MohanPublications Print Books Online store clik Here Devullu.com

హరిహరుల దివ్య క్షేత్రం మొగిలి-Mogali, Chittoor district, మొగిలి, చిత్తూరు జిల్లా GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu


హరిహరుల దివ్య క్షేత్రం మొగిలి
చిత్తూరు జిల్లాలోని మొగిలి ఆధ్యాత్మిక కేంద్రం. మొగిలీశ్వరుడు అక్కడ కొలువైనాడు. తడిబట్టలతో స్నానం చేసి సాష్టాంగ పడితే చాలు కోరిన కోరిక నెరవేరుతుందని అక్కడి ప్రజలకు నమ్మకం. అందుకే కాబోలు ఆ చుట్టుపక్కల గ్రామాల్లోనే కాకుండా.. కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా మొగిలీశ్వరుడి పేరున్న వ్యక్తులు అనేకమంది కనిపిస్తుంటారు.
చుట్టూ కొండల మధ్య కనువిందైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వయంభువుగా ముక్కంటి అక్కడ వెలిశాడని స్థల పురాణాలు చెబుతున్నాయి. హరితో కొలువైనందున దీన్ని హరిహర క్షేత్రమని కూడా అంటారు. ఆ గోపాలుడు రుక్మిణీ, సత్యభామ సమేతంగా కొలువై ఉండటం మొగిలి ప్రత్యేకత. దేశంలో ఏ హర క్షేత్రంలో లేని విధంగా భక్తులకు శఠగోపంతో పూజారులు ఆశీర్వాదాలు అందజేస్తారు. సర్పదోష నివారణ కోసం చేసే రాహుకేతు పూజ ఈ ఆలయంలో చేయించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని అక్కడి ప్రజలు చెబుతుంటారు.
స్థల పురాణం
మొగలిపొదల సమీపంలో గల మొగిలివారిపల్లి గ్రామంలో పేద బోయ దంపతులు నివసించేవారు. బోయ భార్య నిండు చూలు తో ఉన్నపుడు ఒకరోజు వంట చెరకు కోసం అడవికి వెళ్లింది. అకస్మాత్తుగా నొప్పులు వచ్చి అక్కడే బిడ్డను ప్రసవించింది. మొగలిపొదల వద్ద పుట్టాడు కనుక మొగిలప్ప అని ఆ బిడ్డను అందరూ పిలవసాగారు. మొగిలప్ప యుక్తవయస్సుకు వచ్చాక ఒక పెద్ద రైతు ఇంట్లో పశువులను మేపే పనికి కుదిరాడు. ఒకరోజు మొగిలప్ప అడవిలోకి పశువులను తోలుకెళ్లి సమీపంలోని మొగలిపొదల వద్ద వాటిని వదిలి, వంటచెరకు కోసం పొదలను నరకసాగాడు. కొద్దిసేపటికి కంగుమని శబ్దం వచ్చి రక్తం కారసాగింది.
ఆ పొదలను తొలగించి చూడగా అక్కడ రక్తం ధారగా స్రవిస్తున్న శివలింగం కనిపించింది. వెంటనే మొగిలప్ప ఆ లింగానికి కట్టుకట్టాడు. నాటినుంచి ఆ శివలింగాన్ని పూజిస్తూ పూలు, పళ్లు సమర్పించేవాడు. మొగిలప్పకు శివుడిపై భక్తి పెరిగి ఇంటి ధ్యాస తగ్గిపోగా, కలవరపడ్డ అతని తల్లి వెంటనే మొగిలప్పకు వివాహం చేసింది. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. మొగిలప్ప మేపుతున్న మందలో ఒకగోవు పాలివ్వకపోతుండడంతో రైతు మొగిలప్పను మందలించాడు. మరునాడు మొగిలప్ప ఆ గోవుపై ఒక కన్నేసి ఉంచాడు. ఆ గోవు మేతమేస్తూ దేవరకొండ వైపు వెళ్లి అక్కడ ఉన్న బిలంలో ప్రవేశిస్తుండగా దాని తోకను పట్టుకొన్నాడు. అతనూ గోవుతోపాటు చాలా దూరం ప్రయాణించాడు.
ఇద్దరూ ఒక విశాల ప్రదేశానికి చేరుకోగా అక్కడ జగన్మాత పార్వతీదేవి ఒక బంగారు పాత్రను చేబూని, ఆ గోవును సమీపించి పాలు పితికింది. ఇంతలో మొగిలప్పను గమనించి అనుమతి లేకుండానే ఆ ప్రదేశానికి వచ్చినందుకు శపించబోయింది. మొగిలప్ప ఆమె పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు. జగన్మాత శాంతించి మొగిలప్పకు ఆకలిదప్పులు లేకుండా ఉండేటట్లు వరమిచ్చి, జ్ఞానోపదేశం చేసింది. ఈ విషయం ఎవరికి చెప్పినా వెంటనే మరణిస్తావని హెచ్చరించింది. అనంతరం మొగిలప్ప ఇంటికి చేరుకున్నాడు.
నాటినుంచి సర్వం త్యజించి శివధ్యానంలో మునిగిపోయేవాడు. నిద్రాహారాలు మానేసి శివధ్యానంలో గడిపేవాడు. అతని భార్య ఎంత అడిగినా ఏమీ చెప్పేవాడు కాదు. చచ్చిపోతానని భార్య బెదిరించడంతో చేసేదేమీ లేక ఊరి పొలిమేరల్లో చితి పేర్చుకొని, ఊరందరినీ పిలిచి విషయం చెప్పాడు. మరుక్షణం మరణించాడు. మొగిలప్ప భార్య పశ్చాత్తాపంతో సహగమనం చేసింది. మొగిలప్ప చితి ఉన్న ప్రదేశాన్ని మొగిలప్ప గుండంగా పిలుస్తుంటారు. మొగిలప్ప పేరుమీదుగానే శివలింగాన్ని మొగిలీశ్వరుడు అని పిలవసాగారు. చోళుల కాలంలో దేవాలయాన్ని నిర్మించారు.
మహిమ గల దైవం
సంతానం లేనివారు ఆలయంలో నిద్ర చేస్తే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. బిడ్డలు లేని ఎందరో మహిళలు స్వామివారి కృపాకటాక్షాలతో సంతానం పొందారు. ఈ క్షేత్రంలో వివాహం చేసుకుంటే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే ప్రతి సంవత్సరం కనీసం వంద వరకు వివాహాలు జరుగుతుంటాయి. ప్రతి అమావాస్యకూ భక్తులు ఆలయానికి పోటెత్తుతారు.
నిత్య పూజలు
అర్చన, రుద్రాభిషేకం, క్షీరాభిషేకం, రుద్ర హోమం, చండీ హోమం సహస్రనామార్చన, శనిదోష నివారణ పూజలు
వారపు పూజలు
ప్రతి సోమవారం రాహుకేతు పూజ (రాహుకాలంలో సర్ప దోష నివారణకోసం) ఉ‘‘ 7.30 నుంచి 8 వరకు జరుపుతారు.
మాస పూజలు
శ్రావణమాసంలో రెండో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఉచితంగా ఆలయ యాజమాన్యం నిర్వ హిస్తుంది. అదేవిధంగా కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఉచితంగా నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాలు..
ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా మొగిలీశ్వరస్వామి దేవస్థానంలో 12 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఉభయదారుల చేతులు మీదుగా ఒక్కోరోజు ఒక్కో ఉత్సవం జరిపి స్వామివారిని మేళతాలాలతో ఊరేగిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలకు ఇసకేస్తే రాలనంత జనం హాజరవుతారు.
ఇలా చేరుకోవచ్చు..
బెంగళూరు చెన్నై హైవేలో చిత్తూరుకు 30 కిలోమీటర్ల దూరంలో మొగిలీశ్వరుడు కొలువైనాడు. బెంగళూరుకు 148 కిలో మీటర్లు, చెన్నైకి 186 కిలోమీటర్లు, కాణిపాకంకు 39 కిలోమీటర్లు ఉంది. చెన్నై నుంచి వచ్చే భక్తులు బెంగళూరుకు వెళ్లే బస్సుల్లో మొగిలికి చేరుకోవచ్చు. చిత్తూరు, పలమనేరు నుంచి బస్సు సౌకర్యం ఉంది.
– గాండ్లపర్తి భరత్‌రెడ్డి సాక్షి, చిత్తూరు


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list