MohanPublications Print Books Online store clik Here Devullu.com

భద్రాద్రి రాముడు_Bhadradri Ramudu

జగదానంద కారకుడు భద్రాద్రి రాముడు

భద్రాచలం మహా పుణ్యక్షేత్రం. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రగిరి భూలోక వైకుంఠమై దర్శనమిస్తుంది. గోదావరి పరవళ్లు వీనులవిందు చేస్తుండగా, మిన్నంటిన వేద మంత్రోచ్చారణలతో ప్రతి మది భక్తి పారవశ్యంతో నిండిపోతుంది. ఈ క్షేత్ర చరితం వింటే చాలు అంతా శుభమే కలుగుతుందని పండితులంటారు. ధర్మమే రామావతారుడై భద్రగిరిలో కొలువై ఉండగా తక్కువేమి మనకు... అన్న రామదాసు మాట అక్షరాలా నిజం.
సీతారాములు వనవాసంలో దండకారణ్యంలోని పర్ణశాల ప్రాంతంలో నివసించారు. ఆ సమయంలో ఒకనాటి విహార వేళ విశ్రాంతి స్థానమైన ఒక శిల ఆ దివ్య దంపతులకు ఆనందాన్ని కలిగించి, వారి అనుగ్రహానికి పాత్రమైంది. ఆ శిలయే భద్రుడు. బ్రహ్మదేవుడి వరప్రసాదంగా మేరు పర్వతరాజ దంపతులకు పుత్రుడై జన్మించాడు భద్రుడు. శ్రీరామ భక్తుడైన భద్రుడు నారద మహర్షి ద్వారా శ్రీరామ తారక మంత్రాన్ని ఉపదేశంగా పొందాడు. శ్రీరామ సాక్షాత్కారం కోసం దండకారణ్యంలో ఘోర తపస్సు చేశాడు. శ్రీరాముడు చతుర్భుజ రాముడిగా సీత, లక్ష్మణుడితో కూడి పద్మాసనమున ఆసీనుడై భద్రుడికి ప్రత్యక్షమయ్యాడు. తర్వాత భద్ర మహర్షి కోరికపై పర్వత రూపంలోకి మారిన అతని శిఖరాగ్రముపై శ్రీ పాదముద్రలనుంచిన రాముడు పవిత్ర గోదావరి నదికి అభిముఖంగా భద్రుడి హృదయ స్థానమున వెలిశాడు. భద్రుడు అచలమై(కొండ)నందున ఈ క్షేత్రానికి భద్రాచలం అని పేరు వచ్చింది. భద్రాచల రాముడిని సేవించినవారు సకల పాప విముక్తులై తరిస్తారని బ్రహ్మపురాణం చెబుతోంది.
తాటాకు పందిరి
రాముడు భద్రాద్రిలో కొలువయ్యాక తొలి ఆరాధన దేవర్షి నారదుడు చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. 16వ శతాబ్దంలో పోకల దమ్మక్క సీతారాముల వారికి తాటాకు పందిరి వేసి తాటి పండు నైవేద్యంగా అందించేది. ఈమె ఇచ్చిన సమాచారంతో అప్పటి హసనాబాద్‌(పాల్వంచ) తహసిల్దార్‌ కంచెర్ల గోపన్న రామాలయాన్ని నిర్మించి రామదాసుగా కీర్తిగడించారు. 1831లో రాజా తూము లక్ష్మీనరసింహ దాసు ఆలయ అధికారిగా వ్యవహరించి విశేష సేవలు అందించారు. ఇతని స్నేహితుడు వరద రామదాసు. ఇతనే భక్త రామదాసు చరిత్రను తొలిసారిగా రాశారు.
రామ దర్బారు
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కోవెలలో జరిగే ప్రతి ఉత్సవంలో విధిగా విష్వక్సేన పూజ జరుగుతుంది. రోజూ సాయంత్రం జరిగే దర్బారు సేవ భద్రాచలం దేవస్థానం ప్రత్యేకం. మహారాజైన శ్రీరాముడికి దర్బారు నిర్వహించే విధానాన్ని తూము లక్ష్మీనరసింహదాసు ప్రవేశపెట్టారు. దర్బారు సేవను ప్రభుత్వోత్సవమనీ అంటారు. రోజూ వచ్చే ఆదాయ వివరాలను దర్బారులో రామయ్యకు వివరిస్తారు. సంకీర్తనలకు అనుగుణంగా స్వామివారికి ఆరాధన జరిగే విధానం ఇక్కడే ప్రారంభమైంది. ఇక్ష్వాకు కులదైవమైన శ్రీరంగనాధుడి ఆలయ ఉత్సవాల ఆచార సంప్రదాయాలను ఇక్కడ అనుసరిస్తారు. భద్రాచలంలోని ఎత్తైన కొండపై రంగనాథుడు కొలువై ఉండడంతో ఈ కొండను రంగనాయకుల గుట్టగా పిలుస్తున్నారు. భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి వేళ వైకుంఠ ద్వార దర్శనం ప్రముఖమైనది. శ్రీరామ నవమికి ఇక్కడ జరిగే సీతారాముల కల్యాణం జగత్కల్యాణంగా భాసిల్లుతుంది. సీతమ్మ వారి మూడు సూత్రాల మంగళ సూత్రం ఎన్నో వేదాంత రహస్యాలను చాటి చెబుతుందన్నది పెద్దల భావన. పితృ వాత్సల్యంతో భక్త రామదాసు చేయించిన మంగళ పతకాన్ని కలిపి ధరింప చేయడం ఈ క్షేత్ర ఆచారం. తానీషా కాలం నుంచి వస్తున్న సంప్రదాయం ప్రకారం ఇక్కడి తలంబ్రాలలో గులాలు అనే రంగును కలుపుతారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బు చెల్లించని రామదాసు చెరసాల పాలవడం, రామలక్ష్మణులు రామోజీ లక్ష్మోజీ పేర్లతో వచ్చి ఆ పైకాన్ని చెల్లించి రామదాసుని బంధ విముక్తుడ్ని చేయడం మనకు తెలిసిన కథే. ఈ సంఘటన జరిగినప్పటినుంచీ భద్రాద్రిలో జరిగే కల్యాణానికి రాజు ముత్యాల తలంబ్రాలను, పట్టు వస్త్రాలను పంపడం ఆనవాయితీ అయింది. ఆ ఆచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది. కల్యాణంలాగే ఇక్కడ జరిగే రామపట్టాభిషేకానికీ ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రతీ 60ఏళ్లకు రాజుకు పట్టాభిషేకం చేయాలన్నది పండితుల భావన. 1927లో, ఆ తర్వాత 1987లో ఈ తరహా పట్టాభిషేకం భద్రాచలంలో జరిగింది. దీన్ని మహా సామ్రాజ్య పట్టాభిషేకం అంటారు. 2047లో మళ్లీ ఇది జరగనుంది. ప్రతీ 12సంవత్సరాలకు ఒకసారి జరిగేది పుష్కర పట్టాభిషేకం. 2011 తర్వాత మళ్లీ 2023లో ఇది జరగాల్సి ఉంది. ఏటా శ్రీరామనవమి తర్వాతి రోజు కూడా పట్టాభిషేకం కనుల పండుగగా నిర్వహించడం సంప్రదాయం.
ఖమ్మం నుంచి భద్రాచలం 120కి.మీ దూరం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం నుంచి భద్రాచలం 40కి.మీ దూరం. ఈ రెండు చోట్ల నుంచి బస్సు సౌకర్యం ఉంది. రైల్లో వచ్చే వారు ఖమ్మంలోగాని, కొత్తగూడెంలోగాని దిగి రావచ్చు. భద్రాచలం నుంచి 35కి.మీ. దూరంలో పర్ణశాల దర్శనీయ ప్రాంతం. సీతారాములవారు నివసించిన ఆ నాటి ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తాయి.


- ఎం.నాగేశ్వరరావు, న్యూస్‌టుడే, భద్రాచలం


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list