MohanPublications Print Books Online store clik Here Devullu.com

టీ, మిథైల్‌గ్జాంథైన్స్‌, Tea, Mithailgjanthains,


మీ&టీ
ఈ కప్పులో జాగ్రఫీ, హిస్టరీ, ఫ్యూచర్‌ అన్నీ ఉన్నాయి. భౌగోళికంగా ఎక్కడెక్కడ టీ సాగవుతుందో తెలుస్తుంది. ఇక బోస్టన్‌ టీ పార్టీల్లాంటి ఎన్ని హిస్టరీలో...! టీ తాగితే హెల్త్‌ ఉంటుంది... హెల్త్‌ ఉంటే ఫ్యూచర్‌ ఉంటుంది. తప్పకుండా తాగండి... కప్పునిండా తాగండి.
రకాలేమిటీ?
మీకు తెలుసా? లోకంలో మంచినీళ్ల తర్వాత ఎక్కువగా తాగే పానీయం టీ మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3,000 రకాల టీలు అందుబాటులో ఉన్నాయి. జింజర్, లెమన్, చాక్లెట్‌ అంటూ టీల రకాలు ఎన్ని చెప్పినా అవి ఫ్లేవర్స్‌ మాత్రమే. ఆ ఫ్లేవర్స్‌ను వదిలేస్తే... టీలలో ఉండే సాధారణ రకాలలో... వైట్‌ టీ, బ్లాక్‌ టీ, గ్రీన్‌ టీ, ప్యూ–ఎర్‌ టీ, ఊలాంగ్‌ టీ... వంటివి కొన్ని ప్రధానమైనవి.
సాధారణ టీ : మనం రోజూ తాగే చాయ్‌ ఇది. కాసిన్ని పాలు, పంచదార, టీ పొడిని మరిగిస్తే వచ్చే మిశ్రమం ఇది. వంద గ్రాముల టీలో 17 క్యాలరీల శక్తి ఉంటుంది. ఇందులో ప్రత్యేకంగా మిథైల్‌గ్జాంథైన్స్‌ తరహా రసాయనాలు ఉంటాయి. టీలో ఉండే ప్రధాన రసాయనం థియోఫిలిన్, కెఫిన్‌. అయితే కాఫీలో కెఫిన్‌ ఎక్కువ. కెఫీన్‌ పానీయం తాగితే... అది తొలుత చాలా ఎక్కువగా ఉత్తేజపరచి, ఆ తర్వాత నిస్తేజమయ్యేలా చేయవచ్చు. కానీ సాధారణ టీలో కాఫీ కంటే కెఫిన్‌ పాళ్లు చాలా తక్కువ. అందుకే టీని కాఫీకంటే ఎక్కువ సార్లు తీసుకోవచ్చు.
వైట్‌ టీ : ఇది పాలు ఎక్కువ కావడం వల్ల వచ్చే తేలిక పాటి రంగు కాదు. చాలా లేతగా ఉండే టీ–ఆకులతో తయారైన టీ–పౌడర్‌తో కాచే టీ వల్ల ఈ రంగు వస్తుంది. ఇది రొటీన్‌గా ఉండే రుచితో కాకుండా కాస్తంత పచ్చిగా ఉన్నట్లుంటుంది.
మినరల్స్‌ ఏమిటీ? టీలో దాదాపు 28 రకాల ఖనిజలవణాల (మినరల్స్‌) మూలకాలు ఉన్నాయి. అందులో ఫ్లోరిన్, మ్యాంగనీస్, ఆర్సెనిక్, నికెల్, సెలీనియమ్, అయోడిన్, అల్యూమినియమ్, పొటాషియమ్‌ కాస్త ఎక్కువ పాళ్లలో ఉంటాయి. టీలో ఉండే ఫ్లోరిన్‌ మన దంతాలను కాపాడుతుంది.
చాక్లెట్‌ టీ : ఇది కాస్త చాక్లెట్‌ రంగు మిళితమైనట్లు కనిపించడంతో పాటు చాక్లెట్‌ ఫ్లేవర్‌నూ కలిగి ఉంటుంది. డార్క్‌ చాక్లెట్స్‌ వల్ల మన నరాలు ఉత్తేజితం కావడంతోపాటు ఇందులోని పాలీఫినాల్స్‌ ఆరోగ్యానికీ మేలు చేస్తాయి..
గ్రీన్‌–టీ : ఇటీవల ఆరోగ్యం కోసం చాలామంది గ్రీన్‌–టీ తాగుతున్నారు. గ్రీన్‌ టీని తొలుత చైనీయులు కొన్ని ప్రత్యేకమైన మూలికలతో చేయడం ప్రారంభించారు. దీనిలో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్నాయి.
బ్లాక్‌ టీ : సాధారణంగా పాలు కలపకుండా కేవలం డికాక్షన్‌ మాత్రమే తీసుకుంటే దాన్ని బ్లాక్‌ టీగా పరిగణిస్తారు. ఇది నలుపు రంగులో కాకుండా డికాక్షన్‌కు ఉండే సహజమైన మెరుపుతో ఉంటే మేలు చేస్తుంది. పశ్చిమాసియా, యూరప్‌ దేశాల వాళ్లు ఈ చాయ్‌ ఎక్కువగా తాగుతుంటారు.
ఊలాంగ్‌ టీ : ఇది చాలా తక్కువ ప్రాసెస్‌ చేసిన గ్రీన్, బ్లాక్‌ టీల సమ్మేళనం. దీన్ని ఎక్కువగా చైనా, తైవాన్‌ దేశాలలో తాగుతుంటారు. ఊలాంగ్‌ టీలలో జాస్మిన్, కొబ్బరి, క్యారమెల్‌ వంటి ఇతర రకాలు కూడా ఇటీవల అందుబాటులోకి వస్తున్నాయి. ఊలాంగ్‌ టీలో మిగతా రకాల టీలలోని యాంటీఆక్సిడెంట్స్‌తోపాటు ప్రధానమైన విటమిన్లయిన విటమిన్‌ ఏ, బి కాంప్లెక్స్, విటమిన్‌ – సి, ఈ, కె లతో పాటు ఫోలిక్‌ యాసిడ్‌ పుష్కలంగా ఉంటాయి. అలాగే ఖనిజలవణాలైన క్యాల్షియమ్, మ్యాంగనీస్, కాపర్, సెలీనియమ్, పొటాషియమ్‌ ఎక్కువ.
చాయ్‌కు ఆ రంగు, రుచి, వాసలేమిటీ?
టీకి అమైనో యాసిడ్‌ ప్రత్యేకమైన రుచినిస్తుంది. టీలో థియనైన్‌ అనే ప్రత్యేకమైన అమైనో యాసిడ్‌ ఉంటుంది. ఈ థియనైన్‌లోనూ ప్రత్యేకంగా ఎల్‌–థియనైన్‌ మన మెదడులోని అల్ఫా తరంగాలను ఉద్భవించేలా చేస్తాయి. మనం రిలాక్సేషన్‌ ఫీల్‌ కావడానికి కారణం... ఈ అల్ఫా తరంగాలే. ∙ టీ ఆకుల్లో చాలారకాల ఎంజైములు ఉన్నా పాలీఫీనాల్‌ ఆక్సిడేజ్, పాలీఫీనాల్‌ పెరాక్సిడేజ్‌ అనేవి ప్రధానం. ఈ ఎంజైముల సహాయంతో పాలీఫీనాల్స్‌ ఆక్సీకరణం చెందాక టీకి ప్రత్యేకమైన బ్రౌన్‌ రంగు వస్తుంది. ఇక టీ ఆకు ఎండటం మొదలుపెట్టగానే వాటిలోని క్లోరోఫిల్‌ కాస్తా... నలుపు రంగు పిగ్మెంట్‌ అయిన ఫియోఫైటిన్‌గా మారిపోతుంది. డికాక్షన్‌ నల్లగా ఉండటానికి కారణం ఈ ఫియోఫైటిన్‌ అనే పిగ్మెంటే. ∙ఇక వాసన విషయానికి వస్తే... టీకి ప్రత్యేకమైన వాసనను, ఫ్లేవర్స్‌ను ఇచ్చే రసాయనాలను వోలటైల్స్‌ అనవచ్చు. ఇవి చాలా సంక్లిష్టమైన రసాయన నిర్మాణాలు. టీలో ఇలాంటి వోలటైల్స్‌ వందలు, వేలలో ఉంటాయని అంచనా. ఉదాహరణకు లినలూల్, లినలూల్‌ ఆక్సైడ్‌ అనేవి టీలో కాస్తంత తీపిని ఇస్తాయి. జెరనాయిల్, ఫినైల్‌ అసిటాల్డిహైడ్‌ వంటివి పువ్వులాంటి వాసననిస్తాయి. నెరొలిడాల్, బెంజాల్డిహైడ్, మిథైల్‌ శాల్సిలేట్, ఫినైల్‌ ఇథనాల్‌ వంటివి పండ్ల ఫ్లేవర్‌ ఇస్తాయి.
వేర్వేరు టీలలో కెíఫీన్‌ పాళ్లేమిటీ?
సాధారణ టీలో 15 – 60 ఎంజీ కెఫీన్‌ ఉంటుంది. ∙బ్లాక్‌ టీలో 25 – 60 ఎంజీ కెఫీన్‌ ఉంటుంది. ∙గ్రీన్‌ టీలో 20 – 30 ఎంజీ కెíఫీన్‌ ఉంటుంది. ∙కాఫీలో మాత్రం 60 – 150 ఎంజీ కెఫీన్‌ ఉంటుంది. అందుకే కాఫీ కంటే టీ తాగడం శ్రేయస్కరం.
టీ కెమిస్ట్రీ ?
దీని అధ్యయనం చాలా కష్టం. ఒక్క పాలీఫీనాల్స్‌లోనే దాదాపు 30,000 రకాల పాలీఫీనాల్‌ కాంపౌండ్స్‌ ఉంటాయి ∙ఇక ఫ్లేవనాయిడ్స్‌ రసాయనాల్లో ఫ్లేవనాల్స్‌ ఎక్కువ. వీటిలోనూ క్యాటేచిన్‌ (సి), ఎపీక్యా టెచిన్‌ (ఈసీ), ఎపీక్యాటేచిన్‌ గ్యాలేట్‌ (ఈసీజీ), గ్యాలోక్యాటేచిన్‌ (జీసీ), ఎపీ గ్యాలోక్యాటేచిన్‌ (ఈజీసీ), ఎపీగ్యాలో క్యాటేచిన్‌ గ్యాలేట్‌ (ఈజీసీజీ) ఉంటాయి.
నిరూపితమైన అధ్యయనాలేమిటీ?
వైట్‌ టీలోని క్యాటెచిన్స్‌ బరువును తగ్గిస్తాయని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ అధ్యయనాల్లో తేలింది. ఇక లండన్‌లోని కింగ్‌స్టన్‌ యూనివర్సిటీ పరిశోధనల్లో వైట్‌–టీ మొటిమలను నివారిస్తుందని నిరూపితమైంది. యూనివర్సిటీ ఆఫ్‌ మేరీల్యాండ్‌ మెడికల్‌ సెంటర్‌ పరిశోధనల్లో తేలిన అంశం ఏమిటంటే... వైట్‌ టీ చుండ్రు, ఎగ్జిమాలను అరికడుతుంది. కొరియాలోని కొనుకుక్‌ యూనివర్సిటీ వైట్‌ టీ మాడుపైన వచ్చే సెబోరిక్‌ డర్మటైటిస్‌ను నివారిస్తుందని చెప్పింది. అలాగే ఇందులోని ఈజీసీజీ పోషకం చర్మానికి, కేశాలకు నిగారింపునిస్తుంది. బ్లాక్‌ టీ రక్తప్రవాహాన్ని మెరుగు పరిచి గుండెజబ్బు లు, పక్షవాతాన్ని అరికడు తుందని బోస్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ చెప్పింది.
న్యూ ఓర్లియాన్‌లోని అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ నిర్వహించిన అధ్యయనం ప్రకారం బ్లాక్‌ టీ చెడు కొలెస్ట్రాల్‌ పాళ్లను తగ్గిస్తుందని తేలింది. రొమ్ముక్యాన్సర్‌ను కూడా నివారిస్తుంది. ఒక స్విస్‌ అధ్యయనం ప్రకారం గ్రీన్‌టీ వల్ల షార్ట్‌ టర్మ్‌ మెమరీ పెరుగుతుంది. కాబట్టి వర్క్‌ప్లేస్‌లో మంచి జ్ఞాపకశక్తి కోసం ఇది తాగుతూ ఉండటం మేలు అన్నది ఆ అధ్యయనం ఇస్తున్న సూచన. అలాగే అలై్జమర్స్, పార్కిన్‌సన్‌ వ్యాధుల ముప్పును తొలగిస్తుంది. 2009లో జర్నల్‌ ఆఫ్‌ పెరియోడాంటాలజీ ప్రకారం గ్రీన్‌ టీ పళ్లు, చిగుర్ల వ్యాధులను నివారించి, నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.2001లో ప్రచురితమైన ఎక్స్‌పెరిమెంటల్‌ ఐ రీసెర్చ్‌ జర్నల్‌లోని వివరాల ప్రకారం ఇందులోని క్యాటెచిన్స్‌ కంటి చూపును మెరుగుపరుస్తాయి. క్యాటరాక్ట్‌ను నివారిస్తాయి.
గ్రీన్‌ టీ, చాక్లెట్‌ టీ... ఈ రెండింటిలోనూ ఆరోగ్యానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్స్‌ ఉంటాయి. కోకోలో యాంటీఆక్సిడెంట్స్‌ ఎక్కువ. దాంతో గ్రీన్‌ టీ కంటే చాక్లెట్‌టీలో పాలీఫీనాల్స్‌ మూడు రెట్లు, ఫ్లేవనాయిడ్స్‌ను 12 రెట్లు ఎక్కువ అనీ. దానివల్ల గుండెజబ్బులను సమర్థంగా నివారిస్తుందని ‘ద బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌’ 2009 ప్రచురణలో పేర్కొంది.
చరిత్ర ఏమిటీ?
సాధారణంగా సామాన్యులు కనిపెట్టిన వాటిని మాన్యులు సొంతం చేసుకుంటారు. నాణ్యమైనవి వాళ్లే వాడుకుంటారు. కానీ టీ అలా కాదు. దాదాపు 5,000 ఏళ్ల క్రితం చైనా చక్రవర్తుల్లో ఒకరైన షెన్‌ నంగ్‌ తన రాజ్యంలో పర్యటిస్తుండగా బాగా దాహంగా ఉండి వేన్నీళ్లు తాగాడట. అందులో ఏవో కొన్ని ఆకులు పడటంతో వాటిని చూసుకోకుండా అలాగే తాగేశాట్ట. తీరా చూస్తే అవే టీ ఆకులు. అలా చక్రవర్తులు టీని కనిపెడితే... ఇవాళ సామాన్యులు దాన్ని విరివిగా తాగుతున్నారు.
ఏయే దేశాల్లో పండుతుందేమిటీ?
యునైటెడ్‌ నేషన్స్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ లెక్కల ప్రకారం టీని పండించే ప్రపంచంలోని టాప్‌ టెన్‌ దేశాలు...
1. చైనా, 2. భారత్, 3. కెన్యా, 4. శ్రీలంక, 5. టర్కీ, 6. ఇండోనేసియా, 7. వియత్నాం, 8. జపాన్‌ 9. ఇరాన్, 10. అర్జెంటీనా
జబ్బుల్ని ఎలా తగ్గిస్తుందేమిటీ?
గ్రీన్‌ టీలో ఉండే ఫైటోకెమికల్స్‌ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ క్యాన్సర్‌ నివారణకు దోహదం చేస్తాయి. గ్రీన్‌ టీ గుండెజబ్బుల నివారణకు తోడ్పడు తుంది. కొలెస్ట్రాల్‌ పాళ్లను తగ్గిస్తాయి. ఎపిగెల్లో కాటెచిన్‌–3 (ఈజీసీజీ) అనే యాంటీ ఆక్సిడెంట్‌ వల్ల అనేక వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. వైట్‌ టీ బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
బ్లాక్‌ టీలోని ట్యానిన్స్‌ డయేరియాను అరికడతాయి. ఆస్తమా ఉన్నవాళ్లకు బ్లాక్‌ టీ మంచి రిలీఫ్‌. ఊపిరితిత్తుల్లోని గాలిగొట్టాలను వెడల్పు చేయడం ద్వారా శ్వాస తేలిగ్గా తీసుకునేలా చేస్తుంది. చాక్లెట్స్‌ టీలోని కోకోల గుణం కారణంగా... మామూలు వారితో పోలిస్తే చాక్లెట్‌ టీ తాగేవారిలో పక్షవాతం ముప్పు 29 శాతం, గుండెజబ్బుల ముప్పు 37 శాతం తగ్గుతుందని తేలింది. ఊలాంగ్‌ టీలోని పోషకాలు ఫ్రీరాడికిల్స్‌ను తొలగిస్తాయి. ఇక అథెరోస్క్లిరోసిస్, ఆర్థరైటిస్‌ ముప్పును కూడా ఉలాంగ్‌ టీ తొలగిస్తుంది.
అనర్థాలేమిటీ?
టీని ఎక్కువగా తీసుకుంటే అది సాధారణ జీర్ణ ప్రక్రియకు అంతరాయం కలిగిస్తుంది, పోషకాలను ఒంటికి పట్టనివ్వదు. కాబట్టి టీని రోజుకు నాలుగు కప్పులకు మించనివ్వవద్దు. తప్పనిసరైతే ఐదో కప్పు, అదే ఇక రోజుకు చివరి కప్పు. బ్లాక్‌ టీని అలవాటు లేనివారు మితిమీరి తాగితే నిద్రలేమి, గుండెదడ, రక్తంవేగంగా ప్రవహించడం వంటి దుష్పరిణామలు సంభవించవచ్చు. మర్నాడు తలనొప్పి కూడా రావచ్చు. అందుకే బ్లాక్‌ టీని కూడా పరిమితంగానే తాగాలి. చాక్లెట్‌ టీని షుగర్‌ వ్యాధిగ్రస్తులు అదేపనిగా తాగడం అంత మంచిది కాదు. చాక్లెట్‌ టీ వల్ల నరాలు మరీ ఎక్కువగా ఉత్తేజితం చెందితే నిద్రలేమి రావచ్చు.
రోజుకు నాలుగు కప్పుల కంటే ఎక్కువ టీలు తాగే మహిళల్లో రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ వచ్చే ముప్పు ఎక్కువ. గ్రీన్‌ టీలో రక్తాన్ని గడ్డకట్టించేందుకు ఉపయోగపడే విటమిన్‌ కె ఉంటుంది. కౌమాడిన్‌ / వార్‌ఫేరిన్‌ వంటి రక్తన్ని పలుచబార్చే మందులు వాడేవారు గ్రీన్‌ టీ తాగే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
లైఫ్‌స్టైల్‌ అండ్‌ సోషల్‌ జాగ్రత్తలేమిటీ...
రోజూ ఉదయాన్నే పరగడుపున కొందరు టీ తాగుతుంటారు. కానీ అది మంచిది కాదు. టీలో ఎన్నో ఆల్కలాయిడ్స్‌ ఉంటాయి. వాటిలో చాలావరకు ఆమ్లగుణాన్ని కలిగి ఉంటాయి. అందుకే పరగడుపున టీ తాగడం అసిడిటీని పెంచుతుంది. ∙భోజనానికి ముందుగా టీ తాగడం సరైన పద్ధతి కాదు. టీ ఆకలిని చంపేస్తుంది. అందుకే భోజనానికి ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ టీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. ∙భోజనం తర్వాత కూడా కనీసం 45 నిమిషాలు మొదలుకొని గంట వరకు టీ తాగడం సరికాదు. వెంటనే తాగితే జీర్ణమైన భోజనంలోని శక్తి ఒంటికి పట్టదు. ఇది మాల్‌అబ్జార్‌ప్షన్‌కు దారితీసి పోషకాహార లోపాలను తీసుకురావచ్చు. ∙టీతో ట్యాబ్లెట్‌ ఎప్పుడూ వేసుకోవద్దు.
సాధారణ ఆరోగ్య ప్రయోజనాలు 
∙బ్లాక్‌ టీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గుండెకు సంబంధించిన కరొనరీ ఆర్టరీ డిస్‌ఫంక్షన్‌ను చక్కదిద్దుతుంది. ∙గ్రీన్‌ టీలో పుష్కలంగా ఉండే థయానిన్‌ కలిగించే నెమ్మదితత్వం (కామింగ్‌ ఎఫెక్ట్‌) వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ∙ఊలాంగ్‌ టీ శరీర జీవక్రియల వేగాన్ని పెంచుతుంది. అందువల్ల కొవ్వు కరిగి, స్వాభావికంగా బరువును నియంత్రించుకోడానికి ఇది తోడ్పడుతుంది.
పరిమితి ఏమిటీ? పానీయం మంచిదైనా అది పరిమితికి మించి తాగితే అనర్థాలను తెచ్చిపెడుతుంది. అది టీ అయినా... మరోటైనా. అందుకే టీ రోజుకు 3 – 4 కప్పులు చాలు.
- రాధిక, చీఫ్‌ డైటీషియన్, కిమ్స్‌ హాస్పిటల్స్, సికింద్రాబాద్‌


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list