MohanPublications Print Books Online store clik Here Devullu.com

పారాయణ_Parayana GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

పారాయణ Parayana bhakthi

పారాయణం 

రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత- ఇలా ఏదో ఒక గ్రంథ భాగాన్ని కొందరు రోజూ పఠిస్తుంటారు. తమ భక్తిశ్రద్ధలు అనుసరించి లేదా పెద్దల సూచన పాటించి వాటిని చదువుతుంటారు. వాటితో పాటు సహస్ర నామాలు, స్తోత్రాలు, చాలీసాలు ఎన్నింటినో పఠిస్తుండటం పరిపాటి. స్త్రీ పురుష భేదాలకు, బాలలు వృద్ధులు అనే తేడాలకు తావు లేకుండా అందరూ కలిసి పారాయణం చేయడాన్ని అలవాటుగా మార్చుకుంటారు. దినచర్యలో భాగంగా ఇళ్లలో, ప్రార్థనా మందిరాల్లో, ఇతర ప్రదేశాల్లో నియమ నిష్ఠలతో పఠించడమే వారికి ఆనందదాయకం.

‘ఆధ్యాత్మిక గ్రంథాల్ని ఏళ్లతరబడి పారాయణ చేస్తే సరిపోతుందా’ అని ప్రశ్నించేవారున్నారు. ఎటువంటి మానవ ప్రయత్నమూ చేయకుండా, అన్నీ దేవుడే చూసుకుంటాడంటూ పఠిస్తూ కూర్చోవడం సరైనదేనా అని వారు అడుగుతుంటారు. పురాణాల్ని పారాయణం చేయడంవల్ల మానసిక శాంతి కలుగుతుందని అనుభవజ్ఞుల మాట. ఆ గ్రంథాల పఠనం ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. కష్టాల్ని ఎదుర్కొనే శక్తిని కలిగిస్తుంది. చక్కని భాష వస్తుంది. పౌరాణిక, ఇతిహాస కథలు కంఠస్థమవుతాయి. ఉమ్మడి పారాయణం ఐక్యభావాలకు మూలమవుతుంది.

సృష్టిలోని శాశ్వత సత్యాల్ని తరచుగా గుర్తుచేసుకోవడానికి పారాయణమే దోహదకారి. పండిత పామరులకు, సాధువులు సాధకులకు, సర్వులకూ ప్రయోజనకరం. అది ఒక నిరంతర సాధన. మనసును భగవంతుడి వైపు మళ్లిస్తుంది. ధ్యానం, యజ్ఞం, అర్చన, జపం, యోగం- అన్నీ సాధనకు ఉపయోగపడతాయి.

ఏ పనినైనా చేసేవాడు, చేయించేవాడు, ప్రోత్సహించేవాడు, చూసి సంతోషించేవాడు- అందరూ ఫలితం రీత్యా భాగస్థులవుతారు. అవి లౌకిక, అలౌకిక ఫలితాలని రెండు విధాలుగా ఉంటాయి. భగవద్గీత, సహస్ర నామ పారాయణం వంటివి అమృత తుల్యాలు. అందుకే వాటిని గీతామృతం, నామామృతం అని పిలుస్తారు. ఆదిత్య హృదయాన్ని శ్రీరాముడికి అగస్త్యుడు ఉపదేశించాడు. దాన్ని రావణాసురుడితో యుద్ధానికి దిగేముందు రాముడు పఠించడమే ఉత్తమ ఫలితమిచ్చిందంటారు.

స్తోత్రాల్ని ఆత్మవిశ్వాసంతో పఠించాలి. భగవద్గీతను రోజూ భక్తితో పారాయణ చేయడం, జీవితంలో ప్రశాంతతకు కారణమవుతుంది. భాగవతాన్ని మించిన మానసిక ఔషధం లేదంటారు విజ్ఞులు. భాగవతం అంటే- కేవలం కృష్ణుడి కథలు కావు. మహాభక్తుల చరిత్రలెన్నో అందులో ఉన్నాయి. వాటిని పఠించడం స్ఫూర్తిదాయకం.

ఆరాధ్య దైవాలకు ఉన్నంత శక్తి మహాభక్తులకూ ఉంటుంది. ఆంజనేయుడు రామభక్తుడు. ‘మీ అభిమతాలు నేనూ తీరుస్తాను’ అని రామభక్తులతో ఆయన పలు సందర్భాల్లో అంటాడు. ప్రహ్లాదుడు, గజేంద్రుడు, అంబరీషుడు వంటి భక్తుల చరితలు ఎన్నిసార్లు చదివినా తనివి తీరదు. అందుకే అవి నిత్యపారాయణ గ్రంథాలుగా నిలిచి ఉన్నాయి. పారాయణం చేసే భారతీయుల్లో, అందులోనూ తెలుగువారిలో అనేక ప్రగాఢ విశ్వాసాలున్నాయి. రుక్మిణీ కల్యాణం, శ్రీకృష్ణ జనన ఘట్టం, అంబరీష ఉపాఖ్యానం, విరాటపర్వ పారాయణాలే వీటికి ఉదాహరణలు. రామాయణంలోని సుందర కాండ, లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తర స్తోత్రం, విష్ణు-పార్వతీదేవి సహస్ర నామాలు, శివ పంచాక్షరి-నారాయణ మంత్రం పఠనాలూ భక్తుల నమ్మకాలకు ప్రతీకలు.

నరమూర్తిని కీర్తించే బదులు హరిమూర్తిని స్తుతించడం ఎంతో మేలు అంటారు. కృతయుగంలో ధ్యానం, త్రేతాయుగంలో యజ్ఞం, ద్వాపరంలో అర్చన కారణంగా భక్తులు కృతకృత్యులయ్యారు. కలియుగంలో నామ సంకీర్తనమూ అదే ఫలితమిస్తుందని విశ్వాసం. భగవంతుడి నామస్మరణతో మానవుడు భవసాగరం దాటగలడన్నదే పురాణగాథల సారాంశం!                           - డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list