MohanPublications Print Books Online store clik Here Devullu.com

నిత్యమంగళికి నీరాజనం_SHAKAMBARI


నిత్యమంగళికి నీరాజనం

ఆషాడం వచ్చిందంటే అమ్మ ఆరాధన మొదలైందనే చెప్పాలి. ప్రకృతి వసంతాగమనంతో కొత్తచిగుర్లు వేస్తుంది. గ్రీష్మం వచ్చి చెట్టుపుట్టలను వాగు వంకలను ఏరులను ఆఖరుకు నదులను కూడా ఎండగట్టిస్తుంది. భూతలం అంతా నీటి ఎద్దడికి అల్లలాడిపోతుంటుంది. వర్షదేవుడు ఎపుడు కనికరిస్తాడో అని ఆకాశం వైపు ఒక్క రైతులే కాదు సర్వజనావళి ఎదురుచూస్తుంది. కాలగమనం వరుణిని వెంట బెట్టుకువస్తుంది. మేఘాలన్నీ ఆవృత్తమై భూదేవిపై కరుణామృతాన్ని కురిపిస్తాయి. చినుకు పడీపడగానే ప్రకృతి పురుషులూ ఇద్దరూ పులకరిస్తారు. ఆమని వచ్చినట్లు ఆనందిస్తారు. అపుడే చినుకు చిత్తడికి ఎక్కడో అణగారిపోయ ఉన్న సూక్ష్మ క్రిములు పుట్టుక మొదలవుతుంది. ఎండకు గాలికి అల్లలాడిన శరీరం వానకు పులకరిం చినా ఆరోగ్యం మందగిస్తుంది. చిత్తడితో జలుబుదగ్గు ఆరంభ వౌతాయ. ఎండిపోయఉన్న సూక్ష్మజీవులన్నీ ప్రాణంపోసుకొని ఊపిరులూదువేళ అనారోగ్యాలు కమ్ముకొస్తాయి అందుకే అనారోగ్యం దరిచేరకుండా చూడమని అమ్మతల్లిని వేడుకోవడం ప్రారంభిస్తారు. ఆ అనారోగ్యాల బారినపడకుండా అమ్మకు చల్లపోసి, పసుపు పూసి కుంకుమ పెట్టి చివుర్లు తొడిగిన వేపచెట్టును పూజిస్తారు. ప్రతి గ్రామదేవతను పూజిస్తారు. ఈ అమ్మ పూజకు ప్రాంతాలు కాని కులాలు కాని అడ్డుగా నిలువవు. ప్రతి ఇంటా ప్రతి వాడా ప్రతి కూడలిలోను ప్రతి గ్రామంలోను అమ్మకు జాతర్లు జరుపుతారు. అట్లాంటి అమ్మనుకొలిచే జాతరే తెలంగాణాలో బోనాల జాతరగా ప్రసిద్ధికెక్కింది. జగత్తును నడిపించే ఆదిపరాశక్తి జగన్మాతను కంచి కామాక్షి, కాశీ విశాలాక్షి, మధుర మీనాక్షి, కలకత్తా కాళీ, బెజవాడ కనకదుర్గ నామరూపాలతో పాటుగా అంకమ్మ, ఎల్లమ్మ, రేణుకమ్మ, పోశమ్మ, మశమ్మ, పోలేరమ్మ- ఇలా ఏ పేరుపెట్టి పిలిచినా అమ్మ ‘ఆ’ అని పలుకుతూ తన సంతనానికి చేదోడుగా ఉంటుంది. అమ్మ చల్లంగా చూడాలని ఒక్కో ప్రాంతంవారు ఒక్కో విధమైన పండుగను చేస్తుంటారు. అనాదిగా వస్తున్న శక్తి ఆరాధన భిన్న ప్రాంతాలలో విభిన్నరూపాలలో భిన్నత్వంలో ఏకత్వానికి రూపంగా కనిపిస్తుంది. శాస్ర్తియంగా అమ్మను
శ్లో: యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా... నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
- చండీ సప్తశతి అంటూ పూజిస్తారు. పండిత పామరభేదం లేకుండా అమ్మ నీవే దిక్కు అన్నింటికీ కారణభూతురాలివి.మమ్ము కరుణింఛిపాలించి లాలించుతల్లీ అని తెలంగాణాలో ని జంట నగరాల్లోని సికింద్రాబాద్‌లోని శ్రీఉజ్జయినీ మహాకాళి దేవాలయం, హైదరాబాద్ పాతబస్తీ షాలిబండలో వెలసిన ప్రాచీన అక్కన్న మాదన్న మహంకాళీ దేవాలయం, పాతబస్తీలోని లాల్‌దర్వాజా మహంకాళి అమ్మవారి దేవాలయాలు ప్రముఖంగా బోనాల ఉత్సవాలను నిర్వహిస్తాయి. జంటనగరాల ప్రజలే కాకుండా తెలంగాణ ప్రాంతంలోని గ్రామాల్లో అక్కడి గ్రామదేవతలకు బోనాలు సమర్పిస్తూ లక్షలాదిగా ప్రజలు ఈ ఉత్సవాలకు తరలివస్తారు. కలశంలో అమ్మవారిని ఆవాహన చేసి పురవీధులలో ఊరేగిస్తారు.సాయంత్రం అమ్మవారు ఘటోత్సవంలో ఘటంపై సూక్ష్మరూపంలో ఆశీనురాలై పురవీధులగుండా సంచారం చేస్తూ భక్తుల పూజలు అందుకుంటుందని భక్తుల నమ్మి అమ్మకు నీరాజనాలందిస్తారు. మహిళలు బోనాలను నెత్తిన పెట్టుకుని తప్పెట్ల మోతలతో, మంగళవాయిద్యాలతో విభిన్న రీతుల నృత్యాలు చేసే పురుషులు వెంటరాగా అమ్మవారి గుడికి ఆనందోత్సాహాలతో వచ్చి అమ్మను అనేకరకాలు అలంకరణలు చేసి, అర్చనలు చేసి హారతులిచ్చి అమ్మను పూజిస్తారు. ఇలా వచ్చినవారంతా అమ్మదయచల్లగా తమను సోకాలని సాకను సమర్పిస్తారు. శరీరమంతా పసుపు రాసుకుని, లంగోటి ధరించి, కాళ్ళకు గజ్జెలు కట్టుకుని, కళ్ళకు కాటుకతో, కుంకుమ దిద్దుకుని, నోటిలో పచ్చటి నిమ్మకాయలు పెట్టుకుని నడుము చుట్టూ వేపమండలు కట్టుకుని, కొరడాగా చేసుకున్న పసుపుతాడును ఝుళిపించుకుంటూ తప్పెట వాయిద్యాలకు అనుగుణంగా నాట్యం చేస్తూ ఆనందోత్సాహాల మధ్య పోతురాజులు కదిలివెళ్ళడం బోనాల పండుగలో ఓ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఈ అమ్మజాతరను చూచితీరవలసిందే కాని వర్ణించడానికి నోర్లు చాలవు.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list