MohanPublications Print Books Online store clik Here Devullu.com

చిలుకూరి బాలాజీ..!_ChilukuriBalajiTemple

వీసాల దేవుడు... చిలుకూరి బాలాజీ..!

తన చెంతకు రాలేని భక్తుల దగ్గరకు ఏడుకొండల వాడే స్వయంగా కదిలి వస్తాడట. అలా... ఓ భక్తుడి మీదున్న ప్రేమతో చిలుకూరులో వెలసి చిలుకూరు బాలాజీగా భక్తుల కోర్కెలు తీరుస్తున్నాడు శ్రీ వేంకటేశ్వర స్వామి. నిత్యం వేలమంది భక్తులతో కిటకిటలాడే ఈ క్షేత్రం టిక్కెట్లూ హుండీలూ వీఐపీ దర్శనాలూ లేని ఆలయంగా పేరుగాంచింది.
అయిదువందల ఏళ్ల కిందట... హైదరాబాద్‌కి దగ్గర్లోని చిలుకూరు గ్రామవాసి గున్నాల మాధవరెడ్డి తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడికి పరమ భక్తుడు. అతడు ప్రతి సంవత్సరమూ క్రమం తప్పకుండా స్వామి వారి దర్శనానికి తిరుమలకు కాలినడకన వెళ్లేవాడు. ఓ ఏడాది వృద్ధాప్యంతో ఆరోగ్యం క్షీణించినా తిరుమల ప్రయాణాన్ని మానకూడదనే నిశ్చయంతో బయలుదేరాడు. కానీ గ్రామ పొలిమేరలకు రాగానే సొమ్మసిల్లి పడిపోయాడు. అతడి అవస్థను చూసి కరిగిపోయిన వేంకటేశ్వర స్వామి లీలగా వచ్చి... ‘ఈ వయస్సులో నాకోసం అంత దూరం రావాల్సిన అవసరమేముందీ... నీ పక్కనే ఉన్న పుట్టలోనే నేనున్నా. బయటికి తీసి దర్శించుకో’ అని చెప్పాడట. తేరుకున్న మాధవరెడ్డి వెంటనే గ్రామంలోకి వెళ్లి కొంతమందిని తీసుకురాగా వాళ్లు పుట్టను తవ్వడం ప్రారంభించారు. తవ్వుతున్న సమయంలో పుట్టలో నుంచి రక్తం చిందిందట. దాంతో గునపాలను పక్కన పడేసి పాలతో పుట్టను కరిగించి, విగ్రహాన్ని బయటకు తీశారు. అప్పుడు ఆ గునపపు దెబ్బ స్వామి విగ్రహపు గుండె దగ్గర కనిపించిందట. తమకోసం ఏడు కొండలు దిగి వచ్చిన వేంకటేశ్వరుడికి అక్కడే ఆలయాన్ని నిర్మించి పూజలు చెయ్యడం ప్రారంభించారు గ్రామస్థులు. అప్పట్నుంచీ భక్తుల కోర్కెలు తీర్చే చిలుకూరు బాలాజీ క్షేత్రంగా ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఏక శిలలోనే శ్రీదేవీ భూదేవీ సమేత వేంకటేశ్వర స్వామి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. అంతేకాదు, విగ్రహాన్ని వెలికి తీసే సమయంలో అయిన గునపపు గాయం తాలూకూ గుర్తు బాలాజీ స్వామి వారి ఛాతీ భాగంలో ఇప్పటికీ కనిపిస్తుంది. గోల్కొండ సామ్రాజ్యంలో మంత్రులుగా ఉన్న అక్కన్న, మాదన్నలు ఈ ఆలయ అభివృద్ధికి అవసరమైన పలు నిర్మాణాలు చేపట్టారు. తర్వాతి కాలంలో సినీనటి భానుమతి, పలువురు మార్వాడీలూ ప్రధాన ఆలయం వెనుక భాగంలో అద్దాల మహల్‌నూ కోనేరునీ కట్టించి ఈ దేవాలయానికి మరింత శోభ తెచ్చారు.

కోర్కెలు తీర్చే 108 ప్రదక్షిణలు...
పూర్వం హైదరాబాద్‌ చుట్టుపక్కల తీవ్ర నీటి కరవు నెలకొంది. చిలుకూరు ప్రజలకు తాగునీటిక్కూడా అవస్థలు పడాల్సిన పరిస్థితి ఎదురైంది. ఎన్ని బోర్లు తవ్వించినా చుక్క నీరు పడేది కాదు. చివరకు ఓ భక్తుడు బాలాజీ ఆలయానికి దగ్గర్లో బోరు తవ్విస్తే నీరు పడుతుందనే నమ్మకంతో పని ప్రారంభించాడు. ప్రజల దాహార్తిని తీర్చే ఆ మంచి పని నెరవేరాలని గుళ్లొని పూజారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చెయ్యడం మొదలుపెట్టాడు. పదకొండు ప్రదక్షిణలు చెయ్యగానే బోరులో నీళ్లు వస్తున్నట్లు సమాచారం అందింది ఆయనకు. దాంతో ప్రదక్షిణల్ని కొనసాగించాడు పూజారి. అలా 108 సార్లు తిరిగేసరికి బోరులో నీళ్లు పుష్కలంగా వచ్చినట్లూ తెలిసింది. అప్పట్నుంచీ భక్తులు కోరికలు కోరే ముందు 11 ప్రదక్షిణలు చెయ్యడం, కోరిక తీరిన అనంతరం 108 ప్రదక్షిణలు చెయ్యడం ఆనవాయితీగా మారింది.
టిక్కెట్లూ హుండీలూ ఉండవు
ఎంతో ప్రాశస్త్యం ఉన్న చిలుకూరు బాలాజీ స్వామి వారిని ప్రతిరోజూ 35వేల మందికి పైగా దర్శించుకుంటారు. సెలవు రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపు అవుతుంది. అయినా ఈ దేవాలయంలో దర్శనానికి టిక్కెట్లూ వీఐపీ దర్శనాలూ ప్రత్యేక పూజలూ హుండీ... లాంటివేవీ ఉండవు. గతంలో ఆలయంలో హుండీ ఉండేది. 2001లో దాన్నీ తొలగించారు. బాలాజీ ముందు అందరూ సమానులేననే ఉద్దేశంతోనే ఈ నియమాలు పాటిస్తున్నారు ఆలయ నిర్వాహకులు. చిలుకూరు క్షేత్రానికి భక్తుల రద్దీ ఎక్కువవడానికి ఇది కూడా ఓ కారణం. ఈ ఆలయం విశిష్టత పెరగడంతో 2008లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని స్వయం ప్రతిపత్తి గల దేవాలయంగా ప్రకటించింది. హుండీ లేదు కనుక నిత్య పూజల నిమిత్తం బాలాజీ పేరిట బ్యాంకుల్లో ఖాతాలు తెరిచింది దేవాలయ కమిటీ. అప్పట్నుంచీ స్వామివారికి విరాళాలు ఇవ్వాలనుకున్న భక్తులు ఎవరైనా నేరుగా చిలుకూరు బాలాజీ పేరిట ఉన్న బ్యాంకు ఖాతాల్లోనే వేస్తున్నారు.


వీసా దేవుడిగా...
అమెరికా, ఆస్ట్రేలియాల్లాంటి దేశాల్లో ఐటీ రంగంలో ఉద్యోగవకాశాలు పెరిగిన తరుణంలో ఇంజినీరింగ్‌ పూర్తైన విద్యార్థులు ఎంతో మంది విదేశాలకు వెళ్లడానికి వీసాలు రాక ఇబ్బంది పడేవారు. ఆ సమయంలోనే చిలుకూరు బాలాజీని దర్శించుకుని మొక్కుకుంటే వీసా వస్తుందనే నమ్మకం ఏర్పడింది. అప్పట్నుంచి ఈ స్వామికి ‘వీసా గాడ్‌’గా దేశవ్యాప్తంగా పేరొచ్చింది. ఏటా బాలాజీకి నిర్వహించే బ్రహ్మోత్సవాల సమయంలో గరుత్మంతుడికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని సంతానం లేని మహిళలు స్వీకరిస్తే సంతాన ప్రాప్తి కల్గుతుందనే నమ్మకమూ ప్రాచుర్యంలో ఉంది. ఇక్కడి బాలాజీ ఆలయం ప్రాంగణంలో శివాలయం కూడా ఉంది. ఈ మందిరం దగ్గరున్న రావిచెట్టు కింద 450 ఏళ్ల కిందట ఓ మహర్షి తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకున్నాడట. ఈ చెట్టును తాకి శివ దర్శనం చేసుకుంటే మనసులోని కోరికలు తీరతాయనేది భక్తుల నమ్మకం.
హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల నుంచి ఈ క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది.
- సామ శేఖర్‌రెడ్డి, న్యూస్‌టుడే, మొయినాబాద్‌


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list