MohanPublications Print Books Online store clik Here Devullu.com

పెళ్లి వేడుక_pelliVeduka

     


డబ్బున్న మారాజులకి అన్నీ తీపి ముచ్చట్లే... సరదా వేడుకలే... పిల్లా పిల్లాడు పుట్టింది మొదలు... బారసాలలో వండి వార్చే పాయసాల రుచులూ, గడపలు దాటితే బూరెల దిగదుడుపులూ, అడుగులేస్తే అరిసెలు పరిచే మురిపాలూ, పెద్దపిల్లయితే నవపిండివంటల ఆరగింపులూ... ఇలా పెరిగేకొద్దీ అడుగడుగునా తియ్యని వేడుకలే. ఇక, పెళ్లంటే మాటలా... నిశ్చితార్థం మొదలు అంపకాల వరకూ అన్నీ తీపి కబుర్లే... రకరకాల మిఠాయిల పంపకాలే.

ఒకప్పుడు ఆడపెళ్లివారయినా, మగపెళ్లివారయినా పెళ్లి వేడుకల్లో భాగంగా ఏవో రెండుమూడు రకాలు మహాఅయితే ఆరేడు స్వీట్లను భారీ సైజుల్లో చేయించి ఇచ్చిపుచ్చుకుని, ఆపైన చుట్టపక్కాలకు పంచుకునేవారు. కానీ నేటి పెళ్లి తంతులో అలంకరణకి ప్రాధాన్యం పెరిగింది. పెళ్లి దుస్తులూ మండపాలే కాదు, పెళ్లిలో వాడే వస్తుసామగ్రిని కూడా ఆకర్షణీయంగా మెరిపిస్తున్నారు. అందులో భాగంగానే ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే పండ్లూ మిఠాయిలతో కూడిన నిశ్చితార్థ తాంబూలాలను సైతం ఆకర్షణీయంగా తయారుచేసి అందంగా అలంకరించడం క్రమంగా పెరుగుతోంది.

అయితే, ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో మగపెళ్లివారు తమ ఇంటి మహాలక్ష్మి కాబోతున్న కోడలికి నిశ్చితార్థం, వివాహం, శోభనం వేడుకల్లో నగలూ చీరసారెలతోబాటు బూందీలడ్డూలూ, గోరుమీఠీలూ, కజ్జికాయలూ, జహంగీరులూ, మడతకాజాలూ, మినపసున్నుండలూ, పంచదార చిలకలూ... ఇలా పలు రకాల మిఠాయిలూ పూలూ పండ్లతో ‘కంత’ను తీసుకొచ్చి, చూడచక్కగా ప్రదర్శిస్తారు. ఫొటోవీడియో షూట్‌ల పుణ్యమా అని అవి మరింత ఘనంగా ఆడంబరంగా కనిపించాలన్న ఉద్దేశంతో ఆయా మిఠాయిల్ని భారీ సైజుల్లో చేయడంతోబాటు అందులో పెట్టే చిలకల్నీ కోవా స్వీట్లనీ రకరకాల పూలూ పండ్లూ కూరగాయలూ కట్టడాలూ దేవుడి విగ్రహాల రూపాల్లో ఆకర్షణీయంగా తయారుచేయించడం ఆనవాయితీగా మారి, క్రమంగా ఇతర ప్రాంతాలకూ వ్యాపించింది.

అయితే, మిఠాయిల్లో ఎప్పుడూ పంచదార చిలకలూ కోవా రకాలే అయితే కొత్తదనం ఏముంటుంది అనుకున్న తాపేశ్వరం, రాజమండ్రికి చెందిన సురుచి, భక్తాంజనేయ దుకాణదారులు రోళ్లూ రోకళ్లలాంటి వస్తువులతోబాటు దేవుళ్ల విగ్రహాలూ బిందెలూ చెంబుల రూపంలోనూ మిఠాయిలను తయారుచేస్తున్నారు. మరమరాలూ, బూందీ పాకంతో చేసి, పలుచని ప్లాస్టిక్‌ కవర్‌తో ప్యాక్‌ చేసి చమ్కీదారాలతో అలంకరిస్తోన్న ఈ తీపి పెళ్లితంతు సామగ్రి పెళ్లివారిని విశేషంగా ఆకర్షిస్తోంది. ఇవనే కాదు, ఆయా దుకాణాల్లో కోవా స్వీట్లను పండ్లూ కూరగాయలూ కొబ్బరికాయల ఆకారాల్లో ఎంతో అద్భుతంగా తయారుచేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌ నుంచి రప్పించిన పాకశాస్త్ర నిపుణులతో పెళ్లివారి అభిరుచులకు తగ్గట్లుగా సహజరంగులతో ప్రత్యేకంగా చేయిస్తోన్న సురుచి వారి కోవా స్వీట్లు ఔరా అనిపించేలా ఉంటున్నాయి.

నిజానికి ఈ కంతలూ సారెల సంస్కృతి ఈనాటిదేం కాదు, కమనీయ కావ్యంగా చెప్పుకునే సీతారాముల కళ్యాణ కాలం నుంచీ ఉన్నాయని తెలుస్తోంది. దశరథమహారాజు నలుగురి కుమారుల వివాహానికి పట్టుచీరలూ ఆభరణాలతోబాటు పలు పిండివంటలతో వూరేగింపుగా వెళ్లినట్లు పౌరాణిక కథనం. ఆనాటి సంస్కృతికి చిహ్నంగా రాజులూ సంపన్నులూ తమ దర్పాన్ని ప్రదర్శించేందుకు కంతల్ని తీసుకురావడం ప్రారంభించారు. పూర్వం గుర్రబ్బండ్లూ ఎడ్లబండ్లతో మగపెళ్లివారు పండ్లూ మిఠాయిల కంతలతో వస్తే, ఆడపెళ్లివారు వూరి పొలిమేరల్లోనే వారికి ఎదురెళ్లి, బ్యాండుమేళంతోనూ పానకాల కావిళ్లతోనూ విడిది గృహాలకు తీసుకెళ్లి, అతిథి మర్యాదలు చేసేవారు. ఇప్పుడు బండ్లు పోయాయి, కార్లు వచ్చాయి. మర్యాదలు మాత్రం అలాగే ఉన్నాయి, కంతలూ మరింత ఘనంగా రూపుదిద్దుకున్నాయి. ఫలితం... మగపెళ్లివారు తమ స్థాయిని బట్టి కంతలకోసం పదివేల రూపాయల నుంచి లక్షల రూపాయల వరకూ ఖర్చుపెడుతున్నారు. కోవా, డ్రైఫ్రూట్స్‌తో భిన్న రూపాల్లో చేసే స్వీట్లతోబాటు కొత్తగా బూందీ, మరమరాలతో చేసే తియ్యని రోళ్లూ, రోకళ్లూ, బిందెలూ, చెంబులూ... లాంటి వస్తువుల్నీ కంతల్లోకి చేర్చేస్తున్నారు. తమదైన తీపి అందాలతో పెళ్లికొచ్చిన అతిథుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తున్నారు. ‘ఆయ్‌... మరేనండీ... పెళ్లంటే పందిళ్లూ... సందళ్లూ... తీపి తీపి రుబ్బురోళ్లూ సన్నికళ్లూ కూడానండీ...’ అంటూ సన్నాయి రాగాలు ఆలపిస్తోన్న గోదారోళ్ల తీపి కళాపోషణను అభినందించకుండా ఉండగలమా..!
- గాడేపల్లి వెంకటరమణమూర్తి 
న్యూస్‌టుడే, మండపేట 
ఫొటోలు: జి.శేషగిరి, రాజమండ్రి

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list