MohanPublications Print Books Online store clik Here Devullu.com

మురుడేశ్వర్‌ మహిమాన్వితమైన శైవ క్షేత్రం-Murudeshwar Temple, మురుడేశ్వర్ ఆలయం


మురుడేశ్వర్‌ మహిమాన్వితమైన శైవ క్షేత్రం
పాండవులు పూజించిన పుణ్యక్షేత్రమిది. సాక్షాత్తూ పార్వతీ పరమేశ్వరుల పాదధూళి పడిన పావన తీర్థమిది. సురపతి అయిన ఇంద్రుడు సందర్శించిన ఆలయమిది. అదే మురుడేశ్వర్‌. ఇక్కడ కొలువైన స్వామికి మురుడేశ్వరుడని పేరు. ఈ స్వామిని పూజిస్తే కోరికలన్నీ నెరవేరతాయని విశ్వాసం. అందుకే ఇక్కడికి దేశంలోని అన్ని ప్రాంతాలనుంచి భక్తులు వచ్చి పూజిస్తుంటారు. అతి ప్రాచీనక్షేత్రమైన ఈ పుణ్యస్థలి ఉన్నది కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా బత్కల్‌ తాలూకాలో.
స్థలపురాణం: రావణాసురుడు భక్తితో శివుని మెప్పించి, కైలాసం నుంచి ఆయన ఆత్మలింగాన్ని తీసుకుని వస్తుంటాడు. రావణాసురుడి చేతికి శివుడి ఆత్మలింగం చిక్కితే, అతను దాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే ఇక రావణుని అకృత్యాలకు అడ్డుకట్ట వేయగలవారే ఉండరనే ఉద్దేశ్యంతో దేవతల కోరికమేరకు వినాయకుడు ఒక పిల్లవాడి రూపంలో వస్తాడు. సాయంత్రం వేళ సంధ్యావందనం చేయడం కోసం ఆత్మలింగాన్ని ఎవరికి అప్పగించాలా అని ఆలోచిస్తూ ఉంటాడు రావణుడు, సరిగ్గా అదే సమయంలో రావణుడి కంట పడతాడు బ్రాహ్మణ బాలుడి వేషంలో ఉన్న గణపతి. కాసేపు శివలింగాన్ని చేతితో పట్టుకుని ఉంటే, తాను స్నానసంధ్యలు ముగించుకుని వస్తానని చెప్పి వెళతాడు రావణుడు.
పథకం ప్రకారం, రావణుడు వచ్చేలోగా శివలింగాన్ని నేలమీద పెట్టేస్తాడా బాలుడు. ఇంకేముంది, శివలింగం భూమిలో దిగబడిపోతుంది. ఎంత ప్రయత్నించినా బయటకు రాదు. అప్పుడు రావణుడు ఆగ్రహంతో ఆత్మలింగానికి కప్పి ఉన్న వస్త్రం, దారం తదితర వస్తువులను విసిరి పారేస్తాడు. ఆ వస్తువులు పడిన ప్రదేశాలే గోకర్ణ క్షేత్రానికి దగ్గరలో ఉన్న సజ్జేశ్వర, గుణవంతేశ్వర, మురుడేశ్వర, ధారేశ్వర లింగాలు. ఈ క్షేత్రాలన్నీ కలిపి పంచక్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆత్మలింగం మీద ఉన్న వస్త్రాన్ని రావణాసురుడు విసిరేస్తే, ఆ వస్త్రం పడిన ప్రదేశమే మురుడేశ్వరం. మురుడ అంటే కన్నడంలో వస్త్రమనీ, సంతోషమనీ అర్థాలున్నాయి. అందరికీ సంతోషాన్ని ఇచ్చే ప్రదేశం కాబట్టి ఇది మరుడేశ్వరక్షేత్రమయిందని అంటారు.
ఈ క్షేత్రానికి ఉత్తరాన భవానీమాత, తూర్పున దుర్గామాత, ఇతర దేవతలందరూ మిగిలిన దిక్కులలో ఉండి పరిరక్షిస్తూ ఉంటారని, బ్రహ్మదేవుడు కూడా ఇక్కడికి వచ్చి మురుడేశ్వరుడిని పూలు, పత్రాలతో పూజించి, పండ్లను నివేదించి వెళుతుంటాడని, బ్రహ్మదేవుడు శివుడిపై తన కమండలంతో చిలకరించిన నీటితో కమండల తీర్థం అనే పవిత్ర సరస్సు ఏర్పడిందట.
అద్భుతం... అనన్య సామాన్యం: మురుడేశ్వర దేవాలయం ఆ కాలంలో దేవాలయ నిర్మాణంలో పవిత్రతకు, అద్భుత శిల్పసౌందర్యానికి నిదర్శనం. మురుడేశ్వర దేవాలయం ఆవర ణంలో కనిపించే శివుని ఎల్తైన పాలరాతి విగ్రహం అందరినీ ఆశ్చర్య చకితులను చేస్తుంది. 123 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని నిర్మించడానికి రెండేళ్లు పట్టిందట. 20 అంతస్థులతో కూడిన ఆలయ గాలిగోపురం సుమారు 250 అడుగుల ఎత్తులో ఉంటుంది. గాలిగోపురానికి ఇరుపక్కలా గల ఏనుగు ప్రతిమలు సజీవ శిల్పాల్లా కనిపిస్తాయి.
తీర్థేశ్వరం కూడా... మురుడేశ్వరంలో పవిత్ర స్నానాలు చేయడానికి బ్రహ్మతీర్థం, కమండల తీర్థం, అగ్నితీర్థం, భీమతీర్థం, దేవతీర్థం అనే ముఖ్యమైన తీర్థాలున్నాయి. ఈ తీర్థాలలో స్నానం చేయడం వల్ల దీర్ఘవ్యాధులు నశిస్తాయని, కోరిన కోరికలు నెరవేరతాయనీ అంటారు.
ఆలయ ప్రాంగణంలోనే ఇతర దేవతల సన్నిధులు కూడా ఉన్నాయి. వాటిలో గణపతి మందిరం, గౌరీమందిరం, దత్తాత్రేయ, సుబ్రహ్మణ్య, ఆంజనేయ మందిరాలు ముఖ్యమైనవి. ఆలయం ఆవరణలో ఉన్న రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి, తమ కోరికలను నెరవేర్చమని భక్తులు ముడుపులు కడుతుంటారు.
ఎలా వెళ్లాలంటే..?
గోకర్ణం నుంచి మురుడేశ్వరం సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. మురుడేశ్వరం 17వ నంబరు జాతీయ రహదారిలో ఉండటం వల్ల రవాణా సౌకర్యాలు బాగానే ఉన్నాయి. బెంగళూరు, మంగుళూరు, హుబ్లీ, ధర్మస్థల నగరాలనుంచి బస్సులున్నాయి. నేరుగా రైలు సౌకర్యం కూడా ఉంది. భోజన, వసతి: ఇక్కడ యాత్రీకులు ఉండటానికి వసతి గృహాలు, హోటళ్లు ఉన్నాయి.
– డి.వి.ఆర్‌. భాస్కర్‌

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list