MohanPublications Print Books Online store clik Here Devullu.com

అచలేశ్వర్‌ కొండలను ఆపిన శివుడు_Tourist places in Achaleshwar Mahadev Temple

అచలేశ్వర్‌ కొండలను ఆపిన శివుడు
Tourist places in 
Achaleshwar Mahadev Temple


అచలేశ్వరుడు.. ఇది శివుని మరో రూపం. అన్ని శివాలయాల్లో ఇక్కడ ఉన్నట్లు శివలింగం ఉండదు. వలయాకారంగా సొరంగం, అందులో చేతికి అందేటంత పైకి నీళ్లుంటాయి, నీటికి పై భాగాన వలయాకారానికి లోపలి వైపుగా బొటన వేలి ఆకారం కనిపిస్తుంది. అది శివుని కాలి బొటనవేలు. పూజలు కూడా ఆ బొటనవేలి రూపానికే జరుగుతాయి. ఆరావళి పర్వత శ్రేణులు ఎక్కడికీ కదిలి పోకుండా ఉండడానికి శివుడు బొటనవేలితో అదిమి పట్టాడని చెబుతారు. చలన లక్షణం ఉన్న పర్వతాలను అచలం (చలించకుండా) చేసినందుకు ఇక్కడ శివుడిని అచలేశ్వర మహాదేవ్‌ అంటారు. శివుడి బొటన వేలు ఉన్న సొరంగం ఆ కొండల మీద నుంచి పాతాళం వరకు ఉందని, దానిని నీటితో నింపడానికి ఆరు నెలల కాలం పట్టిందని చెబుతారు.

పూర్వం వశిష్ట మహాముని ఇక్కడ తపస్సు చేస్తున్న సమయంలో ఒక ఆవు ఆ సొరంగంలో చిక్కుకుపోయింది. దానిని బయటకు తీయడం మునికి సాధ్యం కాక శివుడిని ప్రార్థిస్తాడు. అప్పుడు శివుడు సహాయం కోసం సరస్వతి నదిని పంపిస్తాడు. ఆ నది పాయ నుంచి ప్రవహించిన నీటి ధాటితో ఆవు బయటపడింది. భవిష్యత్తులో ఇలాంటి విపత్తు మరొకసారి రాకుండా ఉండడానికి ఆ సొరంగాన్ని పూర్తిగా నింపమని కోరతాడు వశిష్టుడు. అప్పుడు హిమాలయాధీశ్వరుని కుమారుడు సహాయం చేశాడని చెబుతారు. ఈ ఆలయంలో పంచలోహాలతో చేసిన ఐదు టన్నుల బరువైన నంది విగ్రహం, దాని పక్కనే పిల్లవాడి రూపం ఉంటాయి. ఆ పిల్లవాడే హిమాలయాధీశ్వరుడి పుత్రుడని చెబుతారు. ఈ ఆలయం పక్కనే ఒక తటాకం ఉంది. దాని ఒడ్డున రాతి గేదెలు మూడు ఉంటాయి.

వీటికి స్థానికంగా ఇంకో కథ ప్రచారంలో ఉంది.
ఈ తటాకం పూర్వం నేతి తటాకం, కాగా ముగ్గురు రాక్షసులు గేదెల రూపంలో తటాకంలోకి దిగి నేతిని అపరిశుభ్రం చేసేవారని, ఆ రాజ్యాన్ని పాలిస్తున్న రాజు ఆ ముగ్గురు రాక్షసులను బాణాలతో సంహరించాడని చెబుతారు. దానికి ప్రతీకగా తటాకానికి ఒక ఒడ్డున రాతి గేదెలు, మరో ఒడ్డున రాజు శిలారూపాలున్నాయి.
అచలేశ్వర ఆలయాన్ని తొమ్మిదవ శతాబ్దంలో పారమార రాజవంశస్థులు నిర్మించారు. ఆలయానికి ఒక వైపు కొండ మీద గుహ కనిపిస్తుంటుంది. దానిని గోపీచంద్‌ గుహ అంటారు. రాజకుటుంబానికి చెందిన గోపీచంద్‌ సన్యసించి ఆ గుహలో ధ్యానం చేసేవాడంటారు. రాతి గేదెలున్న తటాకానికి పక్కనే ఓ కొండ, ఆ కొండ మీద ఒక కోట ఉంది. ఈ కోట పారమార రాజవంశం నుంచి 15వ శతాబ్దంలో మేవార్‌ రాజు మహారాణా కుంభా స్వాధీనంలోకి వచ్చింది. రాణా కుంభా ఈ కోటకు అచలేశ్వరమహాదేవ్‌ పేరు మీద అచల్‌ఘర్‌ అని పేరు పెట్టి మరిన్ని నిర్మాణాలు చేశారు, ఆ తర్వాత వచ్చిన మేవార్‌ రాజు రాణాసంగా కోటను పటిష్టం చేశాడు. ఇప్పుడది శిథిలావస్థకు చేరింది. ఆలయం, కోట ఉన్న ఆ ప్రదేశాన్ని అచల్‌గఢ్‌ అని పిలుస్తారు. మౌంట్‌ అబూ పట్టణానికి 11 కి.మీ.ల దూరంలో ఉంది అచల్‌గఢ్‌.

ఇంకా ఏమేమి చూడవచ్చు?
అబూ పట్టణంలో ఓంశాంతి బ్రహ్మకుమారీల ధ్యానకేంద్రం ఉంది. జ్ఞాన సరోవర్, పాండవ భవన్, పీస్‌ పార్క్, మ్యూజియం మొదలైనవి వాటి అనుబంధమైనవి. ఇక ప్రకృతి అందాలంటే సన్‌సెట్‌ పాయింట్, సన్‌రైజ్‌ పాయింట్, గురుశిఖర్, హనీమూన్‌ స్పాట్, నక్కి లేక్‌ ఉన్నాయి. మౌంట్‌ అబూకి సమీపంలో దిల్‌వారా జైన్‌ టెంపుల్‌. అర్బుదాదేవి ఆలయం, రఘునాథ్‌ దూలేశ్వర్‌ ఆలయం, టోడ్‌ రాక్, గోమఖ్‌ టెంపుల్, వ్యాసతీర్థం, నాగ తీర్థం, గౌతముని ఆశ్రమం, జమదగ్ని రుషి ఆశ్రమం వంటి అనేక అద్భుతాలున్నాయి. వీటిలో ప్రతి ఒక్క ప్రదేశానికీ దానికంటూ ప్రత్యేకమైన నేపథ్యం ఉంది. ఇది చారిత్రక యాత్ర మాత్రమే కాదు, సాహస యాత్ర కూడా. రాక్‌ క్లైంబింగ్, మౌంటెయిన్‌ బైకింగ్‌ కూడా చేయవచ్చు. పిల్లలతో వెళ్లిన వాళ్లకు వ్యాక్స్‌ మ్యూజియం, వైల్డ్‌లైఫ్‌ సాంక్చురీ, బర్డ్‌ సాంక్చురీ పెద్ద అట్రాక్షన్‌. మౌంట్‌ అబూ పర్యటనకు అక్టోబరు నుంచి మార్చి వరకు బాగుంటుంది.

ఎలా వెళ్లాలి?
సమీప విమానాశ్రయం: ఉదయ్‌పూర్‌ 186 కి.మీలు. అహ్మదాబాద్‌ నుంచి 225 కి.మీ.లు. హైదరాబాద్‌ నుంచి ఉదయ్‌పూర్‌ కంటే అహ్మదాబాద్‌కి విమానసౌకర్యం ఎక్కువ. హైదరాబాద్‌ నుంచి ఉదయ్‌పూర్‌కి వెళ్లాలంటే ముంబైలో విమానం మారాల్సి ఉంటుంది.

రైల్వేస్టేషన్‌: సమీప రైల్వేస్టేషన్‌ అబూ రోడ్‌. ఇక్కడి నుంచి మౌంట్‌ అబూకి 28 కి.మీ.లు రోడ్డు మార్గాన ప్రయాణించాలి. బికనీర్‌ ఎక్స్‌ప్రెస్‌లో 30 గంటల ప్రయాణం.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list