MohanPublications Print Books Online store clik Here Devullu.com

అప్పు లేనివాడు అధిక సంపన్నుడు-Debt, richest, అప్పు, సంపన్నుడు



మన స్వభావాన్ని మనమెందుకు వదులుకోవాలి?
ఎన్నో మైళ్ల దూరం ప్రయాణం చేసి అలిసిపోయిన ఒక బాటసారి, ఆ పక్కగానే వెళుతున్న ఒక నదిలో స్నానం చేయడానికి అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే ఒక సాధువు స్నానం కోసం ఆ నదిలోకి దిగిపోయి ఉన్నాడు. అయితే స్నానం చేయడం మానేసి నది ఒడ్డుకు 10 గజాల దూరం దాకా వెళ్లి దేన్నో పట్టుకోవడానికి ప్రయత్నించి, ఏదో షాక్‌ కొట్టినట్టు చెయ్యి విదిలించుకుని ఇవతలికి వచ్చేస్తున్నాడు. తన చెయ్యి అదిమి పట్టుకుంటూ విలవిల్లాడుతున్నాడు. అయినా ఆగకుండా అదే చోటికి పదే పదే వెళుతున్నాడు. మళ్లీ చేయి విదిలించుకుంటూ పక్కకు జరుగుతున్నాడు. ఆ వచ్చిన బాటసారికి అక్కడ ఏమవుతుందో అర్థంకాక, ఆ సాధువు దగ్గరగా వెళ్లాడు. ‘‘ఏమిటి స్వామీ! మీరేదో చేస్తున్నట్లున్నారు?’’ అన్నాడు ఎంతో వినమ్రంగా, అందుకాయన ‘‘ఈ వరదలో ఇదిగో ఈ తేలుకు కొట్టుకుపోతోంది. 
ఇలా వదిలేస్తే అది తన ప్రాణాలు కోల్పోవడం ఖాయం. అందుకే దీన్ని ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేస్తున్నాను’’ అన్నాడు ‘‘అది సరే గానీ స్వామీజీ! మీరు ఆ ప్రయత్నం చేస్తున్న ప్రతిసారీ అది మిమ్మల్ని కాటేస్తున్నట్లు అనిపిస్తోంది. నిజమేనా?’’ అన్నాడు.
అందుకాయన ‘‘నిజమే నాయనా!’’ అన్నాడు సౌమ్యంగానే. ఆ వెంటనే ’’తేలు కాటు వేస్తుందని మీకు తెలిసి తెలిసి మీరెందుకు పదే పదే దాన్ని ఎందుకు పట్టుకుంటున్నారు? దాని మానాన దాన్ని వదిలేసి, మీరు మీ స్నానం ఆచరించండి స్వామీ!’’ అన్నాడు బాటసారి కాస్త అసహనంగానే. ఆ మాటలు విన్న సాధువు అతనికేసి మందహాసంతో చూస్తూ ‘‘నాయనా! కాటు వేయడం దాని స్వభావం. ఆపదలో ఉన్నప్పుడు కాపాడటం అనేది మనిషిగా మన స్వభావం. దాని సహజ స్వభావాన్ని కొనసాగించే విషయంలో దానికంత పట్టుదల ఉన్నప్పుడు, మన స్వభావాన్ని కొనసాగించే విషయంలో మన పట్టుదలను మనమెందుకు వదులుకోవాలి చెప్పు?’’ అన్నాడు. 
అలా అంటూనే మరో సారి ప్రయత్నించి, ఎట్టకేలకు తేలును ఒడ్డు మీదికి విసిరేయగలిగాడు. ఒడ్డున పడి అలా వెళ్లిపోతున్న తేలుకేసి సాధువు ఎంతో ప్రేమగా చూడసాగాడు. ఎంతైనా మహానుభావుల ఆలోచనా విధానమే వేరు కదా! అనుకుంటూ ఆరాధనగా సాధువుకేసి చూస్తూ, చేతులెత్తి నమస్కరించాడు బాటసారి.

పెదవుల మృదుత్వానికి...
కొంతమందికి తరచుగా పెదవులు చిట్లడం,. పై పొర లేచిపోయి పొట్టు రాలడం జరుగుతుంటుంది. ఇలా ఎందుకు అవుతుందంటే... శరీరంలో వచ్చిన మార్పులను, వాతావరణంలోని మార్పులను పెదవులు ఇట్టే ప్రతిబింబిస్తాయి. ఇందుకు దారితీసే కారణాలు...
♦ కాఫీలు ఎక్కువగా తాగడం, ఆల్కహాలు తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీనితో పెదవులు పొడిబారుతాయి.
♦ వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు ఆ మార్పును పెదవులు భరించలేవు. ఎక్కువ చలిని, ఎక్కువ వేడిని తట్టుకోలేక తేమ కోల్పోయి పొడిబారతాయి.
♦ పని ఎక్కువైనందువల్ల వచ్చే ఒత్తిడికి శరీర వ్యవస్థలో ఒడిదుడుకులు వస్తాయి. ఆ ప్రభావం మొదట కనిపించేది పెదవులలోనే.
♦ లిప్‌స్టిక్‌ల వల్ల ఇరిటేషన్‌ వచ్చినా కూడా పెదవులు పొడిబారి, చిట్లుతాయి.
♦ ఏదైనా రుగ్మతకు మందులు వేసుకున్నప్పుడు శరీరం తేమను కోల్పోయినట్లయితే కూడా బయటకు కనిపించే సమస్యల్లో ఇదే మొదటిది.
పెదవులకు సాంత్వన చేకూరాలంటే...
ఐదు మిల్లీ లీటర్ల గ్లిజరిన్‌లో అంతే మోతాదు నిమ్మరసాన్ని, పన్నీటిని కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి పెదవులకు పట్టించాలి. దానంతట అది ఆరే వరకు అలాగే ఉంచాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో పెట్టుకుని మూడు రోజుల వరకు వాడవచ్చు. మరీ ఎక్కువగా పొడిబారినట్లనిపిస్తే రెండు గంటలకొకసారి కాని ఉదయం రెండుసార్లు, సాయంత్రం రెండుసార్లు కాని పట్టించవచ్చు.
♦ ఇవేవీ వీలుకానప్పుడు నీటితోనే మర్దన చేస్తే తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంది. చలికి పెదవులు చిట్లినప్పుడు వేడినీటిలో దూది ముంచి పెదవులకు పట్టించాలి. ఎండలకు చిట్లినట్లయితే దూదితో చల్లటి నీటిని పట్టించాలి. వీలైతే నీటిలోనే వాజలిన్, తేనె ఏదో ఒకటి కొద్దిగా వేసుకోవచ్చు.
♦ లిప్‌స్టిక్‌ కొనేటప్పుడు అందులో వాడిన పదార్థాల జాబితాను ఒకసారి సరిచూసుకోవడం తప్పని సరి. బ్రాండెడ్‌ కంపెనీలు తప్పనిసరిగా ఈ లిస్ట్‌ను ప్రచురిస్తాయి. మాయిశ్చరైజర్‌ ఉన్న లిప్‌స్టిక్‌నే ఎంచుకోవాలి. సాధారణంగా లిప్‌స్టిక్‌లలో గ్లిజరిన్‌తోపాటు యాంటిసెప్టిక్‌ ప్రాపర్టీస్‌ కూడా ఉంటాయి. ఒకసారి నిర్ధారణ చేసుకోవడం మంచిది.

హృద్రోగులకు ప్రత్యేక ఆహారం ఉందా?
మా నాన్నగారి వయసు 68. రెండేళ్ల క్రితం ఆయనకు ఒక స్టెంట్‌ వేశారు. ప్రస్తుతానికి ఆరోగ్యంగానే ఉన్నారు. కాకపోతే హృద్రోగులు తీసుకునే ప్రత్యేకమైన ఆహారం ఏమైనా ఉందా? ఉంటే ఆ ఆహారం ఎలాంటిది? ఎలా తీసుకోవాలి? ఈ వివరాలు తెలుసుకోవాలని ఉంది. - సి. నిరంజన్‌, మంచిర్యాల
గుండె జబ్బును నయం చేసి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహార పదార్థాలు ఉన్న మాట నిజమే. అలాంటి వాటిల్లో కొన్ని.....
ఓట్లు: నీటిలో కలిసిపోగ లిగే ఒక జిగురు పదార్థం, లిపిడ్స్‌ను తగ్గించే గుణం ఉన్న బి- గ్లూకాన్‌ వీటిలో ఉన్నాయి. రోజుకు 25 గ్రాముల ఓట్లు తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.
వెల్లుల్లి: చాలా పరిశోధనల్లో చెడు కొలెస్ట్రాల్‌ ఎల్‌.డి.ఎల్‌ను, ట్రైగ్లిసరైడ్లను తగ్గించే సానుకూల అంశాలు వెల్లుల్లిలో ఉన్నాయని తేలింది. రక్తాన్ని గడ్డకట్టించే త్రాంబోసిస్‌ సమస్యను వెల్లుల్లి అడ్డుకుంటుంది. దీనికి తోడు అధిక రక్తపోటును తగ్గించే శక్తి కూడా వెల్లుల్లికి ఉంది. రోజుకు రెండు వెల్లుల్లి పాయలను తీసుకుంటే ఈ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.
మెంతులు: వీటిలో పీచుపదార్థం పుష్కలంగా ఉంటుంది. వీటిల్లోని మొత్తం 50 శాతం పీచుపదార్థంలో 20 శాతం జిగురుతో ఉండే పీచుపదార్థం ఉంటుంది. ఇది పైత్యరసంలోని ఆమ్లాల, తటస్థమైన స్టెరాయిడ్ల విసర్జనను పెంచుతుంది. దీనికి తోడు కాలేయంలో కొలెస్ట్రాల్‌ ఒత్తిడి ని తగ్గిస్తుంది. అందువల్ల రోజుకు 20 గ్రాముల మెంతులు తీసుకుంటే ఈ ప్రయోజనాలన్నీ కలుగుతాయి.
సోయాపాలు: సోయాలోని మాంస కృత్తులకు కొలెస్ట్రాల్‌ను తగ్గించే శక్తి ఉంది. దీనితో పెరుగు కూడా తయారు చేసుకోవచ్చు. రోజుకు 300 మి. లీటర్ల సోయా పాలు తీసుకుంటే హృద్రోగులకు ఎంతో మేలు కలుగుతుంది.
అప్పు లేనివాడు అధిక సంపన్నుడు
ఇది పెద్దలు అనుభవంతో చెప్పిన మాట. అయితే, ఇప్పుడు అప్పు చేయడం ఒక ఫ్యాషన్‌. ఒక అలవాటు. అప్పు చేయనిదే పొద్దు పోదు కొందరికి. రకరకాల కారణాలు చెప్పి, అవతలి వాళ్లని బురిడీలు కొట్టించి మరీ అప్పు చేసి, జల్సాలు చేయడం ఇంకొందరి నిత్యకృత్యం. కావాలంటే వడ్డీ ఎంతయినా తీసుకోండి కానీ, అప్పు లేదని మాత్రం అనకండి అంటూ ముందే ముందరి కాళ్లకు బంధాలు వేస్తారు. ఒకటి రెండుసార్లు మాట నిలబెట్టుకుని నమ్మకం కలిగిస్తారు, ఆ తర్వాత నట్టేట ముంచుతారు. నిజానికి అప్పు చేయడం తప్పేమీ కాదు. అవసరానికి సరిపడా డబ్బు లేకపోతేనో, సమయానికి సర్దుబాటు కాకపోతేనో చేబదులు తీసుకోవచ్చు.
అయితే, అప్పు చేయడాన్ని అలవాటుగా మార్చుకోవడమే తప్పు. అవసరానికి అప్పు ఇచ్చి ఆదుకున్న వాళ్లకు ముఖం చాటేయడం ఇంకా తప్పు. గట్టిగా అడిగితే ‘మీ డబ్బు తీసుకుని మేమేమీ ఊరొదిలి పారిపోములే’ అంటూ ఈసడింపుగా మాట్లాడటం ఇంకా పెద్ద తప్పు. ఇరుగు పొరుగు దగ్గరో, తెలిసిన వాళ్ల దగ్గరో చేబదుళ్లు తీసుకోవడం నామోషీగా మారిపోయి, క్రెడిట్‌ కార్డులు తీసుకోవడం, కార్డు చేతిలో ఉంది కదా అని దానిని ఎడాపెడా వాడేయటం, ఆ తర్వాత ఆ అప్పులు తీర్చలేక తల వేలాడేయడం... ఇదంతా ఊహించే పెద్దలు ‘అప్పు లేనివాడు అధిక సంపన్నుడు’ అన్నారు. అందుకే, అవసరానికి అప్పు చేయడం తప్పు కాదు. అవసరం లేకున్నా అప్పు చేసి మరీ ‘మా దగ్గర ఆ వస్తువులున్నాయి, ఈ వస్తువులున్నాయి’ అని గప్పాలు కొట్టుకోవడం, విందు వినోదాలతో జల్సా చేయడం మాత్రం ముమ్మాటికీ తప్పే. అందుకే ‘అప్పు చేసి పప్పు కూడు’ తినేకన్నా, ఉన్నదానిని జాగ్రత్తగా ఖర్చు చేసుకుంటూ హుందాగా జీవించడమే ఆనందం.




No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list