MohanPublications Print Books Online store clik Here Devullu.com

వాతాపి గణపతిం భజే_Lord Ganesh Song


వాతాపి గణపతిం భజే Lord Ganesh Song lord ganesh kriti by muthuswami dishitar ganesha kriti muthuswami kriti vathapi ganapathim vathapi vathapi ganesh song lord ganesh lord ganapathi bhakthipustakalu bhaktipustakalu bhakthi pustakalu bhakti pustakalu



వాతాపి గణపతిం భజే: 
గణపతి పై అంత అందమైన 
కృతి ఎలా అయింది?


ముత్తుస్వామి దీక్షితార్

కర్ణాటక సంగీత త్రయంలో ఒకరైన శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ గారు తిరువారూరులో జన్మించారు. అలనాటి వాతాపి (ఇప్పటి బాదామి) నుండి గణపతి విగ్రహాన్ని పల్లవులు చాళుక్యుల పై సాధించిన విజయానికి ప్రతీకగా తిరువారూరు తరలించి అచట ప్రతిష్టించారని చరిత్ర కథనం. ముత్తుస్వామి గారు షోడశ (పదహారు) గణపతి కృతులను వ్రాసారు. అందులో ఒకటి హంసధ్వని రాగంలో బాణీ కట్టిన "వాతాపి గణపతిం భజే".ఈ రాగం యొక్క సృజన కర్త ముత్తుస్వామి గారి తండ్రి గారైన శ్రీ రామస్వామి దీక్షితార్ గారు. ఈ కృతి యొక్క ప్రతి పదార్ధము, తాత్పర్యము, వివరణ దిగువన చూడగలరు.

పల్లవి
వాతాపి గణ పతిం భజే(అ)హం వారణాస్యం వరప్రదం శ్రీ
వాతాపి = బాదామి; గణపతిం = గణపతిని; భజే = భజించెదను; అహం = నేను (శ్రీ దీక్షితార్);వారణ = ఏనుగు; ఆస్యం = ముఖము; వర = వరములు; ప్రదం = ఇచ్చువాడు. 

అనుపల్లవి
భూతాది సంసేవిత చరణం భూత భౌతిక ప్రపంచ భరణం (మధ్యమ కాల సాహిత్యమ్)
వీత రాగిణం వినత యోగినం విశ్వ కారణం విఘ్న వారణం



భూతాది = పంచ భూతములు మొదలైన ; సంసేవిత = సేవించబడే; చరణం = పాదములు;భూత = ఆత్మలకు, గతించిన వారికి (వాటికి); భౌతిక = ఇహలోకులయిన జీవులకు; ప్రపంచ = జగత్తున; భరణం = వ్యాపించి యున్న; రాగిణం = విషయ వాంఛలకు; వీత = అతీతుడై ;వినత = స్తుతించ బడు; యోగినం = యోగులచే; విశ్వ = ప్రపంచము లేక జగత్తు; కారణం = కారణమైన వాడు, విఘ్న=అడ్డంకులు; వారణం = వారింప జేయువాడు, తొలగింప జేయువాడు.

చరణమ్
పురా కుంభసంభవ మునివర ప్రపూజితం త్రికోణ* మధ్యగతమ్
మురారి ప్రముఖాద్యుపాసితం మూలాధార క్షేత్ర స్థితమ్
పరాది చత్వారి వాగాత్మకం ప్రణవ స్వరూప వక్ర తుండమ్
నిరంతరం నిటల* చంద్ర ఖండం నిజ వామకర విధృతేక్షు దండమ్ 

పురా = మునుపటి / ప్రాచీన; కుంభ = కుండ; సంభవ = జన్మించిన; కుంభ-సంభవ = కుండలో పుట్టినవాడు - అగస్త్యుడు; మునివర = ముని శ్రేష్టుడు; ప్రపూజితం = పూజించబడిన; త్రికోణ = త్రిభుజము యొక్క మూడు కోణముల; మధ్యగతం = నడుమ నివసించు; మురారి (ముర + అరి) = ముర అను రాక్షస శత్రువును హరించిన లేక సంహరించినవాడు - విష్ణువు; ప్రముఖ = ప్రసిద్ధులైన; ఉపాసితం = కొలువబడిన; మూలాధార= మూలాధార చక్రం; క్షేత్ర = స్థానం; స్థితం = స్థిరమైన. 


పరాది = పర మొదలయిన; చత్వారి = నాలుగు; పరాది చత్వారి = పర, పశ్యన్తి, మధ్యమ,వైఖరి, అనేవి 'ద్వని' కి గల నాలుగు పౌనః పున్యాలు (frequencies) అని శాస్త్రాలు చెబుతున్నాయి; వాగాత్మకం = వాక్ + ఆత్మకం = శబ్ద జనితమైన; ప్రణవ = ఓంకార ; స్వరూప= రూపమైన; వక్ర = వంపు తిరిగిన; తుండం = తొండము గల; నిరంతరం = ఎల్లప్పుడూ;నిటల* = నుదుట; చంద్ర = చంద్రుని; ఖండం = తునక = చంద్రకళ; నిజ = తన; వామ = ఎడమ; కర = చేయి; విధృత = బలమైన; ఇక్షు = చెరకు; దండం = గడ, కర్ర. 
(మధ్యమ కాల సాహిత్యమ్)

కరాంబుజపాశ బీజాపూరం కలుష విదూరం భూతాకారమ్ 
హరాది గురు గుహ తోషిత బింబం హంసధ్వని భూషిత హేరంబమ్


కరాంబుజపాశ = కర + అంబుజ + పాశ; కర = చేత, చేతిలో + అంబుజ = అంబు అంటే నీరు,జ అంటే పుట్టిన, - నీటిలో పుట్టినది, అనగా పద్మము + పాశ = పాశము; బీజాపూరం = దానిమ్మపండు; కలుష = మలినము; విదూరం = మిక్కిలి దూరం చేసేది; భూత = పెద్దదైన;ఆకారం = రూపం; హరాది = హరుడు మొదలగు వారు; గురుగుహ = షణ్ముఖుడు; ఇది కృతిలో రచయితయైన ముత్తుస్వామి గారి ముద్ర లేదా సంతకం; తోషిత = కొలువబడిన; బింబం = రూపం; హంసధ్వని = కర్నాటక సంగీతంలో ఒక రాగం; భూషిత = అలంకరించబడిన;హేరంబం = అంబకు, అంటే అమ్మకు ప్రియమైన వాడు అనగా వినాయకుడు. హేరంబ అనేది వినాయకుని మరొక పేరు. 

తాత్పర్యం: కృతి కర్త యైన శ్రీ ముత్తు స్వామి దీక్షితార్ గారు ఇలా అంటున్నారు: నేను వాతాపి గణపతిని పూజించుచున్నాను. గజ ముఖుడైన, వరాలను ఇచ్చే గణపతిని పూజించుచున్నాను. విషయ వాంఛలకు అతీతమై, యోగులచే కొలువబడి, జగత్కారణమై, అడ్డంకులను తొలగించే గణపతి పాదములను ఈ జగత్తున వ్యాపించి యున్న సమస్త భూతములు, ఆత్మలు, జీవాత్మలు సేవించుకొనును.


మూలాధార చక్ర స్థానం లో స్థిరమై, అందున్న త్రికోణపు మధ్య గల స్థానమందు వసించు గణపతీ! నిన్ను మునుపటి అగస్త్యుల వంటి ముని శ్రేష్ఠులు, విష్ణువు మొదలయిన ప్రసిద్ధులైన దేవతలు పూజిస్తారు. పర మొదలయిన నాలుగు విధములైన శబ్దములతో కూడి జనించిన ప్రణవ నాదమైన ఓంకారము వలె నీ వంపు తిరిగిన తొండము గోచరిస్తోంది. నీవెల్లప్పుడు ఫాలభాగమున చంద్రకళను ధరించి, నీ ఎడమచేత బలమైన చెరకుగడను దాల్చి అగుపిస్తావు. అంతే కాక తల్లియైన పార్వతికి ప్రియ పుత్రుడవైన నీవు చేతులలో పద్మము, పాశము, దానిమ్మ పండు ధరించి, భక్తుల పాపాలను తొలగిస్తావు. శివుడు, షణ్ముఖుడు, మొదలయినవారిచే కొలువబడి హంసధ్వని రాగాన్ని భూషణంగా, అమ్మ అయిన పార్వతికి ప్రియ పుత్రునిగా గణపతీ నీవు ఒప్పుచున్నావు. 


ఈ కృతిలోని సొగసులు: ఈ కృతిలో శ్రీ దీక్షితారు గారు అందంగా ఆద్యక్షర ప్రాసను పల్లవిలో (ఉదా. వాతాపి, వారణాస్యం, వరప్రదం), అనుపల్లవిలో (ఉదా. భూతాది, భూతభౌతిక; అలాగేవీత, వినుత, విఘ్న, విశ్వ మొదలయినవి) వాడారు. అలాగే ద్వితీయాక్షర ప్రాస (పురా, మురా, పరా, నిర, కరా, హరా) మరియు అంత్యాక్షరప్రాస (చరణం, భరణం, రాగిణం, యోగినం, కారణం, వారణం; అలాగే తుండం, ఖండం, దండం మొదలయినవి). ఇవికాక, భూత అనే పదాన్ని మూడు చోట్ల మూడు అర్ధాలతో వాడారు - భూతాది, భూత-భౌతిక, భూతాకారం. అంతే కాక, తన వాగ్గేయకార ముద్ర అయిన 'గురుగుహ' ను, రాగం పేరైన 'హంస ధ్వని'ని కృతి సాహిత్యం లో నిక్షిప్తం చేసారు శ్రీ దీక్షితార్ గారు. ఈ కారణాల వలన ఈ కృతి ఇంత సుందరంగా ఉంటుంది. 

* శ్రీ ఘంటసాల మాస్టారు వినాయక చవితి చిత్రంకోసం పాడిన 'వాతాపి గణపతిం భజే' సాహిత్యం లో "త్రికోణ" కు బదులు "త్రిభువన" అని, "నిటల" కు బదులు "నిఖిల" అని వుంది. అయితే చాల వెబ్ సైట్లు చూసాక, ముఖ్యంగా దీక్షితార్ గారి కి సంబంధించిన 'గురుగుహ' సైట్ ను కలిపి, మరియు ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులైన శ్రీమతి సుబ్బ లక్ష్మి, శ్రీ బాలమురళీ కృష్ణ గార్ల వీడియోలలో పైన ఇచ్చిన సాహిత్యం తో సరిపోయాయి. అందువలన ఆ ప్రాతిపదికన సాహిత్యాన్ని ఇక్కడ పొందు పరచడం జరిగింది.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list