MohanPublications Print Books Online store clik Here Devullu.com

భీష్ముడు_Bishmudu



భీష్ముడు

గంగాశంతనుల పుత్రుడు. అష్ట భీష్ముడుసామాన్యమైన జీవితం ఉన్నత స్థితిలో పరిపూర్ణత్వాన్ని పొందడం ఆదర్శం. అటువంటి పరిపూర్ణమైన ఆదర్శం అందనంత ఎత్తుకు ఎదిగితే అత్యద్భుతం. అది తెచ్చిపెట్టుకున్నది కాదు. ఎవరో ఇచ్చింది కాదు. అధికారంతో సాధించిందీ కాదు. పుట్టుకతో అబ్బిన సంస్కార పరిమళం. ఆదర్శమంటేనే అత్యున్నతమైన భావన. హృదయాంతరాల్లోకి చొచ్చుకెళ్ళేంత స్వాతంత్య్రం. ఆదర్శానికే పెద్దదిక్కై ధార్మికతకు నిలువెత్తు నిదర్శనమై పుడమి తరించే వ్యక్తిత్వమై పావనత్వానికే పవిత్రమై మంచికి రూపమై, ఆలోచనలకు ప్రతీకయై, శక్తికి పరాకాష్టమై అపూర్వమైన మేథస్సై, భీషణత్వానికి ఆరంభమై నిలిచిన భీష్మపితామహుడు భారతీయ చరిత్రకే కలికితురాయి.

భీవసువుల్లో ఎనిమిదవ వాడు. భువిలో జన్మించాడు. చిన్నతనంలోనే తన ధనుర్విద్యతో గంగపై సేతువును నిర్మించిన సాహసవీరుడు భీష్ముడు. ఈ లోకంలో భీష్మునికి తెలిసినన్ని క్షత్రియ ధర్మాలు, రాజనీతులు, విధులు, శాస్ర్తాలు, నైతిక సూత్రాలు మరెవ్వరికీ తెలియవంటే అతిశయోక్తి కాదు. నిలువెత్తు మహాధర్మశాస్త్రం భీష్మపితామహుడు. 
శంతనుని యువరాజుగా పెరిగిన దేవవ్రతుడు భీష్ముడుగా మారిన పరిస్థితి గొప్ప దార్శనికతకు నిదర్శనం. జీవితం అనే యుద్ధరంగంలో ధైర్యంగా పోరాడిన సైనికుడే భీష్ముడు. కానీ ఆ పోరాటంలో ఎక్కడా కించిత్తు స్వార్థం లేదు. త్యాగాన్నే తన కవచంగా, జ్ఞానాన్ని ఖడ్గంగా చేసుకున్న ధీరుడు భీష్ముడు.
రాజు శంతనుడు వేట కోసం వెళ్ళి అక్కడ దాశరాజు కూతురు సత్యవతిని చూసి పెళ్ళి చేసుకోవాలనుకొని నేరుగా దాశరాజునే అడుగుతాడు. శంతనుడే నా దగ్గరికి వచ్చి అడిగితే కాదంటానా! కాకపోతే నా పుత్రికకు పుట్టే బిడ్డనే మీరు మీ తర్వాత రాజుగా ప్రకటించాలనే షరతు పెడతాడు దాశరాజు. తన పుత్రుడు దేవవ్రతుడు గుర్తొచ్చి మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు శంతనుడు. కానీ మనసులోంచి సత్యవతిని తీసేయలేక లోలోనే వ్యధ చెందుతుంటాడు. తండ్రి పడుతున్న వేదనను గమనించిన దేవవ్రతుడు విషయం తెలుసుకొని దాశరాజు దగ్గరకెళ్ళి సత్యవతిని తన తండ్రికిచ్చి వివాహం చేయమంటాడు. శంతనునికి చెప్పిన షరతునే తిరిగి వినిపిస్తాడు దాశరాజు. నాకు రాజరికంతో పనిలేదు. నా తండ్రికోసం నా సింహాసనాన్ని త్యజిస్తున్నాను. నీ కుమార్తెకు పుట్టేవాడే రాజవుతాడని ప్రతిజ్ఞ చేస్తాడు దేవవ్రతుడు. అంతటితో ఆగక దాశరాజు దేవవ్రతునితో మీరు సరే మీ సంతానం తర్వాత దీనిని వ్యతిరేకిస్తే అని సందేహం తెలియపరుస్తుండగానే దేవవ్రతుడు దాశరాజా! నీ సందేహం అర్థమైంది. నా సంతానం గురించి నీకేమీ భయం అక్కరలేదు. నేను ఈ క్షణమే బ్రహ్మచర్య దీక్ష తీసుకుంటున్నాను. ఇది నా శపథం అంటాడు దేవవ్రతుడు. ఆ భీషణ శపథమే దేవవ్రతున్ని భీష్ముడిగా మార్చింది.
తండ్రి కోసం రాజ్యం పరిత్యాగం చేసి, బ్రహ్మచర్య వ్రతం తీసుకున్నవారు చరిత్రలో మరొకరు లేరు. కురువంశాన్ని నిలబెట్టేందుకు అహర్నిశలూ శ్రమించిన భీష్ముడు తన భీషణ ప్రతిజ్ఞను వీడకనే చివరి వరకూ బతుకు సాగించాడు.

సత్యవతీ పుత్రులు చిత్రాంగద, విచిత్ర వీర్యులు అనతికాలంలోనే చనిపోగా సింహాసనం అధిష్ఠించకనే రాజ్యపాలన చేశాడు భీష్ముడు. భీష్ముని ఆలనాపాలనలోనే కౌరవులూ, పాండవులూ పెరిగారు. బ్రహ్మచర్య వ్రతాన్ని విడువక, బాధ్యతలను మరువక కురువంశాన్ని నిలబెట్టేందుకు భీష్ముడు చేసిన కృషి అపారం. అది నిస్వార్థభావనకు ప్రతిరూపం.
ధర్మమే గెలుస్తుందనే నమ్మకం. కౌరవుల పక్షాన తొలి సేనా నాయకుడై యుద్ధరంగంలో నిలబడినా, పాండవుల పక్షంలో తన ధర్మనిరతిని నిలిపాడు. అంపశయ్యపై పవళించిన భీష్ముడు ఈ శయ్యే చివరి దశలో తృప్తినిచ్చిందని అంటాడు. తండ్రికోరిక కోసం రాజ్యాన్ని విడిచిపెట్టిన త్యాగమూర్తి, పరశరామున్నే ఓడించగలిగిన మహాయోధుడు భువినొరగడం ప్రపంచాన్నే కదిలించింది.

తాను కోరుకున్నప్పుడు మరణం పొందే వరాన్ని, ఎవరి చేతిలోనూ మరణం పొందని వరాన్నీ కలిగిన భీష్ముడు అర్జునుడు నిర్మించిన అంపశయ్యపైనే ఉత్తరాయణం పుణ్యకాలం వరకూ వేచి చూశాడు. కర్ణుడు భీష్ముని కలుసుకొని తాను చేసిన తప్పులను క్షమించమని అడిగితే మనిషికి ద్వేషమే ప్రథమ శత్రువనీ నువ్వు దానివల్లే పాండవులకు దూరమయ్యావంటాడు భీష్ముడు. ధర్మం గెలిచింది, యుద్ధం ముగిసింది. ధర్మరాజు పట్టాభిషిక్తుడై అంపశయ్యపై ఉన్న భీష్ముని ఆశీస్సుల కోసం వెళ్ళగా ఇక హస్తినాపురానికి ఏ లోటూ రాదని తృప్తిచెంది అంపశయ్యపై నుండే ధర్మజునికి అనేక ధర్మశాస్ర్తాలను బోధిస్తాడు. చిన్నతనంలోనే వేదాది సకలసారాన్నీ చదివిన భీష్ముని జీవితాన్ని చదవగలిగితే అద్భుతమైన జ్ఞానం మన జీవితాన్ని అడుగడుగునా నడిపిస్తుందని చెప్పొచ్చు.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list