MohanPublications Print Books Online store clik Here Devullu.com

తొందరపాటు... అనర్థదాయకం!- Spiritually, Anger,


12 సార్లు... 1 నిమిషానికే!
అధ్యయనం
మనుషులు నిమిషానికి ఎన్నిసార్లు కన్నార్పుతారో తెలుసా...12 సార్లు. అవును ప్రతి 5 సెకన్లకోసారి కనురెప్పలు వాటంతట అవే మూసుకుపోతాయి. నిమిషానికి... 12సార్లయితే మరి గంటకు...12 *60=720 సార్లు. రోజుకు... 24*720=17280 సార్లు.
ఆసక్తికరమైన అంశాన్ని చూసేటప్పుడు కన్నార్పే నిడివి 5 సెకన్లకంటే ఎక్కువగా ఉంటుంది.
కంప్యూటర్‌ మానిటర్‌ని చూసేటప్పుడు కూడా కన్నార్పడం ఆలస్యం అవుతుంటుంది. దాంతో కంటిని శుభ్రపరిచే ప్రక్రియ తక్కువగా జరుగుతుంది. కంప్యూటర్‌ మీద పనిచేసే వారికి కంటిసమస్యలు త్వరగా రావడానికి ఇదీ ఓ కారణమే. కళ్లకు తగినంత తేమను అందిస్తూ, దుమ్ముధూళిని తొలగించడానికే కనురెప్పలు మూసుకుంటాయి.
తొందరపాటు... అనర్థదాయకం!
ఆత్మీయం
తొందరపాటు, తొందరపడి ఇతరుల మీద ఒక అభిప్రాయానికి రావడం అందరికీ ఉండే అలవాటే. రామాయణ కాలం నుంచి ఉన్నదే. లక్ష్మణుడు కైక మీద కోపంతో ఆమెను నిందిస్తుంటే ‘వివేకం కలవారెవరయినా తమకు ఎవరిమీద అభిమానం ఉంటుందో వారిని ప్రశంసించాలే కాని ఇతరులను నిందించడం ధర్మం కాదు’ అని శ్రీరాముడు లక్ష్మణునికి హితవు చెబుతాడు. అలాగే మేనమామల ఇంటి నుంచి వచ్చిన భరతుడు... రాముడు అరణ్యానికి వెళ్లాడని తెలుసుకుని, పరుగుపరుగున అన్నగారికోసం అడవికి పరివారంతో బయలుదేరాడు. అల్లంత దూరాన్నుంచే వారిని చూసిన లక్ష్మణుడు తమను అడవుల నుంచి కూడా వెళ్లగొట్టడానికే భరతుడు వస్తున్నాడని భ్రమతో విల్లెక్కుపెట్టబోయాడు.
అప్పుడు రాముడు లక్ష్మణుడిని శాంతింపచేసి, భరతుడు వచ్చిన తరవాత వివరాలు అడిగి తెలుసుకున్నాడు. భరతుడు... రాముడిని అయోధ్యకు తీసుకువెళ్లడానికి వచ్చాడనే విషయం తెలుసుకున్న లక్ష్మణుడు తల దించుకున్నాడు. రామరావణ సంగ్రామ సమయంలో విభీషణుడు రాముని శరణుకోరి వచ్చినప్పుడు లక్ష్మణుడు విభీషణుడిని నమ్మవద్దని, ఇక్కడికి కేవలం గూఢచారిగానే వచ్చాడని అంటాడు. కాని విభీషణుడి పలుకులతో లక్ష్మణుడు తప్పు తెలుసుకుంటాడు. తొందరపాటు వద్దనీ, ఇతరులను అనవసరంగా నిందించవద్దనీ హితవు పలుతాడు రాముడు. వీటన్నిటిని బట్టి చూస్తే తొందరపాటు ఎంత అనర్థదాయకమో అర్థం అవుతుంది.

నడకలేదా.. అయితేనేం!
ఏ పార్కుకో, మైదానానికో నడకకి వెళ్లేవారికి వానలు అడ్డుతగిలే కాలమిది. అలాగని వ్యాయామానికీ దూరంకాలేని పరిస్థితి. మరెలా అంటారా? ఇంట్లోనే ఇవి ప్రయత్నించండి.. 
* చిన్నప్పుడు తాడాట ఆడేవారు కదా.. ఇప్పుడూ అదే పని చేయండి. కనీసం ఇరవై నిమిషాలైనా తాడాట ఆడండి. దానివల్ల కెలొరీలే కాదు.. నడుము దగ్గర పేరుకొన్న కొవ్వూ కరిగిపోతుంది. 
* ఇంట్లోనే సూర్య నమస్కారాలు చేయొచ్చు. మొదట్లో కాస్త కష్టంగా అనిపించినా క్రమంగా అలవాటు అవుతుంది. సందేహాలుంటే యూట్యూబ్‌లో చూసి చేయొచ్చు. 
* ఉన్నచోటే నిల్చుని కూడా జాగింగ్‌ చేయొచ్చు. చిన్నచిన్న స్ట్రెచింగ్‌ వ్యాయామాల్ని ఇంట్లోనే ప్రయత్నించొచ్చు. వీటిని ప్రత్యేక సమయం అంటూ పెట్టుకోకుండా.. పది నిమిషాల చొప్పున కుదిరినప్పుడల్లా చేయొచ్చు. 
* మీకు డాన్స్‌ అంటే ఇష్టం అనుకోండి.. మంచి హుషారెత్తించే పాట పెట్టుకుని కాసేపు చేయండి. కెలొరీలు కరగడమే కాదు.. ఒత్తిడి కూడా దూరమవుతుంది. 
* క్రీడాపరికరాలు అమ్మేచోట కేజీ నుంచి రెండుకేజీల దాకా బరువులుండే డంబెల్స్‌లాంటివి దొరుకుతాయి. వాటిని తెచ్చుకుంటే గనుక జిమ్‌కే వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే వ్యాయామాలు చేయొచ్చు. వాటివల్ల చేతులు తీరైన ఆకృతిలోకి వస్తాయి.
‘ఇంకాసేపు నిద్రపోతా...’ అనొద్దు
ఎప్పుడూ నిర్ణీత సమయంలో పడుకోవడం, లేవడం ఇవే చక్కటి నిద్రకి మార్గాలని చెబుతుంటారు! కానీ వాటితోపాటూ పగటిపూట మనం చేసే పనులూ, తీసుకునే ఆహారం కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు. అందుకే ఉదయం నుంచి రాత్రి వరకూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.
అదే కీలకం : ఉదయం నిర్ణీత సమయమని పెట్టుకున్నాక, ఆ సమయానికే అలారం మోగాక, ఇంకో ఐదు నిమిషాలంటూ కునుకేస్తున్నారా? అలా చేయకండి. ఆ అలవాటు మీ శరీర గడియారాన్ని(సర్కాడియన్‌ రిథమ్‌ అంటారు!) గందరగోళంలోకి నెట్టేస్తుంది. ఆ రోజు మీరు చేయాల్సిన పనులన్నీ ఒకసారి మననం చేసుకుని చూడండి. మెలకువ వచ్చేస్తుంది.
కాఫీలొద్దు : నిద్రలేచిన మూడుగంటలదాకా అంటే కనీసం తొమ్మిది, పది గంటలదాకా కాఫీ, టీలేవీ వద్దు. ఆ తర్వాత తాగండి! దీని వెనక ఓ చిన్న సైన్సుంది. కాఫీ, టీల్లోని కెఫీన్‌ మనలో కార్టిసాల్‌ రసాయనాన్ని పెంచుతుంది. సహజంగా మనకు చురుకుదనాన్నిచ్చే రసాయనం ఇది. ఎప్పుడూ..? మనలోని ఉత్సాహం నెమ్మదించినప్పుడు. కానీ ఉదయం లేచినప్పుడు మనలోని ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో కెఫీన్‌ లోపలికి వెళితే చిరాకూ, ఒత్తిడే మిగులుతాయి. అది రోజంతా కొనసాగి నిద్రపైనా ప్రభావం చూపుతుంది.
అల్పాహారం: మహిళలు నిర్లక్ష్యం చేసే విషయం ఇది. ఉదయం ఏదో తిన్నామనిపిస్తారు.. లేదా పూర్తిగా మానేసి మధ్యాహ్నం ఎక్కువగా లాగించేస్తారు. పిండిపదార్థాలూ, మాంసకృత్తులతో కూడిన ఆహారం మీరు నిద్రలేచిన ఒకటిన్నర గంటలోపలే తినాలి. అప్పుడే అది శక్తిగా మారుతుంది. అల్పాహారాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల మధ్యాహ్నం పూట ఎక్కువ తినేస్తారు. నిద్రగా అనిపిస్తుంది. ఇప్పుడు తీసే కునుకు ప్రభావం రాత్రి నిద్రపయినా పడుతుంది మరి.

లైట్‌ తీసుకోండి..
కెరీర్‌లోని కొన్ని అపోహలు మనల్ని ఓటమికి చేరువ చేస్తుంటాయి! మనపై మనం నమ్మకం కోల్పోయేలా చేస్తాయి. పైకి నిజమే కదా అనిపిస్తాయి కానీ.. తరచి చూస్తే వీటిలో తర్కం ఉండదు. మీరే చూడండి..
అదెప్పుడూ చేయలేను.. : ‘నేనెప్పుడూ అంతే. ఆ పని ఎప్పుడూ చేయలేను. ప్రతిసారీ తడబడుతూనే ఉంటా!’ అని బాధపడుతూ ఉంటారు కొందరు. అలాంటివెప్పుడూ ఉండవు. కొన్ని పనులు మీరు బాగా చేయొచ్చు.. కొన్ని అంత చక్కగా చేయలేకపోవచ్చు! ఎవరి జీవితంలోనైనా ఈ రెండు పార్శా్వలే ఉంటాయి. అంతేకాని మీరు ఎన్నడూ చేయలేని పనంటూ ఏదీ ఉండదని తెలుసుకోండి. మీపై మీరు ప్రతికూల ముద్ర వేసుకోవడం మానేయండి.
గుర్తింపే పరమార్థం : ‘ఎంత బాగా చేసినా ఏమిటీ ప్రయోజనం. బాస్‌ మెచ్చుకోలేదే!’ అని బాధపడతారు కొందరు. ఒక్క బాస్‌ మాత్రమే కాదు.. ఎదుటివాళ్లు ఎవరైనా సరే మిమ్మల్ని అన్నిరకాలా ఆమోదించాలని ఎదురు చూడకండి. ఎదుటివాళ్లు మనలో ఉన్నట్టు చెప్పే మంచీ, చెడుల్లో ఎంతోకొంత అతిశయోక్తి పాలు ఉంటూనే ఉంటుంది. కాబట్టి.. మెచ్చుకోలైనా, మందలింపుల్నైనా యథాతథంగా మనసుకి పట్టించుకోవద్దు. కాస్త విమర్శనా దృష్టితోనే చూడండి.
పరిపూర్ణతే ముఖ్యం : కొందరు తమ పనిలో వందశాతం పరిపూర్ణత ఉండాలనుకుంటారు! అలా అనుకోవడం తప్పుకాదుకానీ.. అది ప్రతిసారీ సాధ్యంకాదనే విషయాన్ని తెలుసుకోరు. ఆ అవగాహన లేకే తాము ఏ చిన్న తప్పు చేసినా కుంగిపోతూ ఉంటారు. దాన్నే తమ పనితీరుగా భ్రమపడతారు. గొప్పగా పనిచేసేవాళ్లయినా ఎక్కడో చోట చిన్న లోపం ఉండి తీరుతుందనే విషయం తెలుసుకోవాలి. పొరబాట్లు కూడా విజయానికి మెట్లేనని అర్థం చేసుకోవాలి.
ఈ స్నాక్స్‌ తింటే బెటర్‌
కొందరికి అన్నం తిన్న రెండు మూడు గంటలకుఏదైనా స్నాక్‌ తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఆరోగ్యకరమైన , బరువు పెరగని స్నాక్స్‌ తింటే మంచిది. చిరుతిళ్లు తింటే ఊబకాయం వస్తుంది. శరీరం, పొట్ట పెరగకుండా ఉండాలంటే రోజుకు నాలుగుసార్లు కొద్దికొద్దిగా ఆహారం తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారం తినడం మంచిది కాదు. పైగా స్నాకింగ్‌ (చిన్న మొత్తంలో తినడం) జీవక్రియను పెంచుతుంది. శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. అలా అని వేగించిన, ఎక్కువ క్యాలరీలు, ఫ్యాట్‌ ఉన్న స్నాక్స్‌ తిన్నారనుకోండి సమస్య మళ్లీ మొదటికి వస్తుంది. ఊబకాయులవుతారు. అందుకే స్నాకింగ్‌కి, విందుభోజనానికి ఉన్న తేడాను గమనించుకోవాలి. ఉదాహరణకు ఫ్రైస్‌ వేసిన బర్గర్‌ స్నాక్‌ కాదు. అది మీల్స్‌తో సమానం. స్నాక్స్‌ ఎప్పుడూ చిన్న పరిణామంలో ఉండి మన ఆకలిని తగ్గిస్తాయి.
అందుకే లంచ్‌ తర్వాత సాయంత్రం పూట కొబ్బరినీళ్లు, డ్రైఫ్రూట్స్‌ లేదా తక్కువ ఫ్యాట్‌ ఉన్న పెరుగు స్నాక్స్‌గా తీసుకుంటే మంచిది. అలాగే స్నాక్స్‌ తినాలనుకున్నప్పుడు ఎలాంటి స్నాక్స్‌ తింటే శరీరానికి మంచిది అన్నది ఆలోచించి తినాలి. కొంతమంది మధ్యాహ్నం అన్నం తినకుండా ఉంటే లావు తగ్గుతాం అనుకుంటారు. అది కూడా అపోహ మాత్రమే. అన్నం తినడం మానేస్తే ఆకలి మరింత పెరుగుతుంది. ఆ ఆకలిని శాంతింపచేయడానికి చిరుతిళ్లు తింటాం. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.
దాంతో ఊబకాయులవుతారు. రాత్రి డిన్నర్‌ చేసిన తర్వాత ఎక్కువసేపు మెలకువగా ఉండాల్సి వస్తే ఎలాంటి స్నాక్‌ తీసుకోవాలో ముందుగా ప్లాన్‌ చేసుకోవాలి. లేకపోతే బాగా ఆకలి వేసి ఎక్కువ ఫుడ్‌ లాగించే అవకాశం ఉంది. ఆరోగ్యమైన స్నాక్స్‌ తినాలనుకునేవారు కొబ్బరినీళ్లు, బాదంపప్పులు, ఫ్రూట్‌చాట్‌, బెర్రీలు వేసిన పెరుగు, ధోక్లా వంటివి తీసుకుంటే మంచిది. కేలరీలు పెంచే చిప్స్‌, ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌, సమోసా, బ్రెడ్‌ పకోడా వంటి స్నాక్స్‌కు దూరంగా ఉండాలి.
దుస్తుల నుంచి విద్యుత్‌
శరీర కదలికల ఆధారంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే వినూత్న వస్త్రాలు సమీప భవిష్యత్తులో అందుబాటులోకి రానున్నాయి. అంతేకాదు ఈ దుస్తులు తేలికపాటి బరువుతో, ధరించేందుకు సౌకర్యవంతంగా ఉంటాయట! ఇదెలా సాధ్యమంటే.. దుస్తులను సర్క్యూట్లుగా మార్చే వినూత్న టెక్నాలజీని కనుక్కోవడమేనని యూనివర్సిటీ ఆఫ్‌ మసాచుసెట్స్‌ శాస్త్రవేత్తలు జవాబిస్తున్నారు. ఇందుకోసం మెటల్‌ ఫ్రీ ఎలకో్ట్రడ్లను ప్రత్యేకంగా తయారుచేశామని చెప్పారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎలకో్ట్రడ్లతో పోలిస్తే.. ఇవి సున్నితంగా ఉంటాయని చెప్పారు. దీంతో వీటిని దుస్తులలో అమర్చినా ధరించిన వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు.


ప్లాట్‌ కాగితాలన్నీ పోతే ఏం చేయాలి?
నేను గ్రామపంచాయతీ లేఅవుట్‌లో ఉన్న ఒక ప్లాట్‌ కొనుగోలు చేసి, రిజిస్టర్‌ చేయించుకున్నాను. అందులోనే ఇల్లు నిర్మించుకుని, అక్కడే నివాసం ఉంటున్నాను. అయితే 8 మాసాల క్రితం నా రిజిస్ట్రేషన్‌ పేపర్స్‌ అన్నీ ఎక్కడో పడిపోయాయి. కాక పోతే వాటి జిరాక్స్‌ పేపర్స్‌ మాత్రం నా వద్ద ఉన్నాయి. ఇటీవల అంటే 15 రోజుల క్రితం ఇ.సి. తీయిస్తే ఇప్పటికీ అది నా పేరు మీదే ఉంది. ఇప్పుడు నా భార్య పేరు మీద రిజిస్ట్రేషన్‌, గిఫ్ట్‌డీడ్‌ లేదా జిపిఎ చేయించుకోవచ్చా? ఆ మేరకు బ్యాంక్‌నుంచి రుణం పొందే అవకాశముందా? మునుముందు ఎప్పుడైనా నా ఇల్లు అమ్ముకుంటే ఏమైనా సమస్యలు తలెత్తుతాయా? ఈ సమస్యకు సరియైన పరిష్కారం సూచించండి.
- డి. లక్ష్మణ్‌. మెదక్‌
మీరు కొన్న ప్లాట్‌కు సంబంధించిన ఒరిజినల్‌ సర్టిఫికేట్‌ పోయినంత మాత్రాన మీరు ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదు. కాకపోతే, ఎవరైనా ఇలా, తాము కొనుగోలు చేసిన స్థిరాస్థికి సంబంధించిన దస్తావేజులను కోల్పోయిన ప్పుడు, వెంటనే, ఆ విషయాలన్నీ, దగ్గరలో ఉన్న పోలీస్‌స్టేషన్‌లో దరఖాస్తు ఇవ్వడం తప్పనిసరి. అందులో పోయిన ఆ డాక్యుమెంట్లను తిరిగి తమకు అప్పగించమని కోరాలి. అదే సమయంలో, ఆ విషయాన్ని ఎక్కువ సర్క్యులేషన్‌గల ఒక స్థానిక వార్తాపత్రికలో ఒక ప్రకటన కూడా ఇవ్వవలసి ఉంటుంది. అందులో తమ ఒరిజన ల్‌ దస్తావేజులు పోయినట్లుగా, ఎవరికైనా అవి దొరికినట్లయితే, వాటిని తిరిగి తమకు అప్పగించవలసిందిగా కోరాలి. అందుకు విరుద్ధంగా ఆ దస్తావేజుల ఆధారంగా, వేరే వ్యక్తులు ఎవరైనా ఆ ఆస్తిని ఆక్రమించడం గానీ, లేదా ఏదైనా ఒక చార్జి క్రియేట్‌ చేయడానికి ప్రయత్నించడం గానీ చేస్తే, అలాంటి ప్రయత్నాలు చెల్లనేరవని, వారు చేసే చర్యలకు తాము బాధ్యులం కాదని, తెలియ పరుస్తూ ఒక ప్రకటన ఇవ్వవలసి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మునుముందు జరగబోయే పరిణామాలకు, చ ర్యలకు మీరు బలికాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఏమైనా మీ ఒరిజినల్‌ దస్తావేజులు పోయినంత మాత్రాన మీ యాజమాన్యపు హక్కులకు, ఏ విధమైన భంగమూ ఏర్పడదు. మీ ఒరిజినల్‌ సర్టిఫికేట్ల జిరాక్స్‌ కాపీల ఆధారంగా, సంబంధిత సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లి, సర్టిఫైడ్‌ కాపీని పొందండి. దాని ఆధారంగా మీరు మీ భార్యకు, గిఫ్ట్‌ డీడ్‌ గానీ, జిపిఏ గానీ ఇవ్వవచ్చు. కాకపోతే, గిఫ్ట్‌ పొందిన మీ భార్యగానీ, లేదా స్వయంగా మీరే గానీ, బ్యాంకు నుంచి రుణం పొందాలనుకున్నప్పుడు ఒరిజినల్స్‌ విషయంలో బ్యాంక్‌ వారు కొంత పేచే పెట్టే అవకాశం ఉంది. కానీ, మీ ఒరిజినల్స్‌ పోయిన విషయమై, మీరు పోలీస్‌ స్టేషన్‌లో దరఖాస్తు ఇచ్చినట్లుగా, అలాగే వార్తా పత్రికలో కూడా ప్రకటన ఇచ్చినట్లుగా వాటి ప్రతులను చూపాలి. అలా చేస్తే, రుణం తీసుకోవడానికి మిగతా అన్ని అర్హతలు సక్రమంగానే ఉన్నప్పుడు, బ్యాంకు వారు మీ నుండి, ఇండెమ్నిటీ బాండ్‌ గానీ, మరేదైనా అఫిడవిట్‌ గానీ, తీసుకుని, మీ పేరిట, లేదా, మీ భార్య పేరిట తప్పనిసరిగా రుణం మంజూరు చేస్తారు. కాకపోతే చేయవలసిన వాటిలో ఏదో తప్పిపోకుండా అన్నీ సంపూర్ణంగా పూర్తి చేయడం తప్పనిసరి.
- టి.ఎల్‌. నయన్‌ కుమార్‌, న్యాయవాది
మాన్‌సూన్‌లో చుట్టేద్దాం!
ప్రకృతి అందాలు ఆస్వాదించడానికి ఇది మంచి సమయం. ఈ సీజన్‌లో వాతావరణం ఆహ్లాదకరంగా, మనోహరంగా ఉంటుంది. ఈ తొలకరి వర్షాల వేళ సందర్శించడానికి ఈ ప్రదేశాలను ఎంచుకోవచ్చు.
మున్నార్‌
ప్రకృతి ప్రేమికులు, కుటుంబ సభ్యులతో కలిసి వెకేషన్‌కు వెళ్లాలనుకుంటున్న వారికి, హానీమూన్‌ ప్లాన్‌లో ఉన్న వారికి లేదా టూర్‌లో కొంచె అడ్వెంచర్‌ను కోరుకునే వారికి మున్నార్‌ బెస్ట్‌ ఆప్షన్‌. వర్షాకాలంలో పచ్చని తివాచీ పరిచినట్టుగా కొండలన్నీ పచ్చికతో నిండి ఉంటాయి. తేయాకు తోటలు, అక్కడక్కడా లోయల మధ్యన సాగుతున్న నదులు, కొండలను తాకుతున్న మేఘాలు.. వెరసి మున్నార్‌ అందాలు మిమ్మల్ని కట్టిపడేస్తాయి. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య సమయం మున్నార్‌ సందర్శించడానికి చాలా అనువైనది. ట్రెక్కింగ్‌, హైకింగ్‌ చేయొచ్చు. వర్షాకాలంలో మున్నార్‌ వెళితే ప్రకృతి అందాలు మీకు మధురానుభూతిని అందిస్తాయి.
కొడైకెనాల్‌
మాన్‌సూన్‌లో వెళ్లదగిన మరో ప్రదేశం ఇది. ఇక్కడ సూర్యుడు, మేఘాలు దాగుడుమూతలు ఆడుతున్నట్లుగా ఉంటుంది. ఇక్కడి వాతావరణం ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉంటుంది. కుటుంబసభ్యులతో కలిసి వెళితే టూర్‌ మధురజ్ఞాపకంగా మిగిలిపోతుంది. జూలై, ఆగస్టు మధ్య కాలం సందర్శించడానికి అనువైన సమయం.
అతిరప్పిల్లి
కేరళలో ఉన్న ఫేవరేట్‌ మాన్‌సూన్‌ ప్లేస్‌ ఇది. దీనికి నయాగరా ఆఫ్‌ ఇండియా అని కూడా పేరుంది. ఇక్కడి జలపాతాల అందాలు తనివి తీరా చూడాల్సిందే. వర్షాకాలంలో ఈ జలపాతాలు ఆకర్షణీయంగా ఉంటాయి. జలపాతం నుంచి వచ్చే శబ్దం మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. అనువైన సమయం... జూన్‌ నుంచి సెప్టెంబర్‌.
వయనాడ్‌
దక్షిణ భారతదేశంలో ఉన్న హిల్‌స్టేషన్‌లలో ముఖ్యమైనది. వర్షాలు ప్రారంభమయ్యాక మూడు రోజుల పాటు ఇక్కడ మాన్‌సూన్‌ ఫెస్టివల్‌ను నిర్వహిస్తారు. ట్రెక్కింగ్‌, హైకింగ్‌కు ఇది చాలా అనువైన ప్రదేశం. వర్షాకాలంలో తప్పక సందర్శించాల్సిన ప్రదేశం. ప్రకృతి అందాలు ఆకట్టుకుంటాయి.
అలెప్పీ
వానాకాలంలో సందర్శించాల్సిన ప్రదేశాలలో ముఖ్యమైనది. తొలకరి జల్లులు కురిశాక ఇక్కడి వాతావరణం పచ్చిక బయళ్లతో ఆహ్లాదకరంగా మారుతుంది. ప్రత్యేకమైన కేరళ చేపల వంటకాలు రుచి చూస్తూ ప్రకృతి సోయగాలను ఆస్వాదించవచ్చు. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలం అనువైనది.
కూర్గ్‌
ప్రశాంతమైన వాతావరణం, ఎటు చూసినా పొగమంచు, తొలకరి జల్లుల్లో పచ్చని అందాలు... ఇలా చెప్పుకుంటూ పోతే కూర్గ్‌ అందాలు చాలానే ఉంటాయి. ఇక్కడి వేడి వేడి కాఫీని రుచి చూసి తీరాల్సిందే. వర్షాకాలంలో కూర్గ్‌ అందాలు పర్యాటకులను మదిని దోచేస్తాయి.
జోగ్‌ ఫాల్స్‌
కర్ణాటకలో దట్టమైన అడవుల్లో ఈ జలపాతం ఉంటుంది. శరావతి నదిపై ఉండే ఈ జలపాతం అందాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. వర్షాకాలంలో మరింత శోభాయమానంగా ఉంటుంది.
చిత్రకూట్‌ ఫాల్స్‌
దేశంలోని అత్యంత ఆకర్షణీయమైన జలపాతాల్లో ఇదొకటి. 520 అడుగుల మేర విస్తరించి ఉంటుంది. జలపాతం అందాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
నడక ఇలా!
నడక వల్ల శరీరం మొత్తానికి వ్యాయామం దొరుకుతుంది. కాబట్టే రోజుకి కనీసం 30 నిమిషాలపాటైనా నడవాలని చెబుతూ ఉంటారు వైద్యులు. అయితే వాకింగ్‌కి కూడా కొన్ని టెక్నిక్స్‌ ఉంటాయి. అడుగులు వేస్తూ ముందుకు సాగటం అందరం చేసే పనే! కానీ ఎముకలు, కండరాలు, టెండాన్ల మీద శరీర భారం సమంగా పడుతూ నడవగలిగితేనే ఫలితం ఉంటుంది. ఈ క్రమంలో తేడాలుంటే దీర్ఘకాలంలో కీళ్ల నొప్పులు, వెన్ను, పిరుదుల్లోని ఎముకల నొప్పులు తప్పవు. కాబట్టి నడకలో ఈ కిటుకులు పాటించండి.
ఇలా నిలబడాలి: తుంటి ఎముకల మధ్య ఎంత దూరం ఉంటుందో అంతే దూరంలో కాళ్లను ఉంచి నిలబడాలి. కాలి బొటనవేళ్లతోపాటు మిగతా వేళ్లన్నీ ఎటు వైపుకీ వంగకుండా నేరుగా ఉండాలి. తుంటి, మోకాలి, మడమ ఎముకలు నిటారుగా ఉండేలా నిలబడాలి. ఇలా ఉంటేనే ఎముకలు రాపిడికి గురి కాకుండా ఉంటాయి.
అడుగు ముందుకు: అడుగు ముందుకు వేసేటప్పుడు ముందుకు చాపిన కాలి మడమ నేలకు తాకాలి. ఇలా చేయలేకపోతుంటే మీరు వేసుకున్న జోళ్లను ఒకసారి గమనించుకోండి. బిగుతుగా, బిరుసుగా ఉండే జోళ్లు, బూట్లు ఇలాంటి నడకను నియంత్రిస్తాయి. పాదాలకు సపోర్ట్‌ ఇచ్చేవి, పాదాల కదలికలకు తగ్గట్లు వంగే బూట్లు, చెప్పులనే ఎంచుకోవాలి.
మడమ తర్వాత ముందరి పాదం: పాదం మధ్యలో ఉండే ప్రదేశాన్ని ‘బాల్‌ ఆఫ్‌ ది ఫుట్‌’ అంటారు. కాలి వంపుకు ముందు, బొటనవేలి వెనక ఉండే ఈ ప్రదేశం మడమ తర్వాత నేలను తాకాలి. ఆ సమయంలో వేళ్లు సాగి ఉండాలి. నడిచేటప్పుడు ఈ క్రమ పద్ధతి అనుసరించాలి. అడుగు వేసేటప్పుడు బాల్‌ ఆఫ్‌ ది ఫుట్‌ ఏదో ఓ పక్కకి పడుతుంటే మీ నడక సరిగా లేదని అర్థం. అది ఎందువల్లో తెలియాలంటే కాళ్లకు చెప్పులు లేకుండా నడిచి చూసుకోవాలి. చెప్పుల వల్ల తేడా వస్తుంటే వాటిని మార్చాలి.
కాలి వేళ్లు: బాల్‌ ఆఫ్‌ ది ఫుట్‌ తర్వాత కాలి వేళ్లన్నీ ఒకేసారి నేలకు ఆనాలి. అయితే మొదట చివరి వేలుతో మొదలుపెట్టి ఆఖరున బొటనవేలు నేలకు తాకాలి. అలాగే అడుగు తీసేటప్పుడు కూడా ఇదే క్రమంలో పాదాన్ని లేపాలి. మొదట చివరి వేలు, ఆఖరున బొటనవేలు గాల్లోకి లేవాలి. వేళ్లలో ఏ ఒక్క వేలు నేలకు తాకకుండా ఉన్నా కాల్లోని కీళ్లు, ఎముకల మీద ఒత్తిడి పెరుగుతుంది.

మెడ బిగుసుకుపోతోందా?
కొంతమంది వాత శరీరుల్లో మెడ బిగుసుకుపోయే సమస్య తరుచూ తలెత్తుతుంది. ఈ సమయంలో వాళ్లు మెడను కదపలేక బాధపడుతుంటారు. అయితే శరీరంలో ఏ వాతమూ లేకుండా కూడా కొందరికి మెడ భాగం ఒక్కటే బిగుసుకుపోతుంది. ఇలాంటి వారికి తక్షణ ఉపశమనం కోసం నీటిలో వావిలాకు వేసి ఉడికించి ఆ నీటిని మెడ మీద ధారగా పోస్తే ఎంతో మేలు కలుగుతుంది.
గృహ ఔషధంగా....
రేకుల్లాంటి రస కర్పూరాన్ని గంటసేపు తేనెలో నానబెట్టి, ఆ తర్వాత ఒక తులానికి, రెండు నిమ్మకాయలంత బెల్లం, అరచెంచా ఇంగువ కలిపి, నూరి, బటానీ గింజలంత మాత్రలు చేసుకుని రోజూ వేడినీటితో వేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
లేపన తైలం: వాము పూవు, పుదీనా పువ్వు, ముద్ద కర్పూరం, రెండేసి తులాల చొప్పున ఒక సీసాలో వేసి ఉంచాలి. అరగంటలోగా అది ఘాటైన తైలంగా మారుతుంది. ఆ తైలంలో కొద్దిగా సారాయి చేర్చి, నొప్పితో బిగుసుకుపోయిన నరాలపైన ప్రతి రాత్రీ గట్టిగా మర్దన చేయాలి. ప్రతి రోజూ ఉద యం వేళ వావిలాకు నీటితో స్నానం కూడా చేయాలి.
అప్పటికీ తగ్గకపోతే...
వావిలాకు రసం అరగ్లాసు, పెద్దమాను చెక్క కషాయం అరగ్లాసు, దిరిశన చెక్క కషాయం అరగ్లాసు, ములకవేర్ల కషాయం అరగ్లాసు, వేపచెక్కరసం అరగ్లాసు నెమలి చెక్క రసం అరగ్లాసు, వీటికి తేనె చేర్చి అందులో 5 పిడికిళ్ల త్రికటు చూర్ణం, పిడికెడు ఎల్లిపాయల గుజ్జు వేసి కలయబెట్టి బాగా మర్ధించి గట్టిపడితే మరింత తేనె చేర్చి ఒక సీసాలో భద్రపరుచుకోవాలి. ఆముదంలో అనిపించే ఈ కల్కాన్ని వేడి నీటిలో మూడు చెంచాలు కలిపేసుకుని ఉదయం, సాయంత్రం అరగ్లాసు చొప్పున 60 రోజులు వాడాలి. దీనితో ఎంతటి తీవ్రమైన మెడనొప్పి అయినా తగ్గిపోతుంది.

మధుమేహంతో కీళ్లనొప్పులు వస్తాయా?
నా వయసు 46. నాకు గత ఆరేళ్లుగా మధుమేహం ఉంది. ఇది చాలదన్నట్లు రెండేళ్ల క్రితం నుంచి మోకాళ్ల నొప్పులు కూడా మొదలయ్యాయి. నాకు అర్థం కానిదేమిటంటే ఈ రెండూ వేరు వేరు సమస్యలా? లేక ఒకదానికి ఒకటి ముడిపడి ఉన్నాయా? ఈ సమస్యల్ని సమర్థవంతంగా నియంత్రించే మార్గం చెప్పండి.
- ఆర్‌. వెంకటేశ్‌, ఆదిలాబాద్‌
మధుమేహం, మీకున్న కీళ్ల నొప్పులు వేరు వేరు విషయాలేమీ కాదు. ఈ రెండూ పరస్పర సంబంధం ఉన్న సమస్యలే. సహజంగా మన శరీరంలోని ఏ అవయవం పనిచేయడానికైనా శక్తి కావాలి. ఆ శక్తి అనేది గ్లూకోజ్‌నుంచి వస్తుంది. మధుమేహం కారణంగా ఎవరిలోనైనా గ్లూకోజ్‌ మెటబాలిజం దెబ్బతిన్నప్పుడు శరీరంలో గ్లూకోజ్‌ నిల్వలు పెరుగుతాయి. అయితే, పెరిగిన ఆ నిల్వలను నియంత్రించడం కూడా వెనువెంటనే జరగాలి. మనకు అవసరమైన శక్తి వినియోగంలోకి రావాలంటే, అందుకు అనుగుణంగా గ్లూకోజ్‌ బ్రేక్‌డౌన్‌ కావాలి. అలా బ్రేక్‌డౌన్‌ అయినప్పుడే శక్తి విడుదల అవుతుంది. అలా శ క్తి విడుదల కావల్సిన సమయంలో గ్లూకోజ్‌ వినియోగం జరగకపోతే, శక్తి విడుదలకాదు. గ్లూకోజ్‌ వినియోగం కావాలంటేనేమో, క్లోమగ్రంధినుంచి ఇన్సులిన్‌ విడుదల కావలసి ఉంటుంది. మధుమేహుల్లో ఉన్న సమస్యే ఇది. వీరిలో అవసరమైన మోతాదులో ఇన్సులిన్‌ ఉత్పనం కాదు కాబట్ట్లి గ్లూకోజ్‌ బ్రేక్‌డౌన్‌ కావడమూ ఉండదు. శక్తి విడుదల కావడమూ ఉండదు. శక్తి విడుదల కానప్పుడు సహజంగానే కండరాలు, ఎముకలు, కీళ్లూ బలహీనపడతాయి. అయినా అదేమీ పట్టించుకోకుండా, యదావిధిగా రోజువారీ పనులన్నీ చేసుకుంటూ వెళతాం. కీళ్లకు అది శక్తిని మించిన భారమవుతుంది. అందుకే కీళ్లు అరిగిపోవడం, విరిగిపోవడం జరుగుతుంది. మధుమేహానికీ, కీళ్ల నొప్పులకూ ఉన్న సంబంధమే ఇది. శక్తి వినియోగంలోకి రానప్పుడు మరో సమస్య ఏమిటంటే, శరీరంలో సమాంతరంగా జరిగే రిపేరింగ్‌ ప్రక్రియ కూడా ఉండదు. రిపేరింగ్‌ కానప్పుడు గాయాలు మానకుండా దీర్ఘకాలికంగా అలా కొనసాగుతూనే ఉంటాయి. ఫలితంగా గాయం ద్వారా వచ్చే కీళ్ల నొప్పులు కూడా ఎక్కువ కాలం కొనసాగుతూనే ఉంటాయి అందుకే మధుమేహాన్ని పూర్తి నియంత్రణలోకి తెచ్చుకుంటూ అదే సమయంలో మోకాళ్ల నొప్పులకు కూడా వైద్య చికిత్సలు తీసుకుంటేనే మీరు మోకాళ్లనొప్పులనుంచి పూర్తి విముక్తి పొందగలుగుతారు.
- డాక్టర్‌ చంద్రశేఖర్‌, జనరల్‌ ఫిజీషియన్‌
యోగ్యత అవసరం
మంత్రాలను యథాలాపంగా సంపాదించి జపిస్తే ఫలితం ఉండదంటారు పెద్దలు. ‘అర్హత’ ఉన్నవాడు, ‘అధికారం’ ఉన్నవాడి నుంచి మంత్రోపదేశం పొందినపుడే ఫలితం ఉంటుంది. దీనికి సంబంధించి ఒక కథ ఇలా ఉంది. ఒక రాజు తన మంత్రి నివాసానికి వెళ్తే ఆయన జపంలో ఉన్నారని విన్నాడు. రాజు నిరీక్షించి మంత్రి రాగానే వివరం అడిగాడు. అప్పుడు మంత్రి.. ‘గాయత్రీ మంత్రాన్ని జపిస్తున్నాన’ని బదులిచ్చాడు. రాజు తనకా మంత్రాన్ని ఉపదేశించమన్నాడు. తనకా అధికారం లేదన్నాడు మంత్రి. రాజు ఇతరుల నుంచి ఆ మంత్రాన్ని పొంది జపించడం మొదలు
పెట్టాడు. ఒక రోజు మంత్రితో.. ‘నేను చేస్తున్నది సరైనదేనా’ అన్నాడు రాజు. సరికాదన్నాడు మంత్రి. వివరణ కోరాడు రాజు. అప్పుడు మంత్రి సమీపంలో ఉన్న భటుణ్ణి పిలిచి రాజును బంధించమని ఆజ్ఞాపించాడు. భటుడా ఆజ్ఞను పాటించలేదు. మంత్రి ఒకటికి రెండుసార్లు ఆదేశించినా.. భటుడా పని చేయలేదు. మంత్రి చర్యతో రాజుకు కోపం వచ్చింది. అదే భటునితో ‘ఈ మంత్రిని బంధించండి’ అని ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞను వెంటనే పాటించాడు భటుడు. బందీ అయిన మంత్రి నవ్వి.. ‘మీరు కోరిన వివరణ ఇదే ప్రభూ!’ అన్నాడు మంత్రి. అర్థం కాక ఆశ్చర్యంతో చూస్తున్న రాజుతో.. ‘ఆజ్ఞ అదే! ఆ ఆజ్ఞను పాటించేవాడూ ఒకడే (భటుడు), కానీ అధికారి వేరు! నేను ఆజ్ఞ వేస్తే పాటించని వాడు.. మీరు ఆజ్ఞ వేయగానే తత్‌క్షణం పాటించాడు. మంత్రాల విషయంలోనూ ఇలాగే అధికారం పని చేస్తుంది. మంత్రోపదేశం చేసే వ్యక్తికి యోగ్యత ఉండాలి. సత్పురుషుడై ఉండాలి. ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసినవాడై ఉండాలి. ఇవేవీ లేక పటాటోపం కోసం మంత్రాలు, యంత్రాలు ఇచ్చే వాళ్లు ఎందరో ఉన్నారు. వారిలో సద్గురువును అన్వేషించాలి. ఆయన చూపు, స్పర్శ, మాట చేత మనలో చైతన్యం కలుగాలి. మంత్రాన్ని అనుష్ఠించాలన్న పూనిక పుట్టాలి. అప్పుడే ఆ మంత్ర జపంతో ఫలితం ఉంటుంది.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list