MohanPublications Print Books Online store clik Here Devullu.com

మీ పెట్టుబడులకు నామినీ ఎవరు?-Nomini Evaru





మీ పెట్టుబడులకు నామినీ ఎవరు?
భవిష్యత్తు లక్ష్యాల కోసం పొదుపు, మదుపు చేస్తాం.. కుటుంబ ఆర్థిక రక్షణ కోసం బీమా పాలసీలు తీసుకుంటాం.. ఇంతటితో మన బాధ్యత తీరిపోతుందా? అవసరమైనప్పుడు మన పెట్టుబడులు, బీమా, బ్యాంకులో ఉన్న డబ్బు తదితరాలన్నీ మనవారికి సక్రమంగా.. ఏ ఇబ్బందీ లేకుండా చేరాలి కదా! మరి అందుకోసం మీ వంతుగా అన్ని ఏర్పాట్లూ చేశారా?
బ్యాంకు ఖాతాలు.. బీమా పాలసీలు.. మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులు.. డీమ్యాట్‌ ఖాతాలు.. మొబైల్‌ ఫోన్‌ నెంబర్లు.. ఇలా ఒక్కటేమిటి? ప్రతి చోటా ఆధార్‌ కార్డును అనుసంధానం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. చాలామంది వీటికోసం సంబంధిత కార్యాలయాలకు వెళ్లి, ఆ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. కేవైసీ నిబంధనలను పాటించేందుకు అవసరమైన పత్రాలు సమర్పించేప్పుడు పనిలోపనిగా.. ఒకసారి ఆయా ఖాతాలు, పెట్టుబడుల వివరాలనూ పరిశీలించండి. అందులో నామినీగా ఎవరి పేరునైనా పేర్కొన్నారా? లేదా చూసుకోండి..
నామినీ పేరు పేర్కొనకపోవడం.. వారసులెవరూ ఖాతాల్లోని సొమ్ము తీసుకోవడానికి రాకపోవడం.. బీమా పాలసీలను క్లెయిం చేసుకోకపోవడం ఇలా రకరకాల కారణాలతో కొన్ని వేల కోట్ల రూపాయలు బ్యాంకులు, బీమా సంస్థల దగ్గర ప్రత్యేక ఖాతాల్లో మగ్గుతున్నాయి. భవిష్యత్తులో మన పెట్టుబడులూ ఆ జాబితాలోకి చేరకుండా చూసుకోవాల్సింది మనమే.
వివాహం కాకముందు పెట్టుబడులు, ఈపీఎఫ్‌లాంటి వాటికి తల్లిదండ్రుల పేరును నమోదు చేస్తుంటారు. వివాహం అయిన తర్వాత జీవిత భాగస్వామి పేరును నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే, చాలామంది ఈ విషయంలో అశ్రద్ధ వహిస్తుంటారు. ఇది ఏ మాత్రం మంచిది కాదు. ఒక్కోసారి నామినీగా పేర్కొన్న వ్యక్తులు ఈ లోకంలో ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడు మరీ ఇబ్బంది. వారసత్వ ధ్రువీకరణ పత్రాలు, కుటుంబ ధ్రువీకరణ పత్రాల్లాంటివి ఎన్నో అవసరం అవుతాయి. వీటిని సాధించడం ఎంతో శ్రమతో కూడుకున్నదే.
ఉమ్మడి ఖాతా తీసుకుంటే.. 
వీలైనంత వరకూ కనీసం ఒక బ్యాంకు ఖాతానైనా జీవిత భాగస్వామితో కలిసి ఉమ్మడిగా ఉండాలి. మీ వేతనానికి మరో ఖాతా ఉన్నా.. వచ్చిన డబ్బులు వచ్చినట్లు ఈ ఉమ్మడి ఖాతాలోకి మళ్లించి, లావాదేవీలన్నీ ఇక్కడ్నుంచే చేసేలా చూసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా పెట్టుబడులకు సంబంధించి నెలనెలా కేటాయించే మొత్తాలు ఈ ఉమ్మడి ఖాతా నుంచే వెళ్లేలా చూసుకోవాలి. ఇలా ఉమ్మడి ఖాతాలు తీసుకునేప్పుడు కొన్ని అంశాలపై జాగ్రత్తగా ఉండాలి.
* ఎయిదర్‌ ఆర్‌ సర్వైవర్‌ : ఉమ్మడి ఖాతా తెరిచిన ఇద్దరిలో ఎవరైనా ఖాతా నిర్వహించవచ్చు. ఒకరు మరణించినప్పటికీ రెండో వారు ఎలాంటి లాంఛనాలు లేకుండానే ఖాతా నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. 
* ఎనీవన్‌-సర్వైరర్స్‌: కొన్ని సందర్భాల్లో ఖాతాను ముగ్గురు కలిసి కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఈ ఖాతా కూడా ‘ఎయిదర్‌ ఆర్‌ సర్వైవర్‌’ పద్ధతిలోనే పనిచేస్తుంది. 
* లేటర్‌ ఆర్‌ సర్వైరర్స్‌: ఇదీ ఉమ్మడి ఖాతాయే. అయితే, ఇందులో ఇద్దరూ జీవించి ఉన్నంత కాలం రెండో వ్యక్తి మాత్రమే ఖాతా నిర్వహిస్తాడు. రెండో వ్యక్తి మరణించిన తర్వాతనే మొదటి వ్యక్తి ఖాతా నిర్వహించే అవకాశం ఉంటుంది. 
* ఫార్మర్‌ ఆర్‌ సర్వైవర్‌: పైన పేర్కొన్నట్లుగా పనిచేస్తుంది. అయితే, ఇద్దరూ జీవించి ఉన్నంతకాలం మొదట పేరు ఉన్న వ్యక్తికి మాత్రమే ఖాతా నిర్వహించే అవకాశం ఉంటుంది. మొదటి వ్యక్తి తదనంతరమే రెండో వ్యక్తి ఖాతా నిర్వహించగలుగుతారు.
ఇవి ఖాతా నిర్వహణకు సంబంధించిన ఐచ్ఛికాలు మాత్రమే. ఇలా ఉమ్మడిగా ఖాతా తీసుకున్నప్పటికీ.. నామినీగా పిల్లల పేరును చేర్పించడం మర్చిపోవద్దు.
ఫండ్లలో మదుపు చేస్తుంటే... 
మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసేప్పుడు చాలామంది నామినీ పేరును విస్మరిస్తుంటారు. తర్వాత చూద్దాంలే అన్న ధోరణే ఇందుకు కారణం. ఒక్కసారి నెలనెలా మీకు వచ్చే ఫండ్‌ పోర్ట్‌ఫోలియో స్టేట్‌మెంట్లు చూస్తే మీ ఫండ్లకు నామినీ పేరు ఉందా లేదా అనేది అర్థం అవుతుంది. మీరు నామినీ పేరు పేర్కొనకపోతే ‘ప్లీజ్‌ నామినేట్‌’ అని కన్పిస్తుంటుంది. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా వెంటనే మీ మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులకు సంబంధించి నామినీని పేర్కొనండి. మదుపు చేసేప్పుడు సహకరించిన సలహాదారుడినే ఈ విషయంలో కూడా సంప్రదించండి. మీకు ఈసారి వచ్చే స్టేట్‌మెంట్లో కచ్చితంగా నామినీ పేరు కన్పించేలా చూసుకోండి. అవసరమైతే మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ సేవా కేంద్రానికి ఫోన్‌ చేసి, అవసరమైన సహాయం పొందండి.
డీమ్యాట్‌ ఖాతాలో.. 
షేర్లలో లావాదేవీలు చేయాలంటే డీమ్యాట్‌ ఖాతా అవసరం అని అందరికీ తెలిసిందే. ఈ ఖాతా ప్రారంభించేప్పుడు మీరు నామినీ పేరు పేర్కొన్నారా? లేదా ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ఈ ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతోపాటే.. మీరు నామినీ పేరును కూడా చేర్పించండి. గతంలో ఖాతాలు తీసుకొని, నామినీగా మీ తల్లిదండ్రుల పేరు నమోదు చేస్తే.. ఇప్పుడు అందులో ఏవైనా మార్పులు చేయాల్సిన అవసరం ఉందా చూసుకోండి. వివాహం అయినవారు తల్లిదండ్రుల పేరు స్థానంలో జీవిత భాగస్వామి పేరును మార్పించాలి.
* కొత్త పాలసీలను తీసుకున్నప్పుడు.. ఇప్పటికే ఉన్న జీవిత బీమా పాలసీలనూ ఎలక్ట్రానిక్‌ రూపంలోకి మార్పించేందుకు ‘ఇన్సూరెన్స్‌ రిపాజిటరీ’ ఖాతాను ప్రారంభించవచ్చు. ఈ ఖాతాలో మీ దగ్గరున్న పాలసీలన్నింటినీ ఎలక్ట్రానిక్‌ రూపంలోకి మార్చుకోవచ్చు. మీరు తీసుకున్న పాలసీలకు వేర్వేరు వ్యక్తులను నామినీగా పేర్కొన్నారనుకుందాం.. ఈ రిపాజిటరీ ఖాతాను తీసుకునేప్పుడు నామినీగా కొత్త పేరును పేర్కొని, అన్ని బీమా పాలసీలకూ అతను/ఆమెనే నామినీగా ఉండాలని సూచిస్తే.. వెంటనే అన్ని బీమా పాలసీల్లోనూ నామినీ పేరు మారిపోతుంది. మీరు పనిగట్టుకొని ప్రతి బీమా పాలసీలోనూ పేరు మార్పించాల్సిన అవసరం లేదు. జీవిత బీమా పాలసీలకు నామినీగా ఎవరు ఉన్నా.. ఆ సొమ్ము వాస్తవానికి వారసులదే. నామినీ పని.. బీమా పాలసీ నుంచి సొమ్ము తీసుకొని, అసలైన వారసులకు అప్పగించడమే.
* ఒకవేళ మీ పాలసీలు ఎలక్ట్రానిక్‌ రూపంలో లేకపోతే.. మీ జీవిత బీమా కార్యాలయాన్ని సంప్రదించి, కొత్త నామినీ పేరును మార్పించాలి. ఆరోగ్య, వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలకూ నామినీగా ఎవరున్నారో ఒకసారి తనిఖీ చేసుకోండి.
ఈపీఎఫ్‌.. పీపీఎఫ్‌... 
ఉద్యోగంలో చేరిన కొత్తలో వివాహం అయి ఉండదు కాబట్టి, చాలామంది తమ తల్లిదండ్రుల పేరునే నామినీగా చేరుస్తారు. వివాహం అయిన వెంటనే దీన్ని మార్పించాలి. తల్లిదండ్రుల పేరు స్థానంలో జీవిత భాగస్వామి పేరును మార్పించడం మంచిది. ప్రస్తుతం నామినీ పేరును మార్చుకోవడానికి ఈపీఎఫ్‌ వెబ్‌సైటులోనే అవకాశం ఉంది. కేవైసీ నిబంధనలను పాటించేందుకు ఆధార్‌, పాన్‌, బ్యాంకు ఖాతాలను పేర్కొనేప్పుడు.. నామినీ పేరును కూడా ఒకసారి చూసుకోండి.
* పీపీఎఫ్‌ ఖాతాలకు కూడా నామినీ పేరును మరోసారి సరిచూసుకోండి. ఖాతా తెరిచిన వ్యక్తి మరణించిన తర్వాత తాజాగా జమ చేయడం కుదరదు. పీపీఎఫ్‌ ఖాతాదారు మరణం తర్వాత ఎప్పుడైనా సరే పీపీఎఫ్‌ నుంచి సొమ్ము తీసుకునే వెసులుబాటు నామినీకి ఉంటుంది. ఒకవేళ తీసుకోకపోయినా ఇబ్బందేమీ ఉండదు. ఖాతాలోని సొమ్ముపై వడ్డీ వస్తూనే ఉంటుంది.
జాగ్రత్తలివీ.. 
* పెట్టుబడులకు ఎవరి పేరునైనా నామినీగా పేర్కొనే అధికారం ఉంటుంది. కానీ, జీవిత భాగస్వామే మొదటి ఎంపిక కావాలి. 
* నామినీల పూర్తి పేరు, వారికి మీతోగల సంబంధం పుట్టిన తేదీ, చిరునామా లాంటి వివరాలన్నీ నామినేషన్‌ పత్రంలో వెల్లడించండి. 
* పిల్లల పేరును నామినీలుగా పేర్కొంటే.. సంరక్షకుని పేరు, హోదా, చిరునామాల వంటివన్నీ స్పష్టంగా పేర్కొనండి. 
* మీరు ఇదివరలో నామినేట్‌ చేసిన వ్యక్తి మరణించినా వారితో సంబంధాలు తెగిపోయినా వెంటనే నామినీ పేరు మార్పించండి. 
* పెళ్లికి ముందు తల్లిదండ్రులు, తోబుట్టువుల పేరున నామనిర్దేశనం చేసి ఉండొచ్చు. వివాహం అయిన వెంటనే జీవిత భాగస్వామి పేరే అన్ని చోట్లా నామినీగా ఉండాలి.
కుటుంబ పత్రం.. వీలునామా..
పెట్టుబడులు పెట్టినప్పుడు నామినీ పేరును పేర్కొనడం ఒక్కటే సరిపోదు.. మీరు పెట్టిన పెట్టుబడులేమిటి? తీసుకున్న జీవిత బీమా పాలసీలేమిటి? మీకు సంబంధించిన ఆస్తులు, అప్పులు ఇలా అన్ని వివరాలతోనూ ఒక కుటుంబ పత్రం తయారు చేయాలి. అత్యవసరాల్లో ఎవరిని సంప్రదించాలి లాంటి విషయాలను పేర్కొనాలి. మీ తదనంతరం ఎవరికి ఏమేమి చెందాలో వీలునామా రాయడం.. తెల్లకాగితం మీద రాసినా వీలునామాగానే పరిగణిస్తారు. అవసరాన్ని బట్టి, దానికి ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకోవడం మంచిది.
ఫండ్ల రాబడిపై పన్ను ఇలా..
మార్కెట్లో మంచి రాబడికి అవకాశం కన్పిస్తుండటంతో.. ఇప్పుడు మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేస్తున్నవారి సంఖ్య పెరిగింది. సంప్రదాయ పొదుపు పథకాలతో పోలిస్తే.. ఇందులో కొన్ని అదనపు ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా పన్ను భారం లేకపోవడం ఇక్కడ కలిసొస్తుంది. అయితే, ఏయే సందర్భాల్లో పన్ను వర్తిస్తుంది.. ఎప్పుడు ఉండదు అని తెలుసుకోవడం అవసరం.
మ్యూచువల్‌ ఫండ్‌ పథకంలో రూ.10వేలు మదుపు చేశారనుకుందాం. కొద్దికాలం తర్వాత ఈ మొత్తం రూ.15వేలు అయ్యింది. అంటే, రూ.5వేలు వృద్ధి చెందింది. పన్ను పరిభాషలో చెప్పాలంటే.. ఈ రూ.5వేలు మూలధన లాభం. మరి, ఇలాంటప్పుడు దీనిపై ఆదాయపు పన్ను ఎలా లెక్కించాలో చూద్దాం!
1) ఇక్కడ ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఈ రూ.10వేలను ఈక్విటీ ఫండ్లలో మదుపు చేశారా? డెట్‌ ఫండ్లలోనా?
2) ఎంతకాలం మదుపు చేశారు? మూలధన రాబడులను రెండు రకాలుగా వర్గీకరిస్తారు.. ఒకటి స్వల్పకాలిక మూలధన లాభం. రెండోది దీర్ఘకాలిక మూలధన లాభం. మనం యూనిట్లను విక్రయించే వ్యవధిని బట్టి ఈ రెండూ ఆధారపడి ఉంటాయి.
మదుపరి ఈక్విటీ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్‌ పథకాన్ని కొని, ఏడాదికి మించి కొనసాగించినప్పుడు వచ్చిన మూలధన రాబడిపై ఎలాంటి పన్నూ వర్తించదు. ఒకవేళ మదుపరి, ఏడాదిలోపు ఆ యూనిట్లను విక్రయిస్తే.. అప్పుడు వచ్చే లాభాలను స్వల్పకాలిక మూలధన లాభంగా పరిగణించి, 15శాతం పన్ను విధిస్తారు.
ఈక్విటీ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్లు కాకుండా డెట్‌ ఫండ్లలాంటి వాటిల్లో మదుపు చేసి, మూడేళ్లకు మించి కొనసాగించినప్పుడు వచ్చిన లాభాన్ని దీర్ఘకాలిక మూలధన రాబడిగా పరిగణిస్తారు. ఇలాంటప్పుడు ద్రవ్యోల్బణ సూచీకి సర్దుబాటు చేసి, 20శాతం పన్ను విధిస్తారు. అదే మూడేళ్ల లోపే ఫండ్‌ యూనిట్లను విక్రయిస్తే.. దానిని స్వల్పకాలిక మూలధన లాభంగా పరిగణిస్తారు. అప్పుడు మదుపరులు ఈ లాభాన్ని తమ ఆదాయంలో కలిపి, వర్తించే పన్ను శ్లాబుల ప్రకారం ఆదాయపు పన్ను చెల్లించాలి.
ఏ తరహా మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలైనా.. డివిడెండ్ల ద్వారా చేతికి వచ్చే ఆదాయానికి ఎలాంటి పన్నూ వర్తించదు. ఈక్విటీయేతర మ్యూచువల్‌ ఫండ్లపై వర్తించే డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ (డీడీటీ)ని మ్యూచువల్‌ ఫండ్‌/అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు ముందుగానే చెల్లించి, మిగిలిన మొత్తాన్నే మదుపరులకు అందిస్తాయి. 
ప్రవాస భారతీయులా...
ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ) కూడా మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే, వీరు మదుపు చేసేప్పుడు కచ్చితంగా భారతీయ కరెన్సీ రూపంలోనే ఆ మొత్తాన్ని కేటాయించాల్సి ఉంటుంది. మన దేశంలోని మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు విదేశీ కరెన్సీని అంగీకరించవు. కాబట్టి, ఎన్‌ఆర్‌ఐలు ఇక్కడ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసేప్పుడు.. మూడు రకాల బ్యాంకు ఖాతాల్లో ఏదో ఒకటి ప్రారంభించాల్సి ఉంటుంది. 1) నాన్‌ రెసిడెంట్‌ ఎక్స్‌టర్నల్‌ రూపీ (ఎన్‌ఆర్‌ఈ) అకౌంట్‌ 2) నాన్‌ రెసిడెంట్‌ ఆర్డినరీ రూపీ (ఎన్‌ఆర్‌ఓ) అకౌంట్‌ 3) ఫారిన్‌ కరెన్సీ నాన్‌ రెసిడెంట్‌ అకౌంట్‌ (ఎఫ్‌సీఎన్‌ఆర్‌). ఈ ఖాతాలను ఏదో ఒక భారతీయ బ్యాంకులో తెరవాల్సి ఉంటుంది.
మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లను విక్రయించినప్పుడు వచ్చిన మొత్తాన్ని చెక్కుల రూపంలో చెల్లిస్తారు. లేదా మదుపరి బ్యాంకు ఖాతాలోకి మళ్లిస్తారు. ఈ మొత్తాన్ని రూపాయల్లోనే చెల్లిస్తారు. ప్రవాసులు ఎన్‌ఆర్‌ఈ/ఎఫ్‌సీఎన్‌ఆర్‌ ఖాతాల ద్వారా మదుపు చేసి, పెట్టుబడులను వెనక్కి తీసుకున్నప్పుడు.. ఆ మొత్తాన్ని తాము ఉంటున్న దేశానికి మళ్లించుకునే వెసులుబాటు ఉంటుంది. రాబడితోపాటు, డివిడెండ్లను కూడా వారు వెనక్కి తీసుకెళ్లవచ్చు. అయితే, ఎన్‌ఆర్‌ఓ ఖాతాద్వారా మదుపు చేసినప్పుడు పెట్టుబడుల ద్వారా వచ్చిన లాభాలను మాత్రమే తాము ఉంటున్న దేశానికి తీసుకెళ్లగలరు. పెట్టుబడి మొత్తాన్ని వెనక్కి తీసుకెళ్లలేరు.
ఇక్కడ ఉంటున్న వారికీ.. ప్రవాస భారతీయులకూ ఒకే రకం పన్ను నిబంధన వర్తిస్తుంది. అయితే, ఎన్‌ఆర్‌ఐలు పన్ను చెల్లించాల్సి వచ్చినప్పుడు మూలం వద్ద పన్ను కోత విధిస్తారు.
- శరవణ కుమార్‌, సీఐఓ, ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌





No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list