MohanPublications Print Books Online store clik Here Devullu.com

కాలబైరవాష్టకమ్_Kalabhairava Astakam-


Kalabhairava Astakam కాలబైరవాష్టకమ్ #Kalabhairavastakam





#కాలభైరవాష్టమి
10-12-17
    #Kalabhairavastakam

    మార్గశిర మాసంలోని శుక్లపక్ష అష్టమి- ‘‘కాలభైరవాష్టమి”. పరమ శివుడి వల్ల కాలభైరవుడు ఆవిర్భవించిన రోజే ‘కాలభైరవాష్టమి’. లయకారుడైన పరమశివుడివల్ల ఆవిర్భవించి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి ఐదవ శిరస్సును ఖండించిన కాశీ క్షేత్రంలో క్షేత్ర పాలకుడుగా కొలువుదీరిన దేవడు - కాలభైరవుడు. శ్రీకాలభైరవుడు ఆవిర్భవించిన ‘‘కాలభైరవాష్టమి” పర్వదినమును జరుపుకుని కాలభైరవుడిని పూజించాలని శాస్తవ్రచనం.
కాలభైరవస్వామి ఆవిర్భవానికి సంబంధించి ‘‘శివపురాణం”లో ఆసక్తికరమైన పురాణగాధ వుంది. పూర్వం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడికి శివుడికి మధ్య ఒక వివాదం ఏర్పడింది. బ్రహ్మదేవుడు శివుడివద్దకు వెళ్ళి - ‘‘నేనే సృష్టికర్తను... పరబ్రహ్మ స్వరూపుడను... నేను చెప్పినట్లుగానే మీరందరూ నడుచుకోవాలి” అని పలికాడు. శివుడు అందుకు వ్యతిరేకించాడు. దీనితో ఇద్దరి మధ్య వాదం ప్రారంభమై చాలాసేపు వారిద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. బ్రహ్మదేవుడు మధ్యన వున్న తన ఐదవ శిరస్సుతో శివుడిని తూలనాడడం ప్రారంభించాడు. దీనితో కోపోద్రిక్తుడైన శివుడు హూంకరించాడు. ఆ హూంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది. మహోన్నతకాయముతో... మూడు నేత్రాలతో త్రిశూలము, గద, ఢమరుకము వంటి వాటిని చేతులతో ధరించిన ఆ భయంకర రూపుడే - శ్రీకాలభైరవుడు.
ఈ విధంగా శివుడి హూంకారంతో జన్మించిన కాలభైరవుడు తన జననానికి కారణం చెప్పమని శివుడిని కోరాడు. శివుడి ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుడి ఐదు శిరస్సులలో మధ్యనవున్న ఐదవ శిరస్సును ఖండించాడు. దీనితో బ్రహ్మదేవుడి గర్వం అణిగిపోయింది. అనంతరం శ్రీకాలభైరవుడు లయకారుడైన శివుడి ముందు నిలబడగా- ‘‘నీవు బ్రహ్మదేవుడి శిరస్సును ఖండించడంవల్ల నీకు బ్రహ్మహత్యాపాతకం సోకింది. కనుక నీవు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి తీర్థయాత్రలు చేయమని సలహాయిచ్చాడు. బ్రహ్మహత్యాపాతకమును తొలగించుకునేందుకు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాలలో పర్యటించినా తనకు సోకిన బ్రహ్మహత్యాపాతకము తొలగకపోవడంతో కాలభైరవుడు శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించాడు. కాలభైరవుడి ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు -
“కాలభైరవా! నీవు శివుడి పుత్రుడవు కనుక శివుడితో సమానుడవు. బ్రహ్మ దేవుడి గర్వమును అణుచుటకు జనించినవాడవు. నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఉపయోగం లేదు. కనుక నీవు కాశీ క్షేత్రానికి వెళ్ళు... కాశీ క్షేత్రంలో అడుగుపెట్టినంతనే నీ బ్రహ్మ హత్యాపాతకం భస్మమైపోతుంది” అని సలహాయిచ్చాడు.
దీనితో- కాలభైరవుడు కాశీ నగరానికి చేరుకోవడంతోనే బ్రహ్మహత్యాపాతకం తొలగిపోగా, బ్రహ్మకపాలాన్నీ కాశీలో పూడ్చిపెట్టాడు. బ్రహ్మకపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే - నేటి కాశీ క్షేత్రంలోని ‘‘కపాల మోక్షతీర్థం”. తర్వాత కాశీక్షేత్రంలో శ్రీకాలభైరవుడు కొలువుదీరి క్షేత్రపాలకుడుగా పూజలందుకుంటూ వున్నాడు. కాలభైరవుడిని కాశీలో ముందుగా దర్శించే ఆచారంతోపాటూ... కాశీకి వెళ్ళి వచ్చినవారు ‘‘కాశీ సంతర్పణం” కంటే ముందుగా కాలభైరవ సంతర్పణ చేయడం శ్రీ కాలభైరవస్వామి వారి మహత్మ్యానికి నిదర్శనం.






కాల భైరవ జయంతి శుభాకాంక్షలు



      కాలభైరవుడు పరమేశ్వరుని అపరాంశ. రౌద్రస్వరూపుడు. రక్షాదక్షుడు. దుష్టగ్రహబాధలు నివారించగల శక్తి మంతుడు. కాలభైరవుడు అనగానే హేళనగా కుక్క అనేస్తాం. కుక్కను వాహనంగా చేసుకుని తిరిగే వాడే తప్ప ఆయనే కుక్క కాదు. కుక్క అంటే విశ్వసనీయతకు మారుపేరు. రక్షణకు కూడా తిరుగులేని పేరు. సమయోచిత జ్ఞానానికి ప్రతీక. కాలస్వరూపం ఎరిగిన వాడు. కాలంలాగే తిరుగులేనివాడు. ఎంత వ్యయమైనా తరిగిపోని వాడు. శాశ్వతుడు, నిత్యుడు. కాలభైరవుడు మన పురాణాల ప్రకారం అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, చండ భైరవుడు, క్రోథ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీష్మ భైరవుడు, శంబర భైరవుడు అని 8 రకాలు. వీరు కాక మహాభైరవుడు, స్వర్ణాకర్షణ భైరవుడు మరో ఇద్దరు కనబడతారు. స్వర్ణాకర్షణ భైరవుడు చూడడానికి ఎర్రగా ఉంటాడు. బంగారు రంగు దుస్తులు ధరిస్తాడు. తలపై చంద్రుడు ఉంటాడు. 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో బంగారు పాత్ర ఉంటుంది. స్వర్ణాకర్షణ భైరవుడు సిరి సంపదలు ఇస్తాడని చెబుతారు. ఇతర భైరవుల విషయానికి వస్తే సాధారణంగా భైరవుడు భయంకరాకారుడుగా ఉంటాడు. రౌద్రనేత్రాలు, పదునైన దంతాలు, మండే వెంట్రుకలు, దిగంబరాకారం, పుర్రెల దండ, నాగాభరణం ఉంటాయి. నాలుగు చేతులలో పుర్రె, డమరుకం, శూలం, ఖడ్గం ఉంటాయి. కాలభైరవుని భక్తిశ్రద్ధలతో కొలిచే వారు ”ఓం కాలాకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహే, తన్నో కాలభైరవ ప్రచోదయాత్‌” అని ప్రార్థిస్తారు. మన దేశంలో కాలభైరవ ఆలయాలు ఎక్కువగా లేకున్నా కాలభైరవ క్షేత్రాలు చాలా ఉన్నాయి. ఈ క్షేత్రాలలో ఉండే కాలభైరవుని క్షేత్రపాలకుడు అంటారు. నేపాల్‌, ఇండోనేసియా, థాయ్‌లాండ్‌ దేశాలలో కాలభైరవ పూజ విశేషంగా జరుగుతుంది. ఇక్కడ ఆలయాలలో కాలభైరవుడు ప్రధాన దైవతంగాఉంటాడు. నేపాల్‌ దేశానికి జాతీయ దైవంగా కాలభైరవుడు పూజలందుకుంటున్నాడు.

గ్రహబలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని, సంకల్ప సిద్ధిని పొందడం భైరవ ఉపాసనతో సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి. కాలభైరవుడిని కాశీ క్షేత్ర పాలకుడిగా కీర్తించారు. ఏది సాధించాలన్నా ముందుగా ఆయన అనుమతి తీసుకోవాలని కాశీక్షేత్ర మహిమ చెబుతుంది. సాక్షాత్తు శివుడే కాలభైరవుడే సంచరించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. హోమ కార్యాలలో అష్టాభైరవులకు ఆహుతులు వేసిన తరువాతే ప్రధాన హోమం చేస్తారు. భక్తులకు అనుగ్రహాన్ని, అతీంద్రమైన శక్తులను ఆయన ప్రసాదిస్తారు. దేవాలయంలో ఆయనకి గారెలతో మాల వేస్తారు. కొబ్బరి, బెల్లం నైవేద్యంగా పెడతారు. ఈశ్వరుడు ఆయుష్షుని ప్రసాదిస్తాడు. ఆయనకు పరమ విధేయుడైన కాలభైరవుడిని ఆరాదిస్తే ఆయుష్షు పెరుగుతుందని ప్రతీతి.

కాలభైరవుని ‘క్షేత్రపాలక’ అని కూడా అంటారు. క్షేత్రపాలకుడంటే ఆలయాన్ని రక్షించే కాపలాదారు. మన దేశంలో కాలభైరవుని దేవాలయాలు చాలానే ఉన్నాయి. మన రాష్ట్రంలో శ్రీకాళహస్తిలో కాలభైరవుడు, బట్టల భైరవుడు దర్శనమిస్తారు. విశాఖపట్నంలో భైరవకోన ఎంతో ప్రముఖమైంది. కాగా నిజామాబాద్‌లోని రామారెడ్డి ప్రాంతంలో కాలభైరవ స్వామి దేవాలయం వుంది.

న్యూఢిల్లిద్ పురానా ఖిల్లా దగ్గరున్న భైరవాలయం అతి ప్రాచీనమైంది. పాండవ సోదరుల రాజధాని ఇంద్ర ప్రస్త నగరంలో ప్రశస్తమైన కాలభైరవ ఆలయం ఉంది. తమిళనాడు, అరగలూరులోని శ్రీకామనాథ ఈశ్వరాలయంలో అష్ట భైరవుడున్నాడు. అలాగే కరైకుడి, చోళపురం, అధియమాన్‌ కొట్టయ్‌, కుంభకోణాల్లో భైరవ దేవాలయాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌ ఉజ్జయినీలో కాల భైరవాలయం వుంది. కర్ణాటకలోని అడిచున్‌చనగిరి, మంగళూరు కద్రి ప్రాంతాల్లో కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి.

భక్తులు తమకు క్రమశిక్షణ అలవడాలని, ప్రయాణాల్లో రక్షకుడుగా తోడుండాలని, నిరంతరం ఆపదలనుండి కాపాడాలని భక్తిప్రపత్తులతో కాలభైరవుని పూజిస్తుంటారు

శ్రీ కాళభైరవాష్టకమ్

దేవ రాజ సేవ్య మాన పావనాంఘ్రి పంకజం 
వ్యాళ యజ్ఞ సూత్ర మిందు శేఖరం కృపాకరమ్ 
నారదాది యోగిబృంద వందితం దిగంబరం 
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ల్ల్

భాను కోటి భాస్వరం భవాబ్ది తారకం పరం 
నీల కంఠ మీప్సితార్ధ దాయకం త్రిలోచనమ్ 
కాల కాల మంబుజాక్ష మక్ష శూల మక్షరం 
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ల్ల్

శూలటంక పాశదండ పాణిమాది కారణంల్
శ్యామ కాయ మాది దేవ మక్షరం నిరామయమ్ 
భీమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవప్రియం 
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే 

భుక్తి ముక్తి దాయకం ప్రశస్త చారు విగ్రహం 
భక్తవత్సలం స్థితం సమస్త లోక విగ్రహమ్ 
నిక్వణన్మనోజ్ఞ హేమ కింకిణీలసత్కటిం
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే 

ధర్మ సేతు పాలకం త్వధర్మమార్గ నాశకం 
కర్మ పాశ మోచకం సుశర్మదాయకం విభుమ్ 
స్వర్ణవర్ణ కేశపాశశోభితాంగ మండలం 
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే 

రత్నపాదుకాప్రభాభిరామ పాదయుగ్మకం 
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్
మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రభూషణం 
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే

అట్టహాసభిన్న పద్మజాండకోశసంతతిం 
దృష్టిపాతనష్ట పాపజాలముగ్రశాశనమ్ 
అష్టశిద్ధిదాయకం కపాలమాలికాధరం 
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే 

భూతసంఘనాయకం విశాలకీర్తి దాయకం 
కాశివాసిలోకపుణ్య పాపశోధకం విభుమ్
నీతిమార్గకోవిదం పురాతనం జగత్ప్రభుం 
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే 

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం 
జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్ 
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం ల్
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్

కాశికాపురాధి నాథ కాలభైరవం భజే 
కాల భైరవం భజే  కాల భైరవం భజే 

~ ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం
                కాలభైరవాష్టకం సంపూర్ణమ్ ~










1 comment:

  1. i want kalabharivya books FRO KALABHARIVYA GURU SAMASTHANA
    where caN I GET IT MAIL E PAVANIMALYAPRSASAD@GMAIL.COM

    ReplyDelete

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list