MohanPublications Print Books Online store clik Here Devullu.com

కుంతి_Kunthi



#కుంతీదేవి

జీవితం చాలా చిన్నది. ఈ లోకంలో మన గొప్పలూ, ఆర్భాటాలూ అన్నీ కొన్నాళ్ళే. ఇతరుల కోసం జీవించేదే అసలైన జీవితం. మన కోసం మనం బతికే జీవితంలో చరిత్ర సృష్టించబడుతుంది. నిస్వార్థమైన జీవితం త్యాగానికి ప్రతిరూపంగా కనిపిస్తూనే ఆదర్శానికి పెద్దపీట వేస్తుంది. త్యాగాన్ని కవచంగా,
జ్ఞానాన్ని ఆయుధంగా, ఓర్పును ఆస్తిగా, నిజాయితీని తన నైజంగా మలుచుకొని తనకు తానుగా 
జీవితానికి అంకితం అయిపోయేంత గొప్పతత్తం కుంతిగా భువిలో వెలిగిపోయింది. ఆ ఆదర్శం ఇంకా తన వెలుగులను పంచుతూనే ఉంది. నిస్వార్థం, నిజాయితీ, ధర్మం, న్యాయం, సత్యం లాంటివన్నీ 
గుణాలుగా కలిగిన కుంతీదేవిలో అనవసర ఆలోచనలు రూపుదిద్దుకునేవే కాదట. ఎందుకంటే ఇది లాభం, ఇది నష్టం అని నిరంతరం లెక్కలు వేస్తూ బతికే తత్తం ఆమెది కాదు. అందుకే ఆమె జీవితం గొప్ప 
పవితత్రను సంతరించుకుంది.

భారతంలో కథను నడిపించే పాత్రల వెనుక వెనుబలమై నిలిచిన మహా ఆదర్శ మహిళ కుంతీదేవి. శ్రీకృష్ణుని తండ్రైన వసుదేవుని సొంత చెల్లెలు, కుంతిభోజునికి దత్తపుత్రికయై పార్థగా పేరుదాల్చినా కుంతీదేవిగా ప్రపంచానికి పరిచయమైంది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు వికసించిన మేథస్సుతో, నిజాయితీగల హృదయంతో పెరిగింది కుంతి. చిన్ననాటి నుంచే గౌరవం, మర్యాద, తన వ్యక్తిత్వం పట్ల తనదైన పద్ధతి, నడవడిక, స్వీయ త్యాగం, సేవ నేర్వని సుగుణాలై కుంతీదేవి జీవితాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాయి.
కుంతీదేవి తత్తం ఆశానిరాశలకు అతీతమైంది. ఫలాపేక్ష ఎరుగని విశాల హృదయం గల కుంతి తన తండ్రి ఆదేశం మేరకు చిన్నతనంలో ఒక ఋషిని సేవించడానికి పూనుకుంది. ఓపిగ్గా అతని సేవలో చెరగని చిరునవ్వుతో, ఎంతటి కాఠిన్యమైన పనిని అప్పజెప్పినా అలుపెరుగక చేయసాగింది. ఆ ఋషి ఆమెలోని ఓర్పునకు పరీక్షపెడుతూ రోజురోజుకీ అత్యంత కఠోరంగా సేవలను పురమాయించసాగాడు. అలా సంవత్సరం పాటు ఆ ఋషిని ఏ మాత్రం చిరాకు లేక, వెనక్కి తగ్గక, ఎటువంటి ప్రతిఫలం ఆశించక సేవించింది. ఆ ఋషి దుర్వాసుడు. అతను కుంతిలోని గుణాలకూ, ఓర్పునకూ చలించి ఏదైనా వరం కోరుకోమంటాడు. అప్పుడు కుంతి నా తండ్రి నాకప్పజెప్పిన బాధ్యత, గౌరవప్రదమైన మీకు చేసిన సేవే నాకు దొరికిన వరం. మీరిరువురూ సంతోషిస్తే అంతకన్నా నాకు కావాల్సిందేమిటని అంటుంది. ఇంత చిన్న వయసులో ఇంతటి పరిపక్వత, స్వీయత్యాగం గల కుంతి వ్యక్తిత్వానికి అచ్చెరు వొందిన దుర్వాస మహర్షి నేనిచ్చే వరాన్ని స్వీకరించాల్సిందేనని పట్టుబట్టాడు.

కుంతి మళ్ళీ నిరాకరిస్తే అహంకారంతో మహర్షిని అవమానించినట్టవుతుందని భావించి సరేనంటుంది. తను కోరుకున్న దేవతలు ప్రత్యక్షమై తాను కోరిన వరాలు ఇచ్చేట్టుగా మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ వరమే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. చరిత్రకు రూపం ఇచ్చింది. 

ధర్మమంటే పాండురాజుగా విశ్వసించి పెళ్ళి చేసుకుంది కుంతి. పాండురాజు మాద్రను పెళ్ళాడితే దానిని సమ్మతించి, మాద్రని సొంత చెల్లెలుగా ఆదరించింది. కిందమ మహర్షి శాపగ్రస్తుడైన పాండురాజుతో ప్ళ్ళైన కొన్నాళ్ళకే అడవులకు పయనమైంది. శాపం కారణంగా సంతానం పొందలేమని పాండురాజు బాధపడుతుంటే తట్టుకోలేక తనకున్న వరాన్ని వివరించి, ఆ వర ప్రాభవంతో యుధిష్ఠర, భీమ, అర్జునులను పుత్రులుగా పొందుతుంది. మాద్రకి కూడా సంతానం సంతృప్తి కలగాలని భావించి తన వర ప్రభావంతో నకుల సహదేవులను ఆమెకు పుత్రులుగా అందించింది. దుర్వాసముని వరప్రభావాన్ని పరీక్షించదలచి చిన్నతనంలోనే అమాయకత్వంతో కర్ణున్ని కొడుకుగా పొందింది. ప్రపంచానికి భయపడి తన మమకారాన్ని దిగమింగుకొని నదిలో విడిచి పెట్టింది. పాండవులూ, కర్ణుడూ మహామహులు. వారంతటివారు కావడం వెనుక పాత్ర అమోఘం.

పాండురాజు అకాల మరణంతో, మాద్ర సతీ సహగమనంతో కృంగిపోలేదు సరికదా! తన పిల్లలకు వారి వంశమేంటో తెలియజేయాలనే తపనతో హస్తినకు కదలివెళ్ళింది. హస్తినాపురం చేరిన నాటినుంచి తన జీవితం చరమాంకం దాకా ఆమె అనుభవించని కష్టాలు లేవు. ఎదుర్కోని అవమానాలు లేవు. అన్నింటినీ సహించింది. ధర్మమే చివరికి గెలిచేదని గట్టిగా నమ్మింది. ఏ మలుపులోనూ తనను గురించి కానీ, తన జీవితం గురించికాని ఆలోచించింది లేదూ, బాధపడిందీ లేదు. 
కుంతీదేవి నోటివెంట వచ్చిన తప్పుకూడా సత్యమైందని చరిత్ర చెబుతుంది. ఆమె వాక్కుకున్న స్వచ్ఛత ఆమెలోని పవితత్రకు ప్రతిరూపంగా అబ్బింది. కార్యదక్షత, పట్టుదల, ధర్మనీతి తెలిసిన కుంతి ఏనాడూ ఎవ్వరినీ బాధపెట్టలేదూ, ఎదుటివారు పెట్టిన బాధలకూ విలపించిందీ లేదు. ధైర్యం, జీవితం పట్ల పరిపక్వత, అవగాహన గల కుంతీదేవి తన జీవితాన్ని తన జీవితానికే వదిలేసింది.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list