GRANTHANIDHI blog Posts updates, Followకై Facebook MOHAN PUBLICATIONS Page LIKE చెయ్యగలరు

శ్రీలక్ష్మీనరసింహస్వామి_ఆలయ_మోర్జంపాడు_LakshmiNarasimhaswamy_Morjampadu


LakshmiNarasimhaswamy_Morjampadu bhaktipustakalu

పల్నాడులో తిరునాళ్ల వేడుక!

ఏడాదిలో ఆ రెండు రోజులూ పల్నాడువాసులకు ఎంతో ప్రత్యేకమైనవి. ఎందుకంటే, భక్తులపాలిట కొంగు బంగారంగా భాసిల్లుతున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామికి ఆ రోజుల్లో ఘనంగా తిరునాళ్లు నిర్వహిస్తారిక్కడ. అసలు పేరు కంటే తిరునాళ్ల గ్రామంగానే ప్రసిద్ధి చెందిన మోర్జంపాడులో వెలసిన ఆ భక్తవత్సలుడు స్మరించినంతనే మనోభీష్టాలను నెరవేరుస్తాడన్నది భక్తుల విశ్వాసం. 

లోకకళ్యాణం కోసం ఆ శ్రీమహావిష్ణువు ఎత్తిన దశావతారాల్లో ఉగ్రనారసింహుని అవతారం అత్యంత శ్రేష్ఠమైనది. పరమ భక్తుడైన ప్రహ్లాదుడిని కాపాడటం కోసం స్వామి ఉగ్రస్వరూపుడై స్తంభంలోంచి ఆవిర్భవించి, హిరణ్యకశ్యపుని సంహరిస్తాడు. అనంతరం ఆ భక్తుని ప్రార్థనతో శాంతించిన దేవదేవుడు లక్ష్మీనరసింహుడిగా, నమ్మిన భక్తులపాలిట కొంగుబంగారంగా భాసిల్లుతున్నాడు.

ఆ స్వామి కొలువైన క్షేత్రాల్లో మోర్జంపాడు ఒకటి. తిరునాళ్ల గ్రామంగా ప్రసిద్ధిచెందిన ఆ ఊరు గుంటూరు జిల్లా మాచవరం మండలంలో ఉంది. ఇక్కడ నెలవైన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఏటా మాఘమాసంలో (ఈ ఏడాది జనవరి 25న స్వామి సేవ, 26న కళ్యాణం) నిర్వహించే తిరునాళ్లకు ఈ ఊరు నెల రోజుల ముందు నుంచీ ముస్తాబైపోతుంది. తిరునాళ్ల సమయంలో పరిసర గ్రామాలనుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచీ పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. నరసింహస్వామి కళ్యాణాన్ని చూసి పరవశిస్తారు. ఇక్కడ కొలువైన ఆ లక్ష్మీపతి ఆర్తితో కొలిచిన వారి కోర్కెలు తప్పక తీరుస్తాడని ప్రతీతి. అందుకే సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు కూడా ఇక్కడికి తరలివచ్చి స్వామికి మొక్కుబడులు చెల్లిస్తారు. తిరునాళ్లను నిర్వహించే ఆ రెండు రోజులూ ఈ గ్రామంలోని ప్రతి ఇల్లూ ఉత్సవశోభను సంతరించుకుంటుంది.

మొదట రాతిపలకే... 
రెండు రోజులపాటు నిర్వహించే ఈ తిరునాళ్లకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. మోర్జంపాడుకు సమీపంలోని తుమ్మలచెరువులో 400 ఏళ్ల కిందట ధన్‌జీ నాయక్‌, ఆయన భార్య లక్ష్మీదేవి నివసించేవారు. వాళ్లకు పెళ్లయ్యి ఏళ్లు గడుస్తున్నా సంతానం కలగలేదు. పిల్లలకోసం ఆ దంపతులు మొక్కని మొక్కూ, చేయని పూజా లేదు. ఒకరోజు ధన్‌జీ నాయక్‌కి సాక్షాత్తూ ఆ లక్ష్మీనరసింహ స్వామే కలలో దర్శనమిచ్చి, గ్రామానికి వచ్చే మార్గంలో తాను యంత్రం రూపంలో ఉన్నాననీ, దాన్ని తీసుకొచ్చి పూజలు చేయమనీ ఆజ్ఞాపించాడట. మెలకువ వచ్చిన అనంతరం ఆ స్వప్న వృత్తాంతాన్ని భార్యకూ ఊరివారికీ చెప్పగా, అందరూ కలసి ఆ ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ వారికో మూట కనిపించింది. విప్పి చూస్తే అందులో రాతి యంత్రం ఉంది. భద్రంగా దాన్ని ఇంటికి తీసుకెళ్లి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఇది జరిగిన కొద్దిరోజుల్లోనే వీరికి సంతానం సిద్ధించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఏటా మాఘమాసంలో ఆ నరసింహస్వామికి రెండురోజులపాటు ఉత్సవాలను నిర్వహించడం ఆచారంగా వస్తోంది. అంతేకాదు, తరతరాలుగా ఆ కుటుంబానికి చెందిన వ్యక్తులే స్వామికి నిత్యకైంకర్యాలు నిర్వహిస్తున్నారు. ఆ స్వామిని ఆర్తితో పిలిస్తే పలకడమే కాదు సంతానం లేనివారు ఈ క్షేత్రాన్ని దర్శిస్తే తప్పక సంతానం కలుగుతుందని ఇక్కడి భక్తుల విశ్వాసం. దాంతో ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. మొదట కేవలం యంత్రం మాత్రమే ఉండే ఈ ప్రదేశంలో తొంభయ్యో దశకంలో ఓ ఆలయాన్ని నిర్మించి, లక్ష్మీదేవి, నరసింహస్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే ఆంజనేయస్వామి ఆలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతి శనివారం సందడి వాతావరణం నెలకొంటుంది. ఆ రోజు ఉదయం నుంచే భజనలూ, ప్రత్యేక పూజలూ ప్రారంభమవుతాయి. శనివారం నిర్వహించే స్వామివారి కళ్యాణం విశేషమైనదని భక్తుల విశ్వాసం.

రాష్ట్రస్థాయి పోటీలు 
ఈ తిరునాళ్లకు మరో విశేషం కూడా ఉంది. అవే రాష్ట్ర స్థాయిలో జరిగే ఎడ్ల పందాలు. ఇందులో పాల్గొనడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచీ పెద్దసంఖ్యలో ఎద్దులను ముస్తాబు చేసి, ఇక్కడికి తీసుకువస్తారు. వీటిలో గెలవడానికి ఎద్దులకు ప్రత్యేక తర్ఫీదు ఇస్తారు. ఈ పోటీల్లో పాల్గొనడానికే కాకుండా చూడటానికి కూడా భారీగానే జనం హాజరవుతారు.

ఇలా చేరుకోవచ్చు 
ఈ ఆలయాన్ని చేరుకోవడానికి రైలు, రోడ్డుమార్గాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి గుంటూరు వెళ్లేదారిలో పిడుగురాళ్ల వద్ద దిగి అక్కడి నుంచి ఆటో, బస్సు ద్వారా ఇక్కడికి వెళ్లవచ్చు. విజయవాడ నుంచి పిడుగురాళ్ల, మాచర్ల బస్సు ఎక్కి పిడుగురాళ్లలో దిగి వెళ్లవచ్చు. రైలు మార్గమైతే పిడుగురాళ్ల స్టేషన్‌లో దిగి అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా 
ఆలయానికి చేరుకోవచ్చు.       - డి.నాగేష్‌బాబు, ఈనాడు, గుంటూరు 


సరస్వతి నమస్తుభ్యం_SaraswatiLeaf

సరస్వతి నమస్తుభ్యం సరస్వతి ఆకు SaraswatiLeaf Lord Saraswathi Lord Saraswati

సరస్వతి నమస్తుభ్యం సరస్వతి ఆకు SaraswatiLeaf Lord Saraswathi Lord Saraswati


సరస్వతీ దేవితోపాటు సరస్వతీ ఆకు కూడా పూజనీయమే. ఆ ఆకుకు అంతటి విలువ ఉంది మరి. సరస్వతీ ఆకు అనగానే అది ఔషధ మొక్క అనే విషయం మనలో చాలామందికి గుర్తొస్తుంది. కానీ దాన్ని చక్కని అలంకరణ మొక్కగా కూడా పెంచుకోవచ్చు.

సరస్వతీ ఆకును ‘సెంటెల్లా’, ‘గోటుకోలా’, ‘ఫౌంటేన్‌ ఆఫ్‌ యూత్‌’ అని రకరకాలుగా పిలుస్తారు. సంస్కృతంలో దీన్ని మండూక పర్ణి అంటారు. దీని శాస్త్రీయ నామం ‘సెంటెల్లా ఏషియాటికా’. ఇది మన ఆసియా ఖండానికి చెందిన మొక్క.
సరస్వతీ ఆకు తడినేలలో పెరిగే బహువార్షికం. నేలమీద పాకే కాండంతో, ప్రతి కణుపు వద్దా వేర్లతో అల్లుకుపోతుంది. ఈ మొక్క తేమగా ఉండే నేలలో, చల్లని వాతావరణంలో చక్కగా పెరుగుతుంది. ఇది చిన్నగా ఆరు అంగుళాలు మించని ఎత్తులో నేలమీద నుంచి మొదలై విసనకర్ర ఆకారపు ఆకులతో ఉంటుంది. ఈ ఆకులు లేతాకుపచ్చ రంగులో ఉంటాయి. ఎండ కంటే కొద్దిపాటి నీడ సరస్వతీ ఆకుకు అనువుగా ఉంటుంది. నీడ ఎక్కువైనా దీనికి పెద్ద ఇబ్బంది ఉండదు. ఇంట్లో పెంచుకునేటప్పుడు అంత తేమ నేలలు ఉండవు కాబట్టి క్రమం తప్పకుండా నీళ్లు పోస్తుంటే సరిపోతుంది. దీనికి నేల సారవంతంగా, నీరు నిలవకుండా తేమగా ఉండాలి కాబట్టి కంపోస్టు, కోకోపీట్‌, ఇసుక కలిపిన మట్టి మిశ్రమం అనువుగా ఉంటుంది. దీనికి చీడపీడల ప్రమాదం దాదాపు లేనట్లే. రసాయన ఎరువులు కాకుండా జీవామృతం లేదా ఇతర సేంద్రియ ఎరువులు వాడటం మంచిది.
వెడల్పు కుండీల్లో... సరస్వతీ ఆకు చక్కని గ్రౌండ్‌ కవర్‌లా పనిచేస్తుంది. ఇది వేలాడే కుండీల్లో/చెట్ల కింద నీడలో పెంచుకోవడానికి అనువుగా ఉంటుంది. లోతు తక్కువగా, వెడల్పుగా ఉండే కుండీల్లో పెంచుకుని వరండాల్లోనూ, బాల్కనీల్లోనూ అమర్చుకోవచ్చు. మిశ్రమ అమరికల్లో గ్రౌండ్‌ కవర్‌గా వాడుకోవచ్చు. బాట పక్కన బోర్డరు మొక్కల మొదట్లో కూడా నాటుకోవచ్చు.
ఆయుర్వేదంలో దశాబ్దాలుగా దీన్ని మెదడుకు సంబంధించిన మందుగా వాడుతున్నారు. జ్ఞాపకశక్తి, తెలివి పెరగడానికి విరివిగా ఉపయోగిస్తారు. జలుబూ, జ్వరం, విరేచనాలూ, కామెర్లు.. మూర్ఛ, మూత్రకోశ వ్యాధులు, నిద్రలేమీ- ఒకటేమిటి దీన్ని సర్వరోగనివారిణిగా నమ్ముతారు. ఇప్పుడిప్పుడే ప్రపంచ వ్యాప్తంగా దీని ఔషధ విలువలకు ప్రాచుర్యం లభిస్తోంది.
పోషకాలూ ఎక్కువే... సరస్వతీ ఆకులో పోషక విలువలు కూడా ఎక్కువే. దీనిలో అనేక విటమిన్లూ, ఖనిజ లవణాలూ, శరీరానికి ఉపయోగపడే రసాయనాలు ఉంటాయి. దీన్ని సలాడ్‌గా కూడా వాడతారు. బర్మా, శ్రీలంకా, ఇండోనేషియా, మలేషియా లాంటి దేశాల్లో దీని వాడకం ఎక్కువ. శ్రీలంకలోనైతే దీని ఆకులను ఇతర ఆకుకూరలతోపాటు మార్కెట్లో అమ్ముతుంటారు.
అతిగా వద్దు... సరస్వతీ ఆకుకు ఇన్ని సుగుణాలున్నా దీన్ని అదేపనిగా వాడకూడదు. ఆరువారాలు వాడిన తరువాత కొంత విరామం ఇచ్చి తిరిగి వాడుకోవచ్చు. అలాగే కాలేయ సంబంధ వ్యాధులున్నవారు వైద్యుల సలహా మేరకు ఈ ఆకులను వాడటం మంచిదట. కణుపు మొక్కలను విడదీసి నాటుకుని సరస్వతీ ఆకును సులువుగా ప్రవర్థనం చేయొచ్చు. అయితే కలుషితమైన నీటిలో పెరిగినప్పుడు ఆ కాలుష్య కారక రసాయనాలను గ్రహించుకునే శక్తి దీనికి ఎక్కువ. అందువల్ల అలాంటి ప్రాంతాల నుంచి మొక్కలను సేకరించుకోవద్దు. అందం, ఆరోగ్యం, పోషకాలు మూడూ విరివిగా ఉండే సరస్వతీ ఆకును మీ తోటలో భాగస్వామిని చేసేందుకు ఇంకా ఆలస్యం ఎందుకు?వసంత_పంచమి_విశిష్టత_VasantaPanchami

VasanthaPanchamiVisistatha VasanthaPanchami Vasant Panchami Lord Saraswathi Lord Saraswati
విద్యాధిదేవత ఉద్భవించిన వేళ...
విద్య, బుద్ధి, జ్ఞానం, వాక్కులకు అధినేత్రి సరస్వతీదేవి ఆవిర్భవించిన పర్వదినం మాఘపంచమి లేదా శ్రీపంచమి. ఈ దినాన ఆమెను పుస్తకాది రూపాలలో, విగ్రహంలో ఆవాహన చేసి విశేష అర్చన, పూజ, వ్రతోత్సవాలు చేస్తే ఆమె అనుగ్రహం కలుగుతుంది.

సరస్వతీ దేవికి తెలుపు రంగు ప్రీతికరం కాబట్టి ఆమెను తెల్లని పూలు, తెల్లని పట్టువస్త్రంతో అలంకరించి, పెరుగు, వెన్న, వరిపేలాలు, తెల్లనువ్వుల ఉండలు, చెరకు రసం, బెల్లం, తేనె, పాలకోవా, చక్కెర, కొబ్బరికాయ, రేగుపండు వంటి వాటిని నివేదిస్తే ఆమె ప్రసన్నురాలవుతుందని శాస్త్రోక్తి. 


వసంత పంచమి
మాఘ శుద్ధ పంచమిని ‘వసంత పంచమి’గా వ్యవహరిస్తారు. రుతు సంబంధమైన పండుగ కావడంతో, దీనికి ఆ పేరు వచ్చింది. ఈ పర్వదినాన్ని శ్రీపంచమి, మదన పంచమి, సరస్వతీ జయంతి అనే పేర్లతోనూ పిలుస్తారు. మకర సంక్రాంతి తరవాత, వసంత రుతువు లక్షణాలు ప్రకృతిలో కనిపిస్తాయి. చెట్లు చిగురించడం, పూలు పూయడం వంటి శుభ సంకేతాలు ఇదే రుతువులో ఆరంభమవుతాయి. వసంతుడికి ఆహ్వానం పలుకుతూ ప్రకృతి కాంత శోభాయమానంగా విరాజిల్లుతుంది.

వసంతం అందరికీ ఎనలేని ఆనందం కలిగిస్తుంది. హరి పూజ, నూతన వస్త్రధారణను విధులుగా భావిస్తారు. రంగులు చల్లుకుంటారు. కొత్త ధాన్యం వచ్చే రోజులు కాబట్టి, బియ్యంతో పాయసం వండి నైవేద్యం పెడతారు. ఈ వసంత పంచమిని రాజస్థాన్‌లో విశేషంగా ఆచరిస్తారు. వంగ దేశంలో శ్రీ పంచమి పేరుతో నిర్వర్తిస్తారు. సరస్వతి జన్మించిన రోజుగా భావించి, ఆ దేవిని భక్తి ప్రపత్తులతో కొలుస్తారు. గ్రంథాలను ఆ ప్రతిమ దగ్గర ఉంచి, పూజించి, సాయంకాలం వూరేగింపుగా వెళ్లి జలాశయంలో నిమజ్జనం చేస్తారు.

ప్రాచీన కాలంలో రోమనులు సైతం ఈ ఉత్సవం జరిపేవారని చరిత్ర చెబుతోంది. ‘బ్రహ్మ వైవర్త పురాణం’ వసంత పంచమినాడే సరస్వతిని పూజించాలంటుంది.
రతీదేవికి, కామదేవుడికి, వసంతుడికి పూజలు చేస్తారు. ముగ్గురూ ఒక్కరోజునే పూజలందుకుంటారు.

వసంతోత్సవాల్ని వేర్వేరు పేర్లతో, పలు విధాలుగా ఆచరిస్తుంటారు. ఇది శీతకాలానికి, వేసవి కాలానికి సంధికాలం కావడంతో ప్రజలకు ఈ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కొత్త పంటలు వచ్చే కాలం ఇది. పశువులకు గ్రాసం పుష్కలంగా లభిస్తుంది. ‘కృత్యసార సముచ్చయం’ లో వసంత పంచమి గురించిన సమగ్ర విశ్లేషణ ఉంది.

చైత్ర-వైశాఖాల్లో వచ్చే వసంతుడికి మాఘ-ఫాల్గుణ మాసాల్లోనే స్వాగతోపచారాలు మొదలవుతుండటం బట్టి ఈ పంచమి ప్రాముఖ్యం, వైశిష్ట్యం అందరికీ అవగతమవుతుంది. అంటే, శిశిర రుతువే వసంత రుతువుకు పరమానందంతో స్వాగతం చెబుతోందన్న మాట!
వసంత పంచమినాడే సరస్వతీ జయంతి కావడంతో, ఈ పర్వదినం అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అక్షరానికి ఆమె అధిదేవత. ప్రణవ స్వరూపిణి, జ్ఞానానంద శక్తి, లౌకిక-అలౌకిక విజ్ఞాన ప్రదాయిని ఆమె. శ్రీవాణి కృప లేకుంటే, లోకానికి మనుగడే లేదు. వాగ్దేవి ఉపాసన వల్ల వాల్మీకి రామాయణ రచన చేశాడంటారు. శారద దీక్ష స్వీకరించి, వ్యాసుడు వేదవిభజన చేయగలిగాడంటారు. ఆదిశేషువు, బృహస్పతి, ఆదిశంకరులు, యాజ్ఞవల్క్యుడు వంటి ఎందరో శారదానుగ్రహం కారణంగా జ్ఞాన సంపన్నులయ్యారు. వ్యాసుడు గోదావరీ తీరాన సైకతమూర్తి రూపంలో వాణిని ప్రతిష్ఠించాడని పురాణ కథనం. ఆ క్షేత్రమే వ్యాసపురిగా, బాసరగా ప్రసిద్ధి చెందింది.

సరస్వతి శబ్దానికి ‘ప్రవాహ రూపంలో ఉండే జ్ఞానం’ అని అర్థం. వసంత రుతు శోభలకు వసంత పంచమి స్వాగతం పలుకుతుంది. శుద్ధ సత్వగుణ శోభిత సరస్వతి, శ్వేత వస్త్రాలంకృతగా హంస వాహినిగా తామర పుష్పం మీద కొలువుతీరి జ్ఞాన క్రతువు నిర్వహిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
వేదాలు సరస్వతీ మాత నుంచే వెలువడ్డాయని ‘గాయత్రీ హృదయం’ గ్రంథం అభివర్ణించింది. సరస్వతీనది అంతర్ముఖీనమై గంగ యమునలతో కలిసి ‘త్రివేణి’ గా విరాజిల్లింది. దేశ విదేశాల్లో గీర్వాణి ఆరాధనలందుకుంటోంది. సరస్వతీదేవి వద్ద ఆయుధాలుండవు. గ్రీకులు, రోమనులు ఆమెను జ్ఞానదేవతగా పూజిస్తారు. వసంత పంచమిని విద్యారంభ దినంగా పరిగణిస్తారు.
వసంత శోభను మహనీయులెందరో హృదయంగమంగా వర్ణించారు. సకల కళామయిగా సరస్వతిని కావ్యాల్లో స్తుతించారు. మార్కండేయ, స్కంద పురాణాలు; ‘ధర్మసింధు’ శ్రీవాణీ స్తుతిని రసరమ్యంగా వెలయించాయి.      - చిమ్మపూడి శ్రీరామమూర్తి

#వసంత_పంచమి_విశిష్టత

సరస్వతీదేవిని మాఘపంచమినాడు  శ్రీపంచమి పేరిట ఆరాధిస్తారు. సర్వవిద్యలకూ ఆధారం వాగ్దేవే కనుక చిన్నపెద్ద తేడాల్లేకుండా పుస్తకాలు, కలాలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీత నృత్యసాహిత్యాలకు కూడా ఈ దేవీ యే మూలం కనుక ఈ తల్లిని నృత్యకేళీవిలాసాలతో స్తుతిస్తారు.  ఈ శ్రీపంచమినే వసంత పంచమి అని మదన పంచమి అని అంటారు. ఈ తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మవైవర్తపురాణం చెప్తోంది. ఈ శ్రీపంచమినాడు సరస్వతిని ఆరాధించే విధివిధానాలను నారదునకు శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవీ భాగవతం చెప్తోంది.

మాఘమాసం శిశిరఋతువులో వసంతుని స్వాగతచిహ్నమూగా ఈ పంచమిని భావిస్తారు. ఋతురాజు వసంతుడు కనుక వసంతుని, ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదనుణ్ణి, అనురాగ వల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయటం కూడా శ్రీపంచమినాడే కనబడుతుంది. వీరి ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి. దానివల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడుతాయి.

అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయస్తే పిల్లలు జ్ఞాన రాశులు అవుతారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్సుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్భుద్ధినీ పొందుతారు.
మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు. శరన్నవరాత్రులల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతీ రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో పంచమి తిథినాట సరస్వతీదేవికి ప్రత్యేక ఆరాధనలు విశేష పూజలు చేస్తారు.

‘‘చంద్రికా చంద్రవదనా తీవ్రా మహాభద్రా మహాబలా భోగదా భారతీ భామా గోవిందా గోమతీ శివా’’ అని ప్రతిరోజూగాని, పంచమినాడు సప్తమి తిథులలో కాని, సరస్వతీ జన్మనక్షత్రం రోజు గాని పూజించిన వారికి ఆ తల్లి కరుణాకటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి.

అహింసకు అధినాయిక సరస్వతిదేవి. సరః అంటే కాంతి. కాంతినిచ్చేది కనుక సరస్వతి అయింది. అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతికిరణ పుంజాన్ని వెదజల్లే దేవత సరస్వతీ.

ఈ అహింసామూర్తి తెల్లని పద్మములో ఆసీనురాలై వీణ, పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. అహింసామూర్తి కనుకనే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు. జ్ఞానకాంతిని పొందినవారికి ఆయుధాల అవసరం ఏమీ వుండదు కదా. ఈ తల్లిని తెల్లని పూవులతోను,శ్వేత వస్త్రాలతోను, శ్రీగంథముతోను, అలంకరిస్తారు. పచ్చని వస్త్రాలను లేక తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పూలతో అర్చనాదులు చేసి క్షీరాన్నాన్ని, నేతితోకూడిన వంటలను, నారికేళము, అరటిపండ్లను చెరకును నివేదన చేస్తారు. ఆ తల్లి చల్లని చూపులలో అపార విజ్ఞాన రాశిని పొందవచ్చు.

‘‘వాగేశ్వరీ, మహాసరస్వతి, సిద్ధసరస్వతి, నీలసరస్వతి, ధారణ సరస్వతి, పరాసరస్వతి, బాలాసరస్వతి’’ ఇలా అనేక నామాలున్నప్పటికీ ‘‘సామాంపాతు సరస్వతీ.... ’’ అని పూజించే వారు ఆ తల్లికి ఎక్కువ ప్రేమపాత్రులట.

సరస్వతీ దేవిని ఆవాహనాది షోడశోపచారాలతో పూజించి సర్వవేళలా సర్వావ స్థలయందు నాతోనే ఉండుమని ప్రార్థిస్తారు. వ్యాసవాల్మీకాదులు కూడా ఈ తల్లి అనుగ్రహంతోనే వేదవిభజన చేయడం, పురాణాలు, గ్రంథాలు, కావ్యాలు రచించడం జరిగిందంటారు. పూర్వం అశ్వలాయనుడు, ఆదిశంకరాచార్యులు కూడా ఈ తల్లిని ఆరాధించి ఉన్నారు.

మాఘమాసం_MaghaMasam

మాఘమాసం MaghaMasam radhasapthami lordsurya bhakthibooks

పవిత్ర మాఘం 

పర్వదినాలు అంటే ‘పూర్ణిమ’ రోజులు. ఇవి దేవతలకు అత్యంత ప్రీతికరమని భక్తులు విశ్వసిస్తారు. మాఘమాసంలో పవిత్ర స్నానాలు చేసి, ఇష్టదైవాల్ని పూజిస్తారు. సాగర తీరాన నివసించేవారు అక్కడ స్నానాదులు ముగించి జపాలు, దానాల వంటి సత్కర్మలు ఆచరిస్తారు. నదీస్నానం చేసినా, అందుకు అవకాశం లేనివారు బావి లేదా చెరువు నీటితో గంగను స్మరిస్తూ స్నానం గావించినా అదీ పుణ్యప్రదమేనని ఓ నమ్మకం.

మాఘమాసంలో మరో నాలుగు పండుగలున్నాయి. మాఘ శుద్ధ అష్టమి మఘా నక్షత్రంనాడు- భీష్మాష్టమి. సప్తమి-సూర్య సప్తమి (రథ సప్తమి). మాఘ బహుళ చతుర్దశి- శివరాత్రి. మాఘ బహుళ అమావాస్య, మాఘ మాసాంతం- ద్వాపర యుగాది.

మాఘశుద్ధ అష్టమి తిథినాడు భీష్ముడు పరమపదించాడు. ఉత్తరాయణం ప్రవేశించిన తరవాత, మాఘ శుద్ధ అష్టమినాడు ఆయన స్వచ్ఛంద మరణం పొందాడని ‘మహాభారతం’ చెబుతోంది. శ్రీకృష్ణుడు ఆయన దగ్గరే ఉన్నాడు. తన మరణానంతరం వచ్చే ఏకాదశి పుణ్యదినాన్ని ‘భీష్మ ఏకాదశి’గా లోకం గుర్తించేలా వరం కోరతాడు భీష్ముడు. కృష్ణుడు అనుగ్రహించాడని ‘నారద పురాణం’ విశదీకరిస్తోంది. భారత యుద్ధం ముగిశాక, అంపశయ్యమీద ఉత్తరాయణ పుణ్యకాలం వరకు ఉన్న భీష్ముడికి కృష్ణుడు తన వాగ్దానం ప్రకారం దర్శనమిస్తాడు. అప్పుడు భీష్ముడు చేసిన స్తుతి ‘భీష్మ స్తవం’గా పేరొందింది. దాన్ని ఆయన ‘కృష్ణాయ నమః’ అని ముగిస్తాడు. అది శ్రీకృష్ణ మహామంత్రంగా నిలిచిపోయింది.
ఇదే మాసంలో స్మరించాల్సిన పౌరాణిక గాథల్లో మార్కండేయుడి చరిత్ర ఒకటి. అతడికి పరమేశ్వరుడు ప్రసాదించింది పదహారు సంవత్సరాల ఆయుర్దాయమే! అది పూర్తయిన వెంటనే భటుల్ని పంపుతాడు యముడు. ఆ సమయంలో అతడు శివ ధ్యానం చేస్తుండటంతో, భటులు ఆ దరిదాపులకైనా వెళ్లలేకపోతారు. ఒక మహా తేజస్సు వారిని అక్కడి నుంచి తరిమేస్తుంది. విషయం తెలిసి, యమధర్మరాజే అక్కడికి చేరుకుంటాడు. పాశంతో మార్కండేయుడి ప్రాణాలు హరించడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు అతడు శివలింగాన్ని హత్తుకొని, ఆ స్వామిని ధ్యానిస్తాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై, యముడి పైకి త్రిశూలాన్ని ప్రయోగించి, భక్త మార్కండేయకు చిరంజీవత్వాన్ని ప్రసాదిస్తాడు. అన్నింటికీ మూలం మాఘంలో రోజూ ఉదయమే సాగిన గంగాస్నానం, ఈశ్వర ధ్యానం అని వివరిస్తుంది ‘మాఘ పురాణం’.

భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో స్నానానికి ఎంతో ప్రాముఖ్యముంది. పలు విధాల స్నానాలుంటాయి. అవి- మంత్ర, వాయవ్య, ఆగ్నేయ, కాపిల, వారుణ, మునుమానస స్నానాలు. వేదమంత్రాలు చదువుతూ చేసేది మంత్ర స్నానం. గోధూళి పైన చల్లుకొని చేసే స్నానం వాయవ్యం. విభూతి రాసుకొని చేస్తే ఆగ్నేయం. శరీరం పైభాగాల్ని తడి వస్త్రంతో తుడుచుకోవడం కాపిలం. ఎండలో స్నానం ఆచరించడం ఆతపం. సాధారణ స్నానం- వారుణం. విష్ణుస్తుతితో చేసే స్నానం మునుమానసం. ఇవన్నీ శారీరక, మానసిక పరిశుభ్రతకు దోహదపడతాయి. మాఘస్నానం చేసి, విష్ణువును పూజించి, దానం తరవాత పురాణ శ్రవణం నిర్వర్తించడం సంప్రదాయం.

అన్ని అంతరాలకూ అతీతంగా పాటించాల్సిన పద్ధతులివి. మాఘమాసం శివకేశవులిద్దరికీ ఇష్టమైనది. దేవతార్చనలో- శివుణ్ని, విష్ణువును, వారి అవతార మూర్తులను స్తుతించవచ్చు. మాఘ స్నానం వల్ల బుద్ధి, వికాసం, ఆరోగ్యం అభివృద్ధి చెందుతాయి. శరీరం ఉల్లాసభరితమవుతుంది. విష్ణువుకు ఇష్టమైన మాఘ శుద్ధ ఏకాదశి పరమ పవిత్రం. అఘం అంటే పాపం. దాన్ని పోగొట్టేది మాఘం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ మాసం అత్యంత విశేషమైనది. ఇటువంటి పవిత్ర స్నానాల సంస్కృతి దేశంలో అతి ప్రాచీన కాలం నుంచీ ఉందని పురాణాలెన్నో తేటతెల్లం చేస్తున్నాయి.
- పి.భారతి
-------------------


మాఘమాసం ఆరంభం


మాఘమాసమున అనగా మకరరాశిలో రవి ఉండే తరుణంలో నెల రోజులు నియమానుసారంగా మాఘమాస స్నానం చేస్తే చాలు, వారి వారి కోరికలన్నీ తప్పక నెరవేర్తాయి అని పద్మపురాణంలో ఉత్తరఖండంలో పేర్కొనబడింది.

మాఘస్నాయీ వరారోహు దుర్గతిం వైవ పశ్యతి | 
తన్నాస్తి పాతకం యత్తు మాఘస్నానం న శోధయేత్‌ | 
అగ్ని ప్రవేశాదధికం మాఘస్నానం న శోధయేత్‌ | 
జీవితా భుజ్యతే దుఃఖం మృతేన బహుళం సుఖమ్‌ | 
ఏతస్మాత్కారణేద్భద్రే మాఘస్నానం విశిష్యతే

మాఘస్నానానికి ఒక ప్రత్యేకత ఉంది. చాలామంది మాఘమాసం కోసం ఎదురుచూస్తుంటారు.దీనికి కారణం ఈ మాఘస్నానాల వెనుక ఉన్న ప్రత్యేకత, ప్రయోజనాలే. మాఘమాసం స్నానానికి ప్రసిద్ది. మాఘస్నానం ఇహపరదాయకం. సూర్యుడు ఉదయించే సమయంలో స్నానం చేస్తే మహాపాతకాలు నశిస్తాయని కమలాకర భట్టు రచించిన నిర్ణయ సింధులో చెప్పారు.

బ్రహ్మచర్య, గృహస్త, వానప్రస్థ, సన్యాసాశ్రమాలవారూ, అన్ని వర్ణములవారూ, వర్గములవారూ, ప్రాంతాలవారు ఈ మాఘస్నానం చేయవచ్చు.మాఘమాసంలో సూర్యుడు మకరరాశిలో ఉండే సమయంలో సూర్యోదయానికి ముందు వేడి నీటిలోనైనా ఇంట్లో స్నానం చేసినా ఆరు సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుంది. ఇంట్లో బావి నీటి స్నానం చేస్తే పనె్నండు సంవత్సరాల పుణ్యస్నాన ఫలాన్నీ, తటాక స్నానం ద్విగుణం, నదీస్నానం చతుర్గుణం, గంగాస్నానం సహస్రగుణం, గంగాయమునా సంగమ (త్రివేణి) స్నానం నదీ శత గుణ ఫలాన్నీ ఇస్తుందని శాస్త్రాలు వివరిస్తున్నాయి. అయితే మాఘమాసంలో ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగాయమునాది దివ్య తీర్థాలను స్మరించి స్నానం చేయాలని నిర్ణయసింధులో స్పష్టం చేశారు.

‘‘దుఃఖ దారిద్య్ర నాశయ శ్రీ విష్ణోస్త్రోషణాయచ
ప్రాతఃస్నానం కరో మధ్యమాఘే పాప వినాశనం
మకరస్థే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ
స్నానేనా నేన మేదేవ యధోక్త ఫలదోభవ’’
            అనే ఈ శ్లోకం పఠిస్తూ స్నానం ఆచరించాలి.

రోజూ సమయాభావంవల్ల, అనారోగ్యంవల్ల చేయలేనివారు మాఘంలో పాడ్యమి, విదియ, తదియ తిథులలో స్నానం చేసి, మళ్లీ త్రయోదశి, చతుర్దశి మాఘ పూర్ణిమ తిథులలో స్నానం చేయవచ్చు.

ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తరవాతే మాఘమాసం రావటం విశేషంగా చెప్పుకోవాలి. ఈ మాసంలో సూర్యారాధన, శివోపాసన, విష్ణ్వార్చన వంటివి విశేష ఫలాన్నిస్తాయి. సర్వదేవతలకు ప్రీతికరమైన మాసం మాఘమాసం. కార్తీకమాసం దీపానికి ప్రధానమైనట్లే మాఘమాసం స్నానానికి ముఖ్యం.

సూర్యోదయానికి ముందు నదీ స్నానం ఉత్తమం. నది అందుబాటులో లేనివారు తటాకంగానీ, బావిగానీ స్నానానికి మంచిది. ఇవేమీ అందుబాటులో లేనప్పుడు పవిత్ర నదీ స్మరణతో ‘గంగేచ .....జలేస్మిన్ సన్నిధింకురు’’ అని శ్లోకం చెప్పుకుంటూ స్నానం చేయాలి.

మాఘస్నానానాలన్నింటిలోకి త్రివేణి సంగమ స్నానం ఉన్నతమైన ఫలితాన్ని అందిస్తుందని ధర్మశాస్తవ్రచనం. ఉత్తర భారతదేశంలో ఈ నదీ స్నానానికి విశేష ఆదరణ వుంది. మాఘపూర్ణిమనాడు అశేష జనవాహిని త్రివేణి సంగమంలో, గంగానదిలో పవిత్ర స్నానాలు చేస్తారు. దక్షిణ భారతంలో కృష్ణ, గోదావరి, కావేరి నదుల్లో స్నానమాచరిస్తారు. స్నానమాచరించు సమయంలో, శివకేశవాది దేవతాస్మరణ, గంగాయమున, సరస్వతి, గోదావరి వంటి పుణ్యనదుల స్మరణ చేయాలి. అదేవిధంగా ఈ మాసంలో దానం, జపం విశేషంగా చేస్తే ఎంతో మంచిది.

పవిత్రమైన విశేషమైన మాఘస్నానాన్ని సద్వినియోగం చేసుకొని పుణ్యఫలాన్ని పొందటానికి అందరూ ముందుండాలి. ఈ స్నానం ఆధ్యాత్మికతకు పునాదులు వేస్తుంది. మాఘమాసంలో పుణ్యమైన మాఘస్నానమే కాకుండా ఇంకా ఎన్నో పుణ్యదినాలున్నాయి. ఈ మాసంలో డుంఠి గణపతి పూజ, శ్రీపంచమి, భీష్మైకాదశి, మహాశివరాత్రి, రథసప్తమి ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఏ మాసంలో వచ్చే విశేష దినాలను ఆచరిస్తే మానసిక శాంతి, ఆధ్యాత్మికత, పుణ్యఫలం లభిస్తాయని ఋషులు ఆదేశించారు. కలియుగంలో కనీసం ప్రజలు వారు శక్తివంచన లేకుండా కొన్ని ధార్మిక, ఆధ్యాత్మిక నియమాలను పాటిస్తే జీవితం ఆనందంగా గడపవచ్చు.

--------------------------------------------------

మాఘమాస వ్రత మహాత్యాలు

మానవాళికి కావలసిన సర్వ శుభాలనూ పొందేందుకు అనువైన వ్రతాలను చేసుకొనేందుకు వీలున్న మాసం మాఘమాసం. ఈ మాసం పేరు వింటేనే ఆనంద పులకితులవుతారు సంప్రదాయం తెలిసిన వారంతా. గృహ నిర్మాణాలు, పెళ్ళిళ్ళు తదితర శుభకార్యాలన్నిటికీ అనువైన మాసం ఇది. అంతే కాదు శివకేశవుల్దిరితో పాటు సరస్వతీదేవి, వరుణుడు, సూర్యుడు లాంటి దేవతలందరినీ పూజించుకోవటానికి తగిన వ్రతాలు ఈ మాసంలోనే వస్తుంటాయి.

చలికి భయపడక ఉదయాన్నే నదీ స్నానం చేయటం సర్వోత్తమం. ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన, నువ్వులతో హోమం, నువ్వుల దానం, నువ్వుల భక్షణం లాంటివి ముఖ్యమైనవి.రాధన, నువ్వులతో హోమం, నువ్వులను దానం ఇవ్వటం ఆ తర్వాత భోజన పదార్ధాలలో నువ్వులను కలిపి తినటం అనేవి ప్రధానాంశాలుగా భావిస్తుంటారు.

అఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అని అర్థం. మాఘము అంటే పాపాలను నశింప చేసేది అనే అర్థాన్ని పండితులు చెబుతున్నారు. అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది.

మాఘ విశిష్టతను గురించి, ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయటం ఓ వ్రతంగా ఉంది. చలికి భయపడక ఉదయాన్నే నదీ స్నానం చేయటం సర్వోత్తమం. ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన, నువ్వులతో హోమం, నువ్వుల దానం, నువ్వుల భక్షణం లాంటివి ముఖ్యమైనవి.

మాఘమాసంలో శుద్ధ విదియ, తదియ నాడు బెల్లం, ఉప్పు దానం చేయటం మంచిది. దీంతోపాటు పార్వతీ పూజ, లలితావ్రతం హరతృతీయ వ్రతం చేస్తుంటారు.

శుద్ధ చవితిన ఉమా పూజ, వరదా గౌరీ పూజ, గణేశ పూజ చెయ్యడం మొల్ల పువ్వులతో శివపూజ చెయ్యడం ఉంది. ఈ చవితినాడు చేసే తిలదానానికి గొప్ప పుణ్యఫలం చెప్పారు.ఈ చవితికే తిలచతుర్ధి అని పేరుంది. ఈ రోజు ప్రత్యేకంగా నువ్వులను దానం ఇవ్వటం వల్ల అధిక పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు.

శుద్ధ పంచమిని శ్రీపంచమి అని అంటారు. ఈ రోజున సరస్వతీ పూజ చెయ్యటం విశేష ఫలప్రదం. దీన్నే కొన్ని ప్రాంతాల్లో వసంత పంచమి, రతికామదహనోత్సవం అనే పేరున జరుపుకొంటారు.

శుద్ధ షష్టిని విశోకషష్టి అని, మందార షష్టి అని, కామ షష్టి, వరుణ షష్టి అని కూడా అంటారు. ఈ రోజున వరుణ దేవుడిని ఎర్రచందనం, ఎర్రని వస్త్రాలు, ఎర్రని పుష్పాలు, ధూపదీపాలతో పూజించాలి.

శుద్ధ సప్తమిని రథసప్తమి అని అంటారు. ఈ రోజున సూర్య జయంతిని జరుపుతారు. రథసప్తమీ వ్రతం ఎంతో విశేషమైనది.

అష్టమి నాడు భీష్మాష్టమిని చేస్తారు. కురువృద్ధుడు భీష్ముడికి తర్పణం విడవటం ఈనాటి ప్రధానాంశం.

నవమి నాడు నందినీదేవి పూజ చేస్తారు.దీన్నే మధ్వనవమి అని అంటారు. ఆ తర్వాత వచ్చే ఏకాదశికి జయ ఏకాదశి అని పేరు. దీన్నే భీష్మ ఏకాదశి వ్రతమని చెబుతారు. కురువృద్ధుడు భీష్మాచార్యుడు మరణించిన సందర్భం గుర్తుకు తెచ్చుకుంటారు. ఈ తిథినాడే అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరుపుతుంటారు.

ద్వాదశినాడు వరాహ ద్వాదశీ వ్రతం చేస్తారు. త్రయోదశి విశ్వ కర్మ జయంతిగా పేరు పొందింది.

మాఘపూర్ణిమకు మరీ మరీ విశిష్టత ఉంది. ఈ రోజున కాళహస్తిలో స్వర్ణముఖి నదిలో స్నానం చేయటం, ప్రయాగ త్రివేణీ సంగమంలో స్నానం చేయటం విశేష ఫలప్రదాలు. సతీదేవి జన్మించిన తిథిగా కూడా మాఘపూర్ణిమను చెబుతారు.

మాఘమాసంలో వచ్చే కృష్ణపాడ్యమి నాడు సౌభాగ్యప్రాప్తి వ్రతం చేస్తారు.

కృష్ణ సప్తమినాడు సర్వాప్తి సప్తమి వ్రతం, సూర్యవ్రతాలు జరుగుతాయి.

అష్టమినాడు మంగళా వ్రతం చేస్తుంటారు.

కృష్ణ ఏకాదశిని విజయ ఏకాదశి అని, రామసేతు నిర్మాణం పూర్తి అయిన రోజున గుర్తు చేసే తిథి అని చెబుతారు.

కృష్ణ ద్వాదశినాడు తిల ద్వాదశీ వ్రతం జరుపుతుంటారు.

మాఘ కృష్ణ త్రయోదశిని ద్వాపర యుగాదిగా పేర్కొంటారు.

మాఘ కృష్ణ చతుర్దశి నాడు మహశివ రాత్రి పర్వదినం వ్రతం జరుపుతారు.

మాఘమాసంలో చివరిదైన కృష్ణ అమావాస్యనాడు పితృశ్రాద్ధం చెయ్యడం అధిక ఫలప్రదమని పెద్దలంటారు.

ఇలా మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు, పర్వదినాలు, వివిధ దేవతలను ఉద్దేశించి జరపుకోవటం కనిపిస్తుంది. అందుకే మాసానికి తొలినాళ్ళనుండి అంత విశిష్టత ఉంది.

ఫేస్‌బుక్‌ వీడియోలు డౌన్‌లోడ్‌ చేయాలంటే?_FacebookVideosDownlodes?


e-eenadu FacebookVideosDownlodes? Facebook (FB) Video Download

ఎఫ్‌బీ వీడియోలు

          అవసరం మేరకు ఫేస్‌బుక్‌ వీడియోలు డౌన్‌లోడ్‌ చేయాలంటే? పీసీలో అయితే వీడియోపై రైట్‌క్లిక్‌ చేసి ‘షో వీడియో యూఆర్‌ఎల్‌’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి. ప్రత్యేక బాక్స్‌లో ఎఫ్‌బీ వీడియో లింక్‌ ఓపెన్‌ అవుతుంది. ఇతరులకు ఎవరికైనా లింక్‌ని షేర్‌ చేయాలంటే కాపీ చేసి పంపొచ్చు. వీడియోని డౌన్‌లోడ్‌ చేయాలంటే లింక్‌ని https://en.savefrom.net/వెబ్‌సైట్‌లోకి కాపీ చేసి సిస్టంలో సేవ్‌ చేయవచ్చు. ఫేస్‌బుక్‌ ఆప్‌ నుంచి వీడియోల డౌన్‌లోడ్‌ లింక్‌లను పొందేందుకు వీడియో పక్కనే కనిపించే మూడు చుక్కలపై క్లిక్‌ చేయాలి. పాప్‌అప్‌ మెనూలో ‘కాపీ లింక్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది. ఎక్కడైనా యూఆర్‌ఎల్‌ లింక్‌ని పేస్ట్‌ చేసి షేర్‌ చేయవచ్చు. డౌన్‌లోడ్‌ చేయాలంటే అదే మెనూలో ‘డౌన్‌లోడ్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది.

++++++++++++++++++++++++++++++++++++++

‘ప్లస్‌’ అవ్వండి

టైపింగ్‌కి బిల్ట్‌ఇన్‌ కీబోర్డ్‌నే ఎంత కాలం ఉపయోగిస్తాం?... 
‘జీబోర్డు ప్లస్‌’ని వాడి చూడండి 
టైపింగ్‌ మరింత స్మార్ట్‌ అవుతుంది. 
కీబోర్డు నుంచే అదనపు సౌకర్యాల్ని పొందొచ్చు. 
* వాట్సాప్‌లో స్నేహితులతో ఛాటింగ్‌... ఏదో అంశానికి సంబంధించిన అనుమాన నివృత్తి కోసం గూగుల్‌ చేయాల్సి వస్తుంది. దీని కోసం వాట్సాప్‌ను క్లోజ్‌ చేసి గూగుల్‌ సెర్చ్‌ ఆప్‌ ఓపెన్‌ చేయక్కర్లేదు. ఎందుకంటే జీబోర్డ్‌లోనే గూగుల్‌ సెర్చ్‌ ఆప్షన్‌ ఉంది. కీబోర్డు పైన ఉన్న గూగుల్‌ బటన్‌ (గూగుల్‌ లోగో)ను క్లిక్‌ చేసి సెర్చ్‌ చేసుకోవచ్చు. వచ్చిన వివరాల్ని అక్కడి నుంచే వాట్సాప్‌లో షేర్‌ చేయొచ్చు.
* వాట్సాప్‌, మెసెంజర్‌ గ్రూపు ఛాట్‌లో నవ్వులు పూయించడానికి జిఫ్‌లు ఎంత ఉపకరిస్తాయో మీకు తెలిసిందే. వాటిని కూడా మీరూ జిబోర్డ్‌లో పొందొచ్చు. కీబోర్డులో ఉన్న ఎమోజీ బటన్‌ను క్లిక్‌ చేస్తే దిగువన జిఫ్‌ ట్యాబ్‌ ఉంటుంది. అందులోకి వెళ్లి మీకు కావల్సిన ఎమోజీని సెర్చ్‌ చేసి పొందొచ్చు. 
* చిన్న స్క్రీన్‌ ఉన్న మొబైల్స్‌లో టైపింగ్‌ చేసేటప్పుడు వచ్చే ప్రధాన సమస్య...కర్సర్‌ను ముందుకు, వెనక్కి కదపడం. జీబోర్డ్‌లో ఇందుకోసం సులభమైన ఆప్షన్‌ ఉంది. కీబోర్డు మీద టైప్‌ చేశాక... స్పేస్‌ బార్‌ అంచున వేలు తాకించి ఎడమ, కుడివైపు కదిపితే... కర్సర్‌ అందుకనుగుణంగా కదులుతుంది. 
* కీబోర్డులో జీ, చి, !, % లాంటి గుర్తుల్ని టైప్‌ చేయాలంటే... షిఫ్ట్‌ కీని ప్రెస్‌ చేయాలి. జిబోర్డ్‌లో అయితే ‘.’ కీని లాంగ్‌ ప్రెస్‌ చేస్తే సరి. ఆ కీని లాంగ్‌ ప్రెస్‌ చేస్తే సింబల్స్‌ ముఖ్యమైనవి ఒకే బార్‌లో కనిపిస్తాయి. వాటిలో మీకు కావల్సినదాన్ని ఎంచుకోవచ్చు. 
* మెయిల్‌ చేస్తున్నప్పుడు, లేదంటే నోట్స్‌ రాసుకుంటున్నప్పుడు ఏదైనా పదానికి అర్థం తెలియకపోతే... వెంటనే గూగుల్‌లోకి వెళ్లిపోనక్కర్లేదు. జీబోర్డులోని ట్రాన్స్‌లేటర్‌ను వాడుకోవచ్చు. కీబోర్డుపైనున్న ‘జి’ బటన్‌ను క్లిక్‌ చేస్తే... అందులో ట్రాన్స్‌లేటర్‌ ఐకాన్‌ కనిపిస్తుంది. దాన్ని క్లిక్‌ చేసి మీకు కావల్సిన పదాన్ని అనువాదం చేసుకోవచ్చు. 
* జీబోర్డ్‌లో పర్సనల్‌ డిక్షనరీ ఆప్షన్‌ ఉంది. అందులో మెయిల్‌ ఐడీ, చిరునామా, మొబైల్‌ నెంబరు లాంటి ముఖ్యమైన విషయాలను పొందుపరిచి, వాటికి షార్ట్‌కట్‌లు పెట్టుకోవచ్చు. ఉదాహరణకు మీ మెయిల్‌ ఐడీని ఇచ్చి, షార్ట్‌కట్‌గా మెయిల్‌ అని పెట్టుకుంటే... ఆ తర్వాత మీరు కీబోర్డు మీద ఎప్పుడు మెయిల్‌ అని టైప్‌ చేసినా పైన సజెషన్స్‌లో మీ మెయిల్‌ ఐడీ కనిపిస్తుంది. దీని కోసం కీబోర్డు దిగువన ఉన్న ‘,’ బటన్‌ను లాంగ్‌ప్రెస్‌ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. అందులో జీబోర్డ్‌సెట్టింగ్స్‌ను ఎంచుకోండి. ఆ తర్వాత డిక్షనరీ విభాగంలోకి వెళ్తే పర్సనల్‌ డిక్షనరీ కనిపిస్తుంది. అందులో మీరు షార్ట్‌కట్‌లు క్రియేట్‌ చేసుకోవచ్చు. 
* పెద్ద తాకేతెర ఉన్న మొబైల్‌ను ఒక చేత్తో పట్టుకొని టైప్‌ చేయడం కష్టంగా ఉంటుంది. దీని కోసం కొన్ని కీబోర్డ్స్‌లో సింగిల్‌ హ్యాండ్‌ ఆప్షన్‌ ఉంటుంది. దీన్ని యాక్టివేట్‌ చేసుకుంటే కీబోర్డు వెడల్పు తగ్గి ఒకవైపు చేరిపోతుంది. జిబోర్డ్‌లోనూ ఇలాంటి ఆప్షన్‌ ఉంది.
-------------------------
బ్రైట్‌నెస్‌ తగ్గించాలంటే?

ఏసర్‌ ఏస్పైర్‌ ఈ15 మోడల్‌ ల్యాపీని వాడుతున్నా. డిస్క్‌ నుంచి ‘బ్రైట్‌నెస్‌ కంట్రోల్‌ డ్రైవర్స్‌’ ఇన్‌స్టాల్‌ చేయలేకపోతున్నా. ఇతర వెబ్‌సైట్‌ల నుంచి సాధ్యం కావడం లేదు. ఏం చేయాలి?

- అనిల్‌ యాదవ్‌ 
బహుశా మీ ల్యాపీలో రెండు డిస్‌ప్లే కార్డ్స్‌ ఉండొచ్చు. ఒకటి ఇంటెల్‌ డ్రైవర్స్‌ (మైక్రోసాఫ్ట్‌ బేసిక్‌ డిస్‌ప్లే అడాప్టర్‌) అయితే మరోటి ఇంటెల్‌ మదర్‌బోర్డ్‌తో పాటు వచ్చిన ‘ఎన్విడియా’గానీ మరేదైనా కార్డు ఉండొచ్చు. ఈ రెండు డ్రైవర్లలో ఏది మిస్‌ అయ్యిందో చూసి దాన్ని మాత్రం లోడ్‌ చేస్తే సరిపోతుంది. డ్రైవర్స్‌ కోసం మీ సిస్టం ఓఎస్‌ ఆధారంగా కింది వెబ్‌సైట్‌లను చూడండి. 

యూట్యూబ్‌, ఇతర వెబ్‌సెట్స్‌లో అశ్లీల సైట్‌లు ఓపెన్‌ కాకుండా బ్లాక్‌ చేయడానికి అనువైన ఆప్స్‌ని తెలుపగలరు?

- ప్రసాద్‌ టీవీఎన్‌ఎస్‌ 
నెట్టింట్లో టెక్నాలజీ సొల్యుషన్స్‌ కారణంగా అశ్లీల వీడియోలు, ఇతర అసభ్యకరమైన కంటెంట్‌ని ఫిల్టర్‌ చేయడం టూల్స్‌ వాడకంతో సాధ్యం కాదనే చెప్పాలి. టూల్స్‌తో నిరంతరం మానిటర్‌ చేయాలంటే పెద్ద వ్యవస్థని సెట్‌ చేసుకోవాలి. యూట్యూబ్‌లో ఫిల్టర్‌ చేసేందుకు కొన్ని ప్రత్యేక ఆప్షన్లు ఉన్నాయి. అందుకు 
* https://goo.glhC67h సైట్‌లను చూడండి. 
టెక్నాలజీ వాడకంలో సందేహం ఏదైనా మాకు పంపండి. నిపుణులతో సూచనలు అందిస్తాం. 
మా ఈ-మెయిల్‌ its@eenadu.in

-------------------------

ఫాంట్‌ ఏంటి?

గ్రీటింగ్‌ కార్డుల్లో... గ్రాఫిక్‌ డిజైన్లలో రకరకాల ఫాంట్‌లు చూస్తుంటాం. మరి, ఎప్పుడైనా ఆయా ఫాంట్‌ల పేర్లు తెలుసుకోవాలని అనిపించిందా? అయితే, అదేం పెద్ద కష్టమైన పని కాదు. వాడుతున్న స్మార్ట్‌ఫోన్‌లో ‘వాట్‌ ద ఫాంట్‌’ ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేయండి చాలు. ఫోన్‌ కెమెరాతో ఫాంట్‌ని స్నాప్‌ తీస్తే చాలు. కృత్రిమ మేధస్సుతో ప్రాసెస్‌ చేసి ఫాంట్‌ వివరాల్ని చెబుతుంది. ఆప్‌ కావాలంటే https://goo.gl/uc9RYX లింక్‌ని చూడండి.
-----------------------------------
రేటు అంతే ఉండొచ్చు

షామీ కంపెనీ నుంచి వచ్చిన రెడ్‌మి సిరీస్‌ ఇప్పుడు ‘నోట్‌ 5’గా ముందుకురానుంది. రేటు ఎంతుండొచ్చు? అనే ప్రశ్నకు నెట్టింట్లో టెక్కీలంతా రూ.7,000 ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే... తెర పరిమాణం 5.99 అంగుళాలు. ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే. 3జీబీ, 4జీబీల్లో ర్యామ్‌. 32జీబీ, 64జీబీల్లో మెమొరీ. బ్యాటరీ సామర్థ్యం 4,000 ఎంఏహెచ్‌. ఆండ్రాయిడ్‌ ఎన్‌ ఓఎస్‌తో పాటు ‘మియూ9’ ఇంటర్‌ఫేస్‌ని అందిస్తున్నారు. వెనక భాగంలో డ్యూయల్‌ కెమెరాలు (16మెగాపిక్సల్‌, 5 మెగాపిక్సల్‌) ఉండొచ్చని అంచనా. అంతేనా... మి రౌంటర్‌ 3సీ, మి వై-ఫై రిపీటర్‌ గ్యాడ్జెట్‌ల ధరల్ని దేశీయ మార్కెట్‌లో బాగా తగ్గించింది. రూ.1,199 ఉన్న రౌటర్‌ని 999కి, 899ఉన్న దాన్ని రూ799కి అందించేందుకు షామీ సిద్ధం అయింది.
----------------------------------------

టెక్నాలజీ తీన్‌మార్‌

సంక్రాంతి సంబరాల మాదిరే... టెక్నాలజీ ప్రియులకూ అదో సంబరం! 
ఏటా జనవరిలో... అమెరికాలో జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా 
ప్రముఖ కంపెనీలన్నీ ఓ చోట చేరతాయి... సరికొత్త ఆవిష్కరణలతో ముందుకొస్తాయి... 
చూసేందుకు వచ్చే టెక్‌ ప్రియులతో ఒకటే సందడి! 
మరి, గత వారంలో జరిగిన టెక్‌ పండగ ‘కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షో (సీఈఎస్‌)-2018’లో 
ఆకట్టుకున్న తీన్‌మార్‌ సంగతులు కొన్ని...

తోక ఊపుతూ... తలాడిస్తూ!

దీని పేరు ఐబో. సోనీ కంపెనీ తయారు చేసిన బుజ్జి పప్పీ. సీఈఎస్‌ షో అంతా కలియతిరుగుతూ.. అందర్నీ చూస్తూ తోకూపుతూ... తలాడిస్తూ కనిపించింది. అచ్చంగా ఇంట్లో పెంచుకునే బుజ్జి కుక్కపిల్లలానే అబ్బురపరిచింది. తలపై నిమిరితే తన్మయంతో దగ్గరైంది. దీనంతటికీ కారణం దీని బుర్రలోని కృత్రిమ మేధస్సు. స్పర్శకు స్పందించడమే కాదు. చెప్పిన మాట వింటూ కుటుంబసభ్యులతో కలిసిపోతుందట. ఇంతకీ ‘ఐబో’ అంటే అర్థమేంటో తెలుసా? తోడు. 1999లోనే ఇది ప్రపంచానికి పరిచయమైనా ఇప్పుడు తెలివిగా ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌తో ముందుకొచ్చింది. 
వీడియో లింక్‌: https://goo.gl/bLYy15

టీవీ ముడుచుకుంటుంది

ఎంత నాజూకు టీవీ అయినా టేబుల్‌పైన పెట్టాలి.. లేదా గోడకు తగిలించాల్సిందే. చూసినా... చూడకపోయినా... అలా నిత్యం కనిపిస్తూనే ఉంటుంది. పిల్లలు ఉన్న ఇంట్లో అయితే.. అందకుండా... ఏదీ తగలకుండా... జాగ్రత్త పడాల్సిందే. ఇలాంటివి ఏమీ లేకుండా టీవీని చుట్టచుట్టి ఓ బాక్స్‌లో పెట్టేస్తే. చూద్దాం అనుకున్నప్పుడు రిమోట్‌ని తాకగానే బాక్స్‌లో నుంచి బయటికి టీవీ పొడుచుకొస్తే! ఎల్‌జీ కంపెనీ తయారు చేసిన ‘ఎల్‌జీ డిస్‌ప్లే’ టీవీతో ఇది సాధ్యమే. ఓఎల్‌ఈడీ హెచ్‌డీ టీవీ తెర పరిమాణం 65 అంగుళాలు. చూడ్డానికి దళసరి కాగితంలా తెర కనిపిస్తుంది. 
వీడియో లింక్‌: https://goo.gl/e4zH8a

డ్రైవరూ... డెలివరీ బాయ్‌ అక్కర్లేదు

అమెజాన్‌లో ఏదో వస్తువుగానీ.. లేదంటే వేడిగా తిందామాని ఓ పిజ్జానో ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే! మామూలుగా అయితే, వాహనంపై డెలివరీ బాయ్‌ తెచ్చి ఇస్తాడు. ఇది ఇప్పుడు. సమీప భవిషత్తులో డ్రైవరుతోగానీ... డెలివరీ బాయ్‌తోగానీ అక్కర్లేదు. టయోటా కంపెనీ అందుబాటులోకి తేనున్న ‘ఈ-ప్యాలెట్‌’ స్మార్ట్‌ వాహనం ఒక్కటి చాలు. దీన్ని నడిపేందుకు డ్రైవర్‌ అక్కర్లేదు. మిని వ్యానులా ఉండే దీంట్లో ఆర్డర్లు, అడ్రస్‌లను లోడ్‌ చేస్తే చాలు. మెరుపు వేగంతో డెలివరీ చేస్తుంది. అంతేనా... కార్యాలయాలకు ఉద్యోగుల్ని చేరవేస్తుంది. 
వీడియో లింక్‌: https://goo.gl/yiQytH

ఇదో కెమెరా ‘కన్ను’

కంటి చూపు లేనివారు లేదా చూపు పాక్షికంగా కోల్పోయినవారు పుస్తకాలు, పత్రికలు చదవడం కష్టమే కాదు... కొందరికి అసాధ్యం కూడా. అలాంటి వారికి చదివి వినిపించే కెమెరా కన్ను త్వరలోనే పరిచయం కానుంది. అదే ‘ఆర్‌కామ్‌ మైఐ2.0’. చూపుడు వేలంత ఉన్న దీన్ని చిత్రంలో మాదిరిగా కళ్లజోడుకి అమర్చుకుని చదవాలనుకున్న వాటిని వేలితో చూపితే చాలు. శ్నాప్‌ తీసుకుని చక్కగా చదివి వినిపిస్తుంది. అంతేకాదు... షాపింగ్‌కి వెళ్లినప్పుడు కెమెరాకి చూపిన వాటిని గుర్తించి చెప్పడంతో పాటు రేటెంతో కూడా చెబుతుంది. కృత్రిమ మేధస్సుతో మనుషుల ముఖాల్ని గుర్తించి వచ్చింది ఎవరనేది చెబుతుంది. ముఖ్యమైన 100 మంది వ్యక్తుల ముఖాల్ని గుర్తించేలా సెట్‌ చేసుకోవచ్చు. 
వీడియో లింక్‌: https://goo.gl/3QJaot

ఈ కారుకి ఓనరు తెలుసు

ఎప్పుడైనా కారు తాళాలు పోగొట్టుకుంటే వచ్చే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ప్రత్యామ్నాయం చాలా కష్టం. మరైతే, ఇప్పుడొస్తున్న స్మార్ట్‌ఫోన్‌ మాదిరిగా కారు దగ్గరికి వెళ్లగానే మీ కారు మిమ్మల్ని గుర్తిస్తే! డోరు తెరుచుకుంటే! భవిష్యత్‌ కార్లలో ఇది సాధ్యమే. కావాలంటే చైనాకి చెందిన బైటన్‌ కంపెనీ తయారు చేసిన ఈ నమూనా కారుని చూడండి. ఇదో ఎలక్ట్రిక్‌ స్పోర్ట్స్‌ కారు. దీంట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ‘ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ’తో యజమానిని గుర్తించి కారు డోరు తెరుచుకుంటుంది. కారు మొత్తాన్ని స్మార్ట్‌గా మేనేజ్‌ చేసేందుకు ముందు భాగంలో పెద్ద టచ్‌స్క్రీన్‌ని ఏర్పాటు చేశారు. ప్రత్యేక సెన్సర్లు నిత్యం డ్రైవరు హార్ట్‌రేట్‌, బీపీలను ట్రాక్‌ చేస్తాయి కూడా. 
వీడియో లింక్‌: https://goo.gl/H1Jftm

సూట్‌కేస్‌ ‘ఫాలో.. ఫాలో.. యు!’

దూర ప్రాంతాలకు వెళ్లేప్పుడు ఒకటే ఇబ్బంది. సూట్‌కేస్‌ని మోసుకెళ్లడం. లేదంటే లాక్కెళ్లడం. ఇదేం లేకుండా మనం నడుస్తూ వెళ్తుంటే... మనల్ని సూట్‌కేస్‌ ఫాలో అయితే! ఏదో ఫాంటసీ సినిమాలో అయితే సాధ్యమే అనుకోవక్కర్లేదు. ఈ ఏడాదిలో ఇది సాధ్యమే. చైనా కంపెనీ తయారు చేసిన ‘ఫార్వొర్డ్‌ఎక్స్‌ సీఎక్స్‌-1’ స్మార్ట్‌ సూట్‌కేస్‌ అందుకు సాక్ష్యం. హోటళ్లు, ఎయిర్‌పోర్టుల్లో వెళ్లేటప్పుడు మిమ్మల్నే చూస్తూ ఫాలో అయిపోతుంది. అందుకు దీంట్లో కృత్రిమ మేధస్సుతో కూడిన కెమెరాల్ని నిక్షిప్తం చేశారు. ఒకవేళ యజమాని సూట్‌కేస్‌ గుర్తించలేనంత దూరం వెళ్తున్నా... బ్యాటరీ శాతం తగ్గుతున్నా వెంటనే మేసేజ్‌ ద్వారా తెలుపుతుంది. 
వీడియో లింక్‌: https://goo.gl/Ks2TJi

‘గోడ’లాంటి టీవీ

హాల్లోని గోడని చూస్తే టీవీ కనిపించడం మామూలే. కానీ, శ్యామ్‌సంగ్‌ తయారు చేసిన ‘ద వాల్‌’ టీవీని గోడకి పెడితే గోడ కనిపించకపోడం ఓ అద్భుతం. ఎందుకంటే టీవీ పరిమాణం ఎంతో తెలుసా? 146 అంగుళాలు. అంటే సుమారు... 34 అంగుల మిని సినిమా డిస్‌ప్లే అన్నమాట. మైక్రోఎల్‌ఈడీ ప్యానల్స్‌తో ఇంత పెద్ద తెరని తీర్చిదిద్దారు. 4కే రిజల్యూషన్‌తో వీడియోలు చూడొచ్చు. 
వీడియో లింక్‌: https://goo.gl/w5hcBg

ఇక అన్నీ స్మార్ట్‌ ‘వైట్‌బోర్డ్‌’లే!

స్కూల్‌... కాలేజీ... కార్పోరేట్‌ ఆఫీస్‌ల్లో ఎక్కడికి వెళ్లినా స్టాండ్‌పైనో... గోడకో వైట్‌బోర్డ్‌, బ్లాక్‌ స్కెచ్‌ లేదంటే బ్లాక్‌బోర్డ్‌, వైట్‌ స్కెట్‌ కనిపిస్తాయి. మీకు తెలుసా? ఇక మీదట వీటి స్థానంలో శామ్‌సంగ్‌ తయారు చేసిన ‘ద శామ్‌సంగ్‌ ఫ్లిప్‌’ కనిపిపంచొచ్చు. ఎందుకంటే... ఇదో బహుళ ప్రయోజనాల డిజిటల్‌ డిస్‌ప్లేగా ‘వైట్‌బోర్డ్‌’గా పరిచయం కానుంది. నిలువు, అడ్డంగా తిప్పుకుని అవసరానికి అనువుగా వాడుకోవచ్చు. స్టైలస్‌తో బోర్డుపై రాసిన కంటెంట్‌ని ఎన్‌ఎఫ్‌సీ టెక్నాలజీతో ఫోన్‌, ట్యాబ్‌, ల్యాపీల్లోకి చిటికెలో కాపీ చేసుకోవచ్చు.
వీడియో లింక్‌: https://goo.gl/sEBxJy

అత్యంత నాజూకు ల్యాపీ

ఫోన్లు, ట్యాబ్‌లతో పాటు ల్యాప్‌టాప్‌లూ నాజూకుగా మారిపోతున్నాయ్‌. అందుకు ఎసర్‌ పరిచయం చేసిన ‘స్విప్ట్‌ 7’ ఉదాహరణ. ప్రపంచంలోనే ఇది అత్యంత పల్చటి ఆల్ట్రాబుక్‌. మందం ఎంతంటే 8.98ఎంఎం. వచ్చే ఏప్రిల్‌ నాటికల్లా మార్కెట్‌లోకి తేనుంది. దీని తాకేతెర పరిమాణం 14 అంగుళాలు. రిజల్యూషన్‌ 1920*1080 పిక్సల్స్‌. ఐ7 ప్రాసెసర్‌ని వాడారు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే సుమారు 10 గంటల వరకూ వాడుకోవచ్చు. 
వీడియో లింక్‌: -https://goo.gl/287iun
3డీలో స్కానింగ్‌
ఫోన్‌ కెమెరాకి జూమింగ్‌ లెన్స్‌ని పెట్టుకుని డీఎస్‌ఎల్‌ కెమెరా మాదిరిగా ఫొటోలు తీసుకోవడం తెలుసు. కానీ, ఎప్పుడైనా స్మార్ట్‌ ఫోన్‌ వాడుకుని 3డీ స్కానింగ్‌ చేశారా? అయితే, మీరు ‘బెల్లుస్‌3డీ ఫేస్‌ కెమెరా’ గురించి తెలుసుకోవాల్సిందే. చిత్రంలో మాదిరిగా స్కానింగ్‌ పరికరాన్ని ఫోన్‌కి కనెక్ట్‌ చేసి ఎవరికివారే ముఖాన్ని స్కాన్‌ చేసుకోవచ్చు. కృత్రిమ మేధస్సు (ఏఐ) సపోర్ట్‌తో స్కానర్‌ ముఖాన్ని అన్ని కోణాల్లో చిత్రీకరిస్తుంది. ఇలా చిత్రీకరించి 3డీ ఇమేజ్‌తో మోడళ్లు సరిపడే యాక్ససరీస్‌, 3డీ ఫేస్‌ మాస్క్‌లను రూపొందించడం సులభం అవుతుంది.
వీడియో లింక్‌: https://goo.gl/3tCXRF

ఉషాకిరణాలు sunrise


ఉషాకిరణాలు sunrise lordsurya radhasaptami bhaktipustakalu

ఉషాకిరణాలు 
సూర్యుడు ఆది దేవుడు. జ్యోతి స్వరూపుడు. జీవకోటికి నిత్యమూ దర్శనమిస్తున్న ప్రత్యక్ష దైవం. సకల ప్రాణులకు ప్రభాకరుడే జీవశక్తిని, చైతన్యదీప్తిని ప్రసాదిస్తున్నాడు. అందుకే ఆయనను పాలన కర్త శ్రీమన్నారాయణమూర్తితో పోల్చుకొని ‘సూర్యనారాయణుడు’ అని పిలుచుకుంటారు భక్తులు. భానుడు కాలస్వరూపుడు. కాల విభాగాలైన మాసాలకు, అయనాలకు, రుతువులకు, గ్రహాలకు, శీతోష్ణాదులకు ఆయనే కారణభూతుడు. సృష్టిలో పన్నెండుమంది ఆదిత్యులు ఉన్నారని; సమస్త జీవజాలానికి, సృష్టివిధానానికి వారే ఆధారమని ‘భవిష్య పురాణం’ చెబుతోంది.

నవగ్రహాల్లో సూర్యుడే మొదటివాడు. కాలచక్రాన్ని ఆయనే తిప్పుతున్నాడు. సూర్య గతి కారణంగా, కాలం నిరాటంకంగా ముందుకు సాగుతోంది. సూర్యారాధన దేహసంబంధ దోషాల్ని తొలగిస్తుందని ‘బ్రహ్మాండ పురాణం’ విశదీకరిస్తోంది.

భాస్కరుడు ఉదయిస్తూ చీకటిని తరిమికొడతాడు. ఇది లోకం ప్రత్యక్షంగా చూస్తున్న నిత్యసత్యం. ఉషాకిరణాలు సంపదను, దీర్ఘాయువును, రక్షణను కలిగిస్తాయి. భాను కిరణాల ద్వారా మానసిక నిర్మలత ప్రాప్తిస్తుంది. జీవరాశి అంతటికీ ఆయనే హితుడు కాబట్టి, ‘మిత్రుడు’ అని సంబోధించింది రుగ్వేదం. ఉపాసన వల్ల వర్చస్సు, దృష్టి, జ్ఞానం లభిస్తాయని ‘శుక్ల యజుర్వేదం’ మంత్రాలు చెబుతాయి. ఆదిత్యుడు ఆరోగ్యాన్ని, తేజస్సును, బలాన్ని ప్రసాదిస్తాడని సామవేదం పలుకుతోంది. పలు బాధల్ని నివారిస్తాడంటోంది అధర్వణ వేదం.

ప్రతిరోజూ ఉదయాన స్నానం చేసి, సూర్యుణ్ని ధ్యానిస్తూ జలధారతో అర్ఘ్యమివ్వాలి. అది సప్తవిధ పాపాలూ సమసిపోయేలా చేస్తుందంటారు. మానవాళికి ఆయన భౌతికంగా ప్రేరణశక్తిని కలిగిస్తాడని గాయత్రీ మంత్రం వర్ణిస్తుంది. సూర్యశక్తి అపారం. విశ్వమానవాళికి కావాల్సినంత వర్షం లభించడానికి కారకుడై ‘ఘన వృష్టి’ అని ఖ్యాతి పొందాడు. లోకులు వర్షం కురిసినప్పటి తడిలోనే ఉండిపోతే, క్రిమికీటకాదులు ప్రబలి వ్యాధులు వ్యాపిస్తాయి. అలా కాకుండా త‌గినంత‌ ఎండనిచ్చి రోగాల బారినుంచి వారిని కాపాడుతూ ‘ఆతపి’ అనే పేరు గడించాడు. పాపపుణ్యాలన్నింటికీ లోకసాక్షి అయ్యాడు.

ప్రభాకరుడికి ‘వెలుగు నిధి’ అనే పేరుంది. వెలుగు లేకుంటే, అంతా చీకటిమయమే. విజ్ఞానానికి వెలుగు, అజ్ఞానానికి చీకటి ప్రతీకలు. విద్య అంటే- చదవటం, రాయటం మాత్రమే కాదు. విజ్ఞానమే విద్య. అందరూ వెలుగునే కోరుకోవాలి. ఆ బాటలోనే పయనించాలి!
- యం.సి.శివశంకరశాస్త్రి

పవిత్ర ధామాలు గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్‌, బదరీధామం-pavitradhamalu

పవిత్ర ధామాలు గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్‌, బదరీధామం-pavitradhamalu gangotri yamunotri badaridhamamkedaranath

పవిత్ర ధామాలు

హిమాలయ పర్వతశ్రేణి ప్రపంచంలో ఒక అద్భుతం. ఈ పుణ్య గిరుల్లో పురాణ ప్రసిద్థమైన నాలుగు పవిత్ర క్షేత్ర-తీర్థాలను చతుర్థాలుగా వ్యవహరిస్తారు. 'చార్‌ధామ్‌'గా ప్రసిద్ధి చెందిన గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్‌, బదరీధామం- ఈ నాలుగూ పౌరాణిక వైశిష్ట్యాన్నీ, చారిత్రక ప్రభావాన్నీ వ్యక్తపరుస్తున్నాయి.

యుగయుగాల నుంచి అనేకమంది ఈ నాలుగు ధామాల యాత్రలను భక్తిశ్రద్ధలతో చేస్తున్నారు. బదరీ నుంచి పై మూడు క్షేత్రాలు వైశాఖ శుద్ధ తృతీయ(అక్షయ తృతీయ) నుంచి, ఆశ్వయుజ బహుళ (దీపావళి) అమావాస్య వరకు మాత్రమే యాత్రకు అనుకూలం. ఆ తరవాత వీటిలో ప్రవేశానికి అనుమతించరు. ఈ నడిమి కాలంలో దేశం నలువైపులనుంచి ఎందరో యాత్ర చేస్తారు. ఈ యాత్రతో జన్మసాఫల్యం పొందినట్లుగా, చరితార్థత సాధించిన అనుభూతి భారతీయుల అంతరంగంలో పొంగుతుంది.


బదరికా క్షేత్రం శ్రీమహావిష్ణువు తపోభూమిగా పురాణాలు చెబుతున్నాయి. సర్వ విష్ణుక్షేత్ర శక్తి రాశీభూతమైన ఈ పుణ్యప్రాంతంలో నారాయణుడు తపోమూర్తిగా వెలసి ఉన్నాడని స్కాందపురాణ వచనం. ధర్ముడు, మూర్తి అనే దివ్య దంపతులకు తపోఫలంగా నారాయణుడు 'నర, నారాయణ' అనే నామాలతో రెండు మూర్తులుగా అవతరించాడని, ఇందులో నారాయణుడు పూర్ణస్వరూపంగా, నరుడు అంశావతారంగా పురాణాలు వర్ణించాయి. వీరుభయులూ తపోమార్గాన్నీ, జ్ఞానమార్గాన్నీ సముద్ధరణ చేసిన దివ్యావతారాలంటారు. నారాయణుడి తపస్సమయంలో లక్ష్మీదేవి గొప్ప బదరీవృక్షం(రేగుచెట్టు)గా మారి, ఆయనకు నీడపట్టి ఆశ్రయించి ఉన్న కారణంగా ఈ క్షేత్రం బదరీ క్షేత్రమైందని పురాణోక్తి.


నరనారాయణులు శాశ్వతావతారులనీ, సర్వ దివ్య విద్యలకు, రుషులకు ఆశ్రయమూర్తులనీ శాస్త్రాలు చెబుతున్నాయి. గంగానది 'అలకనందా' పేరుతో ప్రవహిస్తున్న పుణ్యప్రవాహ తీరంలో భవ్యమైన నారాయణ మందిరం ఉంది. తపోమూర్తిగా ఉన్న నారాయణ దివ్యవిగ్రహం కాలాంతరంలో నదిలో అదృశ్యమైందని, ఆదిశంకరుల యోగదృష్టికి గోచరమై, తిరిగి ప్రతిష్ఠితమైందని చరిత్ర.


ఈ ఆలయ పరిసరాల్లో, పర్వత శ్రేణుల్లో ఎన్నో తీర్థాలు, తపోధామాలు ఉన్నాయనీ, వాటి మహిమ అపారమనీ ధార్మిక గ్రంథాలు చెబుతున్నాయి. 
పరవళ్ళతో ప్రవహిస్తున్న గంగా నదీతీరంలో ఎన్నో పుణ్యఘట్టాలను పురాణం పేర్కొంది. తపోయోగ శక్తిగా నారాయణుడు కృతయుగం నుంచే అక్కడ నెలకొని, ధ్యాననిష్ఠులకు మాత్రమే హృదయంలో గోచరించేవాడనీ, తరవాత దేవతల ప్రార్థన మేరకు దివ్య శిలామూర్తిగా తన తపోముద్రను ప్రకటిస్తూ ఆవిర్భవించాడనీ 'స్కాందం' చెబుతోంది. ఈ క్షేత్రానికి 'విశాల' అనే నామాంతరం ఉంది. అపరిమితమైన విష్ణుశక్తిని ప్రకటించే ఈ విశాల నామంతో నేటికీ భగవానుని ఎలుగెత్తి కీర్తిస్తారు. 'బదరీ విశాల్‌' అని ఆ క్షేత్ర పరిసరాలు భక్తుల నినాదాలతో మారుమోగుతుంటాయి. దర్శనమాత్రం చేతనే పాపసంహరణం చేసే ఈ క్షేత్రంలో, స్వామి ప్రసాదానికి గొప్ప మహిమ ఉందని పురాణం వర్ణించింది.


ఇక్కడి ఆలయ సమీపాన బ్రహ్మకపాల తీర్థం ప్రత్యేకమైంది. గయ కంటే ఎనిమిది రెట్లు అధిక ఫలాన్ని ప్రసాదించే ఈ పితృతీర్థాన్ని పురాణాలు బహువిధాల ప్రస్తుతించాయి. దీనితోపాటు అగ్ని తీర్థం ప్రసిద్ధమైంది. ఆలయ సన్నిధిలో ఉన్న పంచశిలలు, పురాణాలు వర్ణించిన విధంగానే నేటికీ గోచరిస్తున్నాయి. నారది, నారసింహి, వారాహి, గారుడి, మార్కండేయ- అని ఆ శిలల పేర్లు. వీటికి ఐతిహ్యాలు కూడా చాలా ఉన్నాయి. ఈ అయిదు శిలల నడుమ గంగను గొప్ప తీర్థంగా అభివర్ణించారు.


నారాయణుడి వూరువు (తొడ) నుంచి ఆవిర్భవించిన వూర్వశీదేవి వ్యక్తమైన తీర్థం- వూర్వశీ తీర్థం. బదరీధామంలో మరో గొప్పతీర్థం- సరస్వతీ తీర్థం. ఒకప్పుడు అసుర శక్తులు వేదాలు అపహరించగా, బ్రహ్మదేవుడు బదరికాశ్రమాన తపస్సు ఆచరించాడనీ, అప్పుడు నారాయణుడు హయగ్రీవ రూపంతో అసుర సంహారంచేసి వేదవిద్యను బ్రహ్మకు అనుగ్రహించాడనీ, ఆ వేదాలే ద్రవరూపంలో ఇక్కడ ప్రవహిస్తున్నాయనీ పురాణ ఐతిహ్యం. ఈ ద్రవరూపిణే 'సరస్వతీ తీర్థం'గా పూజలందుకుంటోంది. ఈ పుణ్య ప్రవాహ సమీపంలో మానసోద్భేద తీర్థం ఉంది. దాని సమీపానే 'వ్యాస గుహ' ప్రసిద్ధి. వేదవ్యాసులు ఇక్కడే వేదాలు, పురాణాలు రచించారని చెబుతారు.


ఉన్నత పర్వత శిఖరాల్లో వసుధారా జలపాత తీర్థం మరో విశిష్టత. అష్టవసువుల తపశ్శక్తి ప్రభావంవల్ల ఏర్పడిన ఈ పావన ధారను అద్భుతంగా స్కాంద పురాణం కీర్తించింది. ఈ మార్గం ద్వారానే పాండవులు స్వర్గారోహణ గావించినట్లు భారత వచనం. అనేక దివ్యత్వాలకు ఆలవాలమైన బదరీ విశాల క్షేత్రం ప్రపంచంలోని అన్ని దిశల నుంచి ప్రజలను ఆకర్షిస్తోంది. మాటలకందని ఒక దివ్యానుభూతిని, శక్తిని ప్రసరిస్తూనే ఉంది.
- సామవేదం షణ్ముఖ శర్మ

తిరుమలలో మీరు వాలంటీర్ గా చేస్తారా..?_Will you make volunteer in Thirumala?


#work, #volunteer, #Tirumala, #TTD, #DressCode, #Srivaru, #Tirupati, #Pilgrims bhaktipustakalu granthanidhiతిరుమలలో మీరు వాలంటీర్ గా చేస్తారా..?


అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా..?

వివరాలు తెలీక బాధ పడుతున్నారా..?

తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి వారిని ఎంతోమంది దర్శించుకుని తరిస్తారు. అయితే ఆ స్వామి వారి సన్నిధిలో వారం రోజులపాటు సేవ చేసే భాగ్యాన్ని కూడా కల్పిస్తోంది టీటీడీ. శ్రీవారి సన్నిధిలోని క్యూ లైన్లు, దేవాలయ పరిసరాలు తదితర చోట్ల విధులు నిర్వహించేందుకు వలంటీర్లను ఎంపిక చేస్తుంది. స్వామివారి సన్నిధిలో సేవకు ఎలా వెళ్లాలి?, మార్గదర్శకాలు ఏమిటో?

మీ కోసం....

నెల రోజుల ముందే సమాచారమివ్వాలి..!

ఆధ్యాత్మిక పరిజ్ఞానం కలిగి ఉండాలి. స్త్రీ, పురుష బేధం లేకుండా పదిమంది భక్తులకు తక్కువగాకుండా బృందంగా వెళ్లాలి. గ్రూపులోని సభ్యులంతా వారి పేరు, చిరునామా, వయస్సు తదితర వివరాలను నెలరోజుల ముందుగానే టీటీడీకి పంపాలి.

ఏ కులం వారైనా హిందువులందరూ శ్రీవారి సేవకు అర్హులే. 

హిందువుగా గుర్తించేందుకు తిరుమల నామం, తిలకం లేదా కుంకుమ లేదా చందనం బొట్టు ధరించాలి.

శ్రీవారి సేవకు వచ్చే గ్రూపు లీడరు లేదా కోఆర్డినేటర్ వలంటీర్ల పూర్తి వివరాలు తిరుమల సేవా సదన్‌లో అందించాలి.

వారి వయసు 18 ఏళ్లు నిండి 60 ఏళ్లలోపు ఉండాలి.

ఆరోగ్య ధ్రువీకరణ పత్రాన్ని (మెడికల్ సర్టిఫికెట్) గుర్తింపు పొందిన వైద్యునిచేత అటెస్ట్ చేయించి సమర్పించాలి.

కేటాయించి తేదీల్లో ఉ. 10 నుంచి సా.5 వరకు సేవాసదన్‌లోని సహాయ ప్రజా సంబంధాల అధికారికి రిపోర్ట్ చేయాలి.

సేవకులకు ఉచిత బస కల్పిస్తారు. పురుషులకు పీఏసీ-3లో, మహిళలకు సేవాసదన్‌లో వసతి కల్పిస్తారు. సేవకులు తమ లాకర్ కోసం తాళం చెవిలు తెచ్చుకోవాలి.

శ్రీవారి సేవాసదన్‌లో రోజూ సాయంత్రం 4గంటలకు డ్యూటీలు కేటాయిస్తారు. రోజుకు కనీసం ఆరుగంటలు విధులు నిర్వహిం చాల్సి ఉంటుంది.

సేవా సమయంలోనే శ్రీవారి స్కార్ఫ్‌లు ధరించాలి.

గోవిందుడిని స్మరిస్తూ, భక్తులను గోవిందా గోవిందా అని సంభోదించాలి.

శ్రీవారి సేవ పూర్తిగా యాత్రికుల సహా యం చేసేందుకు ఉద్దేశించిన స్వచ్ఛంద సేవ మాత్రమే. సేవ కోసం గ్రూపు కోఆర్డినేటర్‌కు కానీ సిబ్బందికి కానీ ధన, వస్తురూపంలో ఎలాంటి చెల్లింపులు ఉండవు.

కేటాయించిన ప్రదేశంలోనే సేవ చేయాలి. గర్భాలయ సేవ నిర్బంధ సేవ కాదు. గర్భాలయం సేవ కోసం ఒత్తిడి చేయకూడదు.

" సేవా సదన్‌లో ఉండే మహిళా సేవకులు రాత్రి వేళల్లో నైటీలు ధరించరాదు."

నియమ, నిబంధనలు అతిక్రమిస్తే రెండేళ్ల వరకు సేవకు అనుమతించరు.

తిరుమల ఆస్థాన మండపంలో ప్రతి శుక్రవారం ఉదయం 9నుంచి ప్రారంభమయ్యే శిక్షణ తరగతులకు శ్రీవారి సేవకులు హాజరుకావాల్సి ఉంటుంది.

సేవకులు తమ చిన్నారులు, వృద్ధులను వెంట తీసుకు రాకూడదు.

డ్రెస్ కోడ్ :

సేవకు వచ్చే మహిళలు మెరూన్ బార్డర్ కలర్‌తో కూడిన ఆరెంజ్ కలర్ చీర, రవిక ధరించాలి. పురుషులు తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి.


వివరాలు పంపాల్సిన చిరునామా..!
పౌరసంబంధాల అధికారి,
తిరుమల తిరుపతి దేవస్థానము,
కపిలతీర్థం రోడ్డు, తిరుపతి, పిన్ కోడ్ 517501.
మరిన్ని వివరాలకు 0877-2263544, 0877-2264392
 నంబర్లలో సంప్రదించవచ్చు.


#work, #volunteer, #Tirumala, #TTD, #DressCode, #Srivaru, #Tirupati, #Pilgrims

వాసవీ కన్యకాపరమేశ్వరీ_vasaviKanyakaParameswari

వాసవీ కన్యకాపరమేశ్వరీ_ vasaviKanyakaParameswari bhakthi granthanidhi mohanpublications antaryami mandaram bhaktipustakalu gollapudi

వాసవీ కన్యకాపరమేశ్వరీ_ vasaviKanyakaParameswari bhakthi granthanidhi mohanpublications antaryami mandaram bhaktipustakalu gollapudi


కల్పవల్లి... కన్యకాపరమేశ్వరి!

ప్రాణం కంటే మానం గొప్పదని భావించి ఆత్మార్పణ చేసుకున్న పవిత్రమూర్తి కన్యకాపరమేశ్వరి అమ్మవారు. ఆమె జన్మించిన ఊరుగానే కాదు, ఆత్మార్పణ చేసుకున్న పవిత్ర స్థలంగానూ పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండకు విశిష్ట స్థానం ఉంది. ఈ నెల 19న అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని వైభవోపేతంగా జరుపుతారిక్కడ. 
వశిష్ఠ గోదావరీ తీరంలో చుట్టూ పచ్చటి ప్రకృతి సోయగాలతో అలరారుతున్న పెనుగొండ ఆధ్యాత్మికంగానూ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కొలువైన మహిషాసురమర్దినీ సమేత నగరేశ్వరస్వామి ఆలయం విశిష్టమైంది. ఈ క్షేత్రంలోనే వెలసిన వాసవీ కన్యకాపరమేశ్వరీ అమ్మవారు ఆర్యవైశ్యుల ఆరాధ్య దేవతగా, భక్తజనకోటి కొంగుబంగారంగా విశేష పూజలందుకుంటోంది. అమ్మవారి జన్మస్థలం, ఆత్మార్పణ తర్వాత కులదైవంగా వెలసిన ప్రాంతం ఇదే కావడంతో పెనుగొండ ఆర్యవైశ్యులకు మరింత ప్రత్యేకం.

స్థల పురాణం 
సుమారు నాలుగు వేల సంవత్సరాల కిందట నగరేశ్వరస్వామి, మహిషాసురమర్దిని అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలిశారు. కాలక్రమంలో ఈ క్షేత్రానికి దగ్గర్లో నివాసముంటున్న కుసుమశ్రేష్ఠి, కుసుమాంబ దంపతులకు వాసవీ మాత జన్మించింది. ఆమె బాల్యం నుంచే శివభక్తురాలు. రాజమహేంద్రవరాన్ని పాలించే విష్ణువర్థన మహారాజు పెనుగొండ క్షేత్రాన్ని దర్శించానికి వచ్చినప్పుడు కుసుమశ్రేష్ఠి ఇంటిలో ఆతిథ్యం తీసుకున్నాడు. ఈ సందర్భంలో వాసవి అందాన్ని చూసి ముగ్ధుడై, ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. రాజు ఆజ్ఞను ధిక్కరించలేని కుసుమశ్రేష్ఠి ఏం చెయ్యాలో పాలుపోక తమ కులపెద్దలకు జరిగింది విన్నవిస్తాడు. వారిలో కొంతమంది ఈ కళ్యాణానికి అంగీకరించగా, మరికొందరు క్షత్రియులతో వియ్యం వద్దంటూ నిరాకరించారు. అనంతరం వాసవిని తన నిర్ణయం అడగగా, తాను పార్వతీదేవి అంశతో జన్మించాననీ ఆ పరమశివుడిని తప్ప అన్యులను వివాహం చేసుకోననీ చెబుతుంది. విషయం తెలుసుకున్న రాజు ఆమెను బంధించడానికి పయనమవుతాడు. దీంతో వాసవి ఆత్మార్పణకు సిద్ధమవుతుంది. ఆమెతోపాటు వాసవికి మద్దతుగా నిలిచిన వారుకూడా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు. బ్రహ్మకుండం అనే ప్రాంతంలో మాఘ శుద్ధ విదియనాడు 102 అగ్నిగుండాలను ఏర్పాటుచేసుకుని వాసవితో సహా అందరూ శివుడిలో ఐక్యమవుతారు. అనంతరం నగరేశ్వరస్వామి ఆలయంలో వాసవీ అమ్మవారు స్వయంభూగా వెలిసినట్లు ఇక్కడి భక్తుల విశ్వాసం.ఏడంతస్తుల గాలిగోపురం 
ఈ ఆలయంలో వాసవీ అమ్మవారు ఆత్మార్పణ చేసిన దృశ్యాలను తెలుపుతూ నిర్మించిన గాలిగోపుర మండపాన్ని సందర్శించవచ్చు. ఏడంతస్తులుగా నిర్మించిన ఈ గాలిగోపురానికి ప్రతి అంతస్తులో అమ్మవారి స్థలపురాణాన్ని తెలిపే శిల్పాలు కనువిందు చేస్తాయి. దీంతోపాటు వెంకటేశ్వరస్వామి, నవగ్రహాలు, గణపతి, కాలభైరవులతో నాలుగు ఉపాలయాలను ఏర్పాటు చేశారు. క్షేత్రపాలకుడిగా జనార్దనస్వామి దర్శనమిస్తాడు. కంచికామకోటి పీఠాధిపతితో శివపంచాయత క్షేత్రంగా పునఃప్రతిష్ఠ చేయించిన ఈ ఆలయంలో 2012 నుంచీ నిత్యాన్నదాన సేవ కొనసాగుతోంది.

మూలవిరాట్‌కు పూజలు... 
అమ్మవారు ఆత్మార్పణ చేసిన మాఘ శుద్ధ విదియ రోజున(ఈ ఏడాది జనవరి 19న) ఆ తల్లికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ రోజు వేకువజాము నుంచే కన్యకాపరమేశ్వరి మూలవిరాట్‌కు పంచామృత స్నానాలూ, విశేష అభిషేకాలూ ప్రారంభమవుతాయి. శోభాయమానంగా అలంకరించిన ఆ చల్లనితల్లి విగ్రహాన్ని మంగళవాయిద్యాల నడుమ ఊరేగిస్తారు. అనంతరం 102 హోమగుండాలను ఏర్పాటు చేసి, పూర్ణహోమాన్ని నిర్వహిస్తారు. ఏడాదిలో వాసవీమాత జన్మదినం, ఆత్మార్పణ చేసుకున్న రెండు రోజులు మాత్రమే మూలవిరాట్‌కు అభిషేకాలు చేస్తారు. దీంతోపాటు వైశాఖమాసంలో శుద్ధ షష్ఠి నుంచి దశమి వరకూ అమ్మవారి జయంతిని నిర్వహిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా ఏడు రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా చేస్తారు.ఎలా చేరాలంటే... 
వశిష్ఠ గోదావరికి 15కి.మీ. దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి చేరాలంటే రైలూ, బస్సు సౌకర్యాలు ఉన్నాయి. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిలో సిద్ధాంతం నుంచి 15 కిలోమీటర్లూ, పాలకొల్లు నుంచి 12 కిలోమీటర్ల్లూ, తణుకు నుంచి 13 కిలోమీటర్లూ ప్రయాణించి వాసవీ అమ్మవారిని దర్శించుకోవచ్చు.
- కె. అనీల్‌కుమార్‌, ఈనాడు, పశ్చిమ గోదావరి 

ఊరికి పండగొచ్చింది_sankranthiఊరికి పండగొచ్చింది!

అవును... సంక్రాంతి అంటే సొంతూరే! ఆ ఊరి మధుర స్మృతులే! 
గూగుల్‌ సీఈవోకైనా, రిలయెన్స్‌ అంబానీకైనా, దేశ ప్రధానికైనా, రాష్ట్ర ముఖ్యమంత్రికైనా, ఓ సొంతూరు... ఉంటుంది. 
వారి చిరునామాలో అది ఉండకపోవచ్చు. 
కానీ మనసులోని మధుర జ్ఞాపకాల అరలో తప్పకుండా ఉంటుంది. 
అక్కడ బుడి బుడి నడకలే నడిచి ఉండ వచ్చుగాక... 
అక్షరాలు మాత్రమే దిద్ది ఉండవచ్చుగాక... 
కానీ ప్రయాణం మొదలెట్టింది అక్కడి నుంచేనని నిర్ద్వందంగా చెబుతారు. 
హైదరాబాదైనా, అమెరికా అయినా పుట్టి పెరిగిన ఊరి తర్వాతేనంటారు. 
చూడడానికి అది అందరికీ మామూలు ఊరే కావచ్చు. 
కానీ ఊరికీ, ఆ ఊరి గడ్డమీద నడిచిన మనుషులకీ మధ్య గల బంధమే ఓ మధురజ్ఞాపకాల పుస్తకం. సంక్రాంతి పండగ... ఆ పుస్తకంలోని పేజీలను తిరగేసే సందర్భం. 
అందుకే పండగొస్తే పట్టణం పిల్లాపాపల్ని చంకనేసుకుని పల్లెబాట పడుతుంది. 
అంతఘనం ఏముందీ ఆ సొంతూళ్లో అంటే... 
తప్పటడుగులేస్తూ దాటిన తొలి గడప ఉంది. 
తొలిసారి ఎదురు దెబ్బ తగిలించుకున్న వాకిలి ఉంది. 
తొలి అక్షరం దిద్దిన బడి ఉంది. 
తొలిసారి దేవుడికి దణ్ణం పెట్టుకున్న గుడి ఉంది. 
అవన్నీ ఒక్కసారి చూడాలి. పిల్లలకు చూపించాలి. ఇక్కడి నుంచీ బయల్దేరి అమ్మ హైదరాబాద్‌ వెళ్లిందనీ... ఇక్కడి నుంచీ బయల్దేరి నాన్న సిలికాన్‌ వ్యాలీలో సెటిలయ్యాడనీ... పిల్లలకు తెలియాలి. అందుకే శ్రీవారిని ఒప్పించి బయల్దేరడం.

‘ఏముంటుందీ ఆ పల్లెటూళ్లో. బోర్‌ కొడుతుంది’ అంటుంది కూతురు. ‘వైఫై ఉండదు... టీవీలో ఇంగ్లిష్‌ ఛానల్స్‌ రావు...’ బుంగమూతి పెడతాడు కొడుకు. వాళ్లను బ్రతిమాలో బుజ్జగించో చిన్న చిన్న లంచాల ఆశ చూపో ఎలాగైతేనేం బస్సెక్కేస్తే... 
సగం నిశ్చింత.

బస్సు చెరువు గట్టు పక్కగా వెళ్తుంటేనే మనసు చెలియలికట్ట తెంచుకుంటుంది. పొలాల మీదుగా వీస్తున్న చల్లని గాలి చెవిలో ఏవేవో ఊసులు చెబుతుంది. మట్టి వాసన మరచిపోయిన జ్ఞాపకాలను తట్టిలేపుతుంది. అప్పుడు... ఒక్కసారి బస్సు దిగి వెళ్లి ఆ నేలను ముద్దాడాలనిపించదూ!


ఇంటింటా పేరంటమే 
ఎప్పుడో పాతిక ముప్పయ్యేళ్ల క్రితం... కాలేజీలో చేరడానికి పట్టణానికి తొలి ప్రయాణం కట్టిన రోజు ఇప్పటికీ గుర్తే. ఇరుగు పొరుగు అందరూ పెరట్లో పండిన కూరగాయలూ, వండిన పిండివంటలూ సంచుల్లో పట్టుకొస్తే... మొత్తం హాస్టల్లో ఉన్నవాళ్లందరికీ సరిపోతాయని నవ్వుకోలేదూ. ఎవరినీ నొప్పించకుండా వారు తెచ్చినవి తీసుకుని పేరు పేరునా వారికి వెళ్లొస్తానని చెప్పి బయల్దేరేసరికి మధ్యాహ్నం దాటింది. బస్టాండు దాకా వచ్చి అందరూ ఎన్ని జాగ్రత్తలు చెప్పారనీ! ఆ తర్వాత చదువుకున్నన్నాళ్లూ ఎప్పుడో హఠాత్తుగా ఇలా రావడం అలా వెళ్లిపోవడం తప్ప పదిమందిని నోరారా పలకరించిందే లేదు. ఇక ఉద్యోగంలో చేరాక ఎలా గడిచిపోయాయో ఇరవయ్యేళ్లు.

ఇప్పుడిలా పిల్లల్ని తీసుకుని ఊరు వెళ్తే అందరూ ఎంత ఆనందిస్తారో. 
అటు మూడు తరాలనూ ఇటు మూడు తరాలనూ గుర్తుచేస్తారు. పిల్లలకు ఎవరెవరి పోలికలొచ్చాయో చెబుతారు.

ఊళ్లో పుట్టి పెరిగినవారంతా చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ పెద్దలను వెదుక్కుంటూ వస్తుంటే పల్లెకి అంతకన్నా ఏం కావాలి? అప్పుడు ఇంటింటా పేరంటమే. ఊరంతా ఉల్లాసమే. చిన్నప్పుడు ‘ఇవాళ పొలం వెళ్లలేదేమిటి’ అనడిగితే తాతయ్య అనేవారు... ‘పండక్కి మీ బడికి సెలవులు ఇచ్చినట్లే మాకూ దేవుడు సెలవులిచ్చాడు...’ అని. పంట చేతికొచ్చిన ఆనందం ఓ పక్క. అయినవాళ్లంతా వచ్చారన్న సంతోషం మరోపక్క. ఇంటిపట్టునే ఉండి వచ్చిన వారితో బోల్డన్ని కబుర్లు చెప్పేవాడు తాతయ్య.


ముగ్గులూ గొబ్బిళ్లూ 
ముద్ద బంతులూ మువ్వ మోతలూ 
నట్టింట కాలుపెట్టు పాడిపంటలూ 
వెండి ముగ్గులూ పైడికాంతులూ 
పుట్టింట దీపమెట్టు ఆడపడుచులూ... 
బస్సులో టీవీ పెట్టారు. సంక్రాంతి గురించి సినిమా పాట వస్తోంది. ఆ పాటలానే ఆ రోజులు కూడా ఎంత సందడిగా ఉండేవి! సంక్రాంతి నెలపట్టిన దగ్గర్నుంచీ అమ్మమ్మ గీతల ముగ్గులేసేది. ఒక్కో ముగ్గుకీ ఒక్కో కథ చెప్పేది. కార్తికమాసం అయిపోతూనే ధనుర్మాసపు పనులు మొదలు పెట్టేది. ముగ్గుపిండి కొట్టించి ఎండబెట్టేది. అందులో కాస్త సున్నం కలిపేది. ‘పక్షులు తినడానికి బియ్యప్పిండితో ముగ్గు వేస్తారని మా టీచర్‌ చెప్పింది. నువ్వు దాంట్లో సున్నం కలిపితే పాపం పక్షులకు కడుపునొప్పి రాదూ’ 
నా సందేహం. ‘అవన్నీ పాతరోజులు. సున్నం కలపనిదే ముగ్గు కర్ర పడదు, రాగి కలపనిదే బంగారం నగ అవదు’ అమ్మమ్మ సమాధానం. పండగ దగ్గరకొచ్చేకొద్దీ వాకిట్లో ముగ్గు విస్తీర్ణం పెరిగేది. అత్తయ్యలూ పిన్నమ్మలూ తోడు వచ్చేవారు. వాకిలంతా పరుచుకున్నట్లున్న ఆ గళ్ల చివర్లలో తలకట్లు కట్టడమూ; ముగ్గు తొక్కకుండా గడి మధ్యలోకి వెళ్లి పసుపూ కుంకుమా, బంతిపూరేకలూ, గొబ్బెమ్మలూ, రేగుపండ్లూ పెట్టడం పిల్లల బాధ్యత. 
ఈ ఏడాదైనా పెద్ద ముగ్గేయనివ్వవా అంటూ అమ్మమ్మ దగ్గర గారాలు పోవడం... నిన్న మొన్న జరిగినట్లు అన్పిస్తోంది. పదేళ్లు నిండాకే పిల్లల ముగ్గుల ప్రాక్టీసుకి పెరటి వాకిలి 
వదిలేవారు. స్కూల్లో స్నేహితుల దగ్గర కొత్త ముగ్గులు నేర్చుకోవడం, మర్నాడు వాకిట్లో వేయడం, నాది బాగుందంటే కాదు నాది బాగుందంటూ పోట్లాటలూ అలకలూ. పేడతో గొబ్బెమ్మలు పెట్టడానికి మాత్రం ఎవరూ ముందుకు రారని అమ్మమ్మ ముద్దు ముద్దుగా విసుక్కునేది. పేడకళ్లాపి చల్లిన వాకిట్లో తివాచీ పరిచినట్లుగా తెల్లని ముగ్గూ, దాని మీద గొబ్బిళ్లూ, పూలూ, రేగుపళ్లూ... పౌష్యలక్ష్మికి పలికే స్వాగతగీతం. మనోఫలకంపై ముద్రితమైన మరపురాని చిత్రం.


అరిసెల ప్రహసనం 
కారపు చెక్కలూ, జంతికల్లాంటి పిండివంటలు చాలావరకూ ఇంట్లోవాళ్లే ఇద్దరు ముగ్గురు కలిసి చేసేసేవారు కానీ అరిసెలకు మాత్రం పెద్ద ప్రహసనమే అయ్యేది. కనీసం నలుగురైనా ఉండాలి. అందుకని ఇరుగూ పొరుగూ మాట్లాడుకుని ఏరోజు ఎవరింట్లో అరిసెలు చేయాలో ముందుగానే అనుకునేవారు. పెద్దవాళ్లు అరిసెలు చేస్తుంటే పిల్లలం చలిమిడి ముద్దలు తీసుకుని పరుగులు పెట్టేవాళ్లం. ‘చేతులు పెట్టకండర్రా, నేను తీసి 
పెడతానుగా...’ అనే బామ్మ మాటలు చెవిలో ఇంకా విన్పిస్తూనే ఉన్నాయి. నగరంలోనూ స్వీటుషాపులకి వెళ్తే అరిసెలు దొరుకుతాయి. రుచిగానే ఉంటాయి. కానీ, బామ్మ పెట్టిన 
ఆ చలిమిడి రుచీ, వేడి వేడి అరిసెల వాసనా రావు కదా. నాకు చలిమిడి అంటే ఇష్టమని వాయి వాయికీ తీపి చూడమనే వంకతో ఓ చలిమిడి ముద్ద నా చేతిలో పెట్టేది. ఓ పక్క అరిసెలు ఒత్తుతూనే కోడళ్లు అత్తల మీదా, అత్తలు కోడళ్ల మీదా బామ్మకి ఫిర్యాదు 
చేయడమూ, బామ్మ వారికి సర్ది చెప్పడమూ, కొత్తగా పెళ్లైన వాళ్ళని సరదాగా ఆటపట్టించడమూ... ఆ ముచ్చలన్నీ ఎక్కడినుంచి వస్తాయి? పొయ్యి వేడికి బామ్మ మొహం మీద చిరుచెమటలూ, మసి చారికలూ, 
బోసి నవ్వూ... ఎక్కడ కన్పిస్తాయి?


పండగ అక్కడా ఉంది కానీ... 
నగరంలోనూ పండగ చేసుకుంటాం. అన్నయ్యవాళ్ల అపార్ట్‌మెంట్‌లో అందరూ కలిసి ప్రతి పండగనీ సరదాగా జరుపుకొంటారు. సెల్లార్‌లో పెద్ద పెద్ద ముగ్గులేసి రంగులు నింపుతారు. కేటరింగ్‌కి ఆర్డరిచ్చి అందరూ కలిసి పండగ భోజనం చేస్తారు. పిల్లలకు ముగ్గుల పోటీలూ పతంగుల పోటీలూ పెడతారు. మా అపార్ట్‌మెంట్లో అలా చేసుకోకపోయినా పండగనాడు పులిహోరా, గారెలూ, చక్కెరపొంగలీ అన్నీ స్వగృహాలో తెచ్చుకుంటాం. అయినా ఏదో వెలితి. ఇతర పండగలేమో కానీ సంక్రాంతి మాత్రం నగరంలో పండగలాగా ఉండదు. రోజంతా ఊరి సంగతులు సినిమాలో ఫ్లాష్‌బ్యాక్‌లా మనసంతా గింగిరాలు తిరుగుతుంటాయి.

పండగంటే పిండివంటలూ కొత్తబట్టలే కాదుగా... ఎన్ని పనులు చేసేవాళ్లం! మామయ్య ఎడ్లను శుభ్రంగా కడిగి కొమ్ములకు రంగులేసేవాడు. జాతరలో కొన్న రంగురంగుల ఊలు కుచ్చుల్ని కొమ్ములకు తగిలించేవాడు. లేగదూడల మెడలో మువ్వల పట్టీలు కట్టడం నా వంతు. పక్క ఊళ్లో ప్రభల ఊరేగింపుని ఎడ్లబండి కట్టుకుని వెళ్లి చూసొచ్చేవాళ్లం. పండగ నాడు ఎడ్లకు కూడా ప్రత్యేకంగా

ఉలవ గుగ్గిళ్లు పెట్టించేవాడు తాతయ్య. ఎడ్ల పందాలూ కోడి పందాలూ అంటే తాతయ్యకు కోపం. వాటిని బాధపెట్టడం తగదనేవాడు. అందుకని ఆయనకు తెలియకుండా మామయ్య చాటుగా ఆ పందాలు చూడడానికి వెళ్లివచ్చేవాడు. గంగిరెద్దుల వాళ్లూ, హరిదాసులూ వచ్చినప్పుడల్లా వారికి బియ్యం పోయడానికి పిల్లలం పోటీ పడేవాళ్లం.

నిద్రలో కలలూ, మెలకువ వస్తే జ్ఞాపకాలూ... మొత్తానికి ఊరి ప్రయాణం ఏమో కానీ మనసు మాత్రం టైమ్‌ మెషీన్‌లో గతమూ, వర్తమానాల మధ్య తెగ తిరిగేసింది. తెలతెలవారుతోంది. పొగమంచు మధ్య దూరంగా అక్కడోటీ ఇక్కడోటీ విసిరేసినట్లుగా పల్లెలు కన్పిస్తున్నాయి. మరికాసేపైతే ఊరు వచ్చేస్తుంది. ఊహూ ఊరు రాదు... మేమే ఊరికొచ్చేస్తున్నాం.


ఇదీ... మా ఊరే! 
ఊరు చేరుకున్నాం. కాకపోతే అది మా ఊరేనని గుర్తు పట్టడానికి కాస్త సమయం పట్టింది. నా జ్ఞాపకాల్లోని ఊరికీ ఇప్పటి ఊరికీ చాలా మార్పు ఉంది. ఊరికి కాస్త ముందుగానే రోడ్డు పక్కగా పెద్ద రావిచెట్టుకింద ఓ ఆంజనేయ విగ్రహం ఉండేది. బడినుంచి వస్తూ రోజూ కాసేపు ఆ చప్టా మీద కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్లం. పరీక్షలప్పుడు దణ్ణం పెట్టుకుని వెళ్లేవాళ్లం. ఇప్పుడక్కడో చిన్న గుడి కట్టేశారు. ఊరి మొదట్లో ఉండే కరణంగారి పెంకుటిల్లు రెండంతస్తుల డాబా అయింది. కరణంగారూ లేరు కరణీకమూ లేదు కానీ ఆ ఇంటి పేరు మాత్రం అలాగే నిలిచిపోయింది. కొన్ని ఇళ్ల వాకిళ్లలో ట్రాక్టర్లూ కార్లూ కన్పిస్తున్నాయి. అదిగో మా బడి. దాని పక్కనే బస్టాండు. మేం చదువుకున్న పాత బిల్డింగుని అలాగే ఉంచి పక్కన కొత్తది కట్టించారు కాదు, కట్టించాము. మీకు చెప్పలేదు కదూ మా ఊరికో ఫేస్‌బుక్‌ పేజీ ఉంది. ఊళ్లో జరిగే పనులన్నిటి గురించీ సర్పంచి అందులో రాస్తుంటాడు. సర్పంచి యువకుడు. అగ్రికల్చర్‌ బీఎస్‌సీ చదివి వ్యవసాయం చేస్తున్నాడు. ఊరిని అభివృద్ధి చేయాలని చాలా కోరిక. సోషల్‌మీడియాలో ఊరి వారందరినీ ఒక్కతాటిమీదికి తెచ్చాడు. అలా మా ఊరి అభివృద్ధిలో మేమూ పాలుపంచుకుంటున్నాం. నేనే కాదు, అప్పటి నాతోటివారు చాలామంది కూడా ఈసారి పండక్కి ఊరికొస్తున్నారు. ఇన్నాళ్లూ సోషల్‌మీడియాలోనే టచ్‌లో ఉన్నాం. ఇప్పుడు ప్రత్యక్షంగా కలుసుకోబోతున్నాం.


రోజులు క్షణాల్లా... 
ఇంటి నిండా బంధువులూ ఊరి నిండా స్నేహితులూ... మూడు రోజులూ మూడు క్షణాల్లా గడిచిపోయాయి. భోగినాడు పొద్దున్నే భోగిమంటలు వేశాం. చిన్న పిల్లలందరినీ కూర్చోబెట్టి భోగిపళ్లు పోశాం. ఇంట్లో ఉన్న బొమ్మలన్నీ ఒక్కచోట చేర్చి బొమ్మలకొలువు తీర్చాం. ఎవరికీ ఒళ్లు అలవకుండా అందరమూ అన్ని పనులూ చేసేశాం. రాత్రి రెండింటివరకూ కబుర్లూ మళ్లీ పొద్దున్నే ఐదింటికే కాఫీలూ... ఊరికి వెళ్దామంటే బుంగమూతి పెట్టిన పిల్లలు వచ్చాక మాతో మాట్లాడింది లేదు. వైఫై ఉన్నా ఏ పది నిమిషాలో తప్ప ఫోను పట్టుకోలేదు.

చుట్టాలందరినీ వరస కలిపి పరిచయం చేస్తే మనకు ఇంతమంది బంధువులున్నారా... అంటూ ఆశ్చర్యపోయారు. అందరితో సెల్ఫీలు దిగి ఆడుకోడానికి వెళ్లిపోయారు. నగరంలోని సౌకర్యాలనూ పల్లెటూరి సౌందర్యాలనూ 
కలబోసినట్లున్న ఊరు వారికి బాగా నచ్చేసింది. బోలెడంతమంది స్నేహితులను చేసేసుకున్నారు. నేనూ నా మిత్రబృందాన్ని కలుసుకున్నాను. పెద్దలమంతా కాసేపు పిల్లలమైపోయి చిన్ననాటి స్నేహాలను గుర్తుచేసుకున్నాం. కుటుంబాలను పరిచయం చేసుకుని అడ్రసులు ఇచ్చిపుచ్చుకున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఓ తీర్మానం చేసుకున్నాం... ప్రతి సంక్రాంతికీ ఊరికి రావాలనీ, అందరమూ కలుసుకోవాలనీ.

మనసును చూసే కన్నులు ఉంటే పగలే వెన్నెల రాదా మమతలు పూసే బంధాలుంటే ఇల్లే కోవెల కాదా 
మన అనువాళ్లే నలుగురు ఉంటే దినమూ కనుమే కాదా..! 
అని పాడుకుంటూ జ్ఞాపకాల మధురోహల్లో చిక్కుకుపోయిన మనసును బలవంతంగా లాక్కుని కనుమ మర్నాడైనా తిరుగుప్రయాణం కాక తప్పదు. అయినా పర్వాలేదు. వచ్చే ఏడాది సంక్రాంతికి మళ్లీ కలుస్తాం కాబట్టి సంతోషంగానే బయల్దేరతాం.


అదే పండగ... పేరే వేరు!

తెలుగు లోగిళ్లలోనే కాదు, సంక్రాంతి భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో పెద్ద పండుగే. లోహ్రీ, ఉత్తరాయణ్‌, మకర సంక్రమణ్‌, తై పొంగల్‌, మాఘీ, కిచ్‌డీ, పౌష్‌ సంక్రాంతి... ఇలా పేర్లు మాత్రమే వేరు. అన్ని రాష్ట్రాల్లోనూ ఈ పండగకి చేసుకునే ప్రత్యేక వంటల్లో పాయసం ఉంటుంది. పంజాబీలు పాయసంలో చక్కెర/బెల్లం బదులు చెరుకురసం వాడతారు. నువ్వులూ, నెయ్యీ అందరి వంటకాల్లో తప్పనిసరిగా ఉంటాయి. దిల్లీ, హరియాణా చుట్టుపక్కల ప్రాంతాల్లో వివాహిత అయిన కుమార్తెకూ, ఆమె మెట్టినింటివారికీ పుట్టింటివారు బట్టలు పెట్టడం ఆనవాయితీ. పంజాబ్‌లో ఉదయమే నదీ స్నానం చేసి నువ్వుల నూనెతో దీపం పెడతారు. రాజస్థాన్‌లో కొత్తగా పెళ్లయిన కూతుర్నీ అల్లుణ్నీ ఆహ్వానించి పెద్ద ఎత్తున విందు ఇస్తారు. సంక్రాంతి సందర్భంగా గాలిపటాలు ఎగరేయడం గుజరాత్‌, రాజస్థాన్‌లలో ఎక్కువ. తమిళనాడులో మార్గళి చివరి రోజున భోగితో మొదలుపెట్టి నాలుగు రోజుల తై పొంగల్‌ పండగ జరుపుకొంటారు. కర్ణాటక, రాజస్థాన్‌లలో వివాహిత మహిళలు వాయనాలు ఇచ్చే సంప్రదాయం కూడా ఉంది. అస్సాంలో ‘బిహు’ పండగకి వెదురుతో గుడిసెలు వేసి అందులో విందులు చేస్తారు. మర్నాడు వాటిని తగలబెట్టేస్తారు. పాత వైరాలు మర్చిపోయి స్నేహంగా ఉందామంటూ మహారాష్ట్రలో నువ్వుండలను పంచుతారు. పశ్చిమ్‌బంగా, ఒడిశా, బిహార్‌, హిమాచల్‌... ఇలా అన్ని రాష్ట్రాల్లోనూ సంక్రాంతి పండగను అదే రోజున ఏదో ఒక రూపంలో జరుపుకోవడం భిన్నత్వంలో ఏకత్వంగా పిలుచుకునే భారతీయతకు అద్దం పడుతుంది.MOHAN PUBLICATIONS Price List

జాతకచక్రం