MohanPublications Print Books Online store clik Here Devullu.com

నమస్కారం_IndiansTraditionalWelcome



 
నమస్కారం_IndiansTraditionalWelcome IndianWelcome Welcome Namaskaram Namashkar Antaryami
 నమస్కారం
 
వ్యక్తి సంస్కారాన్ని తెలిపే సమున్నత ప్రక్రియ- నమస్కారం. అది ఎదిగిన మనసును ఆవిష్కరిస్తుంది. పరిపక్వత చెందిన వ్యక్తిత్వాన్ని చూపరుల మనసు వాకిట నిలుపుతుంది. ఎదుటివారిని గౌరవించాలనుకున్నప్పుడు నమస్కరిస్తారు. ప్రతినమస్కారం ద్వారా అవతలి వ్యక్తి నుంచీ గౌరవం, మన్నన పొందుతారు. డబ్బు, హోదా, పలుకుబడి... ఏదీ పనిచేయని సందర్భంలోనూ ఒక నమస్కారం అనేక పనులు చేసిపెడుతుంది. దానికి అంతటి మహత్తు ఉంది.
విద్యార్జన కోసం గురువును ఆశ్రయించిన శిష్యుడు, మొట్టమొదట నమస్కారంతోనే పలకరిస్తాడు. ఆ అనుబంధం ఏళ్ల తరబడి సాగిపోతుంటుంది. పవిత్రమైన ఆ విద్యాక్షేత్రంలో పలు జ్ఞాన కుసుమాలు వికసిస్త్తుంటాయి. వాటితో అనేకమందికి ఎంతో మేలు జరుగుతుంది. అన్నింటికీ తొలి బీజం నమస్కారమే! గర్భగుడిలో నిలుచున్నప్పుడు, భక్తుడు రెండు చేతులూ జోడించి దైవీ రూపాలకు దండం పెడతాడు. అలా నమస్కారం అనే క్రియ రెండు చేతులూ సమానమనే ఎరుక కలిగిస్తుంది.

భారతీయ సంస్కృతిలో ప్రణామానికి ఒక విశిష్టమైన స్థానమిచ్చారు. స్పందించే గుణం కలిగిన హృదయమే దానికి నాంది పలుకుతుంది. ప్రేమకు మాతృక నమస్కారం. హృదయాంతరాళంలో జనించే అనిర్వచనీయ మానసిక భావనకు అది భౌతిక రూపం. రెండు చేతులూ ఒక దరికి చేరడం వల్ల, నమస్కార ప్రక్రియ సంపూర్ణంగా ఆవిష్కృతమవుతుంది. పిల్లలు బుజ్జి చేతులతో దండం పెడితే, ఇంటికి వచ్చిన అతిథులు ముచ్చటపడతారు. ఆ చిన్నారుల్ని దగ్గరకు తీసుకుంటారు. ప్రేమతో ముద్దాడతారు. ఇంత చిన్నప్పుడే అంతటి మర్యాద నేర్పినందుకు తల్లిదండ్రుల పెంపకాన్ని అభినందిస్తారు.

నమస్కారం తెలిపే వ్యక్తి పట్ల ఎవరికైనా గౌరవభావం పెరుగుతుంది. సమాజం అతని పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంది. రెండు చేతుల జోడింపు- హృదయాన్ని ప్రతిఫలిస్తుంది కాబట్టి, ప్రజల ఆదరాభిమానాలు చూరగొనడానికి నాయకులు దాన్ని ఓ విధానంగా ఆచరిస్తారు.

యోగశాస్త్రంలో సూర్యనమస్కారాలదే కీలక పాత్ర. రోజూ ఉదయంవేళ సూర్యుడికి అభిముఖంగా నిలబడి నమస్కరిస్తే, ఆరోగ్య భాగ్యం కలుగుతుంది. ఆధునిక వైద్యశాస్త్రమూ అదే చెబుతోంది. నమస్కార భంగిమలో ఉన్నప్పుడు, మనిషిలో తేజస్సు ఉట్టిపడుతుంటుంది. పద్మాసనం వేసి, కళ్లు మూసి, చేతులు జోడించి చేసే నమస్కారం అతడి అంతరంగంలోని ‘ఆత్మజ్యోతి’కి చెందుతుంది. పూర్వం రుషులు నమస్కార భంగిమలోనూ ధ్యానం చేసేవారు. అదే సాధనతో, వారు జీవితలక్ష్యం సాధించేవారు!
- మునిమడుగుల రాజారావు
 

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list