MohanPublications Print Books Online store clik Here Devullu.com

అంతా అస్తవ్యస్తం, _Health For Ladies, అంతా అస్తవ్యస్తం,

అండం..పిండం..మనసు..సొగసు.. 

అంతా అస్తవ్యస్తం!
ఆమెకు ప్రపంచం తల్లకిందులు అయినట్లుంటుంది.
పేరుకే ‘నెల’సరిగానీ అది ఎప్పుడొస్తుందో తెలీదు. వచ్చినప్పుడు అంతా గందరగోళం. మరోవైపు ముఖం మీద, ఒంటి మీద మగవారిలా అవాంఛిత రోమాలు. మొత్తం జీవితమే ఏదో అయోమయంలో పడినట్లు అనిపిస్తుంటుంది. నేడు ఎంతోమంది యుక్తవయసు ఆడపిల్లలు, స్త్రీలు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య.. ఈ పీసీఓఎస్‌!
చాలామంది గడ్డాలు, మీసాల వంటి వాటినే చూసుకుంటూ వాటి గురించే ఎక్కువ ఆందోళన చెందుతుంటారుగానీ వాస్తవానికి పీసీఓఎస్‌ ఈ పైపై చికాకులకు మాత్రమే పరిమితమయ్యేది కాదు. మొత్తం ఆరోగ్యంపైన కూడా దీని ప్రభావం కొంత లోతుగా ఉంటుంది. వీరికి మధుమేహం, గుండె జబ్బుల వంటి ముప్పులు ఎక్కువగా ఉంటున్నాయని వైద్యరంగం ఇప్పుడు స్పష్టంగా హెచ్చరిస్తోంది. పైగా ఇది మిగిల్చే మానసిక వేదనా అనంతం. అయితే.. సమస్య ఇంత విస్తృతమైనదైనా.. దీన్ని సత్వరమే గుర్తించి చికిత్స తీసుకుంటే చాలా వరకూ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అందుకే దీనికి సంబంధించిన సమగ్ర వివరాలను మీ ముందుకు తెస్తోంది ఈ వారం సుఖీభవ!
పాలీ సిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌.. పీసీఓఎస్‌.. మన సమాజంలో ఎంతోమంది స్త్రీలు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఇది! మహిళల్లో దాదాపు నూటికి ఐదుగురు దీంతో బాధపడుతున్నారని అంచనా. కొత్తగా రజస్వల అయిన యుక్తవయసు ఆడపిల్లల నుంచి నడి వయసు మహిళల వరకూ.. ఎంతోమంది ఈ సమస్యతో సతమతమవుతున్నారు. చూడటానికి, చెప్పుకోవటానికి ఇదొక వ్యాధిలాగా అనిపించకపోవటం ‘పీసీఓఎస్‌’ ప్రత్యేకత. నెలసరి అస్తవ్యస్తం కావటం.. అవాంఛిత రోమాలు పెరగటం.. గర్భం రాకపోవటం.. ఇలా లక్షణాలన్నీ వేర్వేరుగా కనిపిస్తుంటాయి. ఆ లక్షణాలన్నింటినీ కలిపి సమగ్రంగా చూస్తేనేగానీ.. వాటన్నింటికీ మూలం ‘పీసీఓఎస్‌’లో ఉందని పట్టుకోలేం. అందుకే చాలామంది దీని విషయంలో రకరకాలుగా పొరబడుతుంటారు కూడా.
పైకి కనిపించే లక్షణాలకు తోడు.. దీనితో కనిపించని ముప్పులూ చాలానే ఉంటాయన్న విషయాన్ని విస్మరించకూడదు. చాలామంది పీసీఓఎస్‌ బాధితులకు అధిక బరువు/వూబకాయం కూడా ఉంటుంది. అలాగే చాలామందిలో హైబీపీ, కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉండటం, ఇన్సులిన్‌ నిరోధకత, భవిష్యత్తులో మధుమేహం వచ్చే అవకాశాల వంటి ముప్పులూ ఎక్కువే. అందుకే దీన్ని ఒక రుగ్మతగా, విస్తృత సమస్యగా అర్థం చేసుకోవటం అవసరం. నిజానికి పీసీఓఎస్‌ పూర్తిగా నయమైపోయే సమస్య కాదు. అయితే దీని కారణంగా తలెత్తే చికాకులన్నింటినీ చాలా వరకూ తగ్గించేందుకు ఇప్పుడు సమర్థమైన చికిత్సలున్నాయి. వీటితో పీసీఓఎస్‌ బాధితులు చాలా వరకూ పూర్తి సాధారణ జీవితం గడిపే వీలుంది.
లక్షణాల్లోనే ఉంది కీలకం!
పీసీఓఎస్‌లో కనిపించే ప్రధాన లక్షణం- నెలసరి సరిగా రాకపోవటం. ఒక్కోసారి నెలల తరబడి కూడా రాకపోవచ్చు. ఏడాది మొత్తమ్మీద 8 కంటే తక్కువసార్లే వస్తుంటుంది. ఆ వచ్చినప్పుడు రుతుస్రావం చాలా ఎక్కువగా ఉండొచ్చు, ఎక్కువ రోజులూ ఉండొచ్చు.
చర్మం జిడ్డు కారుతూ యుక్తవయసు దాటినా కూడా మొటిమలు వేధిస్తుంటాయి. అన్నింటినీ మించి అద్దంలో ముఖం చూసుకోవాలంటేనే ఇబ్బంది పెట్టేలా పెదాల మీద, చెంపల మీద.. వెంట్రుకలు పెరుగుతుంటాయి. ఏదో నూనూగుగా ఉంటే ఫర్వాలేదుగానీ క్రమేపీ గడ్డం, మీసం కాస్త దట్టంగా కూడా వస్తుంటాయి. మగవారిలా ఛాతీ మీద, పొట్ట మీద, మోచేతులు, తొడల లోపలి వైపు..చివరికి పొట్ట మీద మధ్యలో నిలువు గీతలా కూడా వెంట్రుకలు వస్తుంటాయి. ఇది చాలదన్నట్టు తల మీదేమో జుట్టు రాలిపోతుంటుంది.
బరువు పెరిగి వూబకాయులుగా తయారవ్వచ్చు. కొందరిలో గర్భధారణ కూడా కష్టంగా తయారవుతుంది.
ఈ లక్షణాల్లో అన్నీ అందరికీ ఉండాల్సిన పని లేదు. కొన్ని ఉన్నా కూడా పీసీఓఎస్‌ను అనుమానించాల్సి ఉంటుంది. ఇవి రజస్వల అయిన తర్వాత యుక్తవయసులో ఎప్పుడైనా మొదలవ్వచ్చు. కొందరికి మొదట్లో అంతా బాగానే ఉన్నా క్రమేపీ బరువు పెరిగి, దాంతో సమస్యలు ఆరంభం కావచ్చు.
ఏమిటీ లక్షణాలు.. ఎందుకీ బాధలు?
పీసీఓఎస్‌ను అర్థం చేసుకోవాలంటే ముందు ప్రతినెలా స్త్రీ శరీరంలో ఏం జరుగుతుందో స్థూలంగా తెలుసుకోవటం అవసరం. ఆడపిల్లలకు పుట్టుకతోనే అండాశయాల్లో బోలెడన్ని కుదుళ్లు, వాటిల్లో సూక్ష్మరూపంలో అండాలు ఉంటాయి. సాధారణంగా ప్రతి నెలా అండాశయాల్లోని ఈ కుదుళ్లలో ఏదో ఒక్కటి పరిపక్వమై.. దాని నుంచి ఒక అండం బయటకు విడుదల అవుతుంటుంది. దీన్నే ‘ఓవ్యులేషన్‌’ అంటారు. కానీ ‘పీసీఓఎస్‌’ సమస్య ఉన్న స్త్రీలలో మాత్రం- నెలనెలా ఒక కుదురు పెద్దగా తయారై అండం పరిపక్వమవటానికి బదులు- చిన్నచిన్న కుదుళ్లు బోలెడన్ని సిద్ధమైపోతుంటాయి. వీటిలో నీరులాంటి స్రావం చేరి, ఇవి చిన్న చిన్న తిత్తుల్లా (సిస్ట్‌) తయారవుతాయి. అందుకే ఈ సమస్యను ‘పాలీ సిస్టిక్‌’ అంటారు. అయితే కుదుళ్లు ఇలా చాలానే సిద్ధమైనా.. చివరికి ఇవేవీ కూడా ఒక అండాన్ని పూర్తిగా పక్వానికి తీసుకొచ్చి బయటకు విడుదల చెయ్యలేవు. దీంతో వీరిలో ప్రతి నెలా క్రమం ప్రకారం ‘అండం’ పక్వం కావటం, విడుదల కావటమన్నది ఉండదు. ఫలితంగా నెలసరి అస్తవ్యస్తంగా తయారవుతుంది.
రెండోది- ఆ చిన్నచిన్న తిత్తులు ప్రమాదకరమైనవేం కాదుగానీ అవి అండాశయాల పనితీరును దెబ్బతీస్తాయి. దానివల్ల వీరిలో హార్మోన్లు అస్తవ్యస్తమైపోతాయి. చాలామంది- స్త్రీ హార్మోన్లు స్త్రీలల్లోనే ఉంటాయి, పురుష హార్మోన్లు పురుషుల్లోనే ఉంటాయని అనుకుంటుంటారుగానీ.. అది నిజం కాదు. వాస్తవానికి ఆడవారిలోనూ పురుష హార్మోన్లుంటాయి, పురుషుల్లోనూ స్త్రీ హార్మోన్లుంటాయి, కాకపోతే కాస్త తక్కువ మోతాదులో ఉంటాయి. కానీ పీసీఓఎస్‌ బాధితుల్లో అండాశయాల పనితీరు అస్తవ్యస్తం కావటం వల్ల- పురుష హార్మోన్లు (ఆండ్రోజెన్స్‌) కాస్త అధికంగా తయారవుతుంటాయి. వాటి ప్రభావం పెరిగిపోతుంది. దానివల్ల వీరిలో అండం విడుదల కాకపోవటమే కాదు.. మగవారిలాగా గడ్డాలు, మీసాలు, ఛాతీ వంటి ప్రదేశాల్లో కూడా పురుషుల్లా వెంట్రుకలు పెరగటం వంటివి మొదలవుతాయి. కొందరిలో తల మీద జుట్టు రాలిపోతూ మగవారిలా బట్టతల లక్షణాలు కనబడటమూ కనిపిస్తుంది.
మూడోది.. సాధారణంగా నెలనెలా గర్భాశయం లోపల గోడల వెంట పెరిగే ఎండోమెట్రియం పొర.. నెలసరి సమయంలో మొత్తం వూడిపోయి, రుతుస్రావం రూపంలో బయటకు వచ్చేస్తుంటుంది. అయితే పీసీఓఎస్‌ బాధితుల్లో నెలనెలా సక్రమంగా అండం విడుదల కావటం లేదు కాబట్టి.. గర్భాశయం లోపలి ఈ ఎండోమెట్రియం పొర కూడా పూర్తిగా విడివడదు. పైగా అది మందంగా తయారై అస్తవ్యస్తంగా వూడుతుంటుంది. అందుకని నెలసరి వచ్చినప్పుడు- రుతుస్రావం చాలా ఎక్కువగా కావటం, లేదూ చాలా ఎక్కువ రోజులు కావటం జరుగుతుంటుంది.

వీటినీ చూసుకోవాల్సిందే!
మధుమేహం
పీసీఓఎస్‌ బాధితుల్లో తప్పకుండా పట్టించుకోవాల్సిన కీలకమైన సమస్య మధుమేహం. ఎందుకంటే వూబకాయం ఉన్నా, లేకున్నా, పీసీఓఎస్‌ బాధితుల్లో 65-80% మందికి ‘ఇన్సులిన్‌ నిరోధకత’ మాత్రం కచ్చితంగా ఉంటోందని అధ్యయనాల్లో గుర్తించారు. చాలామంది పీసీఓఎస్‌ బాధితుల్లో రక్తంలో ఈ ఇన్సులిన్‌ ఎక్కువగానే ఉంటోందిగానీ.. రక్తంలో గ్లూకోజు మాత్రం సరిగా నియంత్రణలో ఉండదు. ఇలాంటి వారు క్రమేపీ మధుమేహంలోకి వెళతుంటారు. కాబట్టి బరువు ఎక్కువగా ఉన్న పీసీఓఎస్‌ బాధితులకు లేదా పెద్దవయసులో పీసీఓఎస్‌ బారినపడిన వారికి, కుటుంబ చరిత్ర ఉన్నవారికి ఇన్సులిన్‌ నిరోధకత ఎలా ఉంది? మధుమేహం కూడా వచ్చిందా? అన్నది తేల్చుకునేందుకు గ్లూకోజు తాగించి చేసే రక్తపరీక్షను (జీటీటీ) తప్పనిసరిగా చూడాలి.
గుండె జబ్బు
వూబకాయం, ఇన్సులిన్‌ నిరోధకత లేదా మధుమేహం వంటి సమస్యలున్న వారికి గుండెలోని రక్తనాళాలు మూసుకుపోయి, గుండె జబ్బువచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పీసీఓఎస్‌ బాధితులందరికీ ఈ గుండెపోటు ముప్పు ఎక్కువగా ఉంటుందా? లేదా? అన్నది కచ్చితంగా చెప్పలేకపోయినా పీసీఓఎస్‌తో పాటు వూబకాయంగానీ, మధుమేహంగానీ ఉన్న మహిళలు ఈ గుండె జబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బరువు, ఇన్సులిన్‌ నిరోధకతలతో పాటు కొలెస్ట్రాల్‌ కూడా ఎక్కువగా ఉంటోందేమో పరీక్ష చేయించుకుని, అది ఎక్కువగా ఉంటే తగ్గించుకునేందుకు చికిత్స తీసుకోవటం అవసరం.
గురక, నిద్రలో శ్వాస సమస్య
పీసీఓఎస్‌ బాధితుల్లో కనీసం సగం మందికి నిద్రా సమయంలో మధ్యమధ్యలో ‘శ్వాస’ తీసుకోవటం ఇబ్బందికరంగా ఉంటోందని గుర్తించారు. దీన్నే ‘స్లీప్‌ అప్నియా’ అంటారు. దీనివల్ల నిద్రలో తరచూ మెలకువ వచ్చేస్తుంటుంది. ఇలా రాత్రి నిద్ర కరవై... పగలంతా విపరీతమైన అలసట, మత్తుగా ఉండటం వంటి లక్షణాలు మొదలవుతుంటాయి. ఈ రకం శ్వాస సమస్య ఉన్నవారిలో- ­బకాయం, ఇన్సులిన్‌ నిరోధకత, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె కొట్టుకునే లయలో తేడాల వంటి ఇతరత్రా ముప్పులూ పెరుగుతాయి. కాబట్టి పీసీఓఎస్‌ నిర్ధారణ అయినప్పుడు వారికి గురక వస్తోందా? పగటిపూట మగతగా అనిపిస్తోందా? వంటి లక్షణాల మీదా ధ్యాస పెట్టాలి.
కుంగుబాటు, ఆందోళన
చాలామంది పట్టించుకోని విషయం ఇది. పీసీఓఎస్‌ అనేది మానసికంగా తీవ్ర వేదన మిగిల్చే సమస్య. దీనివల్ల ఎంతోమంది మానసికంగా కుంగుబాటు, ఆందోళన వంటివాటిలో కూరుకుపోతుంటారు. కాబట్టి వీటి గురించీ పట్టించుకోవటం, అవసరమైతే కౌన్సెలింగ్‌ ఇవ్వటం అవసరం.
క్యాన్సర్‌ ముప్పును మరువకూడదు
నెలసరి క్రమంగా రాకపోవటం, రుతుక్రమం అస్తవ్యస్తంగా తయారవటం వల్ల పీసీఓఎస్‌ బాధితుల్లో- ఎండోమెట్రియం పొర చాలా మందంగా పెరిగే అవకాశం ఉంటుంది. దీన్నే ‘ఎండోమెట్రియల్‌ హైపర్‌ప్లేసియా’ అంటారు. అరుదుగానే అయినా కొందరిలో ఇది ఎండోమెట్రియం క్యాన్సర్‌కు కూడా దారి తియ్యొచ్చు. కాబట్టి అల్ట్రాసౌండ్‌ పరీక్ష చేసి, ఎండోమెట్రియం పొర మందం ఎంత ఉంటోందీ పరిశీలించటం అవసరమని తాజా మార్గదర్శకాలు స్పష్టంగా చెబుతున్నాయి.


గర్భధారణ
పీసీఓఎస్‌ బాధితుల్లో గర్భధారణ అంత తేలిక కాదు. నిజానికి చాలామంది గర్భం ధరిస్తారు గానీ దానికి కొంత సమయం పట్టొచ్చు. బరువు ఎక్కువగా గలవారు దాన్ని తగ్గించుకుంటే నెలసరి క్రమబద్ధమై, గర్భధారణ అవకాశాలు మెరుగవుతాయి. బరువు తగ్గినా కూడా రుతుక్రమం గాడిలో పడకపోతే వైద్యులు అండాల విడుదల కోసం ప్రత్యేకంగా హార్మోన్‌ మాత్రలు, ఇంజెక్షన్ల వంటివి ఇస్తారు, దాంతో గర్భధారణ అవకాశాలు బాగా పెరుగుతాయి. అండాశయాల్లో తిత్తులు మరీ ఎక్కువగా ఉన్న వారికి ల్యాప్రోస్కోపీ విధానంలో సర్జరీ చేసి, ఈ తిత్తులను చిదిపెయ్యటం ద్వారా హార్మోన్ల అసమతౌల్యాన్ని బాగా తగ్గించొచ్చు. దీంతో గర్భధారణ అవకాశాలు బాగా మెరుగవుతాయి.
అలాగే గర్భధారణ తర్వాత వీరికి గర్భిణీ మధుమేహం వస్తోందేమో చూడటం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే పీసీఓఎస్‌ ఉన్న స్త్రీలకు ‘గర్భిణీ మధుమేహం’ వచ్చే ముప్పు రెండు రెట్లు ఎక్కువగా ఉంటోందని గుర్తించారు.
ఎందుకిలా?
పీసీఓఎస్‌ ఎందుకొస్తుందన్నది కచ్చితంగా తెలియదుగానీ దీనికి చాలా వరకూ జన్యుపరమైన అంశాలు కారణమవుతున్నాయని భావిస్తున్నారు. పీసీఓఎస్‌ విషయంలో ‘ఇన్సులిన్‌ నిరోధకత’ కీలక పాత్ర పోషిస్తోంది. ఇన్సులిన్‌ అనేది.. మనం తిన్న ఆహారంలోని గ్లూకోజును మన శరీరం శక్తిలా వినియోగించుకునేందుకు ఉపయోగపడే కీలక హార్మోను. దీన్ని క్లోమ గ్రంథి స్రవిస్తుంటుంది. కానీ కొందరిలో శరీరం- ఈ ఇన్సులిన్‌ను సరిగా వినియోగించుకోలేకపోతుంటుంది. దీంతో క్లోమ గ్రంథి ఇన్సులిన్‌ను మరింత ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంటుంది. ఫలితంగా ఒంట్లో ఇన్సులిన్‌ స్థాయులు పెరుగుతాయి. ఈ ఇన్సులిన్‌.. అండాశయాలను అధికంగా ప్రేరేపించి, పురుష హార్మోన్లు కాస్త ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తోందని, దీనివల్ల ఒంట్లో హార్మోన్ల సమతౌల్యం దెబ్బతిని, ‘పీసీఓఎస్‌’ లక్షణాలు మొదలవుతున్నాయని గుర్తించారు. అధిక బరువు ఉన్నవారిలో ఈ సమస్య మరింత ఎక్కువ. మొత్తానికి ఇదీ కచ్చితమైన కారణమని చెప్పలేకపోయినా- పీసీఓఎస్‌ అనేది ఇన్సులిన్‌ నిరోధకత ఎక్కువగా ఉన్న వారిలో వస్తోందని, జన్యుపరంగా కొన్ని కుటుంబాల్లో ఎక్కువగా ఉంటోందని గుర్తించారు. ఇంట్లో తల్లికి గానీ, అక్క చెల్లెళ్లకు గానీ ఉంటే ఇతరులకూ వచ్చే అవకాశాలు ఎక్కువ.
నిర్ధారించుకునేది ఎలా?
నెలసరి సరిగా రాకపోవటం వంటి ఏదో ఒకట్రెండు లక్షణాలకే పరిమితం కాకుండా మొత్తం లక్షణాలన్నింటినీ సమగ్రంగా చూడటం ముఖ్యం. పీసీఓఎస్‌ను నిర్ధారించటానికి ఇప్పుడు స్పష్టమైన మార్గదర్శకాలున్నాయి. దీన్ని ‘రోటెరడామ్‌ కన్సెన్సువస్‌ క్రైటీరియా’ అంటారు. దీని ప్రకారం- 1. అండం విడుదల అస్తవ్యస్తంగా ఉండటం; 2. అల్ట్రాసౌండ్‌ స్కానింగులో అండాశయాల సైజు పెద్దగా ఉండటం లేదా అండాశయాల్లో చిన్నచిన్న ముత్యాల్లా 12 కంటే ఎక్కువ కుదుళ్లు/తిత్తులు తయారై ఉండటం; 3. అలాగే ఒంట్లో పురుష హార్మోన్ల ప్రభావం ఎక్కువగా ఉండటం.. పీసీఓఎస్‌ నిర్ధారణకు ఈ మూడూ కీలకం. కాబట్టి వైద్యులు నెలసరి తీరుతెన్నులను అడిగి తెలుసుకుంటారు. శరీరం మీద వెంట్రుకల పెరుగుదల వంటివీ పరిశీలిస్తారు. ఒంట్లో వివిధ హార్మోన్ల స్థాయులు ఎలా ఉన్నాయన్నది తెలుసుకునేందుకు రక్తపరీక్షలు, అలాగే అండాశయాలను, వాటిలోని తిత్తులను పరిశీలించేందుకు పొత్తికడుపు అల్ట్రాసౌండ్‌ పరీక్ష చేయిస్తారు. వీటితో పీసీఓఎస్‌ను కచ్చితంగా నిర్ధారించొచ్చు.
చికిత్సతో దాదాపు నయమవుతుంది
పీసీఓఎస్‌కు సర్వసాధారణంగా ఇచ్చే చికిత్స- హార్మోన్ల అసమతౌల్యాన్ని సరిచేసేందుకు మాత్రలను ఇవ్వటం! ఇందుకోసం సాధారణంగా గర్భనిరోధక మాత్రల వంటివాటినే సిఫార్సు చేస్తారు. ఈ మాత్రలతో సమస్య పూర్తిగా నయమైపోదుగానీ.. పురుష హార్మోన్ల ప్రభావం తగ్గి, నెలసరి క్రమబద్ధం కావటంతో పాటు ముఖం మీద వెంట్రుకల వంటి చాలా సమస్యలు సర్దుకుంటాయి. ఈ హార్మోన్‌ మాత్రల వల్ల గర్భాశయ క్యాన్సర్‌ నుంచి కొంత రక్షణ కూడా ఉంటుంది. వీటితో పాటు కొందరికి పురుష హార్మోన్ల ప్రభావాన్ని తగ్గించే ‘ఆల్డక్టోన్‌’ వంటి ‘యాంటీఆండ్రోజెన్‌’ మాత్రలను కూడా ఇస్తారు. అలాగే రుతుక్రమాన్ని సరిచేసేందుకు ‘ప్రొజెస్టిన్‌’ వంటి హార్మోన్‌ మాత్రలిస్తారు. ముఖ్యంగా- ఇన్సులిన్‌ నిరోధకతను తగ్గించటం కోసం ‘మెట్‌ఫార్మిన్‌’ (గ్లూకోఫేజ్‌ మొ॥) వంటి మందులను కూడా సిఫార్సు చేస్తారు. మధుమేహానికి సర్వసాధారణంగా వాడుతుండే ఈ మందులు పీసీఓఎస్‌లో రుతుక్రమాన్ని సరి చేయటానికి బాగా ఉపయోగపడతాయి. ఇవి ప్రధానంగా పీసీఓఎస్‌కు చేసే చికిత్సలు. ఇక మొటిమలకు తాత్కాలికంగా లోషన్ల వంటివి, అవాంఛిత రోమాలకు లేజర్లు, ఎలక్ట్రాలసిస్‌ వంటి విధానాలను ఆశ్రయించాల్సి వస్తుంది. పూర్తిగా నయం కాకపోయినా... తరచూ వైద్యులను సంప్రదిస్తూ దీర్ఘకాలం మందులు వాడుకోవటం, జీవనశైలిని మార్చుకోవటం ద్వారా క్రమేపీ పీసీఓఎస్‌ లక్షణాలన్నింటి నుంచీ పూర్తిగా బయటపడొచ్చు.
జీవనశైలి ముఖ్యం
వూబకాయం లేదా అధిక బరువున్న పీసీఓఎస్‌ బాధితులు- బరువు తగ్గటం వల్ల చాలా లక్షణాలు తగ్గుముఖం పడతాయి. బరువు 5% తగ్గినా ఫలితాలు బాగా మెరుగ్గా ఉంటాయని అధ్యయనాల్లో గుర్తించారు.
బరువు ఎక్కువగా లేకపోయినా కూడా పీసీఓఎస్‌ బాధితులు నిత్యం వ్యాయామం చెయ్యటం, శారీరకంగా చురుకుగా ఉండటం, రోజూ నడక వంటి వ్యాయామాలు చెయ్యటం వల్ల ఇన్సులిన్‌ నిరోధకత బాగా తగ్గుతుంది. దీంతో ఫలితాలు బాగుంటాయి.
ఆహారం విషయంలో శ్రద్ధ ముఖ్యం. కొవ్వు పదార్థాలు బాగా తగ్గించాలి. తేలికగా జీర్ణమయ్యే పిండి పదార్థాలను, క్యాలరీలను అధికంగా ఇచ్చే ఫాస్ట్‌ఫుడ్స్‌, కేక్‌లు, క్రీమ్‌లు, కూల్‌డ్రింకుల వంటివి బాగా తగ్గించాలి. పీచు ఎక్కువగా ఉండే ముడి ధాన్యాలు, బ్రౌన్‌ బ్రెడ్‌ వంటి ముడిగోధుమ ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.
పొగ అలవాటు ఉంటే తప్పనిసరిగా మానేసెయ్యాలి. పొగతాగే వారిలో హార్మోన్లు అస్తవ్యస్తమై పీసీఓఎస్‌ లక్షణాలు ముదరటమే కాదు, గుండెజబ్బుల వంటి ఇతరత్రా ముప్పులూ పెరుగుతాయి.

మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list