MohanPublications Print Books Online store clik Here Devullu.com

నోట్లపై గాంధీ బొమ్మే ఎందుకు? _Currency notes, Gandhi's picture


నోట్లపై
గాంధీ బొమ్మే
ఎందుకు?

మన కరెన్సీ నోట్లపై ప్రముఖంగా కనిపించేది బోసి నవ్వుల మహాత్మా గాంధీ బొమ్మ. జాతిపిత కనుక ఆయన చిత్రాన్ని ముద్రించడం సమంజసమేనని భావిం చొచ్చు. అయితే స్వాతంత్య్రం కోసం పోరాడిన మరెం దరో యోధుల చిత్రాలను కూడా నోట్లపై ముద్రించాలని కొన్ని పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గాంధీ బొమ్మ నోట్లపైకి ఎలా చేరిందో క్లుప్తంగా..

1996కు ముందు లేదు..: 1996కు ముందు నోట్లపై జాతిపిత బొమ్మ కాకుండా అశోక స్తంభంపైన ఉండే నాలుగు సింహాల గుర్తు ఉండేది. 1996లో రిజర్వ్‌ బ్యాంకు దాని స్థానంలో గాంధీ బొమ్మను తీసుకొచ్చింది. తర్వాత తంజావూరు బృహదీశ్వరాలయం బొమ్మ ఉన్న రూ. 1,000, కోణార్క్‌ రథచక్రమున్న రూ. 20, గేట్‌వే ఆఫ్‌ ఇండియా బొమ్మ ఉన్న రూ. 5,000 నోట్లను కూడా ప్రభుత్వం రద్దు చేసింది.

మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొన్నేళ్లుగా సోషల్‌ మీడియాలో నోట్లమీది బొమ్మలపై తీవ్ర చర్చలు సాగుతున్నాయి. గాంధీ చిత్రంలోపాటు వల్లభ్‌భాయ్‌ పటేల్, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్, శ్యామాప్రసాద్‌ ముఖర్జీ వంటి నేతల బొమ్మలూ ముద్రించాలని డిమాండ్లు వస్తున్నాయి. దీంతో ఆరీబీఐ గాంధీ బొమ్మ ముద్రణను సమర్థించుకుంటూ పలు కారణాలు తెలిపింది. సింహాల గుర్తువంటి స్థిర చిత్రాలను సులభంగా ఫోర్జరీ చేసే అవకాశముందని, నవ్వుతున్న గాంధీ బొమ్మలాంటి వాటిని ఫోర్జరీ చేయడం కష్టమని పేర్కొంది.
గాంధీ చిత్రం తప్ప మరొకరి చిత్రాన్ని ముద్రించకూడదని ఆర్‌బీఐ కమిటీ కూడా నిర్ణయం తీసుకుంది. యావద్దేశ సంస్కృతి, ఆదర్శాలు, భిన్నత్వంలో ఏకత్వాన్ని గాంధీజీ ప్రతిబింబించినట్లు మరొకరు ప్రతిబింబించలేరని పేర్కొంది. దేశంలోని పలు ప్రాంతాలకు, జాతిమతాలకు వేర్వేరు మహా నాయకులు ఉన్నారని, అయితే అందరికీ అమోదనీయుడైన గాంధీ బొమ్మే నోట్లపై ఉండడం సముచితమని తెలిపింది. ఈ వివరాలను 2014లో కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ పార్లమెంటుకు వెల్లడించారు.
ఫొటోలోని బొమ్మ..
నోట్లపై ఉన్న గాంధీ బొమ్మ నిజానికి ఓ ఫొటో నుంచి తీసుకున్నది. 1946లో భారత్‌కు వచ్చిన నాటి బ్రిటిష్‌ ఇండియా కార్యదర్శి బేరన్‌ పెతిక్‌ లారెన్స్‌ను వ్రైసాయ్‌ హౌస్‌లో గాంధీ కలుసుకున్నప్పుడు తీసిన ఫొటో దీనికి ఆధారం. ఫొటో నుంచి గాంధీ తల భాగాన్ని మాత్రం తీసుకుని డ్రాయింగ్‌ రూపంలోకి మార్చారు.
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list