MohanPublications Print Books Online store clik Here Devullu.com

శుభ ముహూర్తాలకు వేళయ్యింది_marriage



marriage muhurtam pelli mangalyam laggam shubhamuhurtam wedding bhaktipustakalu




ఈ నెల 20 నుంచి మార్చి 4 వరకు వేల వివాహాలు-
మార్చి నాలుగున అనువుగా గ్రహసంచారం
-అదనంగా కలిసొచ్చిన ఆదివారం సెలవు
-ఆ ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 40వేల పెండ్లిళ్లు.. 
-పురోహితులు, ఫంక్షన్‌హాళ్లు, నిర్వాహకులకు భలే గిరాకీ
-బిజీ అయిపోనున్న కెమెరామెన్లు, వంటమాస్టర్లు
-రాష్ట్రమంతటా పక్షం రెండువారాలపాటు కల్యాణకాంతులు
-నగలు, వస్ర్తాల కొనుగోళ్లతో సందడిగా దుకాణాలు

        హైదరాబాద్, శుభముహూర్తాలకు వేళయ్యింది. ఈ నెల 20 నుంచి శుభఘడియలు ప్రారంభం కానున్నాయి. గతేడాది నవంబర్ నుంచి మంచి ముహూర్తాలకోసం ఎదురుచూస్తున్నవారికి కొత్త ఆశలు చిగురులు తొడిగాయి. మార్చి నాలుగువరకు రాష్ట్రమంతటా మంగళవాయిద్యాలు, వేదమూర్తుల శుభాశీస్సుల వేదసూక్తులు మార్మోగనున్నాయి. ఆకుపచ్చని మంగళతోరణాలతో ఊరూ వాడా పల్లె పట్నం సింగారించుకోనున్నాయి. మార్చి 4న గ్రహాల సంచారం అనువుగా ఉండటం, పైగా ఆదివారం సెలవురోజు కావడంతో ఆ ఒక్కరోజే సుమారు 40 వేల పెండ్లిళ్లు ఉన్నాయని అంచనా. ఒక్కసారిగా సుముహూర్తాలు రావడంతో రాష్ట్రంలోని ఫంక్షన్‌హాళ్లన్నీ ఇప్పటికే బుక్ అయిపోయాయి. కెమెరామెన్లు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థల నిర్వాహకులు బిజీ అయిపోతున్నారు. మరోవైపు వివాహ ఏర్పాట్లలో వధూవరుల తల్లిదండ్రులు తలమునకలైపోయారు. పెండ్లి పత్రికలు ముద్రించడం, వాటిని బంధువులకు చేరవేయడం మొదలుకుని, వధూవరులకు నూతన వస్ర్తాలు, నగల కొనుగోళ్లు వంటి పనుల్లో బిజీగా ఉన్నారు. ఆయా జిల్లాల్లోనివారు కూడా నగలు, వస్ర్తాల కొనుగోళ్లకు వస్తుండటంతో హైదరాబాద్‌లోని దుకాణాలు సందడిగా మారుతున్నాయి.


మార్చి 4న అంత ప్రాధాన్యం ఎందుకంటే..అమృతసిద్ధియోగం వంటి గొప్ప యోగం ఉండటంతో మార్చి 4వ తేదీ ముహూర్తానికి చాలా ప్రాధాన్యం వచ్చిందని సుప్రసిద్ధ వేదపండితులు, అయుత చండీహోమం రూపకర్త ఫణిశశాంకశర్మ పేర్కొన్నారు. ఆ రోజు ఫాల్గుణ బహుళ తదియ ఆదివారం హస్తా నక్షత్రం. ఉదయం 8.09 గంటలనుంచి మధ్యాహ్నంవరకు మీన మేషలగ్నాలలో వేదమూర్తులు లగ్నాలు నిశ్చయించారు. ఆదివారం హస్తానక్షత్రం వచ్చినట్లయితే అటువంటి యోగాన్ని అమృతసిద్ధి యోగమని వ్యవహరిస్తారని ఫణిశశాంకశర్మ పేర్కొన్నారు. సోమవారం మృగశిర, మంగళవారం అశ్విని, బుధవారం అనూరాధ, గురువారం పుష్యమి, శుక్రవారం రేవతి, శనివారం రోహిణి నక్షత్రాలు ఉన్నట్లయితే అటువంటి యోగం అమృతసిద్ధియోగమని సిద్ధాంత గ్రంథాలు తెలియచేస్తున్నాయి. ఈ కారణాలతో మార్చి 4, 8వ తేదీల్లో వేలసంఖ్యలో పెండ్లిళ్లు జరుగనున్నా యి. బుధుడు, శుక్రుడు కలిసి ఉండడం, రవి ఏకాదశ స్థానంలో ఉండడంతో దాంపత్య జీవితం ఆరంభానికి ఇది అనుకూలమైన రోజని పండితులు చెప్తున్నారు. గృహప్రవేశాలు, భూమి పూజలు సైతం భారీసంఖ్యలో ఈ రోజుల్లో జరుగనున్నాయి.


నాలుగు మాసాలుగా ముహూర్తాల్లేవు..మార్గశిర శుద్ధనవమినుంచి ఫాల్గుణ శుక్ల చవితి (ఫిబ్రవరి 19) వరకు శుక్రమౌఢ్యం కారణంగా సుముహూర్తాలు లేవు. అంతకుముందు 25 రోజులపాటు గురుమౌఢ్యం ఏర్పడింది. ఈ రెండు మౌఢ్యాల మధ్యలో కొద్దిరోజులు ముహూర్తాలు ఉన్నప్పటికీ పెద్దగా ఆసక్తి కనబరుచలేదు. అయితే.. 2018 ఫిబ్రవరి 19 నుంచి అక్టోబర్ వరకు మంచి ముహూర్తాలే ఉండటంవల్ల పురోహితులకు, మంగళ వాయిద్యకారులకు, కల్యాణమంటపాలకు, పెండ్లి పందిళ్ల రూపకర్తలకు, కావాల్సినంత గిరాకీ ఏర్పడింది. 


హైదరాబాద్‌లో ఫంక్షన్ హాళ్లు ఫుల్నగరంలోని ఫంక్షన్ హాళ్లన్నీ ఇప్పటికే బుక్ అయిపోయాయి. మార్చి 4, 8 తేదీల్లో ముహూర్తాలు పెట్టుకున్న చాలామందికి హాళ్లు దొరుకని పరిస్థితి నెలకొంది. నగరంలోని అబిడ్స్, మెహిదీపట్నం, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, నాగోల్, సరూర్‌నగర్, కర్మన్‌ఘాట్, హైటెక్‌సిటీ, తార్నాక, రామంతాపూర్, కూకట్‌పల్లి, పంజగుట్ట, మాదాపుర్, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లోని ఫంక్షన్ హాళ్లలో ఎక్కువగా పెండ్లిళ్లు జరుగనున్నాయి. ఫిబ్రవరిలో ఎంగేజ్‌మెంట్‌లు, సంగీ త్ వంటి కార్యక్రమాలకు సైతం మెజార్టీ హాళ్లు బుక్ అయిపోయాయి. హైదరాబాద్‌లో కొన్ని మండపాల కిరాయిలు ఐదు లక్షల నుంచి మొదలవుతున్నాయి. చూడటానికి పెద్దమొత్తంలో తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నా.. ఏడాదిపాటు ఫంక్షన్‌హాలు నిర్వహణ, ఉద్యోగుల వేతనాలు, పన్నులు కలిపి లక్షల్లో వెచ్చించాల్సి ఉంటుందని, ఆ మొత్తాన్ని ముహూర్తాల సందర్భాల్లో సంపాదించుకోవాల్సి వస్తుందని కల్యాణమంటపాల యజమానులు చెప్తున్నారు. స్వచ్ఛంద సేవాసంస్థల నిర్వహణలో ఉన్న కల్యాణమంటపాలు కిరాయి విషయంలో చాలా అందుబాటులో ఉన్నాయి. సికింద్రాబాద్ హర్యానాభవన్, మహారాష్ట్రమండల్, గుజరాత్‌భవన్ వంటి మంటపాలు లక్ష రూపాయలలోపునే లభిస్తున్నాయి. మంగళ వాయిద్యాల వాళ్లు ఉరుకులు, పరుగులతో వేల రూపాయలను సంపాదిస్తున్నారు. పాత జిల్లా కేంద్రాలలోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణమండపాలు, హైదరాబాద్‌లోని రెండువేల కల్యాణమండపాలు ఇప్పటికే బుక్‌అయ్యాయి. క్యాటరింగ్ చేసేవారు సైతం ఈ సమయంలోనే కాస్త సంపాదించుకుంటారు. చిన్నాచితక పనులు చేసుకునేవారికి సైతం ఈ పెండ్లిళ్లు నాలుగు రాళ్లు వెనకేసుకునేందుకు దోహదం చేయనున్నాయి.

దాదాపు మూడు నెలల విరామం తరువాత పెండ్లిళ్ల సీజన్ ఆరంభమవుతున్నది. ఇప్పటికే నగరంలో చాలా ఫంక్షన్ హాళ్లు బుక్ అయ్యాయి. ఒక్కో ఈవెంట్ మేనేజర్‌కి పదికి పైగా ఆర్డర్లు వస్తున్నాయి. క్యాటరింగ్, డెకరేషన్, డీజే ఆర్టిస్ట్‌లు, ఫొటోగ్రాఫర్లు, బ్యాండ్ ఇలా అన్ని విభాగాల్లో వారికి ఊహించని స్థాయిలో ఆర్డర్లు వస్తున్నాయి.
- నీరజ్ కేఎస్ ఠాకూర్, తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ ప్రధాన కార్యదర్శి

నగరంలో దాదాపు వెయ్యి నుంచి రెండు వేల మంది వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్లు ఉంటారు. ఒక్కొక్కరి వద్ద దాదాపు 20 మంది వరకు ఉంటారు. అలా దాదాపు 15 నుంచి 20 వేల మంది మార్చి 4, 8 తేదీల్లో బిజీ ఉంటారన్న మాట. ఫిబ్రవరిలో సైతం ఎంగేజ్‌మెంట్‌లు, సంగీత్ వంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఈ సీజన్‌లో వెడ్డింగ్ ఫొటోగ్రఫీకి మంచి డిమాండ్ ఉందనే చెప్పాలి.    - అనిరుధ్, వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్


రూ. కోట్లలో ఖర్చు..పెండ్లిళ్ల సీజన్‌లో హైదరాబాద్ నగరంలో కోట్ల రూపాయాల మార్కెట్ నడవనుంది. వస్ర్తాలు, ఆభరణాలు వంటి కోనుగోళ్లతోపాటు.. వివాహాల నిర్వహణకు సైతం భారీగానే ఖర్చుచేయనున్నారు. ఒక్కో పెండ్లికి సగటున పది లక్షలు అంచనా వేసుకున్నా వంద కోట్లకు పైనే ఈ సీజన్‌లో ఖర్చు అయ్యే అవకాశం ఉందని ఈవెంట్ మేనేజర్లు అంటున్నారు.

మార్చి 4న ఆదివారం అమృతసిద్ధి యోగం ఉన్నది. అందుకే అ రోజు ఎక్కువగా ముహూర్తాలను నిర్ణయించుకున్నారు. దాంపత్యజీవితం సుఖసంతోషాలతో వర్థిల్లుతుందని పెద్దల నిర్ణయం. ముహూర్తమాధవీయంవంటి సద్గ్రంథాలు ఈ విషయాలన్నింటినీ విశదీకరిస్తాయి. 
- ఫణిశశాంకశర్మ, శృంగేరీపీఠం వేదపండితులు

శుక్రమౌఢ్యం ముగిసిన ఫిబ్రవరి 19 నుంచి ముహూర్తాలను నిర్ణయించారు. వివాహముహూర్తాలలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువ సంఖ్యలో ముహూర్తాలు ఉన్నమాట నిజమే. అయినప్పటికీ శాస్ర్తాలు చెప్పినట్లుగా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.        - సాగి కమలాకరశర్మ, వేదపండితులు 

ముహూర్తాలకాలంలో పురోహితులు బాగా సంపాదిస్తున్నారని అంటున్నారు. నాలుగునెలలుగా ముహూర్తాలు లేక చాలా ఇబ్బందులు పడిన రోజులు కూడా ఉన్నాయి.
- భాస్కరభట్ల రామశర్మ, అర్చకులు 

మార్చి 4,8 తేదీలలో గ్రహసంచారంతో పాటు, యోగం, ఫలణం, తిథి, నక్షత్రం, లగ్నం అనుకూలంగా ఉండడంతోపాటు.. హోళీకి ముందు రోజుకావడంతో ఈ రెండు తేదీల్లోనే వేల సంఖ్యల్లో వివాహాలు జరుగనున్నాయి.         ఫణీంద్ర శర్మ, పురోహితులు

కల్యాణమండపాలన్నింటిలో ఏం జరుగుతున్నదో మాకు తెలియదు. అందరికీ అందుబాటులో ఉండేవిధంగా ట్రస్ట్ ద్వారా నిర్ణయాలు తీసుకొన్ని తక్కువ ధరలో కల్యాణమండపాలను కిరాయికి ఇస్తున్నాం      - మిలాప్, హర్యానాభవన్ ట్రస్టీ

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list