MohanPublications Print Books Online store clik Here Devullu.com

మజా మజా.. మొక్కజొన్న రుచులు-Maja Maja Mokkajunna


మజా మజా.. మొక్కజొన్న రుచులు 

చినుకులు పడుతున్నప్పుడు ఉప్పూ, నిమ్మకాయ రసం పట్టించిన వేడివేడి మొక్కజొన్న పొత్తు తింటుంటే.. ఆ మజాయే వేరు కదూ.. ఈ కాలంలో దాంతోపాటూ మరికొన్ని పదార్థాలూ రుచి చూసేద్దాం. ఇంటిల్లిపాది చేత వహ్వా అనిపించేద్దాం.

కర్రీ 
కావల్సినవి: లేత మొక్కజొన్న - ఒకటి (ముక్కల్లా కోయాలి), ఉడికించిన స్వీట్‌కార్న్‌ - రెండు కప్పులు, ఉల్లిపాయ - ఒకటి, అల్లంవెల్లుల్లి ముద్ద - రెండు చెంచాలు, కరివేపాకు - రెండు రెబ్బలు, ఆవాలు - అరచెంచా, ఉప్పు - తగినంత, పసుపు - అరచెంచా, ధనియాలపొడి,జీలకర్రపొడి - చెంచా చొప్పున, పల్లీలపొడి - రెండు చెంచాలు, కొబ్బరిపాలు - అరకప్పు, పచ్చిమిర్చి - మూడు, ఆలివ్‌నూనె - టేబుల్‌స్పూను, టొమాటో గుజ్జు - టేబుల్‌స్పూను, కారం - చెంచా, కొత్తిమీరతరుగు-కొద్దిగా.
తయారీ: బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక ఆవాలు వేయించాలి. రెండు మూడు నిమిషాలయ్యాక కరివేపాకూ, అల్లంవెల్లుల్లి ముద్దా, ఉల్లిపాయలూ వేయాలి. ఉల్లిపాయలు రంగు మారాక టొమాటో గుజ్జూ, పచ్చిమిర్చీ, కారం, ఉప్పూ, జీలకర్రపొడీ, ధనియాలపొడీ, పసుపూ వేసి మంట తగ్గించాలి. ఇది గ్రేవీలా తయారయ్యాక పల్లీలపొడీ, కాసిని నీళ్లూ పోయాలి. ఇందులో మొక్కజొన్నా, స్వీట్‌కార్న్‌ ముక్కలు వేయాలి. మొక్కజొన్న ముక్కలు ఉడికాక కొబ్బరిపాలు పోయాలి. గ్రేవీలా చిక్కగా తయారయ్యాక కొత్తిమీర తరుగు వేసి దింపేయాలి.

కార్న్‌ మసాలా
కావల్సినవి: మసాలా కోసం: లవంగాలు - ఎనిమిది, మిరియాలు - చెంచా, యాలకులు - ఆరు, ధనియాలు, జీలకర్ర - టేబుల్‌ స్పూను చొప్పున, దాల్చిన చెక్క - చిన్న ముక్క.

ఇతర పదార్ధాలు: మొక్కజొన్న గింజలు - కప్పు, నూనె - టేబుల్‌స్పూను, జీలకర్ర, మినప్పప్పు, సెనగపప్పు - చెంచా చొప్పున, కరివేపాకు - రెండు రెబ్బలు, పచ్చిమిర్చి - రెండు, ఉల్లిపాయ - ఒకటి, వెల్లుల్లి రెబ్బలు - రెండు, అల్లం తరుగు - చెంచా, కొబ్బరి తురుము - అరకప్పు, పసుపు - అరచెంచా, కారం - చెంచా, ధనియాలపొడి - రెండు చెంచాలు, ఉప్పు - తగినంత, చింతపండురసం - మూడు చెంచాలు, బెల్లం తరుగు - చెంచా, గరంమసాలా - చెంచా, నిమ్మరసం - కొద్దిగా.

తయారీ: ముందుగా మసాలా కోసం పెట్టుకున్న పదార్థాలన్నింటినీ నూనె లేకుండా వేయించి తీసుకోవాలి. వేడి చల్లారాక పొడిలా చేసుకోవాలి. బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక జీలకర్రా, మినప్పప్పూ, సెనగపప్పు వేయించాలి. రెండు నిమిషాలయ్యాక కరివేపాకూ, పచ్చిమిర్చీ, ఉల్లిపాయ ముక్కలూ, అల్లం,వెల్లుల్లి తరుగు వేయాలి. ఉల్లిపాయలు వేగాక కొబ్బరితురుము కలపాలి. కొబ్బరి పచ్చివాసన పోయాక పసుపూ, కారం, ధనియాలపొడీ, ముందుగా చేసుకున్న మసాలాలో అరచెంచా, తగినంత ఉప్పూ, కాసిని నీళ్లూ, చింతపండు రసం, బెల్లం తరుగూ, మొక్కజొన్న గింజలూ వేయాలి. ఆ గింజలు ఉడికాయనుకున్నాక గరంమసాలా, నిమ్మరసం వేసి దింపేస్తే చాలు.

చీజ్‌టిక్కీ
కావల్సినవి: లేత మొక్కజొన్న గింజలు - ముప్పావుకప్పు, స్వీట్‌కార్న్‌ - అరకప్పు, చీజ్‌ - అరకప్పు, ఉల్లికాడల తరుగు - చెంచా, కొత్తిమీర - కట్ట, ఎండుమిర్చి గింజలు - అరచెంచా, ఉప్పు - తగినంత, మొక్కజొన్న పిండి - టేబుల్‌స్పూను, నూనె - వేయించేందుకు సరిపడా

తయారీ: నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ ఓ గిన్నెలోకి తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి. తరవాత టిక్కీల్లా చేసుకుని కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇవి వేడివేడిగా తింటేనే బాగుంటాయి.

పాన్‌కేక్‌
కావల్సినవి: మొక్కజొన్న పిండి - రెండు కప్పులు, వెన్న - అరకప్పు, ఉప్పు - చెంచా, చక్కెర - చిటికెడు, కూరగాయలు ఉడికించిన నీరు - అరకప్పు, బేకింగ్‌ పౌడర్‌ - చెంచా, మిరియాలపొడి - పావుచెంచా, తాజా మొక్కజొన్న గింజలు - రెండున్నర కప్పులు, చీజ్‌ - ఒకటిన్నర కప్పు, ఎండుమిర్చి గింజలు - అరచెంచా, టొమాటోలు - రెండు.

తయారీ: మిక్సీలో మొక్కజొన్న గింజలూ, చీజ్‌ తురుమూ వేసి మరీ మెత్తగా కాకుండా చేసుకోవాలి. అందులోనే సగం వెన్నా, మొక్కజొన్నపిండీ, ఉప్పూ, చక్కెరా, మిరియాలపొడీ, బేకింగ్‌పౌడర్‌ వేసి మరోసారి మిక్సీపట్టాలి. తరవాత కూరగాయలు ఉడికించిన నీరు వేయాలి. ఇందులో ఎండుమిర్చి గింజలూ, టొమాటో ముక్కలూ కలపాలి. తరవాత ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న దోశల్లా వేసుకుని మిగిలిన వెన్నతో కాల్చుకోవాలి.

థాయ్‌ రైస్‌
కావల్సినవి: బాస్మతీ బియ్యం - కప్పు, వెల్లుల్లి రెబ్బలు - ఐదు, ఉల్లికాడల తరుగు - పావుకప్పు, ఎరుపురంగు క్యాప్సికం - రెండు, నిమ్మరసం - చెంచా, మొక్కజొన్న గింజలు - అరకప్పు, సోయా సాస్‌ - ముప్పావుచెంచా, ఎండుమిర్చి గింజలు - చెంచా, రొయ్యలు - ఐదారు, ఆలివ్‌నూనె - టేబుల్‌స్పూను, ఉప్పు -తగినంత, మిరియాలపొడి - అరచెంచా.

తయారీ: బియ్యాన్ని కడిగి పొడిపొడిగా అన్నం వండి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేడిచేసి మొక్కజొన్న గింజలూ, పొడుగ్గా తరిగిన క్యాప్సికం, వెల్లుల్లి రెబ్బలూ, ఉల్లికాడల తరుగూ వేసి వేయించుకోవాలి. ఐదారు నిమిషాలయ్యాక శుభ్రంచేసిన రొయ్యలూ, అన్నం, సోయాసాస్‌, ఎండుమిర్చి గింజలూ, తగినంత ఉప్పూ, మిరియాలపొడీ.. వేసి బాగా కలపాలి. రెండుమూడు నిమిషాలయ్యాక దింపేస్తే చాలు.




No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list