MohanPublications Print Books Online store clik Here Devullu.com

దక్షిణాది బద్రి... లింబాద్రి-Lingrabragutta Temple, Kartik Purnima, లింబాద్రి గుట్ట దేవాలయం, కార్తీక పౌర్ణమి


దక్షిణాది బద్రి... లింబాద్రి
పుణ్య తీర్థం
నిజామాబాద్‌ జిల్లాలోని లింబాద్రి గుట్ట తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ దేవాలయం. పచ్చని కొండల నడుమ ప్రకృతి రమణీయత మధ్యన అలరారే ఈ క్షేత్రంలోని స్వయంభూ శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారిని సందర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తారు. ఏటా కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కార్తీక పౌర్ణమి రోజున జరిగే రథోత్సవానికి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడాభక్తులు వస్తారు.
భీమ్‌గల్‌ మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో లింబాద్రి గుట్ట ఉంది. రెండంతస్తుల గుట్ట ఇది. మొదటి అంతస్తుపైకి మెట్ల మార్గం, రహదారి మార్గం ఉన్నాయి. మొదటి అంతస్తులో శ్రీవారి మాడ వీధులు, కమలా పుష్కరిణి, కళ్యాణ మంటపం, రథం గుడి, అయోధ్య ఆంజనేయ స్వామి ఆలయం ఉంటాయి. రెండవ అంతస్తులో లోతైన రాతి గుహలో కొలువుదీరిన స్వామి వారి మూల విరాట్టు ఉంది. ఈ స్వామిని దర్శించుకోవడానికి ఇరుకైన గుహ మార్గం గుండా వెళ్లాలి. ఈ గుహ మార్గం ప్రవేశ ద్వారం వద్ద జోడు లింగాలు ఉంటాయి. గుహమార్గం ద్వారా వంగుని 250 మీటర్లు వెళితే రాతి గుహలతో ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన గర్భాలయంలో శ్రీ లక్ష్మీనృసింహ స్వామి వారి మూల విరాట్టు, పక్కనే నరనారాయణుల (కృష్ణార్జునుల) విగ్రహాలు కనువిందు చేస్తాయి.
శాంత నరసింహుడు
సాధారణంగా ఏ నరసింహ క్షేత్రంలో చూసినా స్వామి వారి విగ్రహం ఉగ్ర రూపంతో ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం తొడపైన లక్ష్మీదేవిని కూర్చోబెట్టుకుని శాంత రూపంలో దర్శనమిస్తాడు.
స్వయంభూ నరసింహ క్షేత్రం
శ్రీ లక్ష్మీ నరసింహుడి స్వయంభూ క్షేత్రాలలో ఇదొకటి. బ్రహ్మదేవుడు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ సమయంలో పార్వతి పాదాలను చూడడంతో కోపోద్రిక్తుడైన ముక్కంటి తన గోటితో బ్రహ్మ ఐదవ తలను తొలగించాడని పురాణం చెబుతుంది. దీంతో బ్రహ్మ ఇక్కడే తపమాచరించి శ్రీహరిని నరసింహుడిగా సాక్షాత్కరించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. దీంతో లక్ష్మీసమేతుడుగా స్వామి వారు ఇక్కడే వెలియడం అరుదైన విషయమని చెబుతారు.
దక్షిణ బద్రీనాథ్‌గా ప్రసిద్ధి
పవిత్ర బద్రీనాథ్‌ క్షేత్రం తర్వాత గర్భాలయంలో స్వామి వారి మూలవిరాట్టు పక్కన నరనారాయణుల విగ్రహాలు ఇక్కడ మాత్రమే∙ఉన్నాయి. దీంతో ఈ క్షేత్రానికి దక్షిణ బద్రీనాథ్‌గా విశిష్టత వచ్చింది.
జోడులింగాలు
పరమశివుడు తనకు సంప్రాప్తించిన బ్రహ్మహత్యా దోష నివారణకై తపమాచరించి దోష విముక్తుడై శ్రీవారి ఆజ్ఞచే ఈ క్షేత్రంలోనే జోడు లింగాల రూపాన వెలిసాడట. ఇందుకు ప్రతీకగా గర్భాలయ మార్గ ప్రవేశ ద్వారం వద్ద భక్తులకు జోడు లింగాలు దర్శనమిస్తాయి. యముడు ఈ క్షేత్రంలో బిల్వవృక్ష రూపంలో తపమాచరించి శాంతి పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇంద్రుడు ఈ క్షేత్రంలో స్వామిని కమలాలతో పూజించి శాప విముక్తుడైనాడట.
అయోధ్య హనుమాన్‌
శ్రీరాముని ఆజ్ఞతో కవి పుంగవుడైన హనుమంతుడు ఇక్కడకు వచ్చి తపమాచరించి నరసింహుని రూపంలో ఉన్న శ్రీరాముని దర్శించాడట. అందుకే కొండ దిగువ ప్రాంతంలో క్షేత్ర పాలకుడైన అయోధ్య హనుమాన్‌ ఆలయం కనిపిస్తుంది.
కమలా పుష్కరిణి
ఇక్కడి పుష్కరిణికి కమలా పుష్కరిణిగా పేరు. సతీ విక్రయ దోషనివారణకై సత్య హరిశ్చంద్రుడు నరసింహుని సేవించి తరించాడట. నరనారాయణులు సన్నిధానంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారట. ధర్మరాజు ఈ క్షేత్రాన్ని దర్శించి కృతార్థుడైనట్లు, ప్రహ్లాదుడు తపమాచరించినట్లు పురాణకథనం.
నామధేయులు
ఈ ప్రాంతంతో పాటు జిల్లా, పక్క జిల్లా అయిన రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్‌ జిల్లాలో అడుగడుగునా లింబాద్రి, లింబన్న, లింబయ్య, నర్సింహులు, నర్సయ్య, నర్సయ్య, నర్సింగ్‌ తదితర పేర్లు గల వ్యక్తులు తారసపడతారు. మండలంలో అడుగుడుగునా ఈ పేర్లు గల వాళ్లు కనబడతారు.
ఎలా వెళ్లాలి
హైదారాబాద్‌ నుండి నేరుగా ఆర్మూర్‌ వరకు బస్సులో రావచ్చు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రం నుండి ఆర్మూర్‌ వరకు 25 కి.మీ. అక్కడి నుండి భీమ్‌గల్‌ మండల కేంద్రానికి 25 కిలోమీటర్లు. భీమ్‌గల్‌ నుండి 5 కిలో మీటర్ల దూరంలోని లింబాద్రి గుట్టకు బస్సులు, ఆటోలు, ఇతర వాహనాల ద్వారా చేరుకోవచ్చు. బ్రహ్మోత్సవాల సమయంలో మాత్రమే దేవాలయం బస సౌకర్యం కల్పిస్తుంది.
– కైర రవి గౌడ్, సాక్షి, భీమ్‌గల్, నిజామాబాద్‌ జిల్లా


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list