MohanPublications Print Books Online store clik Here Devullu.com

గంగా ప్రవాహం.. సకల జీవన సారం (పురాణ వ్యక్తులు-పూర్వజన్మలు)-Kapila Muni

గంగా ప్రవాహం.. సకల జీవన సారం (పురాణ వ్యక్తులు-పూర్వజన్మలు)
ఓ ప్రశాంత వాతావరణంలో కపిలముని దీర్ఘ తపస్సు చేసుకుంటున్నాడు. ఆ కపిలముని వెనుక ఈ యాగాశ్వం సగర పుత్రులకు కనిపించింది. ఆ ఆనందంలో వారంతా ఒక్కసారిగా అరిచారు. పైగా ఓరి దొంగ తపస్సు చేసుకుంటున్నావా మా యాగాశ్వాన్ని తీసుకుని వచ్చి అంటూ ఆయనమీదకి వీరు మూకుమ్మడిగా దూకపోయారు.
అంతే మహోత్సాహంతో అరిచే అరుపులకి కపిలమునికి తపోభంగం కలిగింది. ఆయన కళ్లు తెరిచి చూసాడు. వెంటనే ఒక్క హుంకారం చేసాడు. ఆ హుంకార ధ్వనికి సగరపుత్రులంతా మాడి మసి అయిపోయారు. బూడిద కుప్పలుగా మిగిలారు.
ఈ విషయం సగరునికి తెలిసి కుమిలిపోయాడు. ఈ సగరుని వంశంలోని వాడే భగీరధుడు. తన పితృదేవతలకు శాపవిమోచనం కలిగించాలని చాలా శ్రమించాడు. చివరకు గరుత్మంతుని ఉపదేశంతో బ్రహ్మకోసం తపస్సు చేసాడు. ఆ తరువాత ఆయన చెప్పినట్టు శివుని కోసం తపస్సు చేసాడు. అపుడు భగీరధుని తపస్సు ఫలించి ఆకాశంలో వుండే గంగామాత శివుని జటాజూటంలోకి వచ్చింది. ఇలా వచ్చే సందర్భంలోనే గంగ నేనెంత గొప్పదాన్నో అని గర్వించిందట. వెంటనే శివుడు ఆమె మనస్సు తెలుసుకుని తన జటాజూటంలోనే బంధించేశాడట.
ఏమైందో తెలియక భగీరధుడు మళ్లీ శివానుగ్రహం కోసం తపస్సు చేసాడట. అప్పుడు గంగ కూడా తన గర్వాన్ని వదిలి శివుడిని శరణు కోరిందట. అప్పుడు శివానుగ్రహంతో భగీరధుని వెంట గంగ భూలోకానికి వచ్చింది.అలా ఆయన వెంట వస్తు వస్తు ఊళ్లను గుళ్లను ముంచేస్తు వచ్చి వచ్చి చివరకు జహ్నుమహర్షి ఆశ్రమాన్ని కూడా ముంచేసిందట. తపస్సులో వున్న జహ్నుకు ఈ విషయం తెలిసి గంగ పొగరును అణచివేయాలని గంగనంతా తాగివేశాడట. మళ్లీ భగీరధునికి విషయం తెలిసి ఎంతో పరితపించాడట. భగీరధునితోపాటు సర్వదేవతలు, మునులు, సిద్ధులు, సాధ్యులు వీరంతా కూడా జహ్ను మహర్షిని కోపం వీడమని కోరగా ఆయన కోపాన్ని వీడాడట. అపుడు జహ్ను మహర్షి చెవులనువండి గంగ మళ్లీ బయటకు వచ్చింది. అందుకే గంగామాతనే జాహ్నవిగా జహ్ను కూతురిగా కూడా సంభావిస్తారని రామాయణం చెప్తుంది.
ఒకసారి కాలకేయులనే రాక్షసులు సజ్జనులను, సాధువులను చాలా హింసిచేవారు. ఇంద్రాది దేవతలతో పోరినా వీరు అలసిపోయిన వెంటనే సముద్ర గర్భంలోకి వెళ్లి అక్కడ దాక్కునేవారు. ఇలా మంచివారినంతా ఈ కాలకేయులు బాధలుపెట్టేవారు. వీరిని సంహరించాలంటే సముద్రంలోంచి వీరు బయటికిరావాలి కదా అనుకుని దేవలతలంతా వెళ్లి అగస్త్యునితో చెప్పారట. అప్పుడు అగస్త్యుడు లోక కల్యాణం కోసం సముద్ర జలాన్ని తాగివేశాడట. సముద్ర గర్భంలో వున్న కాలకేయులను దేవతలు సంహరించారు. ఆ తరువాత మునులంతా లోకాలను కాపాడే సముద్రాన్ని జలంతో నింపమని అగస్త్యుడిని కోరుకుంటే నేను సముద్ర జలాన్నంతా జీర్ణం చేసుకున్నాను. ఇప్పుడు భగీరధుడు భూలోకానికి తెచ్చిన గంగతో వీటిని నింపుదామని సముద్రాలన్నింటినిలోను గంగనే నింపారట.
గంగాదేవి ఒకసారి బ్రహ్మ, ఇతర దేవతలు, మహాభిషుడు లాంటి వారందరువున్న ఇంద్రుని సభలోకి స్ర్తి రూపంలోకి వెళ్లిందట. అప్పుడు గంగాదేవి సౌందర్యానికి పరవశించి మహాభిషుడు ఆమెనే చూస్తుండిపోయాడట. దానికి సభా మర్యాదను పాటించలేదని బ్రహ్మ మహాభిషుడిని భూలోకంలో పుట్టమని శపించాడట. అపుడు గంగ కూడా మహాభిషుని పై వ్యామోహంతో పుడమికి ఆమెకూడావస్తోందట. దారిలో ఆమెకు వశిష్టుని చేత శపించబడిన అష్టవసువులు కనిపించారు. వారంతా ఆమెను తమను పుట్టిన వెంటనే మళ్లీ ఈలోకానికి పంపించేయమని వేడుకున్నారట. ఆ అష్టవసువుల్లో ప్రభాసుడను వసువు మాత్రం చాలాకాలం భూలోకంలో వుంటాడు. మిగతా వారంతా పుట్టిన వెంటనే వెంటనే నీవే మమీలోకానికి పంపించాలిఅని కోరుకొన్నారు. మహాభిషుడు శంతనుడుగా పుట్టాడు. నీవు ఆయన్ను వివాహం చేసుకుని మమ్మల్ని కని వెంటనే గంగలో పడవేయి అని ప్రార్ధించారట. వాళ్ల కోరికను తీరుస్తానని గంగామాత వారికి మాటిచ్చింది. శంతనునికి కొన్ని నియమాలుపెట్టి గంగ ఆయన్నువివాహం చేసుకుంది. అపుడు వారిద్దరికీ ఈ అష్టవసువులు పుట్టడం మొదలైంది ఏడుగురు శిశువులను పుట్టిన వెంటనే తీసుకునివెళ్లి గంగాప్రవాహంలో పడేసి వచ్చేదట. కాని ఇదంతా చూస్తు శంతనుడు తనయులను దూరం చేసుకుని బాధపడుతు వుండేవాడు. ఆ బాధను భరించలేక ఎనిమిదో శిశువును పారేయబోతుంటే గంగను అట్లా పారేయవద్దని నియంత్రించాడట. దాంతో గంగామాత శంతునునితో నియమాలు ఉల్లంఘించినందువల్ల నేను నిన్ను విడిచిపోతాను. కాని నీ కోరిక మేరకు ఈ శిశువును మాత్రం నీటికి సమర్పించను. కొద్దికాలం సాకి పెద్దయ్యాక పంపిస్తాను అని చెప్పి ఆ శిశువును తీసుకుని వెళ్లిందట. ఆ శిశువే భీష్మాచార్యులు. భీష్మాచార్యుల అమ్మ...శంతనుని భార్య గంగామాత అని భారతం చెప్తుంది. ఇలాంటి గంగా మాత ఒకసారి ప్రళయ కాలం సంభవించినపుడు మహాదేవుని సృష్టి అంతా జలమయం అయిపోయింది. కేవలం జలం ఒక్కటే మిగిలివుంది. అపుడు ‘ఆహా నేను ఒక్కదానే్న ప్రళయకాలంలో కూడా ఉన్నాను గదా!’ అని ఉరుకులు పరుగులు పెట్టిందట. కేరింతలతో ఎగసిఎగసి తన కెరటాలను ఆకాశం దాకా వ్యాపింపచేస్తూ వుందట. ఆ సమయంలో కైలాసంలో ధ్యానంలో వున్న శివుడి మీదకి ఈ గంగ తుంపరలు పడ్డాయట. వెంటనేఆ కైలాస వాసునికి తపోభంగం జరిగింది. దానికి కారణమైన గంగనుచూసి నీవు భూలోకంలో పుట్టుదువుకాక అని శపించాడట. వెంటనే జరిగిన విషయం తెలుసుకుని తన తప్పును గ్రహించి క్షమించమని శివుడిని కోరుకుందట. అపుడు శివుడు గంగను నీవు భూలోకంలో ఏలాపురంలోని నా భక్తులైన శంఖుదేవయ్య, చక్రదేవమ్మలకు పుడతావు. అప్పుడు నేనేనిన్ను వివాహం చేసుకుంటాను అని చెప్పాడట. దాంతో గంగ సంతోషంతో అక్కడినుంచి వెళ్లి భూలోకంలోని శంఖుదేవయ్య ఇంట శివప్రసాదంగా పుట్టింది. దినదినాభివృద్ది చెంది మంచి యవ్వనంలోకి అడుగుపెట్టింది. అపుడు నారదుడు వచ్చి శివుని గురించి ఈ గంగామాతకు చెప్పగా ఆమె శివుడ్ని పెళ్లాడాలని తపస్సు చేసింది. ఆ సంగతి తల్లిదండ్రులు తెలుసుకుని శివుని దగ్గరకు వెళ్లి వారి కుమార్తెను వివాహం చేసుకోమని వేడుకున్నారట. అప్పుడు శివునికి గంగామాతకు వివాహం జరిగింది.
ఈ సంగతి తెలుసుకుని పార్వతీదేవి కోపం తెచ్చుకుందట. గంగా పార్వతులు సవతిపోరుతో నిత్యం వాదులాడుకునేవారట. ఒకసారి గంగకు కోపం వచ్చి అలిగి పుట్టింటికి వెళ్లిందట. అపుడు స్నానానికి నీరు లేక పార్వతి శివుడ్ని ప్రార్ధించిందట. శివుడు విఘ్నేశ్వరుడ్ని గంగ దగ్గరకు పంపి ఆమెను ప్రార్ధించమని చెప్పారట. అట్లా పార్వతి చేసిందట. అపుడు గంగాదేవి కోపం తగ్గి ంచుకుని మళ్లీ శివుని చెంతకు వచ్చిందట. పార్వతికి కూడా గంగ చేదోడువాదోడుగా వుండేదట. ఈ కథ కూడా పురాణాల్లోనే ఉంది. ఈ గంగామాతనే అగ్నిదేవుని ఫ్రార్ధన వల్ల శివరేతస్సును కొన్నాళ్లు ధరించింది. ఆమె శివరేతస్సుని భరించలేక ఒక రెల్లు వనంలో దిగవిడిచేసరికి ఆ వనంలోనే శివకుమారుడు స్కందునిగా ఆవిర్భవించాడని రామాయణం చెబుతుంది. ఇలా ఎన్నో ఒడిదుడుకులు ఉన్న గంగ అవతరణలో లాగానే గంగ ప్రవాహంలో కూడా కొన్ని చోట్ల కురచగా ఉంటే మరికొన్ని చోట్ల ఉద్ధృతంగా ప్రవహిస్తూ జనులందరినీ పునీతులను చేస్తుంది. పురాణాల ప్రకారం గంగాస్నానం పుణ్యరాశులు ప్రోది చేస్తే సైన్సు దృష్ట్యా చూసినపుడు కూడా ప్రాణాలను నిలిపే దేవతగానే గంగామాతకు నమస్కరించాల్సిందే కదా.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list