MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఆషాఢ వియోగం.. అంతరార్థం!_AsadamViyogam



       ఆషాఢ మాసం శుభకార్యాలకు మంచిది కాదని మన పెద్దల భావన. వారు విధించిన ఆచారాల్లో ఎంతో పరమార్థం దాగివుంటుంది. అందువల్ల హిందువులు అషాఢంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లిబాజాలు మోగించరు. అంతేకాదు, గర్భధారణకూ ఈ మాసం నిషిద్ధమే. పెళ్లయిన తర్వాత వచ్చే తొలి ఆషాఢంలో నూతన దంపతులను శారీరకంగా కలవనివ్వకుండా ఉంచేందుకు అత్తగారూ- కొత్తకోడలు ఒకే ఇంట్లో ఉండకూడదనే ఆచారాన్ని తెచ్చారు. దాంతోపాటు అల్లుడూ అత్తగారు ఒకగడప దాటరాదని ఆంక్షలు పెట్టారు. కనుక అమ్మాయిని పుట్టింటివారు తీసుకెళతారు. ఫలితంగా ఆమెను ఒకవైపు భర్తను విడిచివెళుతున్నాననే దిగులు, మరోవైపు పుట్టింట్లో గడుపబోతున్నాననే సంతోషం ముప్పిరిగొంటాయి. ఇటు అబ్బాయికి విరహ వేదన!

     కాళిదాసు కావ్యం ‘మేఘసందేశం’లో కుబేరుని కొలువులో ఉన్న యక్షుడు శాపానికి గురై ఓ అడవిలో మహిమలు పోగొట్టుకుని తిరుగుతుంటాడు. అతను విరహంతో ఉన్న ప్రేయసికి తన సందేశాన్ని అందించమని ఒక ఆషాఢ మేఘాన్ని కోరుతాడు. దీన్నిబట్టి ఆషాఢం వియోగానికి చిరునామాగా ఎప్పట్నుంచో ఉందనేది తెలుస్తోంది. మరోకవి ఈ మాసాన్ని ‘నవదంపతుల సరస శృంగారాల, సురభిళ సింగారాల, ప్రవిమల ప్రణయాల, వియోగాల విరహాల ఆరూఢమాసం’ అంటూ వర్ణించారు. వేటూరిగారైతే ‘ఆకాశ దేశానా/ఆషాఢ మాసానా/ మెరిసేటి ఓ మేఘమా/ విరహమో/దాహమో/ విడలేని మోహమో/ విన్నవించు నా చెలికి మేఘ సందేశం!!’అంటూ ఆషాఢమేఘాన్నే రాయబారిగా ఎంచుకున్నారు.

ఆషాఢంలో పెళ్లిళ్లు చేయకపోవడానికి,
భార్యాభర్తలకు ఎడబాటును కలిగించడానికి కారణాలేమిటో చూద్దాం..

* ఆషాఢంలోనే సూర్యుడు కర్కాటకంలోకి ప్రవేశించడంతో దక్షిణాయనం ఆరంభమవుతుంది. ఈ కాలం దేవతలకు రాత్రి సమయం. ఈ మాసంలో విష్ణుతేజం ఉండకపోవడంతో పెళ్లి చేసుకుంటే దేవుని ఆశీస్సులు లభించవనేది ఓ నమ్మకం.

* మనది ప్రధానంగా వ్యావసాయిక దేశం. ఆర్థికపరంగా చూస్తే ఈ మాసంలో ఏ పంటా చేతికందదు. పెళ్లికి అవసరమయ్యే డబ్బు సమకూర్చలేరు.

* ఆషాఢంలో వర్షాలెక్కువ. శుభకార్యాలకు ప్రకృతి పరమైన ఆటంకాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. పైగా పొలం పనులన్నీ ఈ మాసంలోనే మొదలవుతాయి.

* పెళ్లైన కొత్తలో భార్యాభర్తల మధ్య విపరీతమైన ప్రేమాకర్షణలు ఉంటాయి. ఒక నెల దూరంగా ఉండటంవల్ల వారికి ఎడబాటు అనుభవమవుతుంది. తాత్కాలిక వియోగంవల్ల పరస్పరం ప్రేమ పెరుగుతుంది. వారి బంధం మరింత బలోపేతమవుతుంది.

* వర్షాకాలం కావడంవల్ల కొత్త పెళ్లికొడుకులు పొలం పనులను అశ్రద్ధ చేసి ఇంటిపట్టునే ఉండిపోతారేమోనన్న భయం కూడా నవదంపతులను కొద్దిరోజులు దూరంపెట్టేందుకు ఒక కారణం.

* ఆషాఢంలో ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల అనారోగ్యాలు తప్పవు. విపరీతమైన ఈదురుగాలులతో చినుకులు పడడం, వాతావరణ మార్పులు, కొత్తనీరు చేరడం వల్ల చలిజ్వరాలు, తలనొప్పి, దగ్గులాంటివి బాధిస్తుంటాయి. స్త్రీలు గర్భం దాల్చడానికిది సరైన సమయం కాదు. అలాగే సమష్టిగా చేసే శుభకార్యాలకు నలుగురి తోడ్పాటూ లభించదు.

* కొత్తగా పెళ్లయిన అమ్మాయి ఈ మాసంలో గర్భం దాలిస్తే పుట్టబోయే బిడ్డ చైత్ర వైశాఖాల్లో భూమ్మీదకు వస్తుంది. అప్పుడు ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల శిశువుకూ బాలింతకు కూడా ఇబ్బందే.

* ఆషాఢం తర్వాత వచ్చే శ్రావణంలో వ్రతాలు, నోములు జరుగుతాయి. ఈ మాసంలో దాదాపుగా అన్నీ మంచిరోజులే ఉంటాయి. ఆ శుభ ఘడియల్లో గర్భధారణ జరిగితే మంచిదని పెద్దల నమ్మకం.

* అప్పట్లో సరైన వైద్యసౌకర్యాలు లేని కాలం కావటంతో ఎండకాలంలో సహజ, సుఖ ప్రసవం కష్టమనీ, ప్రసవానంతరం రక్తస్రావం ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంటుందనీ సంప్రదాయం పేరిట నవదంపతుల్ని ఆషాఢంలో కలువకుండా పెద్దలు కట్టడి చేశారు.

* ఆషాఢంలో పుట్టింటికి చేరిన అమ్మాయి తన చేతులకు పండించుకునే గోరింట, ఆమెకు తన సౌభాగ్యాన్ని గుర్తు చేస్తుంది. ఇది చర్మానికి ఎంతో మంచిది. గోళ్లు చిట్లకుండా, గోరుచుట్టు రాకుండానూ కాపాడుతుంది. దీనికి ఒంట్లోని వేడిమిని తగ్గించే గుణం వుంది.

అంచేత నవదంపతులూ ‘విరహము కూడా సుఖమే కాదా.. నిరతము చింతన మధురము కాదా..’ అని పాడుకుంటూ ఈ మాసాన్ని హాయిగా గడిపేస్తారు కదూ!                - కె. రఘు

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list