MohanPublications Print Books Online store clik Here Devullu.com

మాఘమాసం_MaghaMasam

మాఘమాసం MaghaMasam radhasapthami lordsurya bhakthibooks

పవిత్ర మాఘం 

పర్వదినాలు అంటే ‘పూర్ణిమ’ రోజులు. ఇవి దేవతలకు అత్యంత ప్రీతికరమని భక్తులు విశ్వసిస్తారు. మాఘమాసంలో పవిత్ర స్నానాలు చేసి, ఇష్టదైవాల్ని పూజిస్తారు. సాగర తీరాన నివసించేవారు అక్కడ స్నానాదులు ముగించి జపాలు, దానాల వంటి సత్కర్మలు ఆచరిస్తారు. నదీస్నానం చేసినా, అందుకు అవకాశం లేనివారు బావి లేదా చెరువు నీటితో గంగను స్మరిస్తూ స్నానం గావించినా అదీ పుణ్యప్రదమేనని ఓ నమ్మకం.

మాఘమాసంలో మరో నాలుగు పండుగలున్నాయి. మాఘ శుద్ధ అష్టమి మఘా నక్షత్రంనాడు- భీష్మాష్టమి. సప్తమి-సూర్య సప్తమి (రథ సప్తమి). మాఘ బహుళ చతుర్దశి- శివరాత్రి. మాఘ బహుళ అమావాస్య, మాఘ మాసాంతం- ద్వాపర యుగాది.

మాఘశుద్ధ అష్టమి తిథినాడు భీష్ముడు పరమపదించాడు. ఉత్తరాయణం ప్రవేశించిన తరవాత, మాఘ శుద్ధ అష్టమినాడు ఆయన స్వచ్ఛంద మరణం పొందాడని ‘మహాభారతం’ చెబుతోంది. శ్రీకృష్ణుడు ఆయన దగ్గరే ఉన్నాడు. తన మరణానంతరం వచ్చే ఏకాదశి పుణ్యదినాన్ని ‘భీష్మ ఏకాదశి’గా లోకం గుర్తించేలా వరం కోరతాడు భీష్ముడు. కృష్ణుడు అనుగ్రహించాడని ‘నారద పురాణం’ విశదీకరిస్తోంది. భారత యుద్ధం ముగిశాక, అంపశయ్యమీద ఉత్తరాయణ పుణ్యకాలం వరకు ఉన్న భీష్ముడికి కృష్ణుడు తన వాగ్దానం ప్రకారం దర్శనమిస్తాడు. అప్పుడు భీష్ముడు చేసిన స్తుతి ‘భీష్మ స్తవం’గా పేరొందింది. దాన్ని ఆయన ‘కృష్ణాయ నమః’ అని ముగిస్తాడు. అది శ్రీకృష్ణ మహామంత్రంగా నిలిచిపోయింది.
ఇదే మాసంలో స్మరించాల్సిన పౌరాణిక గాథల్లో మార్కండేయుడి చరిత్ర ఒకటి. అతడికి పరమేశ్వరుడు ప్రసాదించింది పదహారు సంవత్సరాల ఆయుర్దాయమే! అది పూర్తయిన వెంటనే భటుల్ని పంపుతాడు యముడు. ఆ సమయంలో అతడు శివ ధ్యానం చేస్తుండటంతో, భటులు ఆ దరిదాపులకైనా వెళ్లలేకపోతారు. ఒక మహా తేజస్సు వారిని అక్కడి నుంచి తరిమేస్తుంది. విషయం తెలిసి, యమధర్మరాజే అక్కడికి చేరుకుంటాడు. పాశంతో మార్కండేయుడి ప్రాణాలు హరించడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు అతడు శివలింగాన్ని హత్తుకొని, ఆ స్వామిని ధ్యానిస్తాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై, యముడి పైకి త్రిశూలాన్ని ప్రయోగించి, భక్త మార్కండేయకు చిరంజీవత్వాన్ని ప్రసాదిస్తాడు. అన్నింటికీ మూలం మాఘంలో రోజూ ఉదయమే సాగిన గంగాస్నానం, ఈశ్వర ధ్యానం అని వివరిస్తుంది ‘మాఘ పురాణం’.

భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో స్నానానికి ఎంతో ప్రాముఖ్యముంది. పలు విధాల స్నానాలుంటాయి. అవి- మంత్ర, వాయవ్య, ఆగ్నేయ, కాపిల, వారుణ, మునుమానస స్నానాలు. వేదమంత్రాలు చదువుతూ చేసేది మంత్ర స్నానం. గోధూళి పైన చల్లుకొని చేసే స్నానం వాయవ్యం. విభూతి రాసుకొని చేస్తే ఆగ్నేయం. శరీరం పైభాగాల్ని తడి వస్త్రంతో తుడుచుకోవడం కాపిలం. ఎండలో స్నానం ఆచరించడం ఆతపం. సాధారణ స్నానం- వారుణం. విష్ణుస్తుతితో చేసే స్నానం మునుమానసం. ఇవన్నీ శారీరక, మానసిక పరిశుభ్రతకు దోహదపడతాయి. మాఘస్నానం చేసి, విష్ణువును పూజించి, దానం తరవాత పురాణ శ్రవణం నిర్వర్తించడం సంప్రదాయం.

అన్ని అంతరాలకూ అతీతంగా పాటించాల్సిన పద్ధతులివి. మాఘమాసం శివకేశవులిద్దరికీ ఇష్టమైనది. దేవతార్చనలో- శివుణ్ని, విష్ణువును, వారి అవతార మూర్తులను స్తుతించవచ్చు. మాఘ స్నానం వల్ల బుద్ధి, వికాసం, ఆరోగ్యం అభివృద్ధి చెందుతాయి. శరీరం ఉల్లాసభరితమవుతుంది. విష్ణువుకు ఇష్టమైన మాఘ శుద్ధ ఏకాదశి పరమ పవిత్రం. అఘం అంటే పాపం. దాన్ని పోగొట్టేది మాఘం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ మాసం అత్యంత విశేషమైనది. ఇటువంటి పవిత్ర స్నానాల సంస్కృతి దేశంలో అతి ప్రాచీన కాలం నుంచీ ఉందని పురాణాలెన్నో తేటతెల్లం చేస్తున్నాయి.
- పి.భారతి
-------------------


మాఘమాసం ఆరంభం


మాఘమాసమున అనగా మకరరాశిలో రవి ఉండే తరుణంలో నెల రోజులు నియమానుసారంగా మాఘమాస స్నానం చేస్తే చాలు, వారి వారి కోరికలన్నీ తప్పక నెరవేర్తాయి అని పద్మపురాణంలో ఉత్తరఖండంలో పేర్కొనబడింది.

మాఘస్నాయీ వరారోహు దుర్గతిం వైవ పశ్యతి | 
తన్నాస్తి పాతకం యత్తు మాఘస్నానం న శోధయేత్‌ | 
అగ్ని ప్రవేశాదధికం మాఘస్నానం న శోధయేత్‌ | 
జీవితా భుజ్యతే దుఃఖం మృతేన బహుళం సుఖమ్‌ | 
ఏతస్మాత్కారణేద్భద్రే మాఘస్నానం విశిష్యతే

మాఘస్నానానికి ఒక ప్రత్యేకత ఉంది. చాలామంది మాఘమాసం కోసం ఎదురుచూస్తుంటారు.దీనికి కారణం ఈ మాఘస్నానాల వెనుక ఉన్న ప్రత్యేకత, ప్రయోజనాలే. మాఘమాసం స్నానానికి ప్రసిద్ది. మాఘస్నానం ఇహపరదాయకం. సూర్యుడు ఉదయించే సమయంలో స్నానం చేస్తే మహాపాతకాలు నశిస్తాయని కమలాకర భట్టు రచించిన నిర్ణయ సింధులో చెప్పారు.

బ్రహ్మచర్య, గృహస్త, వానప్రస్థ, సన్యాసాశ్రమాలవారూ, అన్ని వర్ణములవారూ, వర్గములవారూ, ప్రాంతాలవారు ఈ మాఘస్నానం చేయవచ్చు.మాఘమాసంలో సూర్యుడు మకరరాశిలో ఉండే సమయంలో సూర్యోదయానికి ముందు వేడి నీటిలోనైనా ఇంట్లో స్నానం చేసినా ఆరు సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుంది. ఇంట్లో బావి నీటి స్నానం చేస్తే పనె్నండు సంవత్సరాల పుణ్యస్నాన ఫలాన్నీ, తటాక స్నానం ద్విగుణం, నదీస్నానం చతుర్గుణం, గంగాస్నానం సహస్రగుణం, గంగాయమునా సంగమ (త్రివేణి) స్నానం నదీ శత గుణ ఫలాన్నీ ఇస్తుందని శాస్త్రాలు వివరిస్తున్నాయి. అయితే మాఘమాసంలో ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగాయమునాది దివ్య తీర్థాలను స్మరించి స్నానం చేయాలని నిర్ణయసింధులో స్పష్టం చేశారు.

‘‘దుఃఖ దారిద్య్ర నాశయ శ్రీ విష్ణోస్త్రోషణాయచ
ప్రాతఃస్నానం కరో మధ్యమాఘే పాప వినాశనం
మకరస్థే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ
స్నానేనా నేన మేదేవ యధోక్త ఫలదోభవ’’
            అనే ఈ శ్లోకం పఠిస్తూ స్నానం ఆచరించాలి.

రోజూ సమయాభావంవల్ల, అనారోగ్యంవల్ల చేయలేనివారు మాఘంలో పాడ్యమి, విదియ, తదియ తిథులలో స్నానం చేసి, మళ్లీ త్రయోదశి, చతుర్దశి మాఘ పూర్ణిమ తిథులలో స్నానం చేయవచ్చు.

ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తరవాతే మాఘమాసం రావటం విశేషంగా చెప్పుకోవాలి. ఈ మాసంలో సూర్యారాధన, శివోపాసన, విష్ణ్వార్చన వంటివి విశేష ఫలాన్నిస్తాయి. సర్వదేవతలకు ప్రీతికరమైన మాసం మాఘమాసం. కార్తీకమాసం దీపానికి ప్రధానమైనట్లే మాఘమాసం స్నానానికి ముఖ్యం.

సూర్యోదయానికి ముందు నదీ స్నానం ఉత్తమం. నది అందుబాటులో లేనివారు తటాకంగానీ, బావిగానీ స్నానానికి మంచిది. ఇవేమీ అందుబాటులో లేనప్పుడు పవిత్ర నదీ స్మరణతో ‘గంగేచ .....జలేస్మిన్ సన్నిధింకురు’’ అని శ్లోకం చెప్పుకుంటూ స్నానం చేయాలి.

మాఘస్నానానాలన్నింటిలోకి త్రివేణి సంగమ స్నానం ఉన్నతమైన ఫలితాన్ని అందిస్తుందని ధర్మశాస్తవ్రచనం. ఉత్తర భారతదేశంలో ఈ నదీ స్నానానికి విశేష ఆదరణ వుంది. మాఘపూర్ణిమనాడు అశేష జనవాహిని త్రివేణి సంగమంలో, గంగానదిలో పవిత్ర స్నానాలు చేస్తారు. దక్షిణ భారతంలో కృష్ణ, గోదావరి, కావేరి నదుల్లో స్నానమాచరిస్తారు. స్నానమాచరించు సమయంలో, శివకేశవాది దేవతాస్మరణ, గంగాయమున, సరస్వతి, గోదావరి వంటి పుణ్యనదుల స్మరణ చేయాలి. అదేవిధంగా ఈ మాసంలో దానం, జపం విశేషంగా చేస్తే ఎంతో మంచిది.

పవిత్రమైన విశేషమైన మాఘస్నానాన్ని సద్వినియోగం చేసుకొని పుణ్యఫలాన్ని పొందటానికి అందరూ ముందుండాలి. ఈ స్నానం ఆధ్యాత్మికతకు పునాదులు వేస్తుంది. మాఘమాసంలో పుణ్యమైన మాఘస్నానమే కాకుండా ఇంకా ఎన్నో పుణ్యదినాలున్నాయి. ఈ మాసంలో డుంఠి గణపతి పూజ, శ్రీపంచమి, భీష్మైకాదశి, మహాశివరాత్రి, రథసప్తమి ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఏ మాసంలో వచ్చే విశేష దినాలను ఆచరిస్తే మానసిక శాంతి, ఆధ్యాత్మికత, పుణ్యఫలం లభిస్తాయని ఋషులు ఆదేశించారు. కలియుగంలో కనీసం ప్రజలు వారు శక్తివంచన లేకుండా కొన్ని ధార్మిక, ఆధ్యాత్మిక నియమాలను పాటిస్తే జీవితం ఆనందంగా గడపవచ్చు.

--------------------------------------------------

మాఘమాస వ్రత మహాత్యాలు

మానవాళికి కావలసిన సర్వ శుభాలనూ పొందేందుకు అనువైన వ్రతాలను చేసుకొనేందుకు వీలున్న మాసం మాఘమాసం. ఈ మాసం పేరు వింటేనే ఆనంద పులకితులవుతారు సంప్రదాయం తెలిసిన వారంతా. గృహ నిర్మాణాలు, పెళ్ళిళ్ళు తదితర శుభకార్యాలన్నిటికీ అనువైన మాసం ఇది. అంతే కాదు శివకేశవుల్దిరితో పాటు సరస్వతీదేవి, వరుణుడు, సూర్యుడు లాంటి దేవతలందరినీ పూజించుకోవటానికి తగిన వ్రతాలు ఈ మాసంలోనే వస్తుంటాయి.

చలికి భయపడక ఉదయాన్నే నదీ స్నానం చేయటం సర్వోత్తమం. ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన, నువ్వులతో హోమం, నువ్వుల దానం, నువ్వుల భక్షణం లాంటివి ముఖ్యమైనవి.రాధన, నువ్వులతో హోమం, నువ్వులను దానం ఇవ్వటం ఆ తర్వాత భోజన పదార్ధాలలో నువ్వులను కలిపి తినటం అనేవి ప్రధానాంశాలుగా భావిస్తుంటారు.

అఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అని అర్థం. మాఘము అంటే పాపాలను నశింప చేసేది అనే అర్థాన్ని పండితులు చెబుతున్నారు. అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది.

మాఘ విశిష్టతను గురించి, ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయటం ఓ వ్రతంగా ఉంది. చలికి భయపడక ఉదయాన్నే నదీ స్నానం చేయటం సర్వోత్తమం. ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన, నువ్వులతో హోమం, నువ్వుల దానం, నువ్వుల భక్షణం లాంటివి ముఖ్యమైనవి.

మాఘమాసంలో శుద్ధ విదియ, తదియ నాడు బెల్లం, ఉప్పు దానం చేయటం మంచిది. దీంతోపాటు పార్వతీ పూజ, లలితావ్రతం హరతృతీయ వ్రతం చేస్తుంటారు.

శుద్ధ చవితిన ఉమా పూజ, వరదా గౌరీ పూజ, గణేశ పూజ చెయ్యడం మొల్ల పువ్వులతో శివపూజ చెయ్యడం ఉంది. ఈ చవితినాడు చేసే తిలదానానికి గొప్ప పుణ్యఫలం చెప్పారు.ఈ చవితికే తిలచతుర్ధి అని పేరుంది. ఈ రోజు ప్రత్యేకంగా నువ్వులను దానం ఇవ్వటం వల్ల అధిక పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు.

శుద్ధ పంచమిని శ్రీపంచమి అని అంటారు. ఈ రోజున సరస్వతీ పూజ చెయ్యటం విశేష ఫలప్రదం. దీన్నే కొన్ని ప్రాంతాల్లో వసంత పంచమి, రతికామదహనోత్సవం అనే పేరున జరుపుకొంటారు.

శుద్ధ షష్టిని విశోకషష్టి అని, మందార షష్టి అని, కామ షష్టి, వరుణ షష్టి అని కూడా అంటారు. ఈ రోజున వరుణ దేవుడిని ఎర్రచందనం, ఎర్రని వస్త్రాలు, ఎర్రని పుష్పాలు, ధూపదీపాలతో పూజించాలి.

శుద్ధ సప్తమిని రథసప్తమి అని అంటారు. ఈ రోజున సూర్య జయంతిని జరుపుతారు. రథసప్తమీ వ్రతం ఎంతో విశేషమైనది.

అష్టమి నాడు భీష్మాష్టమిని చేస్తారు. కురువృద్ధుడు భీష్ముడికి తర్పణం విడవటం ఈనాటి ప్రధానాంశం.

నవమి నాడు నందినీదేవి పూజ చేస్తారు.దీన్నే మధ్వనవమి అని అంటారు. ఆ తర్వాత వచ్చే ఏకాదశికి జయ ఏకాదశి అని పేరు. దీన్నే భీష్మ ఏకాదశి వ్రతమని చెబుతారు. కురువృద్ధుడు భీష్మాచార్యుడు మరణించిన సందర్భం గుర్తుకు తెచ్చుకుంటారు. ఈ తిథినాడే అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరుపుతుంటారు.

ద్వాదశినాడు వరాహ ద్వాదశీ వ్రతం చేస్తారు. త్రయోదశి విశ్వ కర్మ జయంతిగా పేరు పొందింది.

మాఘపూర్ణిమకు మరీ మరీ విశిష్టత ఉంది. ఈ రోజున కాళహస్తిలో స్వర్ణముఖి నదిలో స్నానం చేయటం, ప్రయాగ త్రివేణీ సంగమంలో స్నానం చేయటం విశేష ఫలప్రదాలు. సతీదేవి జన్మించిన తిథిగా కూడా మాఘపూర్ణిమను చెబుతారు.

మాఘమాసంలో వచ్చే కృష్ణపాడ్యమి నాడు సౌభాగ్యప్రాప్తి వ్రతం చేస్తారు.

కృష్ణ సప్తమినాడు సర్వాప్తి సప్తమి వ్రతం, సూర్యవ్రతాలు జరుగుతాయి.

అష్టమినాడు మంగళా వ్రతం చేస్తుంటారు.

కృష్ణ ఏకాదశిని విజయ ఏకాదశి అని, రామసేతు నిర్మాణం పూర్తి అయిన రోజున గుర్తు చేసే తిథి అని చెబుతారు.

కృష్ణ ద్వాదశినాడు తిల ద్వాదశీ వ్రతం జరుపుతుంటారు.

మాఘ కృష్ణ త్రయోదశిని ద్వాపర యుగాదిగా పేర్కొంటారు.

మాఘ కృష్ణ చతుర్దశి నాడు మహశివ రాత్రి పర్వదినం వ్రతం జరుపుతారు.

మాఘమాసంలో చివరిదైన కృష్ణ అమావాస్యనాడు పితృశ్రాద్ధం చెయ్యడం అధిక ఫలప్రదమని పెద్దలంటారు.

ఇలా మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు, పర్వదినాలు, వివిధ దేవతలను ఉద్దేశించి జరపుకోవటం కనిపిస్తుంది. అందుకే మాసానికి తొలినాళ్ళనుండి అంత విశిష్టత ఉంది.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list