MohanPublications Print Books Online store clik Here Devullu.com

గిరి కోనల్లో కన్నెపిల్లల కలల పండుగ-Sravanamasa Panduga


గిరి కోనల్లో కన్నెపిల్లల కలల పండుగ
ప్రతి ప్రాంతానికీ, వర్గానికీ ఓ సంస్కృతి ఉంటుంది. ఆ సంస్కృతిని నిలబెట్టే పండుగలూ ఉంటాయి. అలాంటి పండుగే తీజ్‌ ఉత్సవం. తెలుగ రాష్ట్రాల్లోని గోర్‌ బంజారాలు పవిత్రంగా జరుపుకునే వేడుక ఇది. వర్షాలు నిండుగా కురవాలనీ, పంటలు దండిగా పండాలనీ కోరుతూ ప్రత్యేక పూజలు చేస్తారు. ‘బతుకమ్మ’ పండుగ తరహాలో చేసుకునే సాగే తీజ్‌ పండుగ శ్రావణ మాసంలో వస్తుంది. రేపటి నుంచి ఈ నెల 13 వరకు తొమ్మిది రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఈ గిరిజనోత్సవం జరగనుంది.
హిందూ సంప్రదాయ పండుగలను ఘనంగా చేసుకునే గిరిజనులు (గోర్‌ బంజారాలు) సీత్లా, తీజ్‌ పండుగలను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా తీజ్‌ పండుగలో సేవాలాల్‌ మహారాజ్‌, దండి మేరామ యాడీలను దైవ దూతలుగా కొలుస్తారు. పరమేశ్వరుడి ప్రేమను పొందడానికి పార్వతీ దేవి 107 జన్మలు ఎత్తిందనీ, 108వ జన్మలో శివుణ్ణి భర్తగా పొందిందనీ వీరి నమ్మకం. పార్వతీపరమేశ్వరుల పెళ్లి జరిగిన రోజుకు గుర్తుగా ‘తీజ్‌ పండుగ’ను తొమ్మిది రోజుల పాటు సంబరంగా జరుపుకుంటారు.

బుట్టల్లో గోధుమనారు
తండాల్లోని పెళ్లికాని అమ్మాయిలు తమ తల్లితండ్రులకు పంటలు బాగా పండాలనీ, బాగా అభివృద్ధి చెందాలనీ, భవిష్యత్తు బాగుండాలనీ, ప్రేమగా చూసుకునే భర్త రావాలనీ కోరుతూ.. దేవుళ్లను కొలుస్తారు. ‘తీజ్‌’ మొదటి రోజు తండా యువకుల సాయంతో పూజారి కర్రలు, రంగు రంగుల వస్త్రాలతో ఒక మంచె (డాక్లో)ను తయారు చేస్తారు. దానిపై దేవుడి పేరిట దోనెలు (బుట్టలు) ఏర్పాటు చేస్తారు. గిరిజన యువతులు కూడా చిన్న చిన్న బుట్టల్లో ఎరువు వేసుకుని సిద్ధంగా ఉంచుతారు. తండా నాయక్‌ ఇంటి నుంచి నానబెట్టిన గోధుమలు సేకరించి... పూజారి, తండా పెద్దలు.. దేవుడి పేరిట ఉన్న దోనెల్లోనూ, మహిళల బుట్టల్లోనూ వేస్తారు. తర్వాత ఆ బుట్టలను మంచెపైకి ఎక్కిస్తారు. యువతులు ప్రతి రోజూ స్నానమాచరించి బావి నుంచి నీళ్లు తెచ్చి.. గోధుమనారు బాగా రావాలని.. తమ తమ బుట్టలపై చల్లుతారు.

చూర్మో ప్రసాదం
పండుగ జరిగే తొమ్మిది రోజులూ ఆటపాటలతో సాగిపోతాయి. ఏడో రోజు ముఖ్యమైనది. దీనిని ‘డమోళీ తీజ్‌’ అంటారు. ఈ రోజు యువతులు బియ్యప్పిండితో రొట్టెలు తయారు చేస్తారు. వాటిని ముక్కలుగా చేసి చెక్కబెల్లం కలిపి ముద్దలుగా (ముద్దల చూర్మో) తయారు చేస్తారు. చూర్మో ముద్దలను మొదట తండా నాయకుడి ఇంట్లో సమర్పించి.. ఆ తర్వాత తండాలోని అందరి ఇళ్లల్లో పంచుతారు. అందరి ఇళ్ల నుంచి చూర్మో ముద్దలను సేకరించి బుట్టల దగ్గరికి చేరుకుని, దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. ప్రత్యేక పూజలు చేసి చూర్మోను ప్రసాదంగా తీసుకుంటారు.

శివపార్వతుల కల్యాణం
ఈ ఎనిమిదో రోజు గణగోర్‌. ఆ రోజు పాయసం తయారీ కోసం యువతులంతా ప్రతి ఇంటికీ వెళ్లి బియ్యం, చక్కెర, పాలు సేకరిస్తారు. తండా యువకులు పూజారితో కలిసి చెరువు గట్టుకు వెళ్లి నల్లమట్టిని తీసుకొస్తారు. ఆ మట్టితో శివపార్వతుల విగ్రహాలతో పాటు స్త్రీ-పురుషుల ప్రతిమలు తయారు చేస్తారు. శివపార్వతుల విగ్రహాలను అలంకరించి.. మంచెపై ఉంచి.. ఘనంగా పెళ్లి జరిపిస్తారు. తొమ్మిదో రోజు ‘కడఫ్‌ తీజ్‌’. తండాలోని అన్ని ఇళ్లలో నుంచి బియ్యం, బెల్లం, నెయ్యి సేకరించి వాటితో పాయసం చేస్తారు. దానితో సేవాలాల్‌ మహారాజ్‌కు బోగ్‌ బండారో నిర్వహిస్తారు. గోధుమ నారు పెరిగిన బుట్టలను ఒక చోట చేరుస్తారు. వాటిని బతుకమ్మల్లా ఒకచోట ఉంచి.. వాటి చుట్టూ యువతులంతా లయబద్ధంగా తిరుగుతూ సంప్రదాయ గీతాలు ఆలపిస్తారు. చివరగా మేరా మా యాడీ పూజ చేస్తారు. తీజ్‌ ఉత్సవంలో పాల్గొన్న యువతులకు తొందరగా వివాహం అవుతుందనీ, మంచివాడు, మనసున్న వాడు భర్తగా లభిస్తాడని గోర్‌ బంజారాల విశ్వాసం.

ఉత్సవంలో రెండో రోజు యువతీ యువకులు ‘ చేలలో బో రడీ’ ఆట ఆడుకుంటారు. యువకులు చేలల్లో ఉండే రేగుచెట్టును కర్రతో కదలిస్తుంటారు. కదిలే చెట్టు ముళ్లకు సెనగలను గుచ్చడం అమ్మాయిల పని. పాటలు పాడుతూ.. యువకులను మైమరిచేలా చేసి రేగుముళ్లకు సెనగలు గుచ్చి.. ‘బో రడీ’ ఆట ముగిస్తారు.
- నవాబ్‌, మహబూబాబాద్‌, ఫొటో: మధు


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list