MohanPublications Print Books Online store clik Here Devullu.com

సరస్వతీ క్షేత్రం_BASARA_Saraswathi Shektram

గౌతమీతీరాన సరస్వతీ క్షేత్రం

‘సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ! విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా...’ అంటూ ఆ అమ్మవారిని స్తుతించకుండా అక్షరాభ్యాస కార్యక్రమం జరగదు. కానీ ఆ చదువులతల్లికి ఆలయాలు కట్టి పూజించడం మాత్రం అరుదుగా కనిపిస్తుంటుంది. అలాంటి అరుదైన ఆలయాల్లో ఒకటి బాసర... శ్రీమన్నారాయణుడి స్వరూపుడూ వేదాలకు ఆద్యుడూ అయిన వేదవ్యాసుడే స్వయంగా స్థాపించిన ఆ దివ్యక్షేత్రం, దక్షిణ భారతావనిలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరొందింది.
సరస్వతీ శ్రుతిమహతీ మహీయతామ్‌
శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణీ
బాసర పీఠనిలయే శ్రీ సరస్వతీ నమోస్తుతే!
అంటూ బాసరలో కొలువైన అమ్మవారిని సందర్శించేందుకు దేశం నలుమూలలనుంచీ వస్తుంటారు భక్తులు. సువిశాల భారతావనిలో సుప్రసిద్ధ సరస్వతీ క్షేత్రాలు రెండే రెండు ఉన్నాయి. వాటిల్లో ఒకటి బాసర. రెండోది కాశ్మీర్‌లో శిథిలావస్థలో ఉంది.
మహాభారత యుద్ధానంతరం మనసు వికలమైన వ్యాసభగవానుడు ప్రశాంతతకోసం దండకారణ్యంలో సంచరిస్తూ గౌతమీనది తీరంలో తపమాచరించడానికి సరైన ప్రాంతాన్ని అన్వేషిస్తూ బాసరకు చేరుకున్నాడట. ఆ సమయంలో అవ్యక్తరూపిణిగా ఉన్న అమ్మవారు తనను ప్రతిష్ఠించమని వ్యాసుణ్ణి ఆదేశించింది. అమ్మ ఆజ్ఞానుసారం బాసర దగ్గర ఉన్న గోదావరీ సమీపంలోని పర్వత గుహలో అమ్మవారి ఉపాసన ఆరంభించాడు. అవ్యక్తరూపిణిగా ఉన్న అమ్మను సృష్టించడానికి రోజూ గోదావరిలో స్నానం చేసి మూడు పిడికిళ్ల ఇసుకను తీసుకొచ్చి గుహలో మూడు రాశులుగా పోయగా, కొంత కాలానికి వాటినుంచి సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి ఉద్భవించారట. ఇసుకరాశుల నుంచి విగ్రహాలు వేరుచేసి ప్రతిష్ఠించాడట. గర్భగుడిలోని అమ్మ విగ్రహానికి పక్కనే లక్ష్మీదేవి మూర్తి కనిపిస్తుంది. సరస్వతీ ఆలయానికి సమీపంలోనే దుర్గాదేవి ప్రతిమా ఉంది. ముగ్గురమ్మలు కొలువైన ఈ క్షేత్ర దర్శనాన్ని అపురూపమైనదిగా భావిస్తారు భక్తులు.
అమ్మవారి అష్టముఖి కోనేరు చుట్టూ ఉన్న ఎనిమిది దిశల్లో ఇంద్రుడు, సూర్యుడు, విష్ణువు... ఇలా పలు దేవతలు తపస్సు చేశారట. వీళ్లు తపమాచరించిన స్థలాలూ ఆలయాలూ ఇప్పటికీ కనిపిస్తాయక్కడ. వ్యాసభగవానుడి గుహనూ ఇక్కడ చూడవచ్చు. వ్యాసుడు సృష్టించిన బాసర పూర్వనామం వ్యాసపురి. అదే కాలక్రమంలో వాసర, బాసరగా మారింది.అమ్మ సన్నిధిలో అక్షరాభ్యాసం చేస్తే చదువుల్లో వర్థిల్లుతారనే కారణంతో తమ పిల్లల్ని తీసుకుని అనేకమంది ఆలయాన్ని సందర్శిస్తుంటారు.

ఆలయ నిర్మాణం!
నాందేడ్‌ రాజధానిగా నందగిరి రాజ్యాన్ని పాలించిన బిజియాలుడు అనే కన్నడ చక్రవర్తి ఆరో శతాబ్దంలో ఈ ఆలయాన్ని కట్టించినట్లు తెలుస్తోంది. మహ్మదీయుల పాలనలో ఆలయం అనేకసార్లు దాడులకు గురైంది. స్థానిక యువకుడైన మక్కాజీ పటేల్‌ గ్రామ యువకులను చేరదీసి, యుద్ధవిద్యలు నేర్పి, ఆలయరక్షణకు నడుంకట్టాడు. అందుకే ఆలయంలోపల గర్భగుడి పక్కనే మక్కాజీ పటేల్‌ విగ్రహం కనిపిస్తుంది. గర్భగుడిలో పచ్చని పసుపు పూసి అలంకరించిన అమ్మవిగ్రహం ఎంతసేపు చూసినా తనివితీరదు.
అమ్మవారి పుట్టినరోజు వసంతపంచమి సందర్భంగా ఆలయం భక్తులతో కళకళలాడిపోతుంటుంది. దసరా నవరాత్రులు, వ్యాసపౌర్ణమి, శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం అమ్మవారిని నెమలి పల్లకీలో వూరేగిస్తారు. దసరా ఉత్సవాల్లో చివరిరోజున ఆ తల్లికి మహాభిషేకం చేసి, సాయంత్రం శమీపూజ చేస్తారు. ఆపై వూరేగింపు కోసం తీసుకెళతారు. ఈ ఆలయంలో జ్ఞానభిక్షను దీక్షగా తీసుకుంటుంటారు భక్తులు. తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్‌జిల్లాలో ఉన్న బాసర, నిజామాబాడ్‌కు సుమారు 50 కి.మీ., హైద్రాబాద్‌కు 205కి.మీ దూరంలోనూ ఉంది. రోడ్డు, రైలుమార్గాల్లో చేరుకోవచ్చు.
- దూస సంజీవ్‌కుమార్‌, ఆదిలాబాద్‌ డెస్క్‌


ఫొటోలు: వసంతరావు, బాసర

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list