MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఆరోగ్య బీమా.. టాపప్‌ చేసుకుందాం!-Arogya Bheema

ఆరోగ్య బీమా.. టాపప్‌ చేసుకుందాం!
టాపప్‌ లేదా అదనంగా.. ఈ పదాలు మన జీవితంలో రోజువారీ వినిపించేవే. ప్రీపెయిడ్‌ మొబైల్‌ నెంబర్లకు టాపప్‌ చేయించడం.. వంటింట్లో అదనపు గ్యాస్‌ సిలిండర్‌, కారులో అదనంగా టైరు ఇలాంటివన్నీ సాధారణమే. మరి, ఆరోగ్య బీమాకు కూడా ఇలా అదనం, టాపప్‌ ఉంటే? అదెలా అంటారా? చూద్దాం పదండి!
పెరుగుతున్న వైద్య ఖర్చుల నేపథ్యంలో ఆరోగ్య బీమా పాలసీలు ఇప్పుడు అనివార్యం అయిపోయాయి. వయసు పెరుగుతున్న కొద్దీ.. వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఎదురైతే.. మనం ఇన్నాళ్లూ దాచుకున్న మొత్తం అంతా కరిగిపోవడంతోపాటు, మానసిక ప్రశాంతత కూడా కోల్పోతాం. దీన్ని నివారించేందుకు వీలైనంత ఎక్కువ మొత్తంలో ఆరోగ్య బీమా పాలసీ ఉండాల్సిన అవసరం ఉంది. అయితే, భారీ ప్రీమియం చెల్లించక్కర్లేకుండానే తక్కువ ఖర్చుతో బీమా మొత్తం పెంచుకునే వీలు టాపప్‌ పాలసీలు కల్పిస్తాయి.
అనుకోకుండా ఆసుపత్రిలో చేరినప్పుడు వైద్య ఖర్చులు మన నియంత్రణలో ఉండవు. మన దగ్గరున్న ఆరోగ్య బీమా పాలసీని మించి పోయినా ఆశ్చర్యం లేదు. ఇలాంటప్పుడే టాపప్‌ పాలసీ మనకు ఉపయోగపడుతుంది. వ్యక్తిగత ఆరోగ్య బీమా, ఫ్లోటర్‌ పాలసీ అయినా సరే.. పాలసీ మొత్తం ఖర్చయిపోయినప్పుడు అదనంగా తీసుకొనే టాపప్‌ పాలసీలు మనకు కాస్త భరోసానిస్తాయి. అధిక మొత్తానికి పాలసీ తీసుకోవాలంటే.. ప్రీమియం అధికంగా చెల్లించాల్సిందే. అలాంటి ఇబ్బంది లేకుండా.. టాపప్‌ పాలసీల ద్వారా 30-40శాతం తక్కువ ధరకే పాలసీని తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే, ప్రాథమిక పాలసీ మొత్తాన్ని పెంచుకోవడం ద్వారా చెల్లించే ప్రీమియం ఖర్చును, టాపప్‌ తీసుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చన్నమాట.
ఎలా పనిచేస్తుంది? 
ఎంత పరిమితి దాటిన తర్వాత ఈ పాలసీ వర్తించాలన్న విషయాన్ని మనం టాపప్‌ పాలసీని ఎంచుకునేప్పుడు పేర్కొనాలి. ఉదాహరణకు రూ.5లక్షల పరిమితి దాటాక.. రూ.10లక్షల టాపప్‌ పాలసీని తీసుకున్నారనుకుందాం. అప్పుడు ఆసుపత్రిలో చేరినప్పుడు అయ్యే ఖర్చులో మొదటి రూ.5లక్షల వరకూ మీ చేతి నుంచి లేదా మీ ప్రాథమిక ఆరోగ్య బీమా పాలసీ నుంచి చెల్లించాలి. మొత్తం ఖర్చు రూ.9లక్షలు అయ్యిందనుకుందాం. అప్పుడు ప్రాథమిక పాలసీ రూ.5లక్షలు, టాపప్‌ పాలసీ రూ.4లక్షలను చెల్లిస్తాయి. ఒకవేళ సాధారణ ఆరోగ్య బీమా పాలసీ లేదనుకోండి.. అప్పుడు రూ.5లక్షలను చేతి నుంచే చెల్లించాల్సి వస్తుంది.
ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. టాపప్‌ పాలసీ వర్తించే పరిమితిలోపు వైద్య చికిత్సకు అయ్యే ఖర్చుల గురించి దీనికి సంబంధం లేదు. అంటే.. రూ.5లక్షల పరిమితి తర్వాత.. టాపప్‌ పాలసీ వర్తించాలని అనుకుంటే.. రూ.5లక్షల్లోపు ఖర్చు గురించి ఇది పట్టించుకోదు. మరో ముఖ్యమైన సంగతేమిటంటే.. ఇది ఒకసారి ఆసుపత్రిలో చేరినప్పుడు అయ్యే ఖర్చుకు మాత్రమే వర్తిస్తుంది. రెండోసారి వేరే కారణంతో ఆసుపత్రిలో చేరినప్పుడు ఈ పాలసీ వర్తించదు.
దీనికి భిన్నంగా పనిచేసేది.. సూపర్‌ టాపప్‌.
ముందే అనుకున్నట్లు సాధారణ టాపప్‌ పాలసీ.. ఒకేసారి ఆసుపత్రి ఖర్చులు పరిమితి దాటినప్పుడే వర్తిస్తుంది. సూపర్‌ టాపప్‌ పాలసీ ఏడాదిలో అయ్యే మొత్తం వైద్య ఖర్చులు పరిమితి దాటినప్పుడు వర్తిస్తుంది. ఉదాహరణకు రూ.10లక్షల సూపర్‌ టాపప్‌ పాలసీని రూ.3లక్షల పరిమితి దాటాక వర్తించేలా తీసుకున్నారనుకుందాం. మొదటిసారి ఆసుపత్రిలో చేరినప్పుడు రూ.2లక్షలు ఖర్చయ్యింది. ఇలాంటప్పుడు సూపర్‌ టాపప్‌ పాలసీ అవసరం రాదు. అదే ఏడాదిలో రెండోసారి ఆసుపత్రిలో చేరితే రూ.2.5లక్షలు ఖర్చయ్యాయనుకుందాం. ఇప్పుడు మొత్తంగా రూ.3లక్షల పరిమితి దాటింది కాబట్టి, ఇక్కడ సూపర్‌ టాపప్‌ పాలసీ తన వంతుగా మిగిలిన రూ.1,50,000వేలను చెల్లిస్తుంది.
కాబట్టి, సాధారణ టాపప్‌తో పోలిస్తే.. సూపర్‌ టాపప్‌ ప్రయోజనాలు అధికంగా ఉంటాయని చెప్పొచ్చు.
మీరు టాప్‌ప్‌ తీసుకున్నా.. సూపర్‌ టాపప్‌ ఎంచుకున్నా.. ముందు నిబంధనలను పూర్తిగా తెలుసుకోవడం మంచిది. ముఖ్యంగా పరిమితి, మినహాయింపులు, వేచి ఉండే సమయం, ముందస్తు వ్యాధులకు వర్తింపు, ఆసుపత్రిలో చేరకముందు, ఇంటికెళ్లిన తర్వాత అయ్యే ఖర్చులకు వర్తిస్తుందా? ప్రీమియం చెల్లింపు, క్లెయిం విధానంలాంటి వాటితో పాటు, క్లెయిం పరిష్కార చరిత్ర కూడా తెలుసుకొన్నాకే పాలసీని తీసుకోవాలి.
- జైదీప్‌ దేవరే, మేనేజింగ్‌ డైరెక్టర్‌, మహీంద్రా ఇన్సూరెన్స్‌ బ్రోకర్స్‌
లాభాలేమిటి? 
* ఆరోగ్య బీమాకు వర్తించినట్లే.. టాపప్‌ పాలసీలకూ చెల్లించిన ప్రీమియానికి సెక్షన్‌ 80డీ నిబంధనల మేరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. 
* ప్రాథమిక పాలసీని తీసుకున్న బీమా సంస్థతో సంబంధం లేకుండా.. టాపప్‌ పాలసీని ఏ బీమా సంస్థ నుంచైనా కొనుగోలు చేసే అవకాశం ఉంది. 
* వీటిని వ్యక్తిగత, ఫ్యామిలీ ఫ్లోటర్‌, బృంద ఆరోగ్య బీమా పాలసీలకూ దీన్ని జత చేసుకోవచ్చు. 
* మినహాయింపు పరిమితి పెరిగిన కొద్దీ దీనికి చెల్లించే ప్రీమియం మొత్తం కూడా తగ్గుతుంది. 
* పెరుగుతున్న వైద్య ఖర్చులను తట్టుకునేందుకు వీటిని ఎంపిక చేసుకుంటే.. మన జేబుపై భారం ఉండదు.
మీ ఆరోగ్య పాలసీకి, వైద్య బిల్లులకు మధ్య అంతరాన్ని తొలగించేందుకు టాపప్‌, సూపర్‌ టాపప్‌ పాలసీలు ఉపయోగపడతాయి. టాపప్‌ను తీసుకున్నప్పుడు దాన్ని వాడుకోకపోతే ప్రీమియం వృథా అనే భావన రావచ్చు. ఏ సమయం ఎలా ఉంటుందో తెలియని పరిస్థితుల్లో అవసరం వచ్చినప్పుడు తీసుకుందామన్నా కుదరకపోవచ్చు. ఎంతైనా ముందు జాగ్రత్త తీసుకోవడమే ఎప్పుడైనా మేలు కదా! ఏమంటారు?

కొనసాగాలా? కొత్త పథకంలో చేరాలా?
‘నేను అదనంగా కొంత పెట్టుబడి పెట్టాలనుకుంటున్నా?.. దీనికోసం ఇప్పటికే మదుపు చేస్తున్నవి కాకుండా మరో ఇతర ఫండ్లు తీసుకోవాలా?’ చాలామంది మ్యూచువల్‌ ఫండ్‌ మదుపరులు అడిగే ప్రశ్న ఇది. ఇప్పటికే పెట్టుబడి పెడుతున్న మొత్తం పెంచినప్పుడు.. ఫండ్ల సంఖ్యను కూడా పెంచాలి అనే భావనలో ఉండటమే ఇందుకు కారణం. మరి, ఇది నిజంగా అవసరమా? తెలుసుకుందాం!
ఆదాయం, బాధ్యతలు పెరుగుతున్నప్పుడు అందుకు అనుగుణంగా పెట్టుబడి మొత్తాన్నీ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా పెట్టుబడి మొత్తాన్ని పెంచుకున్న ప్రతిసారీ మరో ఇతర పథకాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉందా? అంటే మాత్రం.. అంత అవసరం లేదనే చెప్పాలి. ఇలా కొత్త పథకాన్ని ఎంచుకుంటూ వెళ్తే.. మీ ప్రాథమిక పెట్టుబడుల కేటాయింపు దెబ్బతినే అవకాశం ఉంది. ఉదాహరణకు.. మీరు కొత్తగా మదుపు చేయాలనుకున్నప్పుడు.. ఉన్న వాటిలో కాకుండా.. కొత్త ఫండ్‌ పథకాన్ని తీసుకున్నారనుకుందాం.. అంటే.. అప్పటికే మీరు చాలా జాగ్రత్తగా ఎంచుకున్న పథకాలకు కేటాయింపు, నష్టభయం భరించే శక్తిలాంటివి కూడా మారిపోయే అవకాశం ఉంది.
అంతేకాకుండా.. ఇప్పటికే మీరు ఎంచుకున్న ఫండ్‌ పథకం అనుసరించే పెట్టుబడి వ్యూహాన్నే పాటించే మరో ఫండ్‌నే మీ పోర్ట్‌ఫోలియో జాబితాలోకి చేర్చుకున్నట్లు అవుతుంది. వీటన్నింటికంటే కూడా అనేక ఫండ్లలో మదుపు చేయడం వల్ల, వాటిలో ఎదురయ్యే నష్టాలు కొన్నిసార్లు మొత్తం పోర్ట్‌ఫోలియోపై ప్రభావం చూపించే ప్రమాదం లేకపోలేదు. ఒక స్థాయిని మించిన వైవిధ్యం కూడా కొన్నిసార్లు ఇబ్బందులపాలు చేస్తుందని ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం. షేర్లలో అయినా.. ఫండ్లలో అయినా ఈ సూత్రం వర్తిస్తుంది.
కొత్త ఫండ్లు ఎప్పుడు? 
పెట్టుబడి మొత్తం పెంచుకోవాలని ఆశించిన ప్రతిసారీ కాకుండా.. కొత్త ఫండ్లను ఎంచుకునేందుకు కొన్ని సూత్రాలున్నాయి..
లక్ష్యం మారినప్పుడు: ప్రస్తుతం మీరు ఏదో ఒక లక్ష్యానికి అనుగుణంగా మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేస్తున్నారనుకుందాం. దీనితో పాటు మరో కొత్త ఆర్థిక లక్ష్యాన్ని అనుకొని, దాన్ని సాధించేందుకు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు. అప్పుడు మీరు కొత్త పథకాన్ని ఎంచుకునేందుకు ప్రయత్నించవచ్చు. ఇందులో కూడా మీ లక్ష్య సాధనకు ఉన్న సమయం, దానికి అనుగుణంగా కొత్త ఫండ్‌ పెట్టుబడి వ్యూహం, అందించే రాబడిలాంటివి చూసుకొని, మరో ఇతర ఫండ్‌లో మదుపు చేయవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. మీ కొత్త లక్ష్యానికీ మీ దగ్గరున్న పాత ఫండ్లలో ఏదైనా సరిపోతుంది అనుకుంటే.. అందులోనే మదుపు చేయడం కొనసాగించవచ్చు. ఉదాహరణకు మీరు మీ పిల్లల చదువుల ఖర్చు కోసం ఒక డెట్‌ ఆధారిత పథకాన్ని ఎంచుకున్నారనుకుందాం. పదవీ విరమణ కోసం మదుపు చేసేందుకు మదుపు చేసేందుకు కూడా ఈ ఫండ్‌ సరిపోతుంది అనుకుంటే.. అందులోనే పెట్టుబడి పెట్టవచ్చు. ఒకసారి మీ ఆర్థిక సలహాదారుడిని అడిగి, ఆ ఫండ్‌ పనితీరు బాగుందా లేదా అనేది తెలుసుకోండి. అతని నుంచి సానుకూల సమాధానం వస్తే.. కొత్త ఫండ్‌ను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే, పెట్టుబడి మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు కొత్తగా 1, 2 ఫండ్లను పోర్ట్‌ఫోలియోలో జత చేసుకోవడం గురించి పరిశీలించవచ్చు. కాకపోతే దీనికోసం ఇప్పటికే మీరు మదుపు చేస్తున్న ఫండ్లలో మంచి ఫలితాలను ఇస్తున్న పథకాలను త్యాగం చేయకండి.
పెట్టుబడి మొత్తం పెరిగితే..: మీరు మదుపు చేస్తున్న మొత్తం ఒక్కసారిగా భారీగా పెరిగిందనుకోండి.. అప్పుడు కొత్త ఫండ్లలో మదుపు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. ప్రస్తుతం మీరు నెలకు రూ.5వేలు మదుపు చేస్తున్నారు.. ఈ మొత్తాన్ని నెలకు రూ.25వేలకు పెంచాలనుకుంటున్నారు.. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే..
* మీరు చిన్న మొత్తంలో మదుపు చేయడం వల్ల మీ పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యం అంతగా ఉండక పోవచ్చు. ఈ విషయాన్ని ఒకసారి పరిశీలించాలి. 
* ఇప్పటికే ఉన్న ఫండ్లలో వేటి పనితీరు బాగాలేదో అంచనా వేసుకోండి. వీటి స్థానంలో కొత్త ఫండ్లను ఎంచుకోవడం మేలా అనేది చూసుకోవాలి..
సాధారణంగా చిన్న మొత్తాలను మదుపు చేసేప్పుడు మిడ్‌ క్యాప్‌, డైవర్సిఫైడ్‌ ఫండ్లలో మదుపు చేయలేకపోవచ్చు. లేదా.. మిడ్‌ క్యాప్‌, డైవర్సిఫైడ్‌, లార్జ్‌ క్యాప్‌ ఫండ్లలో ఎక్కువగా మదుపు చేస్తూ ఉండొచ్చు.. పెట్టుబడి మొత్తాన్ని పెంచుకోవాలనుకున్నప్పుడు.. పథకాలను పునః సమీక్షించుకోవడానికి సరైన సమయంగా భావించవచ్చు. మీరు ఇప్పడు మదుపు చేయలేకపోతున్న ఫండ్లలో పెట్టుబడి మొత్తం పెరిగినప్పుడు అవకాశాన్ని వాడుకోవచ్చు.
ఇలా చేయండి... 
* మీరు ఇప్పటికే మదుపు చేస్తున్న ఫండ్ల పనితీరు బాగుందా లేదా తెలుసుకోండి. అవసరమైతే మీ ఆర్థిక సలహాదారు సలహా తీసుకోండి. అన్ని ఫండ్లూ బాగుంటే.. ఆయా ఫండ్లలోనే పెట్టుబడి మొత్తాన్ని పెంచుకోండి. కొత్తవి తీసుకోవాల్సిన అవసరం అంతగా లేదు.
* పెట్టుబడి మొత్తం పెరిగినప్పుడు డెట్‌, ఈక్విటీ నిష్పత్తి దెబ్బతినకుండా చూసుకోండి. ఒకవేళ ఇలాంటి పరిస్థితి వస్తే.. ఆ నిష్పత్తిని సరిచేసేందుకు కొత్త ఫండ్‌ పథకాన్ని ఎంచుకునేందుకు ప్రయత్నించండి. ఉదాహరణకు ఈక్విటీ, డెట్‌ నిష్పత్తి 60:40 ఉందనుకుందాం. కొత్తగా మీరు ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడిని పెంచినప్పుడు ఇది 80:20 అయ్యిందనుకుందాం. ఇలాంటప్పుడు కొత్త పెట్టుబడిలో కొంత మేరకు డెట్‌ ఫండ్లకు కేటాయించి, ఈ నిష్పత్తిని గతంలోలాగా ఉంచేందుకు ప్రయత్నించాలి.
* చాలామంది మదుపరులు చేసే పొరపాటు ఒకటుంటుంది. తాము మదుపు చేస్తున్న ఫండ్లలో అధిక రాబడి ఇస్తున్న ఫండ్లనే కొత్త పెట్టుబడుల కోసం ఎంచుకుంటారు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఒకసారి మంచి రాబడి ఇచ్చిన ఫండ్‌, ప్రతిసారీ అదే రీతిన ఫలితాలను ఇస్తుందని ఆశించలేం. కొంతకాలం తర్వాత మరో ఫండ్‌ ఆ స్థానాన్ని ఆక్రమించవచ్చు. మనం వీలైనంత వరకూ వైవిధ్యంగా మదుపు చేయాల్సింది ఇందుకే. కాబట్టి, కొత్త పెట్టుబడిని మీ వద్ద ఉన్న అన్ని ఫండ్లలోనూ మదుపు సమానంగా మదుపు చేసేందుకు ప్రయత్నించవచ్చు. అవసరం లేకపోయినా.. మరింత వైవిధ్యం కోసం కొత్త ఫండ్లలో మదుపు చేయాలనుకోవడం సరికాదు.
- విద్యా బాల, హెడ్‌, మ్యూచువల్‌ ఫండ్‌ రీసెర్చ్‌, 
FundsIndia.com



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list