MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఉపవాసం ఎందుకు చెయ్యాలి?_ Fasting

ఉపవాసం అంటే ఏమిటి?
             ఎలా చెయ్యాలి?

            “ఈ రోజు నేను ఉపవాసమండీ.”  అనే మాటని మనం తరచుగా వింటూ ఉంటాం. ముక్కోటి ఏకాదశి శివరాత్రి వంటి పర్వ దినాల్లో చాలా మంది, దరిదాపుల్లో అందరు ఉపవాసాలుంటారు. ప్రతి మాస శివరాత్రికి, ఏకాదశికి  ఉపవాసం ఉండేవారు కూడా చాలా మందే కనపడతారు. ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవుడికి ప్రీతికరమని తమ ఇష్ట దైవానికి ప్రీతి కరమైన రోజున ఉపవాసం ఉంటారు ఎంతో మంది. ఇక కార్తీక మాసం వచ్చిందంటే చెప్పనక్కర లేదు. అన్నీ రోజులు ఉపవాసాలే –సోమ వారాలు ఏకాదశులు, పూర్ణిమ, మాస శివరాత్రి. మిగిలిన రోజులు నక్తాలు. ఈ ఉపవాసాలు ఒకొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తూంటారు. రోజంతా ఏమీ తినకుండా ఉండేవారు కొంతమంది. పగలు తిని రాత్రి తినని వారు, రాత్రి తిని పగలు తినని వారు, ఒక పూట అన్నం, మరొక పూట  ఫలహారం ( పిండి వంటలు, పండ్లు, పాలు) తినే వారు, వండినవి తినని వారు, ..... ఇలా ఎన్నో రకాల వారు కనపడతారు. ఉపవాసాన్ని ఒక్క పొద్దు అనటం కూడా వింటాం. అంటే ఒక పూట మాత్రమే తింటారనే అర్థం వస్తుంది. ఇవన్నీ చూస్తే అసలు ఉపవాసం అంటే ఏమిటి? ఎలా చెయ్యాలి? అనే సందేహం రావటం సహజం.
       
        ఉప అంటే  సమీపంలో వాసం అంటే ఉండటం. అంటే ఉపవాసం అనే పదానికి దగ్గరగా ఉండటం అని అర్థం. దేనికి దగ్గరగా ఉండటం? ఈ ప్రశ్నకి సమాధానం ఎందుకు ఉపవాసం చేస్తున్నామో తెలిసి ఉంటే తెలుస్తుంది. ఉపవాసం భగవదనుగ్రహం కోసం చేస్తారన్నది జగద్విదితమైన విషయం. కనుక ఉండవలసింది భగవంతుని సమీపంలో. ఇంటిపని వంట పని తగ్గితే సమయమంతా భగవద్ధ్యానంలో గడపటానికి వీలుగా ఉంటుంది. అప్పుడు వంటికి కూడా పని తగ్గుతుంది. బరువైన, అరగటానికి కష్టమైన ఆహారం తీసుకోక పోవటంతో జీర్ణ వ్యవస్థకి వెచ్చించాల్సిన శక్తి కూడా భగవద్ధ్యానానికో, పూజకో  వెచ్చించటానికి వీలవుతుంది. కడుపు నిండా తినగానే కునుకు వస్తుంది చాలమందికి.  ఎందుకంటే శక్తి అంతా జీర్ణాశయం దగ్గరకి వెళ్ళి పోయి ఉంటుంది. మెదడుకి శక్తి సరఫరా తగ్గుతుంది.

దానితో మెదడులో చురుకుతనం తగ్గి మాదకత కలుగుతుంది. కళ్ళు మూతలు పడతాయి. అటువంటి సమయంలో పూజకో ధ్యానానికో కూర్చుంటే ఇంకేముంది? హాయిగా నిద్ర ముంచుకు వస్తుంది. అందుకని మితాహారం నియమంగా పెట్టటం జరిగింది. అలాగని ఏమి  తిన కుండ ఉంటే నీరసం వచ్చి అసలు ప్రయోజనం దెబ్బ తింటుంది. అందుకని నీరసం రాకుండా శక్తినిస్తూ, జీర్ణశయానికి బరువు కలిగించ కుండా తేలికగా వంట పట్టే ఆహారం తీసుకోవటం మంచిదని పెద్దల మాట. అటువంటి ఆహారాల్లో (ఆవు) పాలు, పళ్ళు శ్రేష్ఠ మైనవి.  మామూలు పూజకైనా అంతే . పూజా ప్రారంభంలో ఆచమనీయం అని  మూడు పుడిసిళ్ళ నీరు లోపలికి తీసుకుంటారు. అన్నం బదులు మరేదైనా తీసుకుంటారు కొందరు - అన్నం కన్నా తక్కువ తింటారు అనే ఉద్దేశంతో. ఆహారం తగ్గించటం, మార్చటం వల్ల శరీరం అదుపులో ఉటుంది.
              పూర్తిగా రోజంతా ఏమి తినకుండా ఉండటం కష్టం కనుక ఒకపూట తినటం బాగా వ్యాప్తిలో ఉంది. అది పగలా? రాత్రా? అన్నది వారి వారి సౌకర్యాన్ని బట్టి ఉంటుంది.
             ఒక నెల పూర్తిగా ఇటువంటి ఉపవాస దీక్ష తీసుకునేది కార్తీక మాసంలో. ఇది శివ కేశవులిద్దరికి ప్రీతి పాత్రమైన మాసం. ఈ నెలలో చాలా మంది నక్తాలుంటారు. అంటే నక్షత్ర దర్శనం అయ్యే దాకా పగలంతా ఉపవసించి  ప్రదోష పూజ అయినాక భోజనం చేస్తారు. కొంత మంది అర్థ నక్తాలు అని పొద్దు వాటారేదాకా ఉండి అప్పుడు భోజనం చేస్తారు. భోజనం ఎప్పుడు చేసినా అప్పటి వరకు రుద్రాభిషేకమో, విష్ణు సహస్ర నామ పారాయణమో చేస్తూ కాలం గడుపుతారు. కార్తీక మాసం చలి కాలం లో వస్తుంది, పగటి సమయం తక్కువ. ఎక్కువ తినాలని చలికి ముడుచుకుని వెచ్చగా కూర్చోవాలనో , పడుకోవాలనో అనిపిస్తుంది. నియంత్రించకపోతే ఆరోగ్యం దెబ్బ తినే ప్రమాదం ఉంది. కనుక ఆహార నియమం పెట్టి ఉంటారు.

అసలు ఉపవాసం అంటే అన్నం తిన కుండా ఉండటం అనేదే ఆరోగ్య సూత్రం. ఏ అనారోగ్యమైన ఆహారంతో ముడి పది ఉంటుంది. దానిని సరిచేస్తే ఎన్నో సద్దుకుంటాయి అన్నది ఆయుర్వేద సిద్ధాంతం. వారానికి ఒక రోజు జీర్ణాశయానికి విశ్రాంతి ఆహారం తీసుకోక పోతే మనసు కేంద్రీకరించటం ఎక్కువగా ఉంటుందనటానికి నిరశన వ్రతాలు, సత్యాగ్రహాలే నిదర్శనం. విద్యార్థులకు ఏ విషయమైనా గుర్తుండకపోతే ఆకలిగా ఉన్నపుడు చదివి వెంటనే భోజనం చేస్తే మనసులో గట్టిగా నాటుకు పోతుందని ఈ మధ్య పాశ్చాత్యులు చేసిన ప్రయోగాలు నిరూపించాయి.
           ఈ ఉపవాస నియమం అన్ని మత సంప్రదాయాల వారి లోనూ కనపడుతుంది. క్రైస్తవులు ఈస్టర్ పండుగకి ముందు 40 రోజులు ఉపవాస దీక్ష చేపడతారు. ఆ సమయాన్ని “లెంట్” అంటారు. పూర్తిగా భోజనం మానెయ్యక పోయినా ఏదో ఒక నియమాన్ని పాటిస్తారు – ఫలానా వస్తువు తినక పోవటం వంటివి. అంతే కాదు  అబద్ధం చెప్పక పోవటం, ఎవరితోనూ కఠినంగా మాట్లాడక పోవటం వంటి ప్రవర్తనా నియమావళిని పాటిస్తుంటారు. అలాగే మహమ్మదీయులు కూడా రంజాన్ మాసంలో ఉపవాసాలు చేస్తారు. అసలు ఆ నెలని ఉపవాస మాసం అంటారు. ఉపవాసాన్ని “రోజా” అంటారు. వీరు పాటించే నియమాలు కష్టమైనవిగానే కనిపిస్తాయి.

            లెంట్ కావచ్చు, రోజా కావచ్చు, కార్తీక మాస నక్తాలు కావచ్చు, ఏకాదశి ఉపవాసాలు కావచ్చు, శని వారపు ఒక్క పొద్దులు కావచ్చు  అన్నీ మరచి భగవంతుని అస్తిత్వంలో జీవ ప్రజ్ఞ నిలిచి ఉంటే అది ఉపవాసం అవుతుంది. లేకపోతే అది లంఖనం అవుతుంది. నిజానికి పూజలో కానీ, ధ్యానంలో కాని ఉన్నపుడు ఆహారం మీదికి మనసు వెళ్ళకూడదు. అలా వెళ్ళినప్పుడు తినేయటం మంచిది.
- Dr Anantha Lakshmi

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list