MohanPublications Print Books Online store clik Here Devullu.com

బృందావనమది అందరిది-Brundavanamdhi



‘బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే!’ అన్న మాట అక్కడ పొద్దంతా చెల్లుబాటు అవుతుంది. సూర్యాస్తమయం అయితే మాత్రం ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బృందావనంలోని ‘నిధివనం’ మాత్రం రాధాకృష్ణులకు మాత్రమే సొంతం. హృదయాన్ని రంజింపజేసే రాధామాధవుల గాథలు చూస్తామంటే కుదరదు. సాహసించి చూశారా..! అంతే సంగతులు!!

బాలకృష్ణుడి లీలలకు రేపల్లె మురిసిపోతే.. ఆ గోపీలోలుడి రాసలీలలకు బృందావనం వికసించింది. యమునా తటిపై నల్లనయ్యకై ఎదురు చూసే రాధ, మోహన మురళీ గానం వినడానికి తహతహలాడుతూ వచ్చిన గోపికలు, అలా వచ్చిన వారితో నందకిశోరుని సరసాలు, అంతలోనే వీరెవరికీ చిక్కకుండా రాధకు దొరకడం, ఆమెతో దోబూచులాడటం.. ఇవన్నీ చూడగలిగే అదృష్టం సిద్ధియోగులకు తప్ప ఇతరులకు సాధ్యం కాదు. ఎప్పుడో ద్వాపరయుగంలో కన్నయ్య చూపించిన లీలలు ఊహించినంత మాత్రాన... మనసు బృందావనంలో విహరిస్తుంది. అయితే, ఈ లీలలు ఇప్పటికీ ప్రకటితం అవుతున్నాయంటే నమ్ముతారా! కానీ, నమ్మాల్సిందే. ఇది నమ్మాలంటే బృందావనంలోని నిధివనం చూడాల్సిందే.

నేటికీ అదే పరవశం!
ఏమిటీ నిధి వనం? వేణు గానంతో శిశువులు, పశువులు తన్మయం పొందిన వనం ఇది. అంతేకాదు.. గోపికలు శ్రీకృష్ణుడితో అచ్చికలాడిక పచ్చిక మైదానమిది. కృష్ణుణ్ణి చూస్తూ లోకాన్ని మరచిపోయి రాధమ్మ పరవశించిన ప్రేమలోకం ఇది. ఇప్పటికీ అక్కడి పశుపక్ష్యాదులు తన్మయం చెందుతున్నాయి. ఎందుకంటే... నేటికీ మురారితో గోపికల అచ్చికలు వినిపిస్తున్నాయి. రాధామాధవుల రాసలీలు కొనసాగుతున్నాయి. కాకపోతే, ఈ మనోహరమైన దృశ్యాన్ని చూడడానికి ఎవరికీ అనుమతి లేదు. అందుకే సూర్యాస్తమయం తర్వాత నిధివనంలోకి ప్రవేశం నిషిద్ధం. ఈ సమయంలో నిధివనం దరిదాపుల్లోకి కూడా ఎవరూ వెళ్లడానికి సాహసించరు.

రాసలీల రేయిలో..
నిధివనం పచ్చదనంతో నిండి ఉంటుంది. ఎక్కడైనా వృక్షాలు నిటారుగా పెరుగుతాయి. కొమ్మలు పైకి విస్తరిస్తాయి. నిధివనంలో మాత్రం మానులు విచిత్రంగా ఉంటాయి. వయ్యారి భామలు వగలు పోతున్నట్టు, ఎవరినో పెనవేసుకున్నట్టు వింత ఆకారాల్లో కనిపిస్తాయి. మురళీ రవానికి ఆడిన నాగినుల్లా అష్టవంకర్లు తిరిగి కింది వైపు పెరుగుతుంటాయి ఇక్కడి చెట్ల కొమ్మలు. రాత్రయ్యాక ఈ చెట్ల కొమ్మలే... కొంటె కొమ్మలు (యువతులు)గా రూపుమార్చుకుంటాయని అంటారు. రాత్రంతా వేణుగానం వింటూ, కోలాటాలు ఆడుతూ, రంగులు చల్లుకుంటారట, గాన లహరులు చేస్తూ.. అలసిపోతారట. సూర్యోదయం సమయానికి మళ్లీ చెట్టు కొమ్మలుగా మారిపోతారట. ఒక్కోసారి ఎవరో చల్లినట్టు కొన్ని కొమ్మలపై రంగులు కూడా కనిపిస్తుంటాయి. అంతేనా.. ఈ కొమ్మలపై కొనగోటి ఆనవాళ్లు కూడా దర్శనమిస్తుంటాయి. ఇవన్నీ చెబుతుంటే అచ్చెరువొందాల్సిందే.

చూశామా! వచ్చామా!!
రాత్రంతా ఇంత తతంగం నడుస్తుంటుందనే.. నిధివనంలోకి ఎవరినీ అనుమతించరు. ఇవేవీ పట్టించుకోకుండా వనంలోకి వెళ్లినవారు ఏం చూస్తారో గానీ.. ఆ తర్వాత వారేం చూశారో.. మరొకరికి చెప్పలేరు. ఎందుకంటే వారి మాట పడిపోతుందట. నిధివనంలోని ముచ్చట్లు రహస్యంగా విన్నామా! చెవులు పని చేయడం ఆగిపోతుందట. అక్కడి రాసలీలలు చూశామా! కళ్లల్లో అంధకారం ఆవరిస్తుందట. అంతేకాదు... రాత్రి వేళలో నిధివనంలో ప్రవేశించిన వారు తెల్లారేసరికల్లా మతిస్థిమితం కోల్పోయి పిచ్చివాళ్లలా తయారవుతారట. అందుకే రాత్రయిదంటే వనంలోకి వెళ్లడానికి ఎవరూ ప్రయత్నించరు. నిధివనంలోకి రాధాకృష్ణులు, గోపికలు రావడం ఏమిటని? ప్రశ్నించేవాళ్లూ లేకపోలేదు. ఇలా ప్రశ్నించే వాళ్లెవ్వరూ రాత్రి సమయంలో వనంలోకి వెళ్లడానికి సాహసించలేదు.

అప్పట్లో కొన్ని మీడియా సంస్థలు నిధివనం రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నించి విఫలం అయ్యాయి. అయితే, అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని గౌరవించాలని కొందరు పెద్దలు చెబుతారు. రాధాకృష్ణులు అక్కడికి వస్తున్నారా..? లేదా..? అన్న విషయం పక్కన పెడితే.. శతాబ్దాలుగా వస్తున్న ఆచారాన్ని కాదనడం దుస్సాహసం అవుతుందని అంటున్నారు. ఉదయం పూట వెళ్లామా.. చూశామా.. వచ్చామా.. అన్నట్టు ఉండాలని హితవు పలుకుతున్నారు. ఎవరి మాట ఎలా ఉన్నా.. నిధివనం మాత్రం పచ్చదనంతో పాటు ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ప్రదేశంగా మనోల్లాసాన్ని కలిగిస్తుంది.


అంతా కృష్ణ మాయ!
నిధివనంలో ‘రంగ్‌ మహల్‌’ అనే చిన్న మందిరం ఉంది. ఇది మరింత ప్రత్యేకమైనది. గోపికలతో ఆటపాటలు పూర్తయ్యాక రాధాకృష్ణులు ఇద్దరూ వచ్చి రాత్రంతా ఈ భవంతిలోనే సేదతీరుతారని ప్రజల నమ్మకం. సాయం సంధ్యా సమయంలో ఈ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడ పట్టుపాన్పు ఏర్పాటు చేస్తారు. రాధమ్మ కోసం వస్త్రాలు, కిట్టయ్య కోసం మిఠాయి, తాంబూలం, మంచినీళ్లు అన్నీ ఉంచుతారు. వేణువు, కోలలు కూడా అక్కడ పెడతారు. హారతి తర్వాత మందిరానికి తాళాలు వేసి అందరూ వచ్చేస్తారు. తెల్లవారి వెళ్లి చూస్తే పక్క నలిగి ఉంటుంది. మిఠాయి కనిపించదు! తాంబూలం ఉండదు! మందిరంలో ఏ వస్తువూ పెట్టిన చోట పెట్టినట్టు ఉండదు. అంతా కృష్ణమాయ!

లలితా కుండం
రాసలీల వేళ అలసిపోయిన లలితా అనే గోపిక దాహం తీర్చడానికి కృష్ణయ్య ఓ కుండాన్ని సృష్టించాడట. ఇప్పటికీ ఆ కుండం నిధివనంలో ఉంది. దానిని లలితా కుండంగా పిలుస్తుంటారు.



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list