MohanPublications Print Books Online store clik Here Devullu.com

శ్రీకూర్మనాథ స్వామి ఆలయం "శ్రీకూర్మం Sree Kurmanadha Swamy alayam

శ్రీకూర్మనాథ స్వామి ఆలయం "శ్రీకూర్మం
 Sree Kurmanadha Swamy alayam
bhaktipustakalu



శ్రీకూర్మనాథ స్వామి ఆలయం
 "శ్రీకూర్మం"


ఏటా జ్యేష్ఠ శుక్ల ద్వాదశి రోజున ఈ కూర్మజయంతి నిర్వహిస్తారు. జయంతి సందర్భంగా ఉదయం స్వామికి ప్రత్యేక అభిషేకం, విశేష అర్చనలు, అలంకారార్చన, రాత్రికి ఉత్సవ విగ్రహాలకు తిరువీధి నిర్వహిస్త్రారు. శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మ క్షేత్రం లో కూర్మనాథుడు వెలశాడు. అస్సాంలోని గౌహతిలోనూ కూర్మనాథాలయం ఉంది. ఇక భారత దేశములో కూర్మనాధ ఆలయాలు ఎన్నో ఉన్నా అవి అంతగా ప్రశిద్ధి గాంచలేదు .


మత్స్యావతారుడైన శ్రీ మహావిష్ణువుకు ప్రపంచంలో ఈ భూమిపై గల ఏకైక దేవాలయం శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం. అందుకే దీనికి ఎనలేని విశిష్టత ఉంది. మహావిష్ణువు అవతారాల్లో రెండోదైన కూర్మావతారం రూపంలో దైవం ఈఆలయంలో కొలువై ఉంటుంది. అమృతానికై దేవదానవులు క్షీరసాగర మధనం చేయడానికి మంధర పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని తాడుగా ఉపయోగించారు. ఆసమయంలో వత్తిడికి లోనైన మంధర పర్వతం క్షీరసాగరంలోకి మునిగిపోతుంటే శ్రీమహావిష్ణువు కూర్మావతారాన్ని ధరించి పర్వతం కింద ఆధారంగా నిలచి అమృత మధనానికి సాయం చేశాడు.


ఆలయ విశిష్టత

శ్రీకాకుళం జిల్లా, గార మండలం శ్రీకూర్మం గ్రామంలో శ్రీకూర్మనాథ స్వామి ఆలయం విశాల ప్రాంగణంలో నెలకొని ఉంది. పెద్ద ప్రాకారానికి వెలుపల 'శ్వేత పుష్కరిణి' ఉంది. క్రీస్తు శకం నాలుగో శతాబ్ధి నాటికే ఈ ఆలయం ఇక్కడ ఉందని చారిత్రిక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఆలయంలోని ప్రతి శిల్పం ఒక అపూరూప కళాఖండంగా చెప్పవచ్చు. ఎంతో మంది రాజులు వేసిన శిలాశాసనాలు శిథిలమై పోకుండా ఇప్పటికీ లభిస్తాయి. ఇవి కళింగాంధ్ర చరిత్రకు అమూల్యా ధారాలుగా నిలుస్తాయి. అత్యద్భుతమైన వాస్తు కళతో ఆలయం అలరారుతూ ఉంటుంది. ఈ ఆలయ మండపంలోని 108 రాతి స్తంభాలు అన్నీ ఏకశిలతో రూపు దిద్దుకున్నవే. ఒకదానికి ఒకటి పోలిక లేకుండా విభిన్నంగా వీటిని శిల్పులు అత్యంత రమణీయంగా మలిచారు. ప్రతి ఆలయంలోనూ గర్భగుడిలో ఎదురుగా మూలవిరాట్ ఉంటే ఈ ఆలయంలో మాత్రం గర్భ గుడిలో ఎడమవైపు గోడ మూలగా శ్రీకూర్మనాధుని ఆవతారంలో శ్రీమహావిష్ణువు భక్తులకు సాక్షాత్కరిస్తారు.


భక్తులు నేరుగా గర్భగుడిలోకి వెళ్తే అడుగు ఎత్తు, ఐదడు గుల పొడవు, నాలుగడుగులు వెడల్పు కొలతలు గల రాతిపీఠంపై కూర్మనాథస్వామి దర్శనమిస్తారు. రెండున్నర అడుగుల పొడవు, అడుగు ఎత్తులో మొదట తల మధ్యలో శరీరం చివరిగా పశ్చిమాభిముఖంగా తోకతో మూడు భాగాలుగా శ్రీకూర్మం కన్పిస్తుంది. మధ్య తక్కువ ఎత్తులో శిరస్సు కలిపి ఒకటిగా కన్పిస్తా యి. చివర తాటిపండు పరిమాణంలో తోక వేరే శిలగా ఉంటుంది. విగ్రహమంతా దట్టంగా గంధపు పూతను పూసి అలంకరిస్తారు. గర్భగుడిలోకి భక్తులు నేరుగా వెళ్లడం వైష్ణవ సంప్రదాయానికి భిన్నమైనా ఇక్కడ మాత్రం నేరుగా గర్భగుడిలోనే స్వామిని దర్శించుకోవచ్చు.


స్థల పురాణం

పూర్వం శ్వేత చక్రవర్తి ఈప్రాంతాన్ని పరిపాలించేవాడు. ఆయన భార్య విష్ణు ప్రియ. ఆమె విష్ణు భక్తురాలు. ఆమె ఏకాదశి ఉపవాస వ్రతంలో ఉన్న సమయంలో ఆమెపై కామాన్ని పెంచుకున్న చక్రవర్తి ఆమెను బలవంతం చేయసాగాడు. ఇది సమయం కాదని ఆమె వారించింది. ఆయినా సరే రాజు మొండి పట్టుదలను వీడలేదు. ఆమె శ్రీమహావిష్ణువును ప్రార్థించింది. ఆమె ప్రార్థనకు ప్రసన్నుడైన విష్ణువు వారిద్దరి మధ్య తన ప్రాదోద్భవ గంగను ప్రవహింపజేశాడు. అది నదిగా మారి వేగంగా ప్రవహించింది. అందులో శ్వేత చక్రవర్తి కొట్టుకుని పోతుండగా ఆమె కూడా అతని వెంట వెళ్లింది.


శ్వేత గిరిపైకి రాజు, అతని భార్య చేరుకున్నారు. ఆసమయంలో నారద మహర్షి ప్రత్యక్షమై రాజుకు శ్రీకూర్మ మంత్రోపదేశాన్ని చేశాడు. ఈమంత్ర జపం చేయగా విష్ణుమూర్తి కూర్మ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఈతపస్సు వలన శ్వేత చక్రవర్తి శరీరం అప్పటికే కృశించి పోయింది. దీంతో కూర్మదేవుడు దిక్కులు పిక్కటిల్లేలా హూంకరించాడు. ఈశబ్ధానికి తట్టుకోలేక శ్వేతాచలం అనే ఈపర్వతం భూమిలోకి కుంగిపోయింది. అప్పటినుంచి ఇది ప్రజలకు నివాసయోగ్యంగా మారింది. మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని వదిలితే అది భూమిని చీల్చిన చోట ఒక సరస్సు ఏర్పడింది. ఇందులో రాజు స్నానం చేసి సంపూర్ణారోగ్యాన్ని పొందాడు. ఈ సరస్సుకు శ్వేత పుష్కరిణి అనే పేరు వచ్చింది. అప్పటి నుంచీ కూర్మనాధుడు ఇక్కడే స్థిర నివాసంలో ఉండిపోయాడు.


శ్రీమహావిష్ణువుతో పాటు మహాలక్ష్మి కూడా ఇక్కడే కొలువు దీరింది. ఇది జరిగిన కొంతకాలం తర్వాత శ్వేత పుష్కరిణిని చూసి ఒక కోయరాజు విస్మయానికి గురైతే శ్వేత మహారాజు ఈ వృత్తాంతాన్ని వివరించాడు. ఎంతో సమ్మోహితుడైన కోయరాజు ఆ కోనేటికి గట్లు, మెట్లు నిర్మించాడు. అతడు అక్కడికి పడమర గల సంపంగి మహర్షి ఆశ్రమంలో ఉండి స్వామిని ఆరాధించేవాడు. తనకు స్వామి ఎల్లప్పుడూ దర్శనమిస్తూ ఉండాలని కోరుకోవడంతో శ్రీ కూర్మనాథుడు పడమటివైపు ముఖం తిప్పుకొని ఉండిపోయాడట. అందువల్లే ఆలయంలో శ్రీకూర్మనాథుని విగ్రహం పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తూ ఉంటుంది.


ద్వాపర యుగంలో శ్రీకాకుళంలో ఉమారుద్రకోటేశ్వర లింగ ప్రతిష్ట చేసిన బలరాముడు శ్రీకూర్మం వచ్చాడు. అక్కడ క్షేత్రపాలకుడైన భైరవుడు అతనిని అడ్డగించాడు. దాంతో అతడు భైరవుని పై ఆగ్రహంతో ఆతనిని గిరగిరా తిప్పి విసిరేశాడు. ఇది తెలిసిన కూర్మనాధ స్వామి బలరామునికి దర్శన భాగ్యాన్ని కలిగించాడు. ఆయినప్పటికీ తనకు జరిగిన అవమానంతో ఆగ్రహాగ్ని చల్లారని బలరాముడు 'కూర్మావతారం'లో ఆలయం భూమి పై మరెక్కడా ఉండకూడదని శపించాడు. అందువల్లే ప్రపంచంలోనే ఇది ఏకైక కూర్మనాధస్వామి ఆలయంగా విరాజిల్లుతోంది. ఈఆలయానికి రెండు ధ్వజ స్తంభాలు ఉండడం మరో ప్రత్యేకత. శ్రీకూర్మంలోని పుష్కరిణి అడుగుభాగం నీరుతో కలిసిన మట్టి తెల్లగా తళతళలాడుతూ ఉండడం విశేషం. ఒక మహర్షికి శ్రీకృష్ణుడు గోపికలతో సహా వచ్చి ఈ పుష్కరిణీలో జలక్రీడలాడుతూ కన్పించాడట. అందువల్లే ఆ పుష్క రిణిలోని మట్టి తెల్లగా మారిందని చెబుతారు. దీనిని 'గోపీ చందనం' అని కూడా అంటారు. ఈమట్టితో తిరునామాలు దిద్దు కోవడం అత్యంత శుభప్రదమని భక్తుల విశ్వాసం.


శ్రీకూర్మంలోని పాతాళ సిద్ధేశ్వరున్ని దర్శించుకున్న తర్వాతే శ్రీకూర్మనాథ స్వామిని దర్శించాలని అంటారు. హటకేశ్వరుడు, కర్పూరేశ్వరుడు, కోటీశ్వరుడు, సుందరీశ్వరుడు, పాతా ళసిద్ధేశ్వరుడు శ్రీకూర్మక్షేత్రానికి క్షేత్ర పాలకులు. ఈ ఆలయాన్ని భగవత్‌ రామానుజులు, కృష్ణ చైతన్యుడు వంటి ప్రముఖులెందరో సందర్శించి కూర్మనాథుని దర్శనాన్ని చేసుకున్నారు.అన్ని రకాల వైష్ణవ క్షేత్ర ఉత్స వాలు ఇక్కడ జరుగుతాయి. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి వాహనసదుపాయం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. మార్గమధ్యంలోని అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామిని దర్శించుకుని భక్తులు శ్రీకూర్మం చేరుకోవచ్చు.




No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list