MohanPublications Print Books Online store clik Here Devullu.com

-శ్రీ భగవద్గీత_Sri Bhagavadgita











గీతామృతం

 శోకమోహాలనేవి మానసిక స్థితిలో సంభవించేవి. హర్షోల్లాసాలు కూడా మానసిక స్థితిలోనే కలుగుతాయి. అయితే శోకమోహాలు శరీరాన్ని, ఇంద్రియాలను శోషింపజేస్తాయి. కాగా హర్షోల్లాసాలు శరీరంలో నూతనోత్తేజాన్ని నింపుతాయి. బంధువులకు తన వలన కలగబోతున్న మృత్యువును తలుచుకుని అర్జునుడు శోకగ్రస్థుడయ్యాడు. అది తన శరీరాన్ని శోషింపజేస్తున్నది. అంటే ఎండిపోయేట్లు చేస్తున్నదని అతడు గ్రహించాడు. అటువంటి శోకాన్ని తొలగించుకునే మార్గం కూడా తన దగ్గర లేదని అతనికి అర్థమైంది. అటువంటి పరిస్థితిలో అతడు కృష్ణపరమాత్మను శరణుజొచ్చాడు. తనకు మర్గోపదేశం చేయమని ప్రార్థించాడు. ఈ విషయాన్ని అర్జునుడు నిక్కచ్చిగా చెబుతూ.. ‘‘గోవిందా! నేను యుద్ధం చేయను’’ అని మౌనం వహించాడు. ఈ సందర్భంలో అర్జునుని పరంతపుడనే పదంతో సంబోధించడం జరిగింది. అంటే అర్జునునికి శత్రువులను తపింపజేసేటంతటి శక్తి ఉంది. అయినా బుద్ధిస్థితి నుంచి మానసికస్థితికి దిగజారిపోవడం వల్ల శక్తిసామర్థ్యాలు నిర్వీర్యమయ్యాయి. యుద్ధోత్సాహం అవిరైపోయింది. కనీసం నిలబడడానికైనా శక్తి లేనంతగా శరీరం ఎండిపోయింది.
అర్జునుడు ఎప్పుడైతే ఆ విధంగా కర్తవ్యవిముఖుడయ్యాడో శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడిని హృషీకేశుడనే పదంతో సంబోధించడం జరిగింది. హృషీకేశుడంటే ఇంద్రియాలకు ప్రభువని అర్థం. ఇంద్రియాలను శోషింపజేస్తున్నట్టి దుఃఖంలో మునిగిపోయిన అర్జునునికి ప్రశాంతతను చేకూర్చి, అతని ఇంద్రియాలను తిరిగి స్వాధీనంలోకి తేగలిగిన వాడు కనుకనే ఈ సందర్భంలో కృష్ణుడిని హృషీకేశుడన్నారు. అర్జునుడి సమస్య, దానికి పరిష్కారం తెలుసు కాబట్టే శ్రీకృష్ణుడు నవ్వుతున్నాడు. ఈ విధంగా నవ్వుతూనే ఆ దేవదేవుడు పరమోత్కృష్టమైన, మానవులు మాత్రమే తెలుసుకోగలిగిన పునర్జన్మ సిద్ధాంతాన్ని ప్రస్తావించాడు. అర్జునుడు తన ఎదురుగా ఉన్నవాళ్లందరూ బంధుమిత్రులని, పూజనీయ గురువులని భావిస్తున్నాడు. వారందరి మరణం తనకు దుఃఖాన్ని కలిగిస్తుందని అనుకున్నాడు. అది నిజమే అయినా ప్రస్తుత దేహం పోగానే అంతా అయిపోతుందని అనుకోవడం సరికాదంటూ శ్రీకృష్ణభగవానుడు పునర్జన్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
‘‘దేహధారి దేహంలో బాల్యం నుంచి యవ్వనానికి, యవ్వనం నుంచి ముసలి ప్రాయానికి ఎలా వెళతాడో అదే రీతిగా మరణం తర్వాత మరొక దేహాన్ని పొందుతాడు. కాబట్టి ఇటువంటి మార్పు విషయంలో ధీరుడు మోహము చూపకూడదు’’ (భగవద్గీత 2.13) అని వివరించాడు. శ్రీకృష్ణభగవానుడు గీతాబోధ ఆదిలోనే పునర్జన్మ సిద్ధాంతాన్ని బోధించడాన్ని బట్టి ఇదే గీతలో తొలిసందేశం అవుతుంది. దేహాన్నే ఆత్మగా భావించడం పశులక్షణం, దేహంలో ఉన్న ఆత్మనే దేహానికి యజమానిగా భావించే స్థితికి చేరుకోవడం మానవజన్మ లక్ష్యం. ఎవ్వడైతే ఈ మానవజన్మ లక్ష్యాన్ని తెలుసుకోడో వాడు అత్మఘాతకుడే అవుతాడు. అంటే తన ఆత్మను తానే చంపుకున్న వాడవుతాడు. అటువంటి మానవజన్మ పూర్తికాగానే పశుపక్ష్యాదుల జన్మను పొందుతాడు. పునర్జన్మ సిద్ధాంతాన్ని అర్జునునికి బోధించడంలో ఉద్దేశం ప్రస్తుత దేహం రాలిపోగానే ఈ బంధుమిత్రులందరూ మళ్లీ కొత్త దేహాలను పొందుతారని, కాబట్టి ఆ విషయంలో శోకం అనవసరమని, ధర్మస్థాపనకై ఆసన్నమైన యుద్ధాన్ని ఆపవద్దని శ్రీకృష్ణుడు సూచించినట్లయింది. ఇక గీతామృతాన్ని పానం చేసేవాడు ప్రస్తుత దేహమే సర్వస్వమనే ధోరణిని విడిచిపెట్టాలి. అతడు పశుపక్ష్యాదుల జన్మలలోకి తన ఆత్మను తోయకుండా ఉన్నతమైన జీవితాన్ని రాబోయే జన్మలో పొందే ప్రయత్నం చేయడానికి కృతనిశ్చయుడు కావాలి. అదే గీతాబోధ ప్రయోజనం. పునర్జన్మ సిద్ధాంతాన్ని ప్రస్తావించడం అనేది వైరాగ్యాన్ని పొందడానికి కాకుండా ఆత్మదృష్ట్యా కర్తవ్య నిర్వహణకు నడుం కట్టడానికేనని తెలుసుకొంటే గీతా ప్రయోజనం సిద్ధించినట్లే. 





No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list