MohanPublications Print Books Online store clik Here Devullu.com

కొత్త చట్టంలో ఎవరికేమిటి-New Rules


కొత్త చట్టంలో ఎవరికేమిటి?

స్థిరాస్తుల విషయంలో ఇప్పటికే అనేక చట్టాలున్నాయి. మరి, కొత్త స్థిరాస్తి నియంత్రణ చట్టం (రెరా) ప్రత్యేకత ఏమిటి? కొనుగోలుదార్లకూ, నిర్మాణదార్లకూ దీనివల్ల ఎలాంటి లాభాలున్నాయి? నష్టాలేమైనా ఉన్నాయా? తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? చట్టం ఏం చెబుతోంది? తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది!
రాస్తి హక్కుల సంక్రమణ, బదిలీ, పత్రాల నమోదు, స్థల అభివృద్ధి, కట్టడాలకు సంబంధించి చట్టాలు మారలేదు.. ఇప్పటికే ఉన్న అపార్ట్‌మెంట్‌ చట్లాల్లో స్థిరాస్తి ఔత్సాహికుల (అభివృద్ధి/నిర్మాణదారుల) విధులు, బాధ్యతలు ఉన్నాయి. మరి, కొత్తగా స్థిరాస్తి నియంత్రణ చట్టం గురించి ఇంత చర్చ, భయాలు, ఆందోళనలు, అత్యుత్సాహాలు అర్భాటాలు ఎందుకు? ఈ చట్టం స్థిరాస్తి అభివృద్ధి, అమ్మకం వ్యాపార స్వరూపాన్ని సమూలంగా మార్చేస్తుందా? స్థానిక, దేశీయ సంస్థలను పరిశ్రమ నుంచి బయటకు నెట్టి, ఆ స్థానంలో విదేశీ సంస్థలకు లేదా బడా వ్యాపార సంస్థల ప్రవేశానికి అవకాశం కల్పిస్తుందా? ఏకస్వామ్యం లేదా సిండికేట్ల అనుచిత వ్యాపారానికి దారి తీస్తుందా? స్థలాలు, వాటాలు, ఇళ్ల ధరలు ఆకాశాన్ని అంటుతాయా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పుకునే ముందు ఈ చట్టంలో కొత్తేముంది? అది మనకు ఎంత వరకూ ఉపయోగపడుతుందో పరిశీలిద్దాం!
అన్ని వివరాలూ అర చేతిలో..
ఇప్పటి వరకూ ఉన్న అనేక చట్టాలున్నాయి. కానీ, వాటి అమలుకు సరైన యంత్రాంగం లేదు. ఒకవేళ మున్సిపల్‌ చట్టాల విషయంలో ఉన్నా.. దానిలో పారదర్శకత లేదు. ఈ రెండింటినీ ఈ చట్టం ప్రవేశపెడుతోంది.
ఇక ఈ చట్టం ద్వారా వచ్చే విప్లవాత్మక మార్పుల విష¾యానికి వస్తే..
ఇంతవరకూ ఫ్లాట్లకు మాత్రమే చట్టం ఉంది. ఇప్పుడు ఇళ్లకూ, ఇళ్ల స్థలాలకు కూడా చట్టం సమానంగా వర్తిస్తుంది.
కొనుగోలుదార్లకు సాధికారత: ఔత్సాహికులు స్థిరాస్తి పథకాన్ని(రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టు) చట్ట ప్రకారం నమోదు చేసుకునేప్పుడు తమ గురించి, తమ గత అయిదేళ్ల కాలంలో చేపట్టిన స్థిరాస్తి పథకాల స్థితి, కేసులు, బకాయీలు, ప్రస్తుత పథకం, అమ్మకాలు, ప్రగతి తదితర అన్ని వివరాలూ, పత్రాలనూ తెలియజేయాలి. అందుబాటులో ఉంచాలి. వీటన్నింటినీ స్థిరాస్తి నియంత్రణ సంస్థ వెబ్‌సైటులో తమకు కేటాయించిన పేజీలో నమోదు చేయాలి. దీనివల్ల కొనుగోలుదారుడికి ప్రతి విషయం, పత్రం అందుబాటులో ఉంటుంది. అభివృద్ధి/నిర్మాణదారు తాను చేపట్టే పథకానికి రాత పూర్వకంగా బద్దుడవుతాడు. మాటలకు, చేతలకూ తేడా ఇట్టే రుజువు అవుతుంది. దీనివల్ల కొనుగోలుదారుడు ఏ చర్యలు చేపట్టాలన్నా దానికి కావాల్సిన పత్రాలు, రుజువులు వెతుక్కోనక్కర్లేదు.
* అన్ని విషయాలూ తెల్సుకొనే కొనుక్కోవచ్చు. మోసానికి ఆస్కారం లేదు. 
* నియంత్రణ సంస్థ కూడా ప్రజా వీక్షణం కోసం సంస్థ వెబ్‌సైటులో అభివృద్ధి/నిర్మాణదార్ల పేర్లు, ఫొటోలు, వారి ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్ల వివరాలు, ఎగవేతదార్ల వివరాలకు సంబంధించిన సమాచారాన్ని నిక్షిప్తం చేయాలి. 
* పై సమాచారం అసమగ్రంగా, అసత్యపూర్వకంగాగానీ ఉంటే ఫిర్యాదు చేయవచ్చు. నియంత్రణ సంస్థ వివరణ ఇవ్వాల్సిందిగా అభివృద్ధి/నిర్మాణదారులను కోరవచ్చు. లేదా విచారణకు ఎవరినైనా నియమించవచ్చు. 
* అభివృద్ధి/నిర్మాణదారుడు ఇచ్చిన సమాచారం, కరపత్రం, ప్రకటన, నోటీసుల్లో నమూనా ఇల్లు/ఫ్లాటు/స్థలానికి సంబంధించి అసత్య సమాచారం ఉందనీ, అందువల్ల నష్టపోయానని కొనుగోలుదారుడు భావిస్తే, కొనుగోలు రద్దు చేసుకొని వడ్డీతో సహా తన సొమ్మును తిరిగి ఇమ్మని, నష్ట పరిహారం కట్టమని కోరవచ్చు. లేదా రద్దు చేయకుండా నష్ట పరిహారం అడగవచ్చు. కాబట్టి, నిర్మాణ సంస్థ తాను చెప్పిందే చెయ్యాలి. చేసేదే చెప్పాలి. సంస్థాగతంగా లభించే సమాచారం, పారదర్శకత వల్ల కొనుగోలుదారుడు తాను కోరుకున్నదే ఖరారుగా ఎంపిక చేసుకోవచ్చు. తనకు చెప్పింది లేదా చూపించినదానికి వ్యతిరేకంగా ఉంటే నిలదీసి అడగవచ్చు. 
* కొనుగోలుదారుడు అడిగిన వాటికి జవాబు చెప్పాలి. పత్రాలు ఇవ్వాలి.
నమోదు లేకుంటే నేరమే!
స్థిరాస్తి నియంత్రణ చట్టం.. ఒక పటిష్ఠమైన నియంత్రణ యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది. ఈ నియంత్రణ సంస్థకు అనేక అధికారాలున్నాయి.. అవేమిటంటే..
* స్థిరాస్తి పథకాల నమోదు చేయడం. నమోదు తర్వాత నిబంధనలు పాటించని ప్రాజెక్టులను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా రద్దు చేయడం. లేదా నమోదును పొడిగించడం. 
* ఒక ప్రాజెక్టుపై స్వయంగాగానీ, లేదా ఫిర్యాదు మేరకుగానీ విచారణ చేపట్టవచ్చు. అవసరమైతే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వవచ్చు. 
* ఏదైనా ఉల్లంఘన లేదా తప్పిదం జరిగితే విచారించి నష్టపరిహారం, వడ్డీ, జరిమానాలు విధించవచ్చు.
పై వాటన్నింటిలో అత్యంత శక్తిమంతమైనది.. స్థిరాస్తి పథకం నమోదు ప్రక్రియ నమోదు కోసం పెట్టుకునే దరఖాస్తుతోపాటు నిర్మాణ సంస్థకు గత అయిదేళ్లుగా పూర్తి చేసిన , నిర్మాణంలో ఉన్న అన్ని స్థిరాస్తి పథకాల వివరాలు జతచేయాలి. అంటే, ఇందులో ఏమైనా అవకతవకలు ఉంటే నమోదు నిరాకరించే అవకాశం ఉంది.
* నిర్మాణ/అభివృద్ధిదారు ఎన్ని రోజుల్లో పథకాన్ని పూర్తి చేస్తానని ప్రకటిస్తాడో, రిజిస్ట్రేషన్‌ అంతకాలం ఉంటుంది. అంటే, పథకానికి సంబంధించిన అనుమతి 5 లేదా 7 ఏళ్లున్నా తాను కేవలం రెండేళ్లలోనే పూర్తి చేస్తానని ప్రకటిస్తే నమోదు రెండేళ్లకే ఉంటుంది. దాన్ని పొడిగించాలంటే.. అభివృద్ధి/నిర్మాణదారుని తప్పు లేని కారణం కావాలి. లేదా దైవికమైన కారణమైనా అయి ఉండాలి. మొత్తం సంవత్సర కాలానికి మించి పొడిగించరాదు. 
* స్థిరాస్తి ప్రాజెక్టును నమోదు చేయకుండా అమ్మకాలు చేయరాదు. ఇది నేరం. పైగా నియంత్రణ సంస్థ తగు చర్యలు చేపట్టేందుకు విస్తృతమైన అధికారాలున్నాయి. 
* నమోదును రద్దు చేసే అధికారాలు కూడా నియంత్రణ సంస్థకు ఉన్నాయి. ఈ కింది సందర్భాల్లో నమోదును తాత్కాలికంగాగానీ, శాశ్వతంగాగానీ రద్దు చేయవచ్చు. 
* నియంత్రణ చట్టం నియమ నిబంధనల్ని ఉల్లంఘించినప్పుడు. 
* అభివృద్ధి, నిర్మాణాలకు ఇచ్చిన అనుమతి షరతుల్ని పాటించనప్పుడు. 
* అనుచితమైన లేక అక్రమమైన వ్యాపార పద్ధతులకు పాల్పడినప్పుడు. అంటే, అమ్మకం కోసం మోసపూరిత అబద్ధపు ప్రచారాన్ని, ప్రకటనల్నీ, మాటల్లోకానీ, దృశ్యంగా కానీ, చేసినప్పుడు. నమూనా ఇల్లు/ఫ్లాటు/స్థలం ప్రదర్శన కూడా ఇందులో భాగమే. తాను చేయకపోయినా, మరొకరితో చేయించినా కష్టమే.
రద్దయితే ఇబ్బందే..
ఒకసారి స్థిరాస్తి ప్రాజెక్టును నియంత్రణ సంస్థ రద్దు చేసిందంటే.. దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వ్యాపారానికీ, ప్రతిష్ఠకూ కోలుకోలేని నష్టం జరుగుతుంది. ఎందుకంటే...
* నమోదు రద్దు కాగానే ఔత్సాహికుడు నియంత్రణ సంస్థ వెబ్‌సైటులో తనకు కేటాయించిన పేజీని కోల్పోతాడు. 
* అతన్ని తప్పు చేసిన వారి జాబితాలో చేరుస్తారు. అతని ఫొటో ప్రదర్శిస్తారు. అంతేకాదు.. ఇతర రాష్ట్రాల నియంత్రణ సంస్థలకు తెలియజేస్తారు. అంటే పది స్థిరాస్తి పథకాలున్నా, ఒక్క దానిలో తప్పు జరిగినా పర్యవసానం ఇదే. 
* మిగతా పథకాన్ని అమలు చేసే హక్కునూ కోల్పోతాడు. నియంత్రణ సంస్థ దాన్ని స్థానిక సంస్థకు అప్పచెప్పవచ్చు. కొనుగోలుదార్ల సంఘానికి ఈ విషయంలో మొదటి హక్కు ఉంటుంది. ఏ దశలో అయినా ఈ పని చేయవచ్చు. ఔత్సాహికుని పెట్టుబడికి సంబంధించి చట్టంలో ఏ స్పష్టతా లేదు. 
* స్తిరాస్తి పథకానికి సంబంధించిన బ్యాంకు ఖాతాను స్తంభింప చేస్తారు. అందులో ఉన్న సొమ్మును పథకానికి వెచ్చిస్తారు. 
* సంస్థ ప్రజా ప్రయోజనార్థం ఆదేశాలు ఇవొచ్చు. చర్యలు చేపట్టవచ్చు. 
* కొనుగోలుదారుడు తన కొనుగోలు రద్దు చేసుకోవచ్చు. తాను కట్టిన సొమ్మును తిరిగి వడ్డీతో సహా పొందవచ్చు. పైగా నష్టపరిహారాన్ని అడగవచ్చు. 
* నమోదు రద్దు చేసేముందు పూర్తి అభియోగాల వివరాలతో ఔత్సాహికుడు/సంస్థకు 30 రోజుల నోటీసును ఇవ్వాలి. ఈ లోపు వారు సంజాయిషీని సమర్పించాలి. దీన్ని పరిశీలించి, సరైన కారణాలుంటేనే రద్దు చెయ్యాలి. అయితే, రద్దుకు బదులు, కొన్ని షరతులపై స్థిరాస్తి పథకాన్ని ఔత్సాహికుడు కొనసాగించేలా కూడా సంస్థ ఆదేశాలు ఇవ్వవచ్చు.
కొనుగోలుదార్లకూ బాధ్యతలున్నాయి
ఇప్పటి వరకూ అమల్లో ఉన్న చట్టాల మాదిరిగా కాకుండా.. కొత్త చట్టంలో కొనుగోలుదార్లకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అవేమిటంటే..
* కొనుగోలుదారు వాయిదా ప్రకారం క్రయధనాన్ని క్రమం తప్పకుండా చెల్లించాలి. వాయిదాలు ఆలస్యం అయితే, నిర్ణీత రేటు ప్రకారం వడ్డీ కట్టాలి. 
* తన వంతు రిజిస్ట్రేషన్‌ ఖర్చులు, పన్నులు, నీరు, కరెంటు బాకీలు వగైరాలు నిర్ణీత సమయంలో, నిర్ణీత ప్రదేశంలో కట్టాలి. 
* కొనుగోలుదార్ల సంఘంలో పాలుపంచుకోవాలి. 
* ఆక్రమణ ధ్రువ ప్రతం (ఆక్యుపేషన్‌ సర్టిఫికేట్‌) వచ్చిన రెండు నెలల్లోగా ఫ్లాటు/స్థలం/ ఇల్లు స్వాధీనం చేసుకోవాలి. 
* ఆంధ్రప్రదేశ్‌తో సహా రాష్ట్రాలు చేసిన నిబంధనల ప్రకారం కొనుగోలుదారులు ముఖ్యంగా ప్రవాస భారతీయులు, తాము చెల్లిస్తున్న క్రయధనం విదేశీ మారకం నిర్వహణ చట్టం, రిజర్వు బ్యాంకు చట్టం, ఇతర చట్టాలకు అనుగుణంగా ఉండేటట్టుగా బాధ్యత వహించాలి. ఈ విషయంలో ఔత్సాహికులకు ఏ సంబంధం లేదు. 
* క్రయధనం చెల్లింపులకు సంబంధించిన విషయంలో పూర్తి బాధ్యత వహించాలి. ఔత్సాహికులకు నష్టపరిహారం చెల్లించాలి. క్రయధనం ఎవరు చెల్లించారన్నదానితో సంబంధం లేకుండా కొనుగోలుదారుడి పేరుమీదే రశీదు ఉంటుంది. 
* అగ్రిమెంటులో వాయిదాల ప్రకారం క్రయధనం కట్టకపోతే ఒప్పందం ప్రకారం నోటీసు ఇచ్చి, ఔత్సాహికుడు అమ్మకాన్ని రద్దు చేయవచ్చు. నష్ట పరిహారం కోరవచ్చు. 
* ఔత్సాహికుని తప్పు లేకుండా, కొనుగోలుదారు ఒప్పందాన్ని రద్దు చేస్తే, బయానా సొమ్మును మినహాయించుకొని, మిగిలిన సొమ్మునే ఔత్సాహికుడు వాపసు చేయాలి.
జాగ్రత్తలేమిటి?
మీరు కొనుగోలుదారులా... 
* రిజిస్ట్రేషన్‌ ఉన్న స్థిరాస్తి పథకంలోని స్థలం/ఫ్లాటు/ఇల్లు కొనుక్కోవాలి. ఔత్సాహికుల్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. 
* నియంత్రణ సంస్థ వెబ్‌సైటును పూర్తిగా తనిఖీ చేసి, సంబంధిత సమాచారాన్ని తెలుసుకోవాలి. ఎప్పుడూ తాజా సమాచారాన్ని గమనిస్తూ ఉండాలి. ఏజెంట్ల మాటలు కాకుండా, వెబ్‌సైట్‌లో ఉన్న విషయాల్నే నమ్మాలి. 
* చట్టప్రకారం ఔత్సాహికులు ఇవ్వాల్సిన పత్రాల్ని, సమాచారాన్ని తెలుసుకోవాలి. వాటిని న్యాయవాదితో పరిశీలింప చేసుకోవాలి. 
* నిర్ణీత పత్రంలోనే ఒప్పందం కుదుర్చుకోవాలి. ఒప్పందం ప్రకారం వాయిదాలు కట్టాలి. 
* ఆదాయపు పన్ను, ఇతర పన్నులు బినామీ, ఇతర ఆర్థిక చట్టాలకు అనుగుణంగా క్రయధనాన్ని సమకూర్చుకోవాలి.
అభివృద్ధి/నిర్మాణదారులైతే..
ఔత్సాహికులు (అభివృద్ధి/నిర్మాణదారులు) తీసుకోవాల్సిన మొదటి జాగ్రత్త.. భూమి యాజమాన్య హక్కుల విషయంలో. ఎందుకంటే ఈ హక్కులకు సంబంధించిన ఏ కేసు ఉన్నా తెలియపర్చాలి. కాల పరిమితి (లిమిటేషన్‌)తో నిమిత్తం లేకుండా కొనుగోలుదారుని నష్ట పరిహారం చెల్లించాలి. అయితే, కొనుగోలుదారు సరైన హక్కు లేదని రుజువు చెయ్యాలి. అందుకే, భూ యజమానితో అయ్యే ఒప్పందాన్ని నిపుణులతో రాయించుకోవాలి.
* భూ యాజమాన్య హక్కుల బీమా తీసుకోవాలని చట్టం చెబుతోంది. కానీ, అలాంటి బీమా ప్రస్తుతం దేశంలో ఏ బీమా కంపెనీ ఇచ్చే స్థితిలో లేదు. అలాంటి నైపుణ్యం, అనుభవం కల్గిన వారు దేశంలో లేరు. విదేశీ సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. భూ యాజమాన్య హక్కుల విషయంలో వారు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఏ మాత్రం అనుమానం ఉన్నా బీమా ప్రీమియం పెంచే అవకాశం ఉంది. బీమా ప్రీమియం పెరిగితే.. మీరు అమ్మే స్థలం/ఫ్లాటు/ఇల్లు ధరలు పెరిగి మీకు అమ్మకాలు కష్టం కావచ్చు. ఇవ్వకపోతే మీరు స్థిరాస్తి పథకాన్ని అమలు చేయడం అసాధ్యం. 
* మాటకారితనంతో మార్కెటింగ్‌ చేసి, అతిశయంగా ప్రకటనలు చేసి, నమూనా స్థలం/ఫ్లాటు/ఇల్లు ఆడంబరంగా చూపించి అమ్మితే కష్టమే. కేవలం అలాంటి మాటల వల్ల, ప్రకటలన వల్ల తాను మోసపోయానని, నష్టపోయాననే వంకతో, కొనుగోలు నమోదు చేసుకున్న కొనుగోలుదారుడు లాభాపేక్షతో, స్తోమత లేకనో.. కొనుగోలు నమోదును (బుకింగ్‌) /ఒప్పందాన్ని రద్దు చేసుకొని, వడ్డీతో సహా తాను కట్టిన సొమ్మును తిరిగి తీసుకోవచ్చు. నస్టపరిహారం అడగవచ్చు. మీ తప్పిదాలను గోరంతలు కొండంతలు చూపే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి, బుకింగ్‌లతోనే సంబరపడవద్దు. కొనుగోలుదారుడి స్తోమత, సద్భుద్ధి, గతచరిత్రలను ముందే తెల్సుకోండి. 
* మీరు ఇవ్వచూపే వస్తు, సేవలు.. వాటి నాణ్యత 5ఏళ్లపాటు వాటి లోపాలను సవరించాల్సిన బాధ్యత మీపై ఉంటుంది. వాటి వినియోగంపై మీకు ఎలాంటి అదుపూ ఉండదు. వాటిని షరతుల ప్రకారం వాడారా లేదా అన్నది చట్టం పట్టించుకున్నట్లు కనిపించదు. 
* స్థిరాస్తి పథకం ఆర్థిక నిర్వహణ ఇకపై పెద్ద సవాలు. నగదు లావాదేవీలపై ఆంక్షలు, వస్తు సేవల పన్ను, ఆదాయపు పన్ను, బినామీ నిరోధక చట్టంలాంటి అనేక చట్టాల ప్రభావాన్ని గమనించండి. ఒప్పందం లేకుండా 10 శాతం మించి తీసుకోరాదు. వసూలైన సొమ్ములో 70 శాతం ప్రత్యేక ఖాతాలో జమ చేయాలి. దాన్ని పూర్తయిన పనికే వాడాలనే నిబంధన ఉంది. దీనివల్ల కొన్ని స్థలాలు/ఫ్లాట్లను కొంత తక్కువ ధరకైనా ముందస్తు చెల్లింపునకు అమ్ముకొని, ఆ డబ్బు వాడే అవకాశం పోతుంది. మీకు సొంత వనరులు ఉండాల్సిందే. అది పన్ను మదింపు అయిన తెల్లధనం. బ్యాంకు ఆర్థిక సహాయం స్థిరాస్తి పథకాలకు ఇక చాలా అవసరం. వడ్డీ లెక్కలు కూడా. ఏదైనా మీరు ముందే పథకంపై అప్పు తీసుకోవాలి. తిరిగి చెల్లింపులకు వసూళ్లను అనుసంధానం చేయాలి. ఎందుకంటే.. అమ్మకాలు మొదలయ్యాక మీరు ఈ తనఖా చేయలేరు. చేసినా చెల్లదు. 
* ఇప్పటి వరకూ చట్టాన్ని కాక అధికారాన్ని నమ్ముకొని వ్యాపారాన్ని చేస్తుంటే.. మీ పద్ధతి మార్చుకోండి. ఎందుకంటే రాజకీయ జోక్యంతో అవినీతితో నిర్వీర్యమైన వ్యవస్థ, పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం, ప్రజల అవసరాల దృష్ట్యా మళ్లీ జవసత్వాలు పుంజుకొంటోంది. విచక్షణాధికాలను కత్తిరిస్తోంది. ఆధార్‌, పాన్‌ నెంబర్లతో లావాదేవీల అనుసంధానం చేసి, ప్రతి ఒక్కరి రహస్యాలు బట్టబయలు చేస్తోంది. ఎక్కడోక్కడ మీరు దొరికిపోవచ్చు. విచారణ స్థాయి మీ పలుకుబడిని దాటిపోవచ్చు. అందుకే, చట్టాన్ని తెలుసుకోండి. వృత్తిపరమైన నిపుణుల సలహాలు స్వీకరించండి. 
* ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ చట్టం శాసనాలు, లావాదేవీలో చెప్పిన వాటి అమలునే లక్ష్యంగా పెట్టుకొంది. అలాగే మీరు చెప్పినవి కూడా. చట్టాలను తప్పించుకొనే ప్రయత్నం చేయవద్దు. చట్టాల్లో ఉన్న మీ హక్కుల్ని బాధ్యతల ప్రకారం మీ వ్యాపార వ్యూహాల్ని రచించుకోండి. నిశ్చితంగా ఉండండి.
స్థిరాస్తి ఏజెంట్లు: ఈ చట్టంలో మరో కొత్త విషయం ఇది. స్థిరాస్తి ఏజంట్లు అంటే ఏదో కమిషన్‌ కోసం ఫ్లాట్లు, స్థలాలును అమ్మించి పెట్టేవారు మాత్రమే కాదు. దానికి చాలా విస్తృతార్థం ఉంది. స్థిరాస్తి పథకంలోని స్థలం/ఫ్లాటు/ఇల్లు ఏదైనా అమ్మకం కోసం బేరం చేసినా, ఇద్దరి వ్యక్తుల నడుమ మధ్యవర్తిగా, లేదా అనుసంధానంగా వ్యవహరించినా, లేదా అవకాశం కల్పించినా స్థిరాస్తి ఏజెంటే. అంతర్జాలంలో అమ్మే లేదా అమ్మించే వెబ్‌సైట్లు, ప్రకటనలు ప్రచురించే పత్రికలు, ప్రసార మాధ్యమాలు అందరూ ఈ నిర్వచనం పరిధిలోకి వస్తారు. వారంతా ఇకపై నమోదు చేయించుకోవాల్సి వస్తుంది.


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list