకపటం ఎరుగని మనస్తత్వం.. ఉన్నది ఉన్నట్లు బయటికి చెప్పేసే బోళాతనం.. కొత్తకొత్త విషయాల్ని తెలుసుకోవాలనే ఉత్సాహం.. ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసే అమాయకత్వం.. ఆటలతో ఆరోగ్యాన్ని పెంచుకునే చలాకీతనం.. ఇవన్నీ బాల్యానికే సొంతం. ‘మళ్లీ ఆ రోజులొస్తే ఎంత బావుండు’ అని ఆశపడని మనసుండదు. మరి ఆ రోజులు మళ్లీ రావాలంటే పెద్దయ్యాక ఏం చేయాలి? మన జీవన శైలిని కొద్దిగా మార్చుకుంటే.. ఎంచక్కా ఆ ‘పాత మధురాల్ని’ ఆస్వాదించొచ్చు, ఒత్తిడికి దూరం కావొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. చిన్న నాటి అలవాట్లను పునరావృతం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రత్యేక కథనం..

పెద్దల్లో కంటే పిల్లల్లో విశ్వాసం, ధైర్య సాహసాలు ఎక్కువగా ఉండటానికి కారణాలు వారికి ఉండే అలవాట్లే. ఆరోగ్యంగా ఎదగడానికి, పనిలో వేగంగా నైపుణ్యం సాధించడానికీ బాలలకు ఈ అలవాట్లే ఉపకరిస్తున్నాయి. పెద్దయ్యాక ఇదే అలవాట్లను పునరావృతం చేస్తే జీవితంలో ఎన్నో అద్భుతాలు సాధించొచ్చు, మరెన్నో సమస్యలు, సవాళ్లు, ఒత్తిళ్లను అధిగమించొచ్చు.

త్వరగా నిద్రపోండి: రాత్రి 8 గంట కొట్టగానే నిద్రకు ఉపక్రమించి.. పొద్దున లేవగానే ఎంతో శక్తితో, చలాకీగా తిరిగే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తున్నాయా!! ఆ రోజులు మళ్లీ రావాలంటే... రాత్రిపూట టీవీలు, నెట్‌ చూడటం, పార్టీలకు హాజరుకావడం.. ఇవన్నీ మానేసి త్వరగా నిద్రపోండి.

ఆటలు ఆడండి: చిన్నప్పుడు పాఠశాలలో, ఇంటికొచ్చాక ఒకటే ఆటలు!! ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచే బ్యాడ్మింటన్‌, ఫుట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, ఈత.. ఇలాంటి రకరకాల ఆటల్ని పెద్దయ్యాకా ఆడండి. మానసిక, శారీరకోల్లాసానికి క్రీడలు ఎంతో అవసరం.

ఫోన్లలో కాదు.. మిత్రుల్ని స్వయంగా కలవండి: బాల్యంలో మిత్రుడికి ఏదైనా విషయం చెప్పాలంటే స్వయంగా కలుసుకునే వాళ్లం. ఇప్పుడు ప్రతిదానికీ సెల్‌ఫోన్‌నే వాడేస్తున్నాం. అలా కాకుండా కొన్ని గంటలు ఫోన్‌ను పక్కనపెట్టి.. మిత్రుణ్ని స్వయంగా కలుసుకుని మనసువిప్పి మాట్లాడుకోండి.

అనుభూతుల్ని పంచుకోండి: పాఠశాలలో ఉపాధ్యాయుడు చెప్పిన విషయాలు, మిత్రుడితో గొడవ.. ఇలా ప్రతి విషయాన్ని ఇంటికొచ్చాక తల్లిదండ్రులతో చెప్పుకునే వాళ్లం. పెద్దవాళ్లయ్యాక.. అది మానేసి.. తలుపులు బిడాయించుకుని సినిమా చూడటమో, సెల్‌ఫోన్‌లో మాట్లాడటమో చేసున్నాం. అలా కాకండా తల్లిదండ్రులతో కూర్చుని కాసేపు ముచ్చట్లాడితే మనసు కుదుటపడుతుంది.

మరిన్ని ప్రశ్నలు అడగండి: కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం కోసం చిన్నప్పుడు తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, మిత్రుల్ని పదే పదే ప్రశ్నలతో ముంచెత్తేవాళ్లం.. గుర్తుందా!! నేర్చుకునే దానికి వయసు అడ్డుకాదు కాబట్టి పెద్దయ్యాకా .. ఇదే ధోరణి అనుసరించండి. ఇతరుల నుంచి తెలుసుకోవడానికి ప్రయత్నించండి.

కెఫిన్‌ వదిలేయండి: జ్యూస్‌ చిన్నప్పుడు ఎంతో ఇష్టమైన డ్రింక్‌. పండ్ల రసాల్లాంటి జ్యూస్‌ మన ఒత్తిళ్లను తగ్గించదని, కాఫీ తాగితే మంచిదని పెద్దయ్యాక అనుకుంటాం. ఆ ఆలోచన మానండి. మళ్లీ జ్యూస్‌ వైపు మళ్లండి.

మరిచిపోండి.. మన్నించండి: చిన్నప్పుడు ఎంతోమందితో గొడవపడుతుంటాం. దాన్ని మరిచిపోయి కొద్దిసేపటికే మళ్లీ స్నేహం చేసేస్తుంటాం. పెద్దయ్యాకా అలాంటి అలవాటే ఉంటే.. ఎన్నో సమస్యల నుంచి బయటపడొచ్చు. క్షమాగుణం అలవరచుకోవడం ముఖ్యం.

చదువుతూ నిద్రపోండి: నిద్రపోయే ముందు కాసేపు ఇంటర్నెట్‌ను ఆపేయండి. పుస్తకం చదవడం మొదలుపెట్టండి. కళ్లను ఒత్తిడికి గురిచేసే డిజిటల్‌ స్క్రీన్‌ కన్నా.. పుస్తకం చదవడం వల్ల త్వరగా, హాయిగా నిద్ర వస్తుంది.

ఎక్కువగా పట్టించుకోవద్దు: మన గురించి ఇతరులు ఎదో అనుకుంటున్నారని మరీ అతిగా ఆలోచించొద్దు. చిన్నపిల్లల మనస్తత్వంతో వ్యవహరించి...ఇతరులకు హాని చేయని రీతిలో.. మీకు ఏది మంచిది అనిపిస్తుందో అదే చేయండి.

అమ్మ చేతి వంటనే తినండి: చిన్నప్పుడు అమ్మచేసిన వంట తినడం వల్లే ఆరోగ్యంగా పెరిగాం. కాబట్టి పెద్దయ్యాకా... బయటి తిండిల జోలికి వెళ్లకుండా అమ్మ చేసిన ఆహారాన్నే తినండి.

ఉన్నది ఉన్నట్లు చెప్పండి: నిజమేందో, అబద్ధమేందో విశ్లేషించే సామర్థ్యంలేని బాల్యంలో మనసులో ఏది అనిపిస్తే దాన్ని బయటికి చెప్పేసేవాళ్లం. ఇప్పుడూ అలాంటి అలవాటే చేసుకోండి. అన్ని విషయాల్నీ మనసులో దాచేసుకుని మనశ్శాంతిని కోల్పోవద్దు.

ప్రేమిస్తున్నానని చెప్పండి: మీరు ఎవరినైనా అభిమానిస్తున్నా.. ప్రేమిస్తున్నా ఆ విషయాన్ని మనసులో దాచుకోకుండా వెంటనే చెప్పేయండి. బాల్యంలో అలా చెప్పడం వల్లే ఎందరో స్నేహితులు, అభిమానుల్ని సంపాదించుకోగలిగాం.

కావాల్సింది అడిగేయండి: చిన్నప్పుడు మనకు ఏదైనా కావాల్సి వస్తే నిర్భయంగా మన చుట్టూ ఉన్న వాళ్లను అడిగేసే వాళ్లం. పెద్దయ్యాక ఎందరం అలా అడుగుతున్నాం? అలా అడగకుండా ఎన్నిసార్లు నష్టపోలేదు? కాబట్టి అడగడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సంకోచించొద్దు.

క్షమాపణ తప్పుకాదు: ఏదైనా తప్పుచేసినపుడు క్షమాపణ చెప్పడం తప్పుకాదు. అది మన గౌరవాన్ని పెంచుతుంది. అపోహల్ని తొలగిస్తుంది. ఇతరుల మనసు బాధపడిందని గుర్తించినపుడు చిన్నపిల్లలు క్షమాపణ చెబుతారని గుర్తించడం మరవకండి.

ఓటమికి వెరువద్దు: ఓ పనిలో వైఫల్యం చెందినా.. పిల్లలు పదేపదే ప్రయత్నించి విజయాలు సాధించిన సందర్భాలు అనేకం. అందువల్ల పెద్దయ్యాకా.. ఓడిపోయామని భయపడకుండా మళ్లీ మళ్లీ విజయం కోసం ప్రయత్నించండి.

ఆసక్తిని చంపుకోవద్దు: ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి చిన్నప్పుడు చూపే ఆసక్తి చాలా ఎక్కువ. పెద్దయ్యాకా ఇదే అలవాటును కొనసాగించండి.

ఏడవండి: బాధేసినపడు ఇతరులు చూస్తున్నా సరే చిన్నప్పుడు గట్టిగా ఏడ్చేవాళ్లం. ఇప్పుడు ఒంటరి ప్రదేశంలో ఉన్నా సరే.. బాధను మనసులోనే దిగమింగుకుంటున్నాం. కానీ ఏడవడం వల్ల మనలోని బాధ చాలావరకు తగ్గిపోతుంది. మనసు కుదుటపడుతుంది. ఆరోగ్యానికీ మంచిది.
                 

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list