MohanPublications Print Books Online store clik Here Devullu.com

నలమహరాజు_Nalamaharaju



నిండైన వ్యక్తిత్వానికి చిరునామా

నలుడు

    మనుషులు మారిపోతారు. మనసులూ మారిపోతాయి. పరిస్థితులూ ఎప్పటికప్పుడు మార్పు అనే రూపాన్ని అక్కున చేర్చుకుంటాయి. మరి లోకంలో మారనిదంటూ ఏమీ లేదా! అనీ, మారకపోతే మనమే ఏమారిపోతాం అనీ అనుకుంటుంటాం. కానీ ఎట్టి పరిస్థితుల్లోనైనా ఎలాంటి కష్టాల్లోనైనా ఎంతటి ఆనందాల్లోనైనా మారనిది, ఎవరూ మార్చలేనిది మనిషి వ్యక్తిత్వం. అది ఒక్కసారి సంపూర్ణత సంతరించుకొని నిండైన రూపానికి నిదర్శనమై నిలిస్తే దానిని మార్చటం అసాధ్యం. అసమాన శక్తి సామర్థ్యాలు దాతృత్వమనే మహాగుణం కలగలిసిన మహోన్నత వ్యక్తి నలుడు. ఈతని వ్యక్తిత్వాన్ని కించపరిచే ప్రయత్నం చేసిన కలిపురుషుడే చివరికి ఓడిపోయి దాసోహమన్నాడు. పాకశాస్త్రం లోనూ నలుని ప్రావీణ్యం తర్వాతే ఏదైనా. అటువంటి నలమహరాజు కథలు వినటానికి అమృతం.. ఆతని గుణగణాలు అద్భుతం.   -ప్రమద్వర

    మంచి చక్రవర్తిగా, వ్యక్తిగా, దాతగా, సకల కళా విశారదుడైన నలుడు జీవితం అందించే ఆటుపోట్లు మన వ్యక్తిత్వాన్ని ఏమాత్రం కించపరచలేవని నిరూపించాడు. నలుడి వ్యక్తిత్వ నిర్మాణం జన్మతః వచ్చిన సంస్కారం వల్లనో, రాజవంశపు రాజసంతోనో ఏర్పడలేదు. స్పష్టమైన అవగాహన, సహృదయత, నమ్మిన సిద్ధాంతం, ప్రేమగుణం, దాతృత్వం, అందమైన రూపం, అంతే అందమైన ఆలోచన నలుని జీవిత చరితను వ్యక్తిత్వ వికాస కోణంలో ఆవిష్కరించాయి. మనిషి తన రూపం ద్వారానో, పదవి ద్వారానో, హోదా వల్లనో ప్రఖ్యాతిగాంచాల్సిన పనిలేదు. వ్యక్తిత్వం నిండుతనం సంతరించుకుంటే ఇవన్నీ వాటంతటవే వస్తాయని నిరూపించిన నలుని జీవితం ప్రతీ మనిషికీ దిక్సూచి.



    నిషధ దేశాన్ని పాలించిన నైషధుడే నలుడు. పుట్టుకతో తేజస్సు పొందిన మహా చరిత్రుడుగా, విశ్వానికే వన్నె తెచ్చిన మంచి వ్యక్తిగా ఎదిగిన నలుని జీవితం ఒక గొప్ప అనుభూతి.కృతయుగంలో అలంకారంగా నిలిచిన ధర్మానికి ప్రతిరూపం నలుడు. ఈ మహారాజు ధర్మబద్ధంగా భూమిని పాలిస్తే, ఒంటికాలిపై తపస్సు చేయాల్సిన గతి పట్టిందట. స్పురద్రూపం గల నలునికి పిసరంత అయినా గర్వం లేదు. లేనివారి దారిద్య్రాన్ని రూపుమాపే మహాదాత నలుడు. వచ్చి ఏదడిగినా లేదూ, కాదని చెప్పడం చేతకాని ఉత్తముడు. దాతృత్వంలో ఉన్నత స్థానం పొందిన నలమహారాజు చిన్నతనంలో న అక్షరాన్ని నేర్చుకోలేదని ఒకవేళ నేర్చుకొని ఉన్నా మర్చిపోయాడనీ చమత్కరిస్తూ అతని గొప్పతనాన్ని చెప్పకనే చెప్పారు అనుభవజ్ఞులు. నలుడు ఆచరించింది అయాయిత వ్రతం. దాని గొప్పతనమేమిటంటే ఇవ్వడమే గాని ఇతరులను అడుగకుడదని, తీసుకోకూడదని నియమం.

     వీరసేన మహారాజు తనయుడు నలుడూ, విదర్భరాజు భీముని కూతురు దమయంతి, వీరిది అందమైన జంట. ప్రపంచంలోని సౌందర్యమంతా ఈ జంటలోనే ఉందంటే ఆశ్చర్యం అక్కర్లేదు. నలదమయంతుల మధ్య ఒక రాయంచ దూతగా ఉండి వారి వివాహానికి శ్రీకారం చుట్టింది. దమయంతి స్వయంవరం ప్రకటించారని తెలిసి హుటాహుటిన బయలుదేరిన నలమహారాజుకు దారి మధ్యలో ఇంద్ర, వరుణ, అగ్ని, కుబేరాది దేవతలు తాము దమయంతీ స్వయంవరానికి వెళుతున్నామనీ, వారి గురించి గొప్పగా చెప్పి ఎలాగైనా దమయంతి తమరిలో ఒకరిని వివాహం చేసుకునేందుకు ఒప్పించమని దౌత్యానికి పంపిస్తారు. దేవతలు దిగివచ్చారనడానికి రెండు కారణాలు. దమయంతి అపురూప సౌందర్యం. నలుడు కాదనడనే నమ్మకం. అనుకున్నట్టుగానే తానూ స్వయంవరానికి వెళుతున్నా దమయంతికి తన గురించి కాకుండా ఇంద్రాది దేవతల గురించి చెప్పిన మాట నిలబెట్టుకునే నలుని తత్తం మహోన్నతమైంది. చిట్టచివరికి నలుడే దేవతల మహత్తును వివరించినా పట్టించుకోక నలున్నే భర్తగా వరించింది దమయంతి. నలదమయంతుల మధ్యనున్న పరస్పర భావన అంత గొప్పది. నలునికి తన వ్యక్తిత్వమే ఆభరణమై ఒప్పారిందనేందుకు ప్రతీక ఈ ఘటన.
ఎంత అందమైన కావ్యమైనా నవరసాలూ అందులో భాగమైనట్టే నలదమయంతుల అందమైన జీవితంలో కూడా ఆపదలు వచ్చాయి. కష్టాలపాలు వచ్చినపుడే సుఖాల విలువ తెలిసివస్తుంది.

    నలుని జీవితంలో ఎదురైన చేదు అనుభవాల వెనుక కూడా సడలని వ్యక్తిత్వం, మంచితనం, దాతృత్వం మరింత నిగ్గుతేలాయి.కలి ప్రభావంతో నలుని జీవితంలో చీకటికోణం మొదలైంది. జూదంలో రాజ్యాన్నీ, సంపదలనూ పోగొట్టుకొని దమయంతితో కలిసి అడవులకు వెళ్ళాడు నలుడు. అక్కడ ఎంతటి దుర్భర పరిస్థితంటే తినడానికి తిండిలేక, కట్టుకోవడానికి బట్టలు లేక అవస్థపడిన రోజులవి. తాననుభవించే కష్టాలకు దమయంతి బలికాకూడదని ఆమెను ఒంటరిగా వదిలి వెళ్ళిపోతాడు నలుడు. దమయంతి సురక్షితంగా తన పుట్టింటికే చేరుతుందనే నమ్మకం అతన్ని ఆ నిర్ణయం తీసుకునేలా చేసింది. అడవిలో తిరుగుతున్న నలున్ని విషసర్పం కాటు వేసింది. దాంతో విరూపిగా మారాడు నలుడు. అలా మారిన నలుడు ఏ మాత్రం కుంగిపోక బాహుకుడనే పేరుతో ఋతువర్ణుడనే రాజు దగ్గర గుర్రాలకు శిక్షకుడిగా, వంటవానిగా పనిచేస్తాడు. అలా అతనిలోని పాకశాస్త్ర నైపుణ్యం ప్రపంచానికి పరిచయమైంది. నలుని పట్టుదల, మంచితనం ముందు నా ప్రభావం ఏమాత్రం పనికిరాదని నలుని జీవితంలో నుంచి తనకు తానుగా ఓడిపోయానని పక్కకు జరుగుతాడు కలి.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list