MohanPublications Print Books Online store clik Here Devullu.com

వివాహ ముహూర్తాల విషయంలో తెలుసుకోవాల్సిన అంశాలు In the case of wedding MUHOORTHAS Things to know

Muhoorthas marrege jyothisham


వివాహ ముహూర్తాల విషయంలో
 తెలుసుకోవాల్సిన అంశాలు

    వివాహ విషయమై ఆడపిల్లకు మూడు నవకములలోని జన్మతార గ్రాహ్యమే. అలాగే మగ పిల్లవాని విషయమై ప్రథమ నవకంలోని జన్మతార నిషేధం. కానీ, రెండు మూడు నవకములలోని జన్మతారలు గ్రాహ్యమే. ఇదే రీతిగా పెండ్లి చూపులు, నిశ్చితార్థము విషయములలో కూడా ప్రవర్తించాలి.

     నిశ్చితార్థం: వధూవరులకు వివాహం చేయుటకు అన్ని విధములుగా సమ్మతమయిన యెడల వెంటనే వధూవరుల తల్లిదండ్రులు తాంబూలములు మార్పు చేసుకోవడం ఆచారం. అదే రీతిగా వధువుకు వరుని తల్లిదండ్రులు పసుపు, కుంకుమ, గంధం, పళ్లు, పూలు వంటి శుభ ద్రవ్యములు ఇచ్చి ‘తథాస్తు’ అనుకోవడం సంప్రదాయం. అందుకే పిల్లను చూచుటకు, మాటలాడుకొనుటకు కూడా మంచి కాలం చూచు సంప్రదాయం. ఇక నిశ్చితార్థం రాత్రులందు నిషేధము వున్నది. కారణం నిశ్చితార్థం రోజు వధువుతో సహా వధువు యొక్క తల్లిదండ్రులు విఘ్నేశ్వరుని పూజ చేసి కార్యక్రమం నిర్వహించాలి. మరి అటువంటి సందర్భంలో పగలు భోజనం చేసి రాత్రి కాలంలో గణపతి పూజ చేయరాదు. నిశ్చితార్థం రోజు ఉపవసించు ఆచారమూ లేదు. అందువలన ప్రాతఃకాలమే శ్రేయస్కరం. నిశ్చితార్థం అంటే అర్థం ఆ వధూవరులకు ఇరువురికీ వివాహం చేయుటకు ఉభయుల తల్లిదండ్రులూ అంగీకారము తెలుపుట. ఈ ముహూర్తంతో బంధం ప్రారంభమవుతుంది. అందువలన నిశ్చితార్థమునకు శాస్ర్తియంగా బలమయిన ముహూర్తం అవసరం. ఒకవేళ మీరు రాత్రి కాలంలోనే వేడుకగా చేసుకోవాలి అంటే పగలు శాస్త్రోక్తంగా కార్యక్రమం పూర్తి చేసుకొని రాత్రి కాలంలో వేడుక చేసుకోండి. ముహూర్త బలం వివాహ ముహూర్తంతో సమానంగా వుండాలి.

1. పెండ్లిచూపులు ఒకవేళ తప్పనిసరిగా మూఢమి వంటి రోజులలో జరపవలసి వస్తే... ప్రథమతః వధూవరులను ఇరువురినీ దేవాలయంలో కలుసుకునేలాగ చేసి అనంతరం ఇంటిలో చూపించండి. పెండ్లిచూపుల విషయంలో దేవాలయం సర్వదోషహరణ చేస్తుంది అని పెద్దల వాదన. ఒకే గోత్రీకులకు బ్రాహ్మణ క్షత్రియ, వైశ్యులలో వివాహం చేయు ఆచారము లేదు. శాస్తమ్రు అంగీకరించదు. గోత్రమునకు సంబంధించి ఋషులు కొందరు వుంటారు కచ్చితంగా. ఋషులు కూడా కలవకూడదు అని శాస్త్ర వచనం. ఋషి గణం ఒకటే అయితే వారు అందరూ సోదరవర్గంలో వారు అని అర్థం.

2.ఆడపిల్లను దత్తత ఇచ్చి (వేరే గోత్రం వారికి) అప్పుడు వివాహం చేయుట అని కొందరు తప్పుడు శాస్తమ్రులు చెబుతున్నారు. ఆడపిల్లకు ఒకసారే గోత్రం మార్పు జరుగుతుంది. అది ప్రథమతః వివాహంలో మాత్రమే. ఇక్కడ మరొక ధర్మసూక్ష్మ ప్రస్తావన చేద్దాం. ఒకవేళ మగపిల్లవాడిని శాస్త్ర ప్రకారం వేరే గోత్రం వారికి దత్తత ఇచ్చాము అనుకోండి. అప్పుడు ఆ పిల్లవాడికి జనక స్థానం, దత్తత స్థానం గోత్రీకులతో ఇరువురితోనూ కూడా వివాహం చేయరాదు. అలాంటప్పుడు ఆడపిల్ల విషయంలో ఒకవేళ మనం ఆధునిక స్వభావాలతో దత్తత ఇచ్చినా జనక స్థాన గోత్రం వారూ ఎలాగూ పనికిరారు అని ధర్మశాస్త్ర వచనం. కాబట్టి ఆడపిల్లను దత్తత ఇద్దాం అనే ఆధునిక ఆలోచనలు తప్పు.

3.వరుడి వయసు కంటే వధువు చిన్న వయస్కురాలయి ఉండాలి. దీని విషయంగా నేడు సమాజంలో చాలా చర్చలు జరుగుతున్నాయి కానీ శాస్త్రం, ధర్మం పాటింపవలసిన అవసరం మనది. చర్చలు అనవసరం.

4.వివాహమునకు తారాబలం చూసే విషయంలో ప్రత్యేక తార విశేషం అనే నానుడి వున్నది.

5.స్వాతీ నక్షత్రంలో వివాహం చేస్తే ఆ వధువు మరల పుట్టింటికి వెళ్లాలి అని చూడదు. అత్తగారింట సుఖంగా ఉంటుంది అని కృష్ణ యజుర్వేద వాక్యము. ఇది జ్యోతిష గ్రంథాలలో లేదు. కేవలం వంశపారంపర్య విద్యగా అభ్యాసం చేసిన వారికి మాత్రమే ఈ రహస్యం తెలుస్తుంది.

6.ఉపనయ నార్హత వున్నవారి విషయంలో రాత్రి సూర్యాస్తమయాత్ ఒక గంటన్నరలోపు చేయు వివాహం విశేషం. కారణం ఏమిటి అంటే ‘స్థాతీపాకం’ అనే కార్యం వివాహం దీక్షలో ప్రధానమయినది. అది సూర్యాస్తమయాత్ పరం మూడు గంటల వ్యవధిలోనే చేయాలి. ఒకవేళ మూడు గంటల వ్యవధి తరువాత ముహూర్తం చేశాము అనుకోండి. వివాహంలో వైదీక సంప్రదాయం కచ్చితంగా జరగదు. వివాహం ముహూర్తం ఎంత ప్రాధాన్యమో, కార్యక్రమం వేద విహితంగా చేయడానికి కూడా అంతే ప్రాధాన్యం కదా! అందుకే రాత్రి వివాహం కంటే పగలు వివాహం చేయుట ద్వారా శాస్ర్తియత బాగా జరుగుతుంది అని పెద్దల వాదన. రెండు రోజుల వివాహం, మరియు అయిదు రోజుల వివాహం వారికి రాత్రి వివాహం విశేషమే. ఉపనయనార్హత లేనివారికి స్థాతీవాకం ఉండదు.

7.వరుని తండ్రి, పితామహ, కాలం చేసిన సందర్భంలో సంవత్సరం దాటేవరకు వివాహం చేయరాదు. వధువు విషయంలో వివాహం చేయుట సంప్రదాయం వున్నది.

8.వధువు, వరుడు ఇరువురి విషయంలో వారి తాత, మామ్మ, అమ్మమ్మ, మాతామహుడు, తల్లిదండ్రీ అబ్దీకముల రోజులలో వివాహం చేయరాదు.

9.ఒకవేళ అమ్మమ్మ, మాతామహుడు కాలంచేస్తే వారి మృతాశౌచ కార్యములు 12 రోజులు పూర్తయ్యేవరకు వివాహం చేయరాదు. ఈ అంశాలు అన్నీ శోధించుకొని ముహూర్తం నిర్ణయింపజేయాలి.

వారములు: సోమవారం నిషేధం ఆచారమే కానీ శాస్త్రం కాదు. మంగళవారము నిషేధము. మిగిలిన వారములు గ్రాహ్యమే. నక్షత్రములు: ‘మూల మైత్ర మృగ రోహిణి కరైః పౌష్ణమారుత ఘోత్సరాన్వితైః వీర్య వద్ధిరుడుద్ధిర్ముృగీ దృశాం పాణి పీడన విధిర్విధీయతే’ అని శాస్త్రం.అయితే ధనిష్ఠా, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతీ నక్షత్రముల సమయంలో వివాహం శ్రేష్ఠము అని కొందరు, కాదని కొందరు చెప్పారు. అయితే నాలుగు నక్షత్రములు కూడా ఆచారంలో వున్నవి. అందువలన అశ్వినీ, రోహిణీ, మృగశిర, మఘ, ఉత్తర, హస్త, స్వాతీ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతీ నక్షత్రముల రోజులలో వివాహము శ్రేయస్కరమే.

అష్టమ శుద్ధి, లగ్నంలో పాపగ్రహములు లగ్నాత్ సప్తమంలో పాపగ్రహములు లేకుండా వివాహ సుముహూర్తము చేయవలెను. ధనిష్ఠా, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతీ నక్షత్రాలు వివాహమునకు గ్రాహ్యము కాదు అని కొందరి వాదన వున్నది. అది కూడా గ్రంథాధారమే కానీ వాటిల్లో కొందరు మహర్షులు శ్రేష్ఠము అని చెప్పిన కారణంగా అందరూ ఆచరిస్తున్నారు. చిత్తా నక్షత్రం గ్రాహ్యం కాదని వాదన.

లగ్నాత్ కేంద్రములు అనే 1,4,7,10 స్థానములలో శుభ గ్రహములు వుండడం దృష్ట్యా వివాహ లగ్నమునకు బలం ఎక్కువ అని చెప్పాలి. లగ్నాత్ 1,4,5,7,9,10 స్థానములలో శుభగ్రహ సంచారం విశేష లాభ ఫలితాలు ఇస్తుంది. అవకాశం వున్నంతవరకు 1,7 స్థానములలో పాపగ్రహములు లేకుండానే నిర్ణయం చేయాలి. శుక్ర గ్రహమునకు పాపగ్రహం సంబంధం లేకుండాను అలాగే చంద్రగ్రహం వున్న నక్షత్రంలో పాపగ్రహం లేకుండాను చేసుకోవాలి. కారణం కళత్ర కారకుడు శుక్రుడు. అలాగే మనఃకారకుడు చంద్రుడు. అలాగే వీలయినంతవరకు గురు బలం అధికంగా వున్న ముహూర్తం నిర్ణయించాలి.

వధూ ప్రవేశము: ‘వివాహ మారభ్య వధూ ప్రవేశో యుగ్మేదినో షోడశ వాసరాంతే’ వివాహం అయినది. ప్రభృతి 16 రోజులలోపు ఎప్పుడయిననూ సరి దినముల యందు నూతన వధువు గృహ ప్రవేశము చేయవచ్చును. అత్తవారి ఇంట ‘వధూ ప్రవేశో నదివా ప్రశస్తిః’ అని కూడా చెప్పారు. సూర్యోదయాత్ పూర్వం సూర్యాస్తమయాత్ పరం మాత్రమే విశేషము.

అప్పగింతలు అనే కార్యక్రమం వేడుక + ఆచారము. అంతేకానీ శాస్త్రం కాదు. ఇది శుక్రవారం పనికిరాదని పనికి వస్తుంది అని చెప్పే మాటలు కుటుంబ ఆచారమునకు ముడిపడినవి. 

వివాహ ప్రయత్నాలలో
 తీసుకోవలసిన జాగ్రత్తలు.

వివాహ ప్రయత్నాలలో వున్న వారికి ఒక సూచన. జాతకాలు చూపించి వివాహం చేద్దాం అనుకున్నా! లేక జాతకాలు చూపించకుండా వివాహం చేద్దాం అనుకున్నా! భగవంతుడు రాసిన వధూవరులను జ్యోతిశ్శాస్తవ్రేత్తలు మార్చలేరు. ఇది తథ్యం. మరి జ్యోతిషం చూపించడం ద్వారా దోష పరిహారాలు చేసుకోవడం, అనవసర సంబంధాల కోసం వెంటపడకుండా మనకు తగిన స్థాయి అన్వేషణ కోసం మాత్రమే ఈ సిద్ధాంతం ఏర్పరిచారు అని గ్రహించండి. జాతకాలు చూపించకుండా వివాహం చేశాము కావున పిచ్చి సంబంధం వచ్చింది. జాతకం చూపించి చేశాము కావున మంచి సంబంధం వచ్చింది అనేది ఒక తప్పు మాట.

మరొక సూచన. మా అబ్బాయి నక్షత్రానికి కుదిరే నక్షత్రాల లిస్ట్ ఇవ్వండి అని కొత్తగా అడుగుతున్నారు ఈ మధ్యన. ఈ విధమైన అధ్యయనం చాలా తప్పు. మీరు జాతకాలు చూపించ దలచుకుంటే మంచి సిద్ధాంతిని అనుసరించండి. కేవలం జన్మ నక్షత్రాలతోనూ, పాయింట్ల పట్టికతోనూ ఏమీ ఉపయోగం లేదు. పూర్తి జాతకం శోధింపచేయండి. లేదా పూర్తిగా త్యజించండి. మధ్యస్థంగా నక్షత్రాలు మీరు చూడడం, జాతకాలు సిద్ధాంతి చూడడం వంటివి చేసి శాస్త్రాన్ని అపహాస్యం చేయకండి.

సాధారణంగా వివాహ ప్రయత్నాలు, పిల్లలకు యుక్త వయసు రాగానే ప్రారంభిస్తాం . అప్పుడు ఒక మంచి రోజు చూసుకొని వినాయకుడికి పూజ చేయించి ప్రారంభించడం శ్రేయస్కరం. మంచి రోజు అంటే మంగళవారం కాకుండా... పౌర్ణిమ, బహుళ పాడ్యమి, రెండు పక్షాలలోనూ విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి మరియు శుక్ల పక్షంలో ఏకాదశి, త్రయోదశి, రోజులలో మరియు అశ్విని, రోహిణీ, మృగశిర, మఘ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతీ నక్షత్రములు వున్న సమయంలో తారాబలం కుదిరిన రోజున వర్జ్య దుర్ముహూర్తము లేని సమయంలో మరియు మూఢమి, అధిక మాసం, గ్రహణం వంటి దోషములు లేని రోజులలో పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాలి. పైన చెప్పిన తిథి, వార నక్షత్ర వివరములు పెళ్లిచూపులకు కూడా వర్తిస్తాయి.

సోమవారం సపత్ని దోష కారణంగా పెళ్లి పనుల విషయమై నిషేధము అనే ఆచారము ఉన్నది.కాని కొన్ని గ్రంథంలోనూ శుభ గ్రహ వారములు వివాహానికి విశేషం అని చెప్పారు. అంటే సోమవారం చంద్రాధిపత్యం వున్న వారం కావున సోమవారం శాస్తత్రః గ్రాహ్యమే. క్షీణ చంద్ర వారంగా చెప్పబడే అమావాస్య ముందు వచ్చే సోమవారం మాత్రమే నిషేధం. పూర్ణ చంద్రుడు వున్న సోమవారం వివాహం శాస్తత్రః నిషేధం లేదు.

పెళ్లిచూపులు.. సదా మూఢమి, అధిక మాసాలలో పెళ్లిచూపులు పనికిరాదు. వధూవరులు మూఢమిలో ప్రథమతః కలుసుకున్న దోషం ఇక జీవితాంతం ఉంటుంది. అందువలన తప్పనిసరిగా ప్రతి పెళ్లిచూపులు కూడా మంచి రోజులలోనే చేయడం మంచిది. అలా కాని యెడల ఏదేని దేవాలయంలో ప్రథమతః పెళ్లిచూపులు కార్యక్రమం పూర్తి చేసుకోండి. అన్నింటికీ దైవ సన్నిధి చాలా గొప్పది కదా. శాస్త్ర విషయంగా వచ్చే ప్రత్యవాయువులను దైవ సన్నిధి దూరం చేయగలదు.

నిశ్చయ తాంబూలాలు.. ఇది పెద్దల మధ్యన జరిగే వేడుక ‘అగ్రిమెంట్’ అనవచ్చు. ‘వాచాదత్తా మయా కన్యా వరార్థం స్వీకృతాత్వయం’ విషయమై వధూవరులను కూర్చుండబెట్టి గణపతి పూజ చేయిస్తాం కావున పగలు 12లోపు నిశ్చితార్థం శాస్తస్రమ్మతం. ఆ తరువాత చేయు నిశ్చితార్థం శ్రేష్ఠం కాదు. పనులు ప్రారంభానికి, నిశ్చితార్థానికి కూడా గణపతిపూజ చేయడం చాలా అవసరం. పెళ్లికి, నిశ్చితార్థానికి, పెళ్లిచూపులకు, పసుపు కొట్టుటకు వచ్చే ముత్తైదువులు తప్పనిసరిగా శుభ లక్షణాలు సూచించే పసుపు, కుంకుమ, పూలు, అంచు వున్న చీర ధరించిన వారయి ఉండాలి. పెళ్లికి సంబంధించిన ప్రతి అంశంలోనూ ఇంటికి వచ్చిన ముత్తైదువు కాళ్లకు పసుపు రాసి ముఖాన బొట్టు పెట్టడం సంప్రదాయం.

నిశ్చితార్థం తరువాత శుభలేఖలు పంపిణీ మొదలు దేవుడికి ఇచ్చి తరువాత చేయాలి. మరియు మంగళ సూత్రం కొనుగోలు, మధుపర్కముల కొనుగోలు, పెళ్లికి బయల్దేరుట, మగ పెళ్లివారిని పెళ్లికి ఆహ్వానించుట అనేవి ముఖ్యాంశాలు. వీటికి కూడా పైన చెప్పిన తిథి వార నక్షత్రములు గ్రాహ్యము. పెళ్లికుమారుని చేయుట, పెళ్లికుమార్తెను చేయుట, పెళ్లిపందిరి వేయుట అనే అంశాలకు కూడా పైన చెప్పిన తిథి వార నక్షత్రములు గ్రాహ్యం. శనివారంనాడు ఉప్పు, నూనె, చెప్పులు, వస్త్రం కొనరాదు. కావున పెళ్లికి ఈ నియమం వర్తిస్తుంది.

కన్యాదాతల వివరం.. తండ్రి కన్యాదానానికి అర్హుడు. తండ్రి లేని ఎడల పితామహుడు, తండ్రి సోదరులు, వధువు యొక్క అన్నగారు, పితృ వంశస్థులు, మాతామహుడు, మేనమామ, సగ్రోతీకులు అనువారు వరుసగా అధికారులు అగుదురు. కన్యాదానం యోగమే.

ఏకోదర వివాహం.. పుత్రీ పాణీని పీడనాచ్చ పరతస్సూనోర్వివాహ శ్శుభో నాస్యత్పుత్ర కరగ్రహత్తునకమప్యు ద్వాహ ఏవ వ్రతాత్’ అనే కాలామృత శ్లోకాధారంగా ఏకకాలమందు పుత్ర పుత్రికా వివాహముల విషయమై పుత్రికా వివాహానంతరం పుత్ర వివాహం విశేషం. పుత్ర వివాహానంతరం పుత్రికా వివాహం మరొక పుత్రుని ఉపనయనం చేయరాదు. అలాగే పుత్ర ఉపనయనానంతరం పుత్రికా వివాహం చేయవచ్చు. పుత్ర వివాహం చేసిన సంవత్సరమందు ఆరు నెలలు పర్యంతము ఏకోదరులకు ఉపనయనాదులు నిషేధము. చిన్నవాడికి ఉపనయనం చేసి వెంటనే పెద్దవాడికి వివాహం చేయవచ్చు. ఫాల్గుణ చైత్ర మాసేతు పుత్రో ద్వాహోపనాయనే అబ్ద భేదాత్ప్రకుర్వీత ఋతుత్రయ విడంబన - అనగా ఫాల్గుణ మాసం ముందు ఒకరికి చైత్రమాసం తరువాత మరొకరికి వివాహం ఉపనయనం వంటివి చేయు విషయంలో సంవత్సర భేదం వున్నది కావున దోషం వుండదు.

సమష్టి నిర్ణయమే సర్వోత్తమం 

    తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధాలే చేసుకుంటామని ఎక్కువ మంది యువతీయువకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు ఇటీవల జరిగిన ఓ సర్వేలో తేలింది. ఇది ఒకరకంగా చాలా ఆరోగ్యకరమైన పరిణామం. తల్లిదండ్రుల నిర్ణయాలను గౌరవించడం మంచిదే! వారు అనుభవజ్ఞులు కనుక మంచిచెడులను తరచి తరచి చూస్తారు.. విశ్లేషించగలుగుతారు. అంత మాత్రాన తల్లి బాధపడుతుందనో, తండ్రి కోప్పడతాడనో బలవంతంగా పెళ్ళికి ఒప్పుకోనక్కరలేదు. పెద్దలు చూసిన సంబంధంలో లోటుపాట్లు ఉన్నాయనిపిస్తే ఆ విషయం వారితో చర్చించవచ్చు. తమ అభిప్రాయాలను చెప్పనూవచ్చు. 
ప్రస్తుతం కన్నబిడ్డల మాట కాదనే తల్లిదండ్రులు లేరు. చాలామంది పెద్దలు- బిడ్డల సంతోషానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ వయసులో బిడ్డల మనోభావాలు ఎలా ఉంటాయో? ఎలా ఆలోచిస్తారో? అన్నీ వారికి కరతలామలకం. వారు కూడా ఆ వయసు దాటి వచ్చినవారే కదా! అంచేత యువతీయువకులు పెళ్లిసంబంధాల విషయంలో తమ అభిప్రాయాలను తల్లిదండ్రులతో పంచుకోవడానికి వెనుకాడ నవసరంలేదు. పెళ్ళి కొన్ని జీవితాలతో ముడిపడిన విషయం కనుక ఇప్పటి మొహమాటం భవిష్యత్తులో పెను సమస్యలకు దారితీయవచ్చు. పెద్దలు కూడా ఈ విషయంలో పారదర్శకతనే కోరుకుంటారు.

ఇప్పుడు ‘అమ్మానాన్నల ఇష్టమే నా ఇష్టం’ అని ఆ తర్వాత ‘అంతా మీరే చేశారు’ అని వారిని నిందించి ప్రయోజనం ఉండదు. అందుచేత సంబంధాల విషయంలో తల్లిదండ్రులతో కలిసి కూర్చుని అన్ని విషయాలూ కూలంకషంగా చర్చించి సమష్టిగా నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. అది అందరికీ మేలు చేస్తుంది.

పిల్లల ప్రేమను పెద్దలు కాదనకపోవచ్చు. అయితే ఆ విషయంలో మరింత జాగ్రత్త అవశ్యం. ఆ విషయమై ఇటు తల్లిదండ్రుల సలహాలూ సహకారంతోపాటు, అటువైపు పెద్దలనూ సంప్రదించడం మంచిది. అప్పుడే మేలు జరుగుతుంది. అంతేతప్ప కాలక్షేపపు సినిమాల ప్రభావంతో కంటికి నదరుగా అనిపించిన వ్యక్తితో కలిగిన పరిచయాన్ని ప్రేమగా అపోహపడితే తొందరపాటవుతుంది. పెళ్ళాడితే సరిచేసుకోలేని అడుగవుతుంది. ఎంచుకున్న వ్యక్తితో కొంతదూరం నడిచాక, ఆ బాట సరికాదనిపిస్తే.. గమ్యంలేని బాటలో గుదిబండతో ప్రయాణ చందమవుతుంది. సుఖసంతోషాల్లో ఓలలాడాల్సిన జీవితం దుఃఖభాజనమవుతుంది. అందుకే ప్రేమ వివాహమైనా పెద్దలు కుదిర్చిన వివాహమైనా అందరూ కలిసి కూర్చుని నిర్ణయం తీసుకుంటే ఇబ్బందులు తలెత్తే అవకాశం తక్కువ. పెద్దల జోక్యం వుంటే వియ్యాలవారి కుటుంబ వివరాలన్నీ తెలుసుకుంటారు. పూర్తిగా చర్చిస్తారు. తగిన సంబంధమయితే అక్షతలేసి ఆశీర్వదిస్తారు.

పిల్లలు పెద్దలు స్వేచ్ఛగా మాట్లాడుకునే వాతావరణం కుటుంబాల్లో ఉన్నప్పుడే ఇలాంటివన్నీ సులభంగా జరుగుతాయి. తమకోసం తపించే అమ్మానాన్నలతో పిల్లలు ఏ విషయమయినా మనసు విప్పి మాట్లాడాలి. ఆకర్షణ కళ్ళద్దాల్లోంచి పిల్లలు యథార్థాలను చూడలేకపోవచ్చు. చూసినా పైపైవి మాత్రమే కనిపిస్తాయి. పెద్దల ఆలోచనా పరిధి విశాలం. కుటుంబ నేపథ్యం, ఆచారాలు అలవాట్లూ, చదువు హోదా, ఆస్తి అంతస్తూ ఇలాంటివెన్నో తరచిచూస్తారు. అంతరంగాన్ని అంచనా వేస్తారు. అనుభవంతో కాచివడపోస్తారు. భవిష్యత్తులో ఎదురుకాబోయే ప్రమాదాలను ముందే పసిగడతారు. పరిసరాలు, పరిస్థితులు, పరిణామాలు..ఇంకా ఎన్నెన్నో ఆలోచించి, చర్చించి, తర్కించి, ఆచితూచి అడుగేస్తారు.

ఎన్ని విచారించి చేసినా పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళన్నీ కూడా విజయవంతం అవుతాయనీ చెప్పలేం. ఆకర్షణ ప్రభావంలో ప్రేమవివాహాలన్నీ విఫలమవుతాయనీ అనలేం. మొత్తానికి సంబంధం ఎటునుండి వచ్చినా, ఇరు కుటుంబాల పిల్లలు, పెద్దలూ కలిసి మాట్లాడుకోవడం అవసరం. మంచిచెడులన్నీ చర్చించుకుని అందరికీ ఆమోదయోగ్యం అనుకున్నాక పెళ్ళి చేసుకున్నట్లయితే ఆ బంధం అనురాగ లత అవుతుంది. ఆ సంసారం ఆనందాల పూలతో కలకాలం కళకళలాడుతుంది.
- నాగరత్న

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list