MohanPublications Print Books Online store clik Here Devullu.com

గజేంద్ర_మోక్షం_Gajendra_Moksham





https://youtu.be/BF1undg1YLw
     

పూర్వజన్మలవల్ల, కర్మలవల్ల ప్రోగుచేసుకున్నవాసనలవల్ల ఏర్పడిన బంధాలతో ఇంద్రియ భోగలాలసత్త్వములతో కూడిన 'అహం' (నేను అన్నదేహాత్మభావన) మొసలి కాగా దానిచే పట్టుబడ్డ మానవుడే గజేంద్రుడు.


జనన మరణ చక్రంలో అనేకసార్లు పడి పరిభ్రమిస్తున్నమానవుడు ముక్తి పొందాలంటే అందుకు తనశక్తి మాత్రమే చాలదు. పరమాత్మ అనుగ్రహశక్తి పరిపూర్ణంగా కావాలి. ఆ అనుగ్రహంకై ఈ సంసార బంధాల నుండి, ఇంద్రియభోగలాలసల నుండి విముక్తి కల్గించమని ఆ పరమాత్మనే ప్రార్ధించాలి. ఈ భవసాగరంలో పడిన నన్ను రక్షించమని పరితపిస్తూ రక్షించేంతవరకు వేడుకోవాలి. పరమాత్మ పలికేంతవరకు ప్రార్ధన ఆపకూడదు - అచ్చంగా గజేంద్రుడులా!


తన పరివారంతో మోహంతో కూడి ఒక పెద్ద కొలనులో జలక్రీడలు సాగిస్తున్న గజేంద్రుడు, సంసార సాగరంలో ప్రాపంచిక పరివారంతో మనస్సుతో కూడి కదలాడుతున్న మానవునికి దర్పణం. గజేంద్రుడు మకరేంద్రుడు బారిన పడిన రీతిలో భవసాగరంలో క్రీడిస్తున్న మానవుడు ఆంతర్యామినే మరచి 'అహం' అనెడి మకరం నోటిలో చిక్కుకొని దుఃఖితుడవుతున్నాడు. గజేంద్రుడు తనని తాను రక్షించుకోవడానికి ప్రయత్నం ప్రారంభించినట్లుగానే మానవుడు కూడా అహం అన్న భావం నుండి బయటపడడానికి సాధన అన్న ప్రయత్నం చేయాలి. జలంనందు మొసలికి బలం ఎక్కువ. ప్రాపంచిక సంసారంలో ఇంద్రియభోగలాలసత్త్వంను అలవర్చుకున్న 'అహం' కు కూడా పట్టు ఎక్కువే. ఈ అహం నుండి విడివడాలంటే తన సాధనాబలంతో పాటు ఈశ్వర అనుగ్రహం కావాలని గజేంద్రునిలాగా గ్రహించి త్రికరణశుద్ధిగా ఆ అనంతున్ని అర్ధించాలి.


గజేంద్ర మోక్ష ఘట్టంలో మొదట గజేంద్రుడు తన శత్రువైన మొసలిని తానుగా జయించడం కష్టమని తెలుసుకొని అందుకు పరమాత్మ మాత్రమే సహాయపడగలడని గ్రహించి పరమేశ్వరుని అనుగ్రహంకై ప్రార్ధించి, అటు పిమ్మట పలుకుటలేదని నిందాస్తుతి చేసి, అంతలోనే పరమభక్తితో వివేక విశ్వాసాలతో నీవు తప్ప ఎవరూ లేరని తనని తాను శరణాగతి చేసుకోగానే ఆ అనంతుడు సుదర్శనచక్రంను ప్రయోగించి మకరసంహారం చేసి దర్శనమిచ్చాడు. ఆలానే మానవుడు కూడా తనకి తానుగా ఈ ప్రారబ్ధవాసనలను అద్దుకున్న 'అహం'భావనను జయించడం కష్టమని గ్రహించి పరమాత్మునికి భక్తివిశ్వాసాలతో ప్రార్ధించి, ఈ జన్మల పరంపరలో పడి అలసిపోతున్నాను, ఈ భవసాగరంలో ఈదలేను, ఈ జనన మరణ చక్రభ్రమణం నుండి నను రక్షింపుము, ఈ వాసనాబంధాలను తీసేయమని, వీటి అన్నింటనందు విముక్తి కల్గించమని (సమస్త ప్రపంచ దృశ్య సంసార భావనా పరిత్యాగమే విముక్తి) వేడుకుంటూ, క్రమేనా కోరిక, కర్మ, అహం సమర్పణ చేస్తూ శరణాగతి స్థితికి వస్తే - అప్పుడు సుదర్శనచక్రమనేజ్ఞానముతో అజ్ఞానఅహంభావనను సంహరించిన పిదప ఆత్మసాక్షాత్కారం అవుతుంది.


జన్మ పరంపరలనుండి విముక్తి పొందడమే ముక్తి.


'తస్మాత్ భావా భావౌ పరిత్యజ పరమాత్మ ధ్యానేన ముక్తో భవతి' సమస్తమును త్యజించగా చివరకు ఆత్మ ఒక్కటే మిగిలివుంటుంది. అదియే ముక్తి. అదియే మోక్షం.


ఈ ముక్తి మరణాంతరం వచ్చేది కాదు, బ్రతికుండగానే సాధించాల్సిన స్థితి. దీనిని తెలియజెప్పే కధనమే "గజేంద్ర మోక్షం". గజేంద్రుడు చేసిన ఈశ్వర స్తుతి ఎంతో గొప్ప ఆధ్యాత్మిక ప్రబోధం.


-----------------------------------------

అతడుంటే అన్నీ ఉన్నట్లే

-డాక్టర్‌ గరికిపాటి నరసింహారావు

‘‘తనవెంటన్‌ సిరి, లచ్చివెంట నవరోధవ్రాతమున్‌ దానివె
న్కను బక్షీంద్రుడు, దాని వెన్కను ధనుః కౌమోదకీ శంఖ చ
క్ర నికాయంబును, నారదుండు, ధ్వజినీ కాంతుండునై వచ్చి రొ
య్యన వైకుంఠ పురంబునం గలుగు వారాబాలగోపాలమున్‌’’



..ఆంధ్ర మహాభాగవతంలోని గజేంద్ర మోక్షంలోని పద్యమిది. దీని అర్థమే పోతన జీవన విధానం. గజేంద్రుడు మొసలిబారి నుంచి తనను కాపాడమని ఎవరిని ప్రార్థించాడు? భాగవత పద్యాల్లో చూస్తే.. ‘ఈశ్వరా.. ఈశ్వరా’ అనే సంబోధనలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ ఈశ్వరుడంటే శివుడు కాదు, విష్ణువూ కాదు. బ్రహ్మ అసలే కాదు. మొత్తం అనంతకోటి బ్రహ్మాండాలకు అధిపతియైున పరమేశ్వరుడన్నమాట. మరి సర్వలోకాధిపతి, ఆత్మచైతన్యస్వరూపుడు అయిన భగవంతుణ్ని ప్రార్థిస్తే విష్ణువు చక్రాయుధుడై వచ్చి కాపాడటమేమిటి? అంటే మనం భగవంతుణ్ని ‘ఫలానా రూపంలో వచ్చి నన్ను కాపాడు’ అంటే అలాగే వస్తాడు. ఏ రూపమో ప్రత్యేకించి చెప్పకపోతే.. స్థితికర్త, పాలన, పోషణ చూసే బాధ్యత కలవాడు విష్ణువు కాబట్టి ఆయన వస్తాడు. అందుకే గజేంద్రుడి ప్రార్థన విని సర్వేశ్వరుడు విష్ణురూపంలో వచ్చాడు. అది సరే! గజేంద్రుడు కేవలం భగవంతుణ్ని వచ్చి తన ప్రాణాలు కాపాడాల్సిందిగా కోరాడు. కానీ, అడగకపోయినా ఆయన వెంట లక్ష్మీదేవి, ఆమె వెంట అంతఃపుర స్త్రీలు, వారి వెంట గరుత్మంతుడు, అతని వెనుక విల్లు, గద మొదలైన ఆయుధాలు, ఆపైన వైకుంఠానికి విష్ణు దర్శనానికి వచ్చిన నారదుడు.. ఇలా ఒకరేమిటి వైకుంఠంలో ఉండే అందరూ ఎందుకు వచ్చారు? దీనర్థం.. మనం భగవద్దర్శనం కోసం ప్రార్థిస్తే చాలు. ఆ దర్శనంతోనే సిరిసంపదలన్నీ వస్తాయి. దాసదాసీజనం సమకూరుతారు. వస్తువాహనాలు కొనగలిగే శక్తి సమకూరుతుంది. మన రక్షణ కోసం సర్వాయుధాలూ వస్తాయి. అత్యున్నత అధికారులందరూ మనచుట్టూ తిరుగుతారన్నమాట.

ఈ రహస్యం తెలిసినవాడు కాబట్టే పోతన మహాకవి రాజుల చుట్టూ మంత్రుల చుట్టూ తిరగడం మాని ఒక్క విష్ణువు చుట్టూ మాత్రమే మనసును ప్రదక్షిణం చేయుస్తూ భాగవతం రచించాడు. అందుకే ఆయనకు ఇహలోక జీవితమూ సుఖంగా ముగిసింది (శ్రీనాథునిలా కాకుండా). పరలోకంలో మోక్షమూ దక్కింది. ఈనాటి వారూ ఈ రహస్యాన్ని గ్రహించి భగవంతుని యందు నమ్మకముంచి ఆత్మవిశ్వాసంతో తమ పని తాము చేస్తే దక్కవలసిన గౌరవాలు అవే దక్కుతాయి.




No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list