MohanPublications Print Books Online store clik Here Devullu.com

పౌష్యలక్ష్మి_POUSYALAKSHMI


పౌష్యలక్ష్మి
పౌష్యలక్ష్మి

     తెలుగు సంవత్సరంలో పదో మాసమైన పుష్యం- శివుడు, విష్ణువుతో పాటు సూర్యుడు, శని, పితృదేవతలకు అత్యంత ప్రీతికరం. వీరందరినీ అనేకులు ప్రత్యేకంగా ఈ మాసంలో ఎంతో భక్తితో కొలుస్తారు. పుష్కలంగా పంటలు పండి రైతు చేతికందడం వల్ల, ఈ నెలను ‘పౌషం’ అంటారు. దీనికి సహస్యం, సిద్ధ్యం, తిష్యం అనే నామాంతరాలు ఉన్నాయి. హేమంత రుతువులో వచ్చే ఈ నెల- పగలు తక్కువ, రాత్రికాలం ఎక్కువగా ఉంటుంది.

ఈ మాసంలో శుక్లపక్ష విదియ నుంచి పంచమి వరకు మహావిష్ణువును ప్రత్యేకంగా పూజిస్తారు. పుష్యమి నక్షత్రం శనిదేవుడిది కాబట్టి, నెల అంతా ఆయనను పూజిస్తే మేలు కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇదే నెలలోని ఆదివారాల్లో సూర్యుణ్ని పూజిస్తారు. పుష్యశుద్ధ విదియనాడు ఆరోగ్య ద్వితీయావ్రతం చేస్తారు. పంచమినాడు మధుసూదనుణ్ని ఆరాధిస్తారు. శుక్ల, కృష్ణపక్ష పంచమి తిథుల్లో నాగపూజ సాగిస్తారు. శుద్ధ షష్ఠిని ‘కుమార షష్ఠి’ అని పిలుస్తారు. ఆ రోజున కుమారస్వామిని అర్చిస్తారు.

భక్తులు సప్తమి రోజున మార్తాండ సప్తమి, ద్వాదశ సప్తమి, రథ సప్తమి వ్రతాలు ఆచరిస్తారు. పుష్యశుద్ధ అష్టమిని మహాభద్రాష్టమి, జయంత్యష్టమి, దుర్గాష్టమి అనీ వ్యవహరిస్తారు. శుద్ధ నవమినాడు ‘ధ్వజ నవమి’ వ్రతం చేస్తారు. ఒంటిపూట భోజనం చేసి, మహామాయను అర్చిస్తారు. శుద్ధ దశమిని ‘శాంబరీ దశమి’ అని కూడా అంటారు. ద్వార (గడప) పూజ నిర్వర్తిస్తారు.

శుద్ధ ఏకాదశి రైవత మన్వాది దినం. అయిదో మనువును ‘రైవతుడు’గా భావిస్తారు. ఆ పర్వదినాన్ని ‘పుత్రదైకాదశి’గానూ పిలుస్తారు. ద్వాదశి రోజున కూర్మ ద్వాదశి, సుజన్మ ద్వాదశి వ్రతాలు; శుద్ధ చతుర్దశినాడు ‘విరూపాక్ష వ్రతం’ చేస్తారు. పుష్య పూర్ణిమను ‘షౌషి’ అనీ పిలుస్తారు. పుష్యమాసంలో ఇది ఎంతో పవిత్రమైన రోజు.

పుష్య శుద్ధ ఏకాదశికి ‘వైకుంఠ ఏకాదశి’ లేదా ‘ముక్కోటి ఏకాదశి’ అనే పేర్లు ఉన్నాయి. అది ముక్కోటి దేవతలతో మహావిష్ణువు వైకుంఠం నుంచి భూలోకానికి చేరిన పర్వదినమని భక్తజనం విశ్వసిస్తారు. అందుకే ఉత్తర ద్వార దర్శనం వల్ల పుణ్యగతులు ప్రాప్తిస్తాయని నమ్ముతారు. పుష్య కృష్ణ పాడ్యమినాడు చేసేది విద్యావ్యాప్తి వ్రతం. బహుళ అష్టమికి ‘కాలాష్టమి’ అని పేరుంది. ఏకాదశిని ‘షట్‌ తిలైకాదశి’గా పరిగణిస్తారు. ఆరు విధాలైన తిలలు (నువ్వులు) ఉపయోగించే ఏకాదశి కనుక ‘తిల్‌దాహీ వ్రతం’ అని దీనికి నామాంతరం ఉంది. ద్వాదశినాడు సంప్రాప్తి ద్వాదశి, మహాఫల ద్వాదశి, సురూప ద్వాదశి వ్రతాలు చేస్తారు.

పుష్యకృష్ణ చతుర్దశినాడు యమతర్పణ పూజాదులు ఆచరిస్తారు. కొన్ని ప్రాంతాల్లో కాళీపూజలుంటాయి. మాసశివరాత్రి కాబట్టి, శివాభిషేకాలు నిర్వర్తిస్తారు.

పుష్యమాస అమావాస్యకు అర్ధోదయామావాస్య, చొల్లంగి అమావాస్య అనే పేర్లున్నాయి. దాన్ని పెద్దలు ‘పద్మయోగ పుణ్యకాలం’గా అభివర్ణించారు. అదే రోజున సముద్రస్నానం, పితృతర్పణాలు ఆచరిస్తారు. చొల్లంగి గ్రామం వద్ద తుల్యాసాగర సంగమం ఉంటుందని అధిక సంఖ్యలో యాత్రికులు అక్కడ స్నానాలు చేస్తుంటారు.

పుష్యమాసంలోనే ఉత్తరాయణ ప్రవేశం సంభవిస్తుంది. ఇదే మాసంలో ఎంతో ప్రాచుర్యం పొందిన పండుగలు- భోగి, సంక్రాంతి, కనుమ. తెలుగునాట ఆ మూడురోజులూ వైభవంగా జరుగుతాయి.

చతుర్వర్గ చింతామణి, పురుషార్థ చింతామణి, శ్రీనాథుడి భీమేశ్వర పురాణం వంటి గ్రంథాలు పుష్యమహిమను వర్ణించాయి. ప్రధానమైన వరితో సహా అనేక పంటల్ని ప్రసాదించి, అన్నదాతల్ని ఆనంద పరవశుల్ని చేసే పౌష్యలక్ష్మికి శుభస్వాగతం పలుకుదాం!
- చిమ్మపూడి శ్రీరామమూర్తి

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list