MohanPublications Print Books Online store clik Here Devullu.com

శుచి, శుభ్రతలే లక్ష్మీ నివాసాలు-Lakshmi Nivasalu

శుచి, శుభ్రతలే లక్ష్మీ నివాసాలు
దేవతలందరిలోను అత్యధికంగా పూజించబడే దేవత లక్ష్మీదేవి. లక్ష్మీదేవి మానవ శరీరాంతర్భాగాలలో ఆవాసము ఏర్పరచురకొని ఉంటుంది. అంటే ఒక్కొక్కరి శరీరంలో ఒక్కొక్క స్థానంలో కొలువై ఉంటుంది. లక్ష్మీదేవి ఎటువంటి స్థానంలో ఉంటే ఏ పుణ్యఫలమో మార్కండేయ పురాణంలో పేర్కొనబడింది.
నరుల పాదాలలో లక్ష్మి ఉంటే గృహాన్నిస్తుంది. తొడలపై వుంటే వస్త్రాలను, రత్నాలను, నానావిధ ద్రవ్యాలను ఇస్తుంది. గుహ్యస్థానంలో వుంటే కళత్రాన్ని, ఒడిలో వుంటే మంచి సంతానాన్ని ఇస్తుంది. హృదయంపైన ఉంటే కోరిన కోరికలను తీరుస్తుంది. కంఠంపై వుంటే కంఠాభరణాలను ఇస్తుంది. ప్రవాసంలో ఉన్నవారికి ఆత్మీయులతో, భార్యతో కలయికనిస్తుంది. నోటిలో వుంటే మధర వాక్కును, మధుర ఆహారాన్ని, లావణ్యాన్ని, ఆజ్ఞ చెల్లుబాటును, కవిత్వాన్ని ఇస్తుంది. లక్ష్మి తలపై ఉంటే వానిని వదలి వేరేవారిని ఆశ్రయిస్తుంది. అంటే జీవితంలో మిగిలిన వాటికంటే ధనానికే అత్యంత ప్రాధాన్యం ఇస్తే ఆ ధనం కూడా నిలబడదని హెచ్చరిక! కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలనుకునేవారు ఆమెను ఉపాసించాలి.
లక్ష్మీదేవి నివాసములు : పసుపు, కుంకుమ, పువ్వులు, పాలు, దీపం, శుభ్రపరిచిన వాకిలి, ద్వారం, గోవులు, ధనం, ధాన్యం ఇవి అన్నీ లక్ష్మీ నివాసాలే! దేవతారాధన, శుచి, శుభ్రత, వేదహిత కార్యక్రమాలు జరిగే ఇళ్ళల్లోను, పెద్దలను గౌరవించే ఇళ్ళలోను సహనంగల స్ర్తిలు వుంటే ఇళ్ళలోను లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీకటాక్షం లభించి దారిద్య్రం తొలగిపోవాలంటే మార్గశిర లక్ష్మివార వ్రతం ఆచరించాలి. మార్గశిర లక్ష్మీవారం నాడు స్ర్తిలు లక్ష్మిదేవిని షోడశోపచారాలతో పూజించి నైవేద్యం మొదటి లక్ష్మివారం నాడు పులగం, రెండో లక్ష్మివారం నాడు పరమాన్నం, మూడో లక్ష్మీవారం నాడు అట్లు లేదా కుడుములు, నాలుగోవారం నాడు గారెలు లేదా చిత్రాన్నం, పుష్యమాసంలో మొదటి లక్ష్మివారం నాడు పూర్ణం బూరెలు, పులిహోర నైవేద్యంగా సమర్పించి నీరాజనమిచ్చి వ్రత కథ చెప్పుకొని పెద్దల ఆశీస్సులు పొందాలి. పుష్యమాసంలో మొదటి లక్ష్మివారం నాడు ముతె్తైదువులకు భోజనం పెట్టి తాంబూలం ఇవ్వాలి.
మార్గశిర లక్ష్మివారాలు శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనవి. మార్గశిరమాసంలో లక్ష్మివార వ్రతం ఆచరించాలని పురాణాల్లో చెప్పబడింది. దీనినే గురువారవ్రతం అని కూడా అంటారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఈ వ్రతం గురించి ద్రౌపదికి చెప్పినట్టు మహాభారతంలో వుంది.
పూర్వం కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి సుశీల అనే కూతురుండేది. ఆమెకు బాల్యం నుండి దైవభక్తి అలవడింది. ఒక మట్టి లక్ష్మి బొమ్మను సంపాదించి దానికి రోజూ పూజలు చేస్తుండేది. ఆమె చిన్నతనంలోనే తల్లి చనిపోగా తండ్రి మరొక పెళ్లి చేసుకున్నాడు. సవతి తల్లి సుశీలను హింసించేది. రోజూ ఆమె తన కొడుకుని ఆడించమని సుశీలకు పురమాయించి ఆమె చేతిలో చిన్న బెల్లం ముక్కను పెట్టేది. సుశీల ఆ బెల్లం ముక్కను తన లక్ష్మిదేవికి నివేదన చేసి ఆ ప్రసాదం తినేది. సుశీల పెళ్లిచేసుకుని అత్తవారింటికి వెళ్తూ తన లక్ష్మి బొమ్మను కూడా తనతో తీసుకొని వెళ్లింది. ఆమెకు అత్తవారింట మంచి ఆదరణ లభించింది. అత్తవారిల్లు ఆమె కాలు పెట్టగానే సిరిసంపదలతో కళకళలాడింది. పుట్టింట దారిద్య్రం తాండవించింది. సుశీల ఈ విషయం తెలుసుకొని ఎంతో విచారించింది. తన తండ్రిని పిలిచి అతనికి ఒక వెదురు బొంగులో బంగారు నాణాలు నింపి ఇచ్చి దానిని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళమని చెప్పింది. అయితే ఆ బ్రాహ్మణుడు ఆ వెదురుబొంగును దారిలో పోగొట్టుకున్నాడు. కొన్నాళ్ళకు సుశీల ఈ విషయం తెలుసుకొని చింతించి తన సవతి తమ్ముడిని రమ్మని పిలిచి అతడికి ఒక ఆనపకాయలో వరహాలు నింపి ఇచ్చి దానిని జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వెళ్లి అమ్మకు ఇమ్మంది. అతడు దారిలో కాలకృత్యాలు తీర్చుకొనుటకు ఒక చెరువు గట్టున దానిని ఉంచగా దారినపోయేవాడు దానిని తస్కరించాడు. సంగతి తెలుసుకొని సుశీల రుూమారు తండ్రిని పిలిచి అతనికి కొంత డబ్బు ఒక బొంతలో కుట్టి ఇచ్చింది. ఆ బ్రాహ్మణుడు ఇంటికి వెళ్తూ దారిలో ఒక బిచ్చగాడు చలికి వణుకుతుండడం చూసి ఆ బొంత అతడికి యిచ్చి వేశాడు. సుశీల తన ప్రయత్నాలు అన్నీ వృధా కావడంతో ఎంతో విచారించి తన తల్లిని రప్పించింది. ఆమె చేత మార్గశిర లక్ష్మివార వ్రతం చేయించాలనుకుంది. సుశీల తన తల్లికి మార్గశిర లక్ష్మివార వ్రతం గురించి చెప్పి పూజ పూర్తయ్యేవరకూ ఏమీ తినకుండా ఉండాలని చెప్పింది. అయితే ఆమె ఆ నియమం పాటించకుండా ఉదయానే్న పండో కాయో తినడంవల్ల ఆమె చేత పూజ చేయించడానికి వీలు కాలేదు. లక్ష్మివారంనాడు సుశీల వేకువనే లేచి తల్లి వెంటే వుండి ఏ తప్పు, పొరపాటు చేయకుండా చూసి లక్ష్మివారవ్రతాన్ని నియమానసారంగా తల్లిచేత ఆచరింపజేసి ముతె్తైదువలకు తాంబూలమిప్పించింది. లక్ష్మీవారవ్రతం ఆచరించడంవల్ల లక్ష్మిదేవి ప్రసన్నురాలై ఆమె ఇంట దారిద్య్రం తొలగింపజేసి, సిరిసింపదలు సిద్ధింపజేసింది.
మార్గశిర లక్ష్మివార వ్రతం చేయడంవల్ల సకల దారిద్య్రాలు తొలగిపోతాయి. సిరిసంపదలు సిద్ధిస్తాయి. స్ర్తిలకు ఐదవతనం వృద్ధి చెందుతుంది.
-రావి ఎన్ అవధాని

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list