MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఆదిత్యహృదయం_AdityaHrudayam - RathaSaptami రథ సప్తమి




కనిపిస్తాడు. కరుణిస్తాడు. కిరణాల భరణాలు కురిపిస్తాడు. భౌతికదృష్టితో చూస్తే - మండుతున్న అగ్నిగోళం, వైజ్ఞానిక నేత్రాలతో పరికిస్తే - ఒకానొక నక్షత్రం, ఉపాసనా దృక్కులతో దర్శించుకుంటే- సప్తాశ్వరథమారూఢం! ఈ మూడుకోణాల్నీ మిళితం చేస్తేనే... ప్రత్యక్ష భగవానుడి పరిపూర్ణతత్వం బోధపడేది (ఫిబ్రవరి 3న, రథసప్తమి).
నీమండలం రుగ్వేదం.
నీ దేహం యజుర్వేదం.
నీ కిరణాలు సామవేదం.
- మంత్రమహార్ణవ వర్ణనం
ప్రభాతంలో బ్రహ్మ స్వరూపానివి.
మిట్టమధ్యాహ్నం మహేశ్వర తత్వానివి.
సంధ్యాసమయంలో సదా విష్ణుమూర్తివి.
- బ్రహ్మాండాది పురాణ ప్రశస్తి
ఓం ఆదిత్యాయ విద్మహే
సహస్ర కిరణాయ ధీమహి
తన్నో సూర్య ప్రచోదయాత్‌
- ఉపనిషత్‌ వాక్కు
అదిగదిగో బాలభానుడు....
లేతమొగ్గ విచ్చుకుని పువ్వవుతుంది, గూట్లో ఒదిగి కూర్చున్న గువ్వపిల్ల రెక్కలల్లార్చుకుని గాల్లోకి ఎగురుతుంది, గాజుముక్కలా నిస్తేజంగా నీటి మీద పడున్న మంచుబిందువు ముత్యమై మెరుస్తుంది. చీకటి బూచికి భయపడి అమ్మను చుట్టేసుకుని పడుకున్న పసివాడు బుడిబుడి అడుగులేస్తూ ధైర్యంగా వీధిలోకొస్తాడు. నిన్నటి అలసటను మరచిన రైతన్న భుజానికి నాగలెత్తుకుని ఉత్సాహంగా పొలానికి బయల్దేరతాడు. కార్ఖానాకు వెళ్లాల్సిన శ్రామికుడు తూర్పు గోడ మీద వేలాడుతున్న గడియారాన్ని గమనిస్తూ పనులు చేసుకుంటాడు. పరీక్షలకు సిద్ధం అవుతున్న విద్యార్థికైతే ఆ బింబం బెత్తంపట్టుకున్న ఉపాధ్యాయుడిలా కనిపిస్తుంది. అప్పటికే అమ్మ, వంటింట్లో ఓ పాతిక రొట్టెల సూర్యులను సృష్టించి ఉంటుంది.
ఆ ప్రభాత కిరణాలు మోసుకొస్తున్నది... ఒట్టి వెలుతుర్నో, వెచ్చదనాన్నో కాదు - అపారమైన ప్రాణశక్తిని. ఆ అనంత అమృతరశ్ముల్ని పంపినవాడు - భాస్కరుడు, ప్రభాకరుడు, విభాకరుడు...సూర్యనారాయణుడు!
ఆ కాలపురుషుడిని వేదాలు కొలిచాయి. ఉపనిషత్తులు ఉపాసించాయి. పురాణాలు ప్రస్తుతించాయి. మానవుడికైతే అతడు నడయాడే పరమాత్మ! సూర్యుడితో మనిషి అనుబంధం రాతియుగాల నాటికే బలపడిపోయింది. సూర్యాస్తమయం కాగానే, దారితప్పిన లేగదూడలా బెంబేలెత్తిపోయేవాడు. చిటారు కొమ్మ మీదో, చీకటి గుహలోనో నక్కినక్కి దాక్కునేవాడు. ఏ సింహాలో పీక్కుతింటాయన్న భయం, ఏ విషసర్పాలో కాటేస్తాయన్న వణుకు. వెలుతురు కిరణాలు వెచ్చగా ఒంటిని తాకగానే, ఎవరో వెన్నుతట్టి అభయమిచ్చినంత ధైర్యం వచ్చేది. విల్లంబులు ధరించి బయల్దేరేవాడు. ఇక, పొద్దువాలే దాకా నిస్సందేహంగా అడవి అతడిదే, వేటా అతడిదే! ఆ కృతజ్ఞత కొద్దే భాస్కరుడిని తొలి దేవుడిగా గుర్తించాడు.

బాలభానుడు....
కాలసాక్షి గాథ బ్రహ్మపురాణంలో ఉంది. కశ్యప ప్రజాపతి, అదితి దంపతుల ముద్దుల తనయుడు సూర్యుడు. ఆ సమయానికే రాక్షసుల ఆగడాలు పెచ్చుపెరిగాయి. అసురుల ఆట కట్టించగల అపార శక్తిమంతుడిని బిడ్డగా ప్రసాదించమని అదితి సౌరశక్తిని ప్రార్థించింది. విశ్వమంతా విస్తరించిన తేజస్సునే సంక్షిప్తీకరించి... ఆ తల్లి కడుపున నిక్షిప్తం చేసిందా దివ్యకాంతి. పుట్టబోయే కొడుకు కోసం వ్రతాలూ ఉపవాసాలూ చేస్తున్న అదితిని చూసి కశ్యపుడు ఎగతాళి చేశాడు. ‘బిడ్డని ఆకలితో చంపేస్తావా?’ అని అరిచేశాడు. ఆ మాటకు తల్లి మనసు గాయపడింది. నిరసనగా తన గర్భాండాన్ని త్యజించింది. ఆమె కడుపులోంచి నేలమీద పడగానే... లక్ష అగ్నిగోళాల్లా భగభగా మండిందా అండం. ఆ వేడికి సృష్టి అతలాకుతలమైంది. అదితీకశ్యపుల ప్రార్థన తర్వాత, ఆ అండం పగిలి అందులోంచి అందమైన పసివాడు బయటికొచ్చాడు. ఆ బాలుడే భానుడు! ఆనాడు మాఘశుద్ధ సప్తమి... రథసప్తమి! ఆ ముహూర్తానికే ఏడుగుర్రాల రథాన్ని అధిరోహించి, వెలుగుల దేవుడిగా బాధ్యతలు స్వీకరించాడని మత్స్యపురాణం చెబుతోంది.
అవక్ర పరాక్రముడైన పసివాడి నాయకత్వంలో అసురసేనల్ని సునాయాసంగా ఓడించింది సురగణం. విశ్వకర్మ తనయ సంజ్ఞను మనువాడాడు యువరవి. యమ, యమి ఆ దంపతుల పిల్లలు. ఎంత ఓరిమిగల ఇల్లాలైనా, నిప్పుల కుంపటితో ఎంతకాలమని కాపురం చేస్తుందీ. తన ఛాయను అక్కడే వదిలేసి, అశ్వరూపం ధరించి అడవులకెళ్లిపోయింది. సూర్యుడు ఆ నీడనే తనతోడని భ్రమించాడు. సావర్ణుడూ, శనైశ్చరుడూ... ఛాయాసూర్యనారాయణుల సంతానం! కాలక్రమంలో...ఛాయ మనసు కలుషితమైంది. సంజ్ఞ కడుపున పుట్టిన పిల్లల్ని వేధించ సాగింది. యమ, యమి ఆ విషయాన్ని నేరుగా తండ్రికి ఫిర్యాదు చేశారు. అప్పుడే, సంజ్ఞ నిర్వాకం బయటపడింది. ఆ పంచాయతీ తేల్చమంటూ మామ విశ్వకర్మ ఇంటికెళ్లాడు సూర్యుడు. ‘నీ తేజస్సు మాలాంటివారికే ముచ్చెమటలు పట్టిస్తుందే. సుకుమారి సంజ్ఞ ఎలా భరిస్తుంది చెప్పూ!’ అంటూ అల్లుడిని వూరడించాడు విశ్వకర్మ. తన నైపుణ్యాన్నంతా గుదిగుచ్చి... అగ్నిగోళం లాంటి సూర్యబింబాన్ని అరగదీసి, కరగదీసి...తాప తీవ్రతను తగ్గించాడు. ఆ అరుగుదలలో పుట్టిన రేణువుల నుంచీ విష్ణువుకు చక్రాన్నీ, శివుడికి శూలాన్నీ తయారు చేసిచ్చాడు... ఇలా అనేకానేక మలుపులతో సాగిపోతుంది భానుడి కథ.
వేదాలు సూర్యుడిని విరాట్‌ స్వరూపుడిగా కొలిచాయి. దాదాపుగా ప్రతి పురాణంలోనూ దినకర ప్రస్తావన ఉంది. సూర్య వైభవాన్ని చాటే ఆదిత్య హృదయ స్తోత్రం రామాయణంలోనిదే. రాముడికి అరుణుడంటే ఆరాధనా భావం. అరణ్యకాండలో ఓచోట, కొండలూగుట్టలూ దాటుకుని వెళ్లి సూర్యుడి మెడలో కొండగోగుపూలతో అల్లిన మాల వేసిరావాలని ఉందంటాడు. దశకంఠుడితో పోరాడి అలసిన రామచంద్రుడికి అగస్త్య మహర్షి ఆదిత్య హృదయాన్ని బోధించాడు. సూర్యుడిని తలుచుకోగానే ఎక్కడలేని బలం వచ్చింది. పదితలల్నీ ఒక్క వేటుతో కూల్చేశాడు. బాలకాండలో - ‘కౌసల్యా సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే...తెలవారుతోంది, సంధ్యాది విధులకు సమయం అవుతోంది’ అంటూ విశ్వామిత్ర మహర్షి రామచంద్రుడిని నిద్రలేపుతాడు. గాయత్రీమంత్రాన్ని ఉపదేశిస్తాడు. రామాయణం అంటే రాముడి ప్రయాణం. రాక్షస సంహారం కోసం రాముడి తొలి ప్రయాణమూ అదే. మళ్లీ యుద్ధకాండలో...ఆదిత్యహృదయ స్తోత్ర పఠనంతో ఆదికావ్యంలో అత్యంత కీలక ఘట్టం పరిసమాప్తం అవుతుంది. గాయత్రీమంత్రానికి విస్తరణే ఆదిత్యహృదయమని అంటారు. బాల హనుమంతుడైతే, ఉషోదయాన్ని చూసి ఎర్రెర్రని పండేదో అనుకుంటాడు. జిహ్వచాపల్యం కొద్దీ గుటుక్కున మింగేస్తాడు. గురుదేవుడై మారుతికి వేద విద్యలు నేర్పింది కూడా సూర్యుడే. ఓచోట పీఠమేసుకుని కూర్చునేంత తీరికా ఓపికా సూర్యుడికెక్కడిదీ! కుదరదు పొమ్మన్నాడు. అయినా హనుమ పట్టు వీడలేదు. సూక్ష్మరూపంలో భానుడి రథ వేగాన్ని అందుకుంటూ... వేదవేదాంగాలూ, వ్యాకరణశాస్త్రాలూ అభ్యసించాడు.
మహాభారతంలోనూ సూర్యోపాసన కనిపిస్తుంది. తెలిసీ తెలియని వయసులో... కుంతీదేవి సూర్యనారాయణుడిని ప్రార్థించడంతో...అసలు సిసలు భారతం ఆరంభమౌతుంది. పాండురాజు రెండోభార్య మాద్రి పిల్లలైన నకుల సహదేవులు కూడా అశ్వినీదేవతల వరమే. అశ్వినుల తండ్రీ సూర్యుడే. ఇంట్లోంచి వెళ్లిపోయిన సంజ్ఞాదేవి అశ్వరూపంలో అడవుల్లో సంచరిస్తున్నప్పుడు, మగ గుర్రమై ఆమెతో రమిస్తాడు. అలా పుట్టినవారే అశ్వినీ దేవతలు. అశ్వమంటే కిరణమన్న అర్థమూ ఉంది.
భాగవతంలో...మోహినీరూపంలోని విష్ణుమూర్తి చాలా తెలివిగా, మహా ఒడుపుగా దేవతలకు మాత్రమే అందేలా అమృతాన్ని పంచుతూ ఉంటాడు. వేషం మార్చుకుని వచ్చి ఏమార్చే ప్రయత్నం చేస్తారు రాహుకేతువులు. ఆ రాక్షస మాయల్ని సూర్యుడు రట్టుచేస్తాడు. రాహుకేతువులు రచ్చచేస్తారు. ఆ గండమే గ్రహణమైంది. కృష్ణుడి అష్టభామల్లో ఒకరైన సత్యాదేవి తండ్రి సత్రాజిత్తు సూర్యోపాసకుడు. మణుగులకొద్దీ సంపదనిచ్చే శ్యమంతకమణి అతడికి సూర్యుడి వరమే. వనవాస కాలంలో, పాండవులకు అక్షయపాత్రను ప్రసాదించింది కూడా ఆదిత్యుడే. భగవద్గీతలో కృష్ణపరమాత్మ ‘ఆదిత్యగతమైన తేజాన్ని నేనే’ అని ప్రకటించాడు.
సూర్యుడు సారస్వతదేవుడు. ఆదికవుల నుంచి ఆధునికుల దాకా...పిండికొద్ది రొట్టె అన్నట్టు, ఎవరి స్థాయిలో వారు ఉదయభానుడిని అక్షరాలతో అర్చించారు. సూర్యోదయం - బ్రహ్మాండం ఓ మేడలా మారితే, ఆ ఇంట వెలుతురు దీపం; ఆకాశమంతా ఓ కిరీటం అయితే; అందులో మెరుపుల దివ్యమణి; ఇంకా.... ప్రభాతలక్ష్మి సిగలో ఎర్రకలువ, సిందూరం ధరించిన ప్రౌఢ, జవ్వని చేతిలో అద్దం, సముద్రంలోంచి తడుస్తూ లేస్తున్న ఎర్రపిట్ట...ఇలా ఎన్నో పోలికలు. విశ్వనాథవారి కవిత్వంలో అయితే సూర్యతత్వమంతా ప్రతిఫలిస్తుంది...‘వెలుగుమరొక్కపేరఖిల విద్యలకున్‌...పరమార్థభూతమై వెలుగులు తన్నుమించి మరి విశ్వమునందున వేరుచోట లేవు...అలఘుడు విశ్వవత్సలుడు అంబుధిశోషణ దాహమూర్తి వెల్గుల నిధికిన్‌ గురూత్తమునకున్‌ జగదక్షునకున్‌ నమస్కృతుల్‌...’

భారతీయం...
భా...అంటే కాంతి. భారతీయులు... వెలుతుర్ని ఇష్టపడేవారు. వెలుగులు విజ్ఞానానికి ప్రతీకలు. మిగతా ప్రపంచమంతా సూర్యుడి గురించి మిడిమిడి జ్ఞానపు మాటలు మాట్లాడుతున్న సమయానికే...భారతీయులు ఆ ధగధగల దేవుడిని ఆధ్యాత్మిక, వైజ్ఞానిక రూపాల్లో దర్శించుకున్నారు. అసలు, ఉదయాస్తమానాలు లేనేలేవని గుర్తించారు. సృష్టిలో అనేకానేక సూర్యుళ్లు ఉన్నారన్న నిర్ధరణకు వచ్చారు. చంద్రుడు స్వయంప్రకాశుడు కానేకాదనీ తేల్చారు. ఆకులోని హరిత రేణువులు సూర్యకాంతిని గ్రహించి పత్రహరితాన్ని తయారు చేసుకుంటాయని లోకానికి చాటారు. అందులోనూ, సూర్యుడి గమనాన్ని లెక్కగట్టడంలో, కాంతి వేగాన్ని అంచనా వేయడంలో భారతీయులకు సాటిలేదు. ఆ నైపుణ్యాన్ని ఆలయవాస్తుకు జోడించి... అనేక అద్భుతాలు చేశారు. రథసప్తమి, సంక్రాంతి తదితర ప్రత్యేక సందర్భాల్లో సూర్యకిరణాలు మూలవిరాట్టును స్పృశించేలా గర్భాలయాల్ని నిర్మించారు. వేదాలు కాంతి కిరణాల వేగాన్నీ లెక్కగట్టాయి. నిమేషార్ధం...రెప్పపాటులో సగం సమయంలోనే సూర్యకాంతి 2,202 యోజనాలు ప్రయాణిస్తుందని నిరూపించారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఇటీవలే, అటూ ఇటుగా అవే అంకెల్ని వల్లెవేసింది. ఈ అద్భుతాలకు శాస్త్రీయ విజ్ఞానం ఒక్కటే సరిపోదు. సూర్యతత్వం పట్ల శ్రద్ధా భక్తీ ఉండాలి. అది భారతీయుల్లో పుష్కలం. గాణపత్యమూ, శాక్తేయమూ మొదలైన ఆరు ప్రాచీన ధర్మాల్లో సౌరమతం ఒకటి. కొద్దిపాటి తేడాతో, భవిష్యోత్తర పురాణంలోనూ ఆదిత్యస్తోత్రం ఉంది. దీన్ని కృష్ణుడు అర్జునుడికి బోధిస్తాడు. అసావాదిత్యో బ్రహ్మ ...‘అదిగో ఆ ఆదిత్యుడే బ్రహ్మ’ అంటాయి గాయత్రీ మంత్రాలు. ఏకచక్రంతో, ఏడుగుర్రాలతో వింతగా కనిపించే సూర్యరథం కాలగమనానికి ప్రతీక.
ఆదిత్యుడు... నిలువెత్తు వికాసమూర్తి. ఆది నుంచి అస్తమయం దాకా ప్రతి కదలికా ప్రపంచానికి ఒక పాఠమే. క్రమశిక్షణకు మారుపేరు; ఆరునూరైనా తెల్లారేలోపు తూరుపుకొండ ఎక్కేస్తాడు. శ్రమకు సంకేతం; సాయంత్రం సెలవు తీసుకునేదాకా అహరహం గమనమే. మహా సమవర్తి; సంపన్నుడికైనా అదే ఎండ, సామాన్యుడికైనా అదే ఎండ. ఎంతో నిస్వార్థపరుడు; అన్నీ ఇస్తాడు కానీ, ఏదీ ఆశించడు. అంతటి పరోపకారికి ఎన్ని పరీక్షలూ! రాహుకేతువుల పీడ ఇప్పటికి కూడా వదల్లేదు. అయినా, సూర్యుడు తన తత్వాన్ని మార్చుకోలేదు, సహజ స్వభావాన్ని వదులుకోలేదు. అలాంటి దేవుడే ఎదురైతే ‘నమస్తే, నమస్తే నమః’ అంటూ పాదాభివందనం చేయాలి. అలాంటి మనిషే తారసపడితే ‘హితుడా...’ అంటూ గాఢంగా గుండెలకు హత్తుకోవాలి. రెండూ కాకుండా, ఏ మండే అగ్నిగోళమో అయినా సరే, దూరం నుంచే ఆ దొడ్డగుణానికి దండం పెట్టుకోవాలి.
ఖగోళ సూర్యుడు
ఖగోళశాస్త్రం ప్రకారం... అర్కుడి వయసు నాలుగువందల అరవై కోట్ల సంవత్సరాలు. దాదాపుగా సృష్టి వయసూ అదే. సూర్యుడు వేలవేల నక్షత్రాల మధ్య ఓ మహానక్షత్రం. హైడ్రోజన్‌, హీలియంలతో నిండిన వాయుగోళం. ఆ గురుత్వాకర్షణశక్తి కారణంగానే, భూమి సహా వివిధ గ్రహాలు సూర్యభ్రమణం చేస్తున్నాయి. సౌర వ్యవస్థలో తొంభైతొమ్మిదిశాతం దినకరుడి అధీనంలోనే ఉంది. సూర్యుడి వ్యాసం భూమి కంటే వందరెట్లు పెద్దది. భూమి మీది నుంచి ఏ రాకెట్టో ఎక్కి, భానుడి నివాసానికి వెళ్లాలంటే... పదిహేను కోట్ల మైళ్లు ప్రయాణించాలి. ఆ మహోజ్వల కాంతి భూమిని చేరడానికి ఎనిమిదిన్నర నిమిషాలు పడుతుంది. సూర్య కిరణాలు అనంత శక్తికేంద్రాలు. ఓ అరవై నిమిషాలు నేలను తాకిన సౌరశక్తినంతా విద్యుచ్ఛక్తిగా మార్చుకున్నా చాలు... ప్రపంచం మొత్తం, ఏడాది పాటూ ‘కోతలు’ లేకుండా కరెంటు వాడుకోవచ్చు. అందులోనూ భారతదేశం మీద సూర్యుడి కటాక్ష వీక్షణాలకు కొదవే లేదు. ఏడాదిలో మూడొందల రోజులూ ఎండే. కాలుష్యభయం ఉండదు. అరిగిపోతుందనో కరిగిపోతుందనో ఆందోళన చెందాల్సిన పన్లేదు.
‘సౌరశక్తి’లో సామాజిక సమస్యలకూ పరిష్కారం ఉంది. అనేకానేక పరిమితుల్ని అధిగమిస్తూ...హరీశ్‌హండే అనే నిపుణుడు దీన్నో సేవా వ్యాపారంగా ఎంచుకున్నాడు. అఖిల్‌ జైసింఘానీ ‘మేరా గావ్‌ పవర్‌’ అనే సంస్థ ద్వారా విద్యుత్‌ సౌకర్యంలేని గ్రామాల్లో లక్షా యాభైవేల దీపాలు వెలిగిస్తున్నాడు. సౌర కాంతి బతుకు చీకట్లనూ తరిమేయగలదు... ఉపాధి కల్పనకూ, పేదరిక నిర్మూలనకూ, అక్షరాస్యత సాధనకూ అండగా నిలబడగలదు. దీపం ఉన్నచోట మంచి ఉంటుంది. సంపద తాండవిస్తుంది. మానవత్వం పరిమళిస్తుంది.
అయినా ఎక్కడో ఏదో లోపం. ఆ ఆత్మీయ హస్తాన్ని మనిషి మనస్ఫూర్తిగా అందుకోలేకపోతున్నాడు. సంప్రదాయ ఇంధనాల మోజులో పడిపోయి....హ్రస్వదృష్టితో వ్యవహరిస్తున్నాడు. ఇక, ప్రభుత్వాల చొరవా అంతంతమాత్రమే. ‘సౌరశక్తి వినియోగం ఆశించిన స్థాయిలో లేకపోవడానికి కారణం, సూర్యుడు ఏ బహుళజాతి సంస్థల అబ్బసొత్తో కాకపోవడమే’ అంటారు రాల్ఫ్‌నాడార్‌ అనే నిపుణుడు. ఈ మాటా నిజమే.
భాస్కరాదిచ్ఛేత్‌...
చెట్టూచేమా కాంతిని గ్రహించి...ఆహారాన్ని తయారు చేసుకున్నట్టు, సౌర పలకలు సూర్యకాంతితో ఇంధనశక్తిని సృష్టించుకున్నట్టు...మనిషి సౌరశక్తిని ప్రాణశక్తిగా ఎందుకు మలుచుకోకూడదు? అదీ అసాధ్యం కాదంటారు, ‘ఒక యోగి ఆత్మకథ’ రచయిత పరమహంస యోగానంద. ఆ దిశగా భారతీయ రుషులు ఎప్పుడో విజయం సాధించారనీ, కాసేపు ఎండలో నిలబడగానే పంచభక్ష్య పరమాన్నాలు తిన్నట్టుగా తృప్తిపడిపోయే సాధుసంతుల్ని సేవించి తరించాననీ ఓ చోట ప్రస్తావించారు. డాక్టర్‌ మాణిక్‌ అనే నిపుణుడు తాను సౌరాహారంతోనే బతుకుతున్నట్టు ప్రకటించారు. ఆయన మీద వివిధ విశ్వవిద్యాలయాలు పరిశోధనలు చేశాయి.
సూర్యుడిలోని అపారశక్తిని ప్రతీకాత్మకంగా వెల్లడించింది ఆదిత్యహృదయం. ఆ స్తోత్ర పఠనం వెనుకా ఓ ఆరోగ్యసూత్రం ఇమిడి ఉందంటారు విజ్ఞులు. ‘ఛందోబద్ధమైన వాక్కు శ్వాసను నియంత్రించి ప్రాణశక్తిగా మార్చగలదు. ఆ ఉచ్ఛ్వాసనిశ్వాసాలు బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజుల్లా పనిచేసి...శరీరంలోని రుగ్మతల్ని దూరం చేస్తాయి’ అన్నది విశ్లేషణ. ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్‌ - అన్న మాట ఉండనే ఉంది. సూర్యుడు వెళ్లని చోట రోగాలు రాజ్యమేలతాయి. యోగాలో సూర్యయోగ ఓ ప్రత్యేక విభాగం. సూర్యోదయ సమయంలో భానుడి కిరణాలు నేరుగా శరీరాన్ని తాకేలా ...పూర్వాభిముఖంగా నిలబడి సాధన చేస్తారు. ఎముకల్ని శక్తిమంతం చేసే విటమిన్‌-డిని ‘విటమిన్‌-దినకర’గానూ చెప్పుకోవచ్చు. విష్ణువు అలంకార ప్రియుడూ, శివుడు అభిషేకప్రియుడూ అయినట్టే...సూర్యుడు నమస్కార ప్రియుడు. సూర్యనమస్కారాలు...శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయని ఆధునిక పరిశోధనలు కూడా నిర్ధరించాయి. సిడార్స్‌-సినానీ మెడికల్‌ సెంటర్‌ అధ్యయనం ప్రకారం...సూర్యుడి కిరణాలు సోకని శరీరాలు మధుమేహం, గుండెజబ్బు తదితర తీవ్ర రుగ్మతల బారిన పడే ఆస్కారం ఎక్కువే. రోజూ కనీసం ఓ పది నిమిషాలు ఎండలో కూర్చుంటే, హార్మోన్ల సమతౌల్యాన్ని సాధించవచ్చనీ, కేశ సంబంధమైన రుగ్మతల్నీ, చర్మ సమస్యల్నీ అధిగమించవచ్చనీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కృత్రిమమైన కాంతిలో బతికేవారు ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ బారినపడే ప్రమాదమూ ఉందంటున్నారు. ఒత్తిడి హార్మోను కార్టిసోల్‌ సూర్యకాంతిని ఆస్వాదించేవారి దరిదాపుల్లోకి కూడా రాదని యూనివర్సిటీ ఆఫ్‌ కొలరాడో నిపుణుల మాట. ‘సూర్యస్నానం’ వూబకాయాన్నీ నియంత్రిస్తుంది. సహజమైన వెలుతురు మనిషిలోని సహజ సృజనను మెరుగుపరుస్తుందని చెప్పడానికి ఆధారాలున్నాయి.
ఏ కొరియర్‌ కుర్రాడో పార్సిలు పట్టుకుని వస్తున్నాడంటేనే... గేటు తెరిచి మరీ కాచుకుని నిలబడతామే! అంతదూరం నుంచీ ప్రాణశక్తిని ప్రేమగా మోసుకొచ్చి ఇచ్చే హిరణ్యగర్భుడికి మాత్రం, పాచిమొహపు పలకరింతా కరవేనా! ఆ నిర్లిప్త నిర్లక్ష్య ధోరణి అక్షరాలా కృతఘ్నతే! సూర్యుడి సంగతి పక్కన పెట్టినా, మనకోసమైనా మనం సూర్యోదయానికి ముందే మేల్కొనాలి. ఆ సాధనతో మన మీద మనం పట్టుసాధిస్తాం, కాలం మీదా పట్టు సాధిస్తాం. ఏ వికాససాహిత్యం తిరగేసినా, ప్రతి విజేత దినచర్యా బ్రాహ్మీ ముహూర్తంలోనే మొదలవుతుంది. మనసు మీదా సూర్యుడి ప్రభావం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. సుప్రభాతవేళ మనసు మహా ప్రశాంతంగా ఉంటుంది. మధ్యాహ్నం నాటికి ఎక్కడలేని చికాకు వచ్చేస్తుంది. సూర్యాస్తమయ సమయానికి నిద్రలేచే, అసురీప్రవృత్తి... నడిరేతిరి దాకా నాట్యమాడుతుంది. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో గణాంకాల ప్రకారం కూడా... పొద్దు కుంగుతున్నకొద్దీ హింస పెరుగుతోంది.
ఇచ్చేవాడినే గిచ్చేతత్వం మనిషిది. పవిత్ర గంగను పరమచండాలం చేసేశాడు. స్వచ్ఛమైన గాలిని అపరిశుభ్రంగా మార్చేశాడు. చివరికి సూర్య కిరణాల్నీ వదల్లేదు. ‘కాంతి కాలుష్యం’ భవిష్యత్తులో తీవ్ర సమస్యగా పరిణమించబోతోంది. వందేళ్ల క్రితంతో పోలిస్తే ... సూర్యకాంతిలో మెరుపు తగ్గింది. స్పష్టత లోపించింది. కారణం..ప్రకృతిలోని కాలుష్య కణజాలమే. కాంతిలోకి చొచ్చుకుపోతున్న ఆ ధూళికణాలూ రసాయనాలూ... అమృత రశ్మిని విషపూరితం చేస్తున్నాయి. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే, అది ‘మిత్ర’ ద్రోహమే! ఆ వికృతతత్వాన్ని ప్రకృతి కూడా క్షమించదు. ఏదో ఒకరోజు ఇంతకింతా అనుభవించాల్సివస్తుంది. ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్తపడేంత ప్రాప్తకాలజ్ఞత మనిషికి ఉందనే భావిద్దాం.
* * * శత్రువుల్ని తొలగిస్తుంది, శుభాల్ని కలిగిస్తుంది, కష్టాల నుంచి ఒడ్డునపడేస్తుంది, దీర్ఘాయువును ప్రసాదిస్తుంది - ఇలా సాగుతుంది ఆదిత్యహృదయస్తోత్ర ఫలశ్రుతి.
ఇదంతా - ఆదిత్య హృదయాన్ని వల్లెవేయడం వల్ల జరగదు, ఆదిత్యుడి హృదయాన్ని మనలో ప్రతిష్ఠించుకోవడం వల్లే సాధ్యం అవుతుంది. సూర్యుడు మన హృదయ స్థానంలో ఉన్నాడనుకుంటే - సూర్యుడిలా విశాలంగా ఆలోచిస్తాం, సూర్యుడిలా సమాజానికి ఉపకారం చేస్తాం, సూర్యుడిలా క్రమశిక్షణతో మెలుగుతాం. అలాంటి వారికి - ఓటమి ఉండదు, శత్రుభయం ఉండదు, రోగాలూ దరిచేరవు. అప్పుడిక... నరుడే భాస్కరుడు!
గ్రీకుపురాణం ప్రకారం సూర్యుడికో ప్రేమకథ ఉంది. అసలే అందగాడు కాబట్టి, చాలామంది అమ్మాయిలే మనసుపడ్డారు. అందులో ఓ వనదేవతా ఉంది. కానీ సూర్యుడేమో జలదేవత కూతుర్ని ప్రేమించాడు. ఆ యువతి సూర్యుడి ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించింది. వనదేవత ఆ ఎడబాటును భరించలేక పొద్దుతిరుగుడు మొక్కగా మారిపోయింది. అయినా పూర్వజన్మ జ్ఞాపకాలు పోలేదు. పొద్దు వెనకాలే సుద్దులు చెబుతూ బయల్దేరుతుంది. సైన్స్‌ ప్రకారం ఆ తిరుగుడుకు కారణం...‘ఫొటోట్రాపిజమ్‌’.
ఇంకో ఐదొందల కోట్ల సంవత్సరాల తర్వాత...సూర్యుడు మాయమైపోయే ఆస్కారం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సూర్యుడి మీదున్న హైడ్రోజన్‌ అంతా మండిపోతే మహావిస్ఫోటనం (సూపర్‌నోవా) తప్పదు. జీవరాశి మొత్తం నశించకా తప్పదు.
భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతుంది. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో భూమి సూర్యుడికి చాలా దూరంగా ఉంటుంది. దీంతో ఆ కిరణాలు మనల్ని చేరుకోడానికి ఎక్కువ సమయం ప్రయాణిస్తాయి. ఆ సుదీర్ఘయాత్రలో...తక్కువగా చెదిరిపోయే స్వభావమున్న ఎరుపురంగు ఎక్కువగా మన కంటికి చేరడం వల్లే...సంధ్యాకిరణాలు బంగారపు రంగులో మెరిసిపోతుంటాయి.
ఈజిప్షియన్ల ముఖ్యదేవత పేరు...రా! ఆ దేవత చుట్టూ ఓ కాంతివలయం ఉంటుంది. అది సూర్యతత్వానికి ప్రతీక. సూర్యుడు కలలోకి వస్తే అంతా మంచే జరుగుతుందని ఓ నమ్మకం. అందులోనూ, సూర్యోదయ దృశ్యం పరిపూర్ణ ఆరోగ్యానికి గుర్తు.
చంద్రుడితో పోలిస్తే సూర్యుడు నాలుగువందల రెట్లు పెద్ద. చంద్రుడి కంటే నాలుగువందల రెట్లు దూరం కూడా. ఆ కారణంగానే, సూర్యచంద్రులిద్దరూ తూర్పుపడమర దేశాల్లో స్థిరపడిపోయిన కవలల్లా అనిపిస్తారు.
అంగారకగ్రహం మీద జనావాసమంటూ ఉంటే, ఆ జనానికంటూ మనలానే కాస్తంత కవితాహృదయం ఉంటే..ఉదయించే సూర్యుడిని ఆపిల్‌తోనో, టమాటాతోనో చచ్చినా పోల్చరు. చక్కగా, ఏ ‘నీలమణి’నో ఉపమానంగా తీసుకుంటారు. ఎందుకంటే, అంగారకగ్రహం మీది నుంచి చూస్తే సూర్యుడు నీలమేఘశ్యాముడిగా దర్శనమిస్తాడు. సూర్య ఆలయాలు...
భారతదేశంలోని ప్రతి సూర్యక్షేత్రం వెనుకా... ఓ ఖగోళపరమైన నిగూఢ రహస్యమున్నట్టు పాశ్చాత్య పరిశోధకులు గుర్తించారు. అపార సౌరశక్తి అక్కడ నిక్షిప్తమైనట్టు కూడా నిరూపించారు. శ్రీకాకుళంజిల్లా అరసవల్లిలోని ఆలయం క్రీస్తుపూర్వం నాటిదని చెబుతారు. హనుమకొండలోని వేయిస్తంభాల గుడిలో పూర్వం సూర్య విగ్రహమూ ఉండేదని అంటారు. ఒడిశాలోని కోణార్క్‌ సూర్యాలయం జగత్‌ ప్రసిద్ధం. ఆ నిర్మాణశైలీ అద్భుతమే. కృష్ణుడి కుమారుడైన సాంబుడు...ఓ మహర్షి ఇచ్చిన శాపం నుంచి మిముక్తి పొందడానికి ఇక్కడ తపస్సు చేశాడనీ, ‘త్వం మాతా, త్వం దాతా...’ అంటూ సూర్యదేవుడిని ఉపాసించాడని ఐతిహ్యం. కోణార్క్‌ ఆలయం అద్భుత రథాకృతిలో ఉంటుంది. కాశీ క్షేత్రంలో సూర్యుడు ద్వాదశాదిత్యుడిగా...పన్నెండు రూపాల్లో కొలువుదీరాడు


సూర్యదేవుని సౌధం
– కోణార్క్‌

సప్తాశ్వ రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేతపద్మ ధరం దేవం తమ్‌ సూర్యం ప్రణమామ్యహం!
అంటూ.. ఆ ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే రెండు చేతులు ఆకాశంవైపుగా సాగి మందిరానికి కైమోడ్చుతాయి. లోకానికి ప్రాణనాథుడైన సూర్యదేవునికి కనులు ప్రణామాలు చెల్లిస్తాయి. ఉదయపు భానుడిలా ఎర్రదనంతో ఆకాశమంత ఎత్తులో ఉన్న ఆ భానుని నివాసాన్ని మనసు తనువంతా కనులు చేసుకొని అచ్చెరువొందుతూ వీక్షించడంలో మునిగిపోతుంది.

ఒరిస్సా రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాల్లో శంఖుక్షేత్రం పూరి, చక్ర క్షేత్రం భువనేశ్వరం, గదా క్షేత్రం జాజ్‌పూర్, ఈ కోణార్క్‌ పద్మక్షేత్రం ప్రసిద్ధమైనవి. కోణార్క్‌ ఆలయాన్ని ‘నల్ల పగోడా’ అంటారు. ప్రధాన పట్టణమైన భువనేశ్వర్‌ నుంచి 64 కిలోమీటర్ల దూరంలో జగన్నాథుడు కొలువున్న పూరీ పట్టణానికి కేవలం 34 కిలోమీటర్ల దూరంలో ఉంది కోణార్క్‌. ప్రపంచ వారసత్వ కట్టడంగా ‘యునెస్కో’ జాబితాలో చేరిన ఈ ఆలయం మనదేశ అద్భుతాల్లో ఒకటి. ఇప్పుడిదొక మాన్యుమెంట్‌గా గత చరిత ఘనతకు ఆనవాలుగా గాధలను మనకు వివరిస్తుంది. రారమ్మని ఆహ్వానిస్తుంది.

నాటి గాధలు కళ్లకు కట్టే కట్టడం
భువనేశ్వర్‌ నుంచి బస్సులో కోణార్క్‌కు చేరుకోగానే హృదయం ఒక్కసారిగా ఉద్వేగభరితం అవుతుంది. పరుగులాంటి నడకతో ఆలయం ముంగిట్లో గువ్వపిట్టలా వాలిపోతాం. నాటి గుర్తులను హృదయంలో ఒక్కొక్కటి లిఖించుకుంటాం. ఈ ఆలయం 13వ శతాబ్దిలో రూపుదిద్దుకున్నట్టు పద్మపురాణంలో చెప్పబడింది. ఈ ప్రాంతం గంగావంశానికి చెందిన లాంగులా నరసింహదేవుడు సూర్యభక్తుడు. ఇతని కాలంలో ఈ ఆలయం నిర్మించబడింది. దీనినే మైత్రేయ వనం అనేవారు. ఈ మందిరం ఎత్తు 230 అడుగులు. అప్పటి తామ్ర శాసనంలో ఈ స్థలానికి కోణా లేదా కోణాకమనము అని పేరుంది. బుద్ధదేవుని మరొకపేరు కోణాకమనీ, అందువల్లనే కోణార్కము బుద్ధదేవుని పేరిట నెలకొన్న స్థలమనీ అంటారు. పూరీక్షేత్రానికి ఈశాన్య కోణంలోని అర్క (సూర్య) దేవుని క్షేత్రం గనుక దీనికి కోణార్కమని పేరు వచ్చింది.

సప్తాశ్వరథం
సూర్యుడు 24 చక్రాలతో, ఏడు అశ్వాలతో ఉన్న రథాన్ని అధిరోహించి సౌరమండలాన్ని పాలించడానికి బయల్దేరుతాడట. ఆ ఆకారం పోలికతోనే నిర్మించబడిన ఈ దేవాలయానికి ఇరువైపులా పన్నెండు జతల చక్రాలు, వారంలోని ఏడురోజులను సూచించే విధంగా ఏడు అశ్వాలు చెక్కబడి ఉంటాయి. (ప్రస్తుతం ఆశ్వాలు లేవు) ఈ చక్రాలపై పడే సూర్యకిరణాల ఆధారంగా స్థానికులు కచ్చితమైన సమయాన్ని చెప్పగలుగుతారని గైడ్స్‌ వివరిస్తారు. సూర్యపరిభ్రమణాన్ని చూపించే విధంగా ఈ చక్రాలు చెక్కబడటం ఓ గొప్ప విశేషం. ఒక్కో రథ చక్రం 3 మీటర్ల వైశాల్యంతో అద్భుత శిల్పచాతుర్యంతో కనిపిస్తుంది. మందిరం మధ్యభాగంలో రత్నఖచితమైన సింహాసనముండేదట. దానిపైన సూర్యభగవానుడు ఆసీనుడై ఉండేవాడట. ఈ మూర్తి ముందు వజ్రం ఉండేదని, సూర్య కిరణాలు ఈ వజ్రం మీద పడి అవి కాంతులు విరజిమ్మేవని చెబుతారు. ఈ సూర్యప్రతిమకు తలపై మకుటం, చెవులకు కుండలాలు, కంఠంలో హారం, మెడలో జంధ్యం, వాటిలో మువ్వలు, కటి ప్రదేశంలో ఆభర ణం, దానికింద గ్రంథిమాల.. జీవకళ తొణికినట్టు కనిపించేదట. 1627లో రాజ కుద్ర సూర్య మూర్తిని కోణార్క్‌ నుంచి పూరీలో జగన్నాథ ఆలయానికి తరలించారని చెబుతారు. దేవాలయం పైన పద్మం, కలశము ఆకర్షణీయంగా చెక్కబడి ఉన్నాయి. ఖజురహో మాదిరి ఇక్కడా శృంగార రసభరిత శిల్పాలు ఎన్నో ఉన్నాయి.

నిర్మాణానికి 16 ఏళ్లు..
ఈ మందిరాన్ని 1200 మంది శిల్పులు 16 సంవత్సరాల పాటు నిర్మించారని చరిత్ర విశదం చేస్తుంది. దేవాలయంతో పాటు దీంట్లోని ప్రధాన హాలు ఒక తామరపూవు మీద ఉన్నట్టు చెక్కి ఉంటుంది. ఈ విశాలమైన హాలుకు నాలుగువైపులా ద్వారాలు, వాటి మీద చెక్కిన లతలు, పువ్వులు.. నాటి అద్భుత కళాసృష్టికి నీరాజనాలు పలుకకుండా ఉండలేం. ఈ హాలు ముందు భాగంలో మరో నాట్యమందిరం నిర్మింపబడి ఉంది. దీనిని భోగమంటపమని, నాట్యమందిరం అని అంటారు. అన్ని వైపులా రాతిపైన చెక్కిన నర్తకుల బొమ్మలు బాజభజంత్రీలతో దేవతార్చన చేయటం కనపడుతుంది. హాలుకి ఉత్తరం వైపు రెండు ఏనుగుల విగ్రహాలు ఉన్నాయి. అవి నిజం ఏనుగులనే తలపించేలా ఉంటాయి. ఒక్కో ఏనుగు ఎత్తు 9 అడుగులు, వెడల్పు 5 అడుగులు ఉంటుంది. హాలుకు దక్షిణం వైపు విరాట్‌ స్వరూపంతో రెండు గుర్రాలుండేవట. ఇప్పుడవి కానరావు. వీరావేశంతో ఉండే ఆ విగ్రహాలను చూసి దర్శకులు భయపడేవారట. ఈ ఆలయం తూర్పు–పడమరల దిక్కులుగా ఉంటుంది. ప్రధాన హాలులో భక్తజనం ప్రార్థనలు జరిపేవారు. అయితే ప్రస్తుతం ఇది మూసి వేసి ఉంటుంది. ఈ ప్రాంత సమీపంలోనే భక్తకబీరుదాసు సమాధి ఉండేదని అబుల్‌ఫజల్‌ అయినీ అక్బరీ చెబుతోంది.

సూర్యుడే తపమాచరించిన చోటు
శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు ఒకనాడు నీళ్లరేవులో అభ్యంగన స్నానం చేస్తున్న స్త్రీలను చూశాడని తండ్రి శపించాడట. ఆ శాపం వల్ల సాంబుడు కుష్టురోగి పీడితుడయ్యాడు. దీంతో ఇక్కడి మైత్రేయవనంలో చంద్రభాగా తీరాన సూర్యారాధన చేసి రోగవిముక్తుడయ్యాడట. ఈ ప్రాంత పవిత్రతను బట్టి సాంబుడు సూర్యప్రతిమను ప్రతిష్టించి పూజలు జరిపాడని చెబుతారు. ఆ తర్వాతి కాలంలో లాంగులా నరసింహదేవుడు నేటి ఆలయాన్ని నిర్మించారని కథలున్నాయి.
స్వయంగా సూర్యభగవానుడే ఇక్కడ తపస్సు చేశాడని, అందుకే ఈ మందిరానికి, ఈ ప్రాంతానికి పవిత్రత చేకూరందని చెబుతారు. అంటే ఈ ప్రాంతంపై సూర్యదేవుని మహిమలు అధికమన్నమాట. ఎంతటి దీర్ఘకాల వ్యాధులైనా ఈ ప్రాంత సందర్శనంతో నయమవుతాయని భక్తుల విశ్వాసం. అనూరుడు సూర్యుని రథసారధి. చేతులు జోడించి సూర్యుని ధ్యానిస్తున్నట్లు ఉంటుంది ఆకృతి. ఇక్కడ గల రామచండీ మందిరం కోణార్కు అధిష్ఠాత్రిదేవీ మందిరం (దీనినే బుద్ధుని తల్లి మాయాదేవి మందిరం) అంటారు. దీనిలోని ప్రతిమ ఇప్పుడు దేవాలయానికి దగ్గరగా ఉన్న లియాఖియా అనే గ్రామంలో ఉంటుంది. ఇక్కడి నవగ్రహాలు తప్పక దర్శించవలసినవి. ఈ గ్రహాలు మనుష్యాకారంలో కాంతులు వెదజల్లుతున్నట్టు మెరుస్తుంటాయి. ఇవన్నీ.. తలలపై మకుటం, పద్మాసనం వేసినట్లు చెక్కబడ్డాయి. ఇంకా ఎన్నో ప్రతిమలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఈ ఆలయం పక్కనే ఉండే మర్రివృక్షం అతి ప్రాచీనమైనది, విశాలమైనది. ఇక్కడ బుద్ధుడు తపస్సు చేసినట్టు కథలుగా చెబుతారు.


అలంకారాలెన్నో!
ఆ నిర్మాణ కౌశలం, ఆ శోభ ఆనవాలుగా కనిపిస్తున్న ఆ దర్బారు హాలు, ఆ అలంకారాలు, ఆ మందిరాలు.. ఎన్నో గాలి తుపానులకు, మరెన్నో భూకంపాలకు లోనైంది. ఇంకా తనవితీరక విదేశీయుల చేతిలో విధ్వసం చేయబడింది. కర్కోటకుడైన కళాపహాడు, 17వ శతాబ్ది జహంగీర్‌ ఈ దేవాలయం ధ్వంసం చేసినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. మహమ్మదీయ నావికులు ఉత్కలకళామణిని కనుమరుగు చేసే ప్రయత్నం చేశారు. కోణార్క దేశం పతనం చెందింది. ఇక్కడ దేవ దేవీల దివ్యమందిరం, జాతీయ కాంతి సౌధం పోర్చుగీసుల ఆశ్రయ స్థలం ముక్కలై జీర్ణ చిహ్నమై కనిపిస్తుంది. అయినా, నాటి కళావైభవం చెక్కుచెదరక కనులకు విందు చేస్తూనే ఉంది. దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుతూనే ఉంది.

మార్గం సులభం
హైదరాబాద్‌ నుంచి భువనేశ్వర్‌కి విమానమార్గం, రైలుమార్గం, రోడ్డుమార్గం ద్వారా చేరుకోవచ్చు. దేశంలోని అన్ని ముఖ్య పట్టణాల నుంచి భువనేశ్వర్‌ చేరుకోవచ్చు. భువనేశ్వర్‌ విమానాశ్రయం నుంచి 64 కిలోమీటర్లు. పూరీ నుంచి 34 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి టాక్సీలు, బస్సు సదుపాయాలు ఉన్నాయి. పూరీలో రైల్వేస్టేషన్‌ ఉంది. కోణార్క్‌ చుట్టుపక్కల చూడదగిన సుందర ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో పూరీ జగన్నాథ మందిరం, భువనేశ్వర్‌లోని సోమేశ్వర ఆలయం, భువనేశ్వరి మాత ఆలయం, చంద్రభాగా బీచ్, రామచండీ టెంపుల్, బీచ్, బౌద్ధ ఆరామాలు... ప్రధానమైనవి.

విశేష యాత్ర
ఈ పుణ్య క్షేత్రంలో మాఘ సప్తమినాడు విశేష యాత్ర జరుగుతుంది. ఘనత వహించిన యాత్రలెన్నో పూర్వం ఇక్కడ వైభవంగా జరిగేవట. వీటిలో ముఖ్యమైనవి చైత్రయాత్ర, రథయాత్ర, చంద్రభాగయాత్ర.700 ఏళ్ల ఘనచరిత్ర గల ఈ నిర్మాణ ప్రాంగణంలో కోణార్క్‌ డ్యాన్స్‌ ఫెస్టివల్‌ను ప్రతియేటా ఒరిస్సా ప్రభుత్వం జరుపుతుంది. ఈ ఉత్సవాలు ఈ ఏడాది ఫిబ్రవరి 19న జరగనున్నాయి.పూరి నుంచి కోణార్క్‌తో పాటు మరో 10 చూడదగిన ప్రదేశాలను సందర్శించడానికి టూరిస్ట్‌ బస్సులు ప్యాకేజీలను అందిస్తుంటాయి. ఒకరికి 200 రూపాయల నుంచి టికెట్‌ ఉంటుంది.భువనేశ్వర్, పూరీ క్షేత్రంలో బస సదుపాయాలకు లోటు లేదు.ఈ ప్రాంత స్థానిక వంటల రుచి తప్పక ఆస్వాదించాల్సిందే!సముద్రతీర ప్రాంతం గనుక ఇక్కడ దొరికే గవ్వలతో తయారుచేసే హస్తకళా వస్తువులు, పూసలు కారుచవకగా దొరుకుతాయి.

– నిర్మలారెడ్డి చిల్కమర్రి


టాగ్లు: కోణార్క్‌, అశ్వాలు, సూర్యకిరణాలలు, Konark, Had been, The sun's rays








No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list