MohanPublications Print Books Online store clik Here Devullu.com

తెలుగు_telugu

  తెలుగు_telugu
మాతృభాషలో ఆలనా పాలన
ప్రతిన బూనాల్సిన తరుణమిది
     తెలుగువారు జాతీయ అంతర్జాతీయ స్థాయి సంస్థలను ఏర్పాటు చేసుకోలేదు. తెలుగు భాషకు ప్రాచీన హోదా వచ్చిన తరవాత కూడా సంబంధిత సంస్థనీ తెలుగు రాష్ట్రాలకు ఇంకా తెచ్చుకోలేకపోయాం. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలున్న నేపథ్యంలో దీన్ని ఎక్కడ స్థాపించాలి లేదా రెండు రాష్ట్రాల్లో రెండు సంస్థలుగా ఇది పనిచేయాలా అనే మీమాంస ఇంకా కొనసాగుతూనే ఉంది. భారతదేశంలో వేరు వేరు భాషా రాష్ట్రాల్లో వారి భాషల కోసం ప్రపంచ సదస్సులు జరుగుతూ ఉన్నాయి. వాటి ఫలితాలు భాషల వికాసం మీద కనిపిస్తున్నాయి. వాటినుంచి తెలుగువారు పొందవలసినంత స్ఫూర్తి పొందడం లేదు. ఈ దశలో ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు, దీనికి ముందు ప్రభుత్వం భాషకోసం తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లో ఆసక్తిని మాత్రమే కాదు- ఆశల్నీ కల్పిస్తున్నాయి. ఈ సభల ముందు చాలా గురుతర బాధ్యతలున్నాయి. వేడుకలు చేస్తాం. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాం. తరవాత ఇటు నుంచి అటు వెళ్ళగానే మరిచిపోకూడదు. కానీ, జరిగే సదస్సులు, చర్చలు ఫలవంతంగా ఉండాలి. భాష ప్రగతికి, అధికార భాషగా అన్ని స్థాయుల్లో దాని అమలు కోసం, విద్యాబోధనలో తెలుగు మాధ్యమం కోసం ఏ విధమైన ప్రణాళికలు రచిస్తున్నారన్నదానిపై ఈ సదస్సులో కూలంకషమైన చర్చ జరగాలి. వాటిని తీర్మానాల రూపంలో ప్రకటించాలి. అంతటితో ఆగకుండా గట్టిగా కృషిచేసి అమలు చేయాలి. అప్పుడే మహాసభలు ఫలవంతమవుతాయి. బహుళ ప్రయోజనాల సాధన
తెలుగు సభల్లో కొన్ని ప్రధాన విభాగాల్లో చర్చ జరగాలి. ఒకటి భాషా విషయంగా, రెండు సాహిత్య పరంగా. సాహిత్యపరమైన చర్చల్లో ఆనాటి పాల్కురికి సోమన, అటు నన్నయ దగ్గరనుంచి ఇప్పటి అత్యాధునిక వచన కవుల దాకా జరిగిన సాహిత్య కృషిని గురించి చర్చించవచ్చు. విశ్లేషించవచ్చు. తెలంగాణ సాహిత్య అస్తిత్వాన్ని, దాని గొప్పతనాన్ని గురించి చెప్పవచ్చు. ఇది సాహిత్య సభల్లో కవులు, సాహిత్య విమర్శకులు చేస్తారు. కానీ, మున్ముందు సాహిత్యాన్ని ఎలా సృష్టించాలి, ఏం చేయాలి అనే విషయాన్ని ఎవరూ చెప్పలేరు. సాహిత్య సృష్టి అనేది వ్యక్తిగతంగా ఆయా కవులు, రచయితలు చేసేది. ఆయా సామాజిక వర్గాలనుంచి వచ్చిన కవులు, కవయిత్రులు తమ నేపథ్యాలకు అనుగుణంగానే సాహిత్యాన్ని సృష్టిస్తారు. అందువల్ల చర్చ మాత్రమే ఉంటుంది. భవిష్యత్తు దిశానిర్దేశం ఉండదు. అలా ఇవి పరిమిత ప్రయోజనాన్ని కలిగి ఉంటాయి.

కానీ, భాష విషయం అలాంటిది కాదు. అది రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరి దైనందిన జీవితానికి సంబంధించినది. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు తమ ప్రభుత్వాన్ని తాము ఎన్నుకుంటున్నారు. తమ భాషలోనే ఆ ప్రభుత్వం పనిచేయాలనుకొంటారు. తన రాష్ట్రంలో, తన ఇంటి పక్కనున్న ఏ ప్రభుత్వ కార్యాలయానికి పోయి అయినా తన భాషలో పనిచేసుకొని రావడం పౌరుడికి సహజంగా సంక్రమించిన హక్కు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా కీలకమైనది. దీన్ని ఇటు మన తెలుగు ప్రజలు కానీ, అటు ప్రభుత్వం కానీ గుర్తించడం లేదు. ఒక జాతికి ఉన్న సహజ వనరుల్లో చాలా ప్రముఖమైనది ఆ జాతికి ఉన్న భాష. ఇది గొప్ప సహజ సంపద. ప్రభుత్వం ప్రజలకు వారి భాషలో పరిపాలన అందించడం అనేది ఇప్పటిదాకా అందకుండాపోతున్న మన హక్కు అని ఈ మహాసభలు తెలుగువారికి చెప్పగలిగితే చాలా మంచి ప్రగతిని సాధించినట్లే.

ప్రపంచ తెలుగు మహాసభల్లో జరిగే వాటిని ఇలా వర్గీకరించవచ్చు. సంగీత, నాటక, నృత్య ఇత్యాది కళాప్రదర్శనలు ఒక భాగం. ఇవి వచ్చినవారికి వినోదాన్ని కలిగిస్తాయి. కళావైభవాన్ని గుర్తు చేస్తాయి. రెండో విభాగం సాహిత్య సదస్సులు. ఇవి ఇప్పటిదాకా వచ్చిన సాహిత్యాన్ని సమీక్షించడానికే పనికి వస్తాయి. వేరు వేరు రాష్ట్రాల్లోను ఇతర దేశాల్లోను ఉన్న ప్రవాస తెలుగు వారి కోసం జరిగే సదస్సులు మూడోవి. ఈ విభాగం ప్రముఖమైనది. ఈ గోష్ఠి ద్వారానే మంచి చర్చలు జరగడానికి వీలుంది. ఇక్కడ ఆయా ప్రాంతాల తెలుగువారి భాషా సమస్యల గురించి చర్చించి; ఇక్కడి ప్రభుత్వం అక్కడి తెలుగువారి కోసం ప్రచురణలు, అధ్యయనాలు, పరిశోధనలకోసం ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వవలసి ఉంటుంది, ఇవ్వాలి అనే విషయాలు కూలంకషంగా పరిశీలించాలి. తీర్మానాలు చేసి ప్రభుత్వానికి అందించాలి. ఇది మూడో విభాగం. ఇక నాలుగో విభాగం చాలా ప్రముఖమైనది. తెలంగాణలో అధికారభాష అమలు, దానికి ఉన్న సమస్యలు, బోధన మాధ్యమంగా తెలుగును ఏ స్థాయి వరకు అమలు చేయాలి- ఈ విషయంలో తప్పుదోవ పట్టిస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలను ఎలా కట్టడి చేయాలి అని చర్చించాలి. ప్రభుత్వ విద్యాసంస్థలను ఎలా బలోపేతం చేయాలి, విద్యార్థులను తల్లిదండ్రులను తెలుగు మాధ్యమం వైపు ఎలా ఆకర్షించాలి; ఇందుకోసం తీసుకోవలసిన చర్యలు ఏమిటి అనే విషయమై చాలా లోతుగా చర్చలు జరగాలి. అధికార భాషగా, బోధన మాధ్యమంగాను తెలుగు అమలులో ఎదురవుతున్న సమస్యలు ఏమిటి, ఎలా అధిగమించాలన్న దానిపై క్షుణ్నంగా చర్చలు కొనసాగించాలి. ఈ తీర్మానాలను ప్రభుత్వాలు అమలు చేసినప్పుడే ఈ మహాసభలు ఫలవంతం అయినట్లు లెక్క.
ఉపాధి సాధక బోధన
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారు 14 లక్షల ఉద్యోగులున్నారని సర్కారు లెక్కలే చెబుతున్నాయి. ఈ ఉద్యోగులందరూ తెలుగువారి కోసమే పనిచేయాలి కాబట్టి తెలుగులో చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయి అని ప్రభుత్వం చెబితే ప్రతి ఒక్కరూ తెలుగు మాధ్యమంలో చదవడానికి ముందుకు వస్తారు. పరిపాలన భాషగా తెలుగు అమలుకు, తెలుగు మాధ్యమంలో విద్యా బోధనకు విడదీయరాని సంబంధం ఉందన్న విషయం పరిపాలకులకు ఇక్కడే తెలియాలి. దీనికి భిన్నంగా తెలుగు మాధ్యమంలో కాదు ఆంగ్ల మాధ్యమంలో చదివితేనే ఉద్యోగాలు వస్తాయని ఎవరు చెప్పినా బాధ్యతా రాహిత్యం, అవగాహనా రాహిత్యమే. ప్రస్తుత తెలుగు మహాసభల్లో భాష అమలుపై జరిగే ఇలాంటి సదస్సులో సంబంధిత విశేషజ్ఞులే పాల్గొనేలా చూడాలి. భాషపై చేసే తీర్మానాలనీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలకు మహాసభల నిర్ణయాలుగా తెలియజేయాలి. తెలుగులో చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించడం చాలా గొప్ప విషయం. ఇదే విషయాన్ని ఈ తెలుగు మహాసభల్లో తీర్మానంగా ఆమోదించాలి. అంతేకాదు, దీన్ని అమలు చేయాలి.
మరొక ముఖ్యమైన అంశం- సాంకేతిక పరిజ్ఞానం. తెలుగు భాషకు సంబంధించి కంప్యూటర్‌ పరిజ్ఞానం బాగా పెరిగింది. ఈ సాంకేతికతను భాషాభివృద్ధికి, నిఘంటు నిర్మాణానికి ఎలా వినియోగించుకోవాలి, విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని అనుసంధానించే శక్తిగా ఈ సాంకేతికత ఎలా ఉపయోగపడుతుంది అని చర్చించాలి. ఒక వాస్తవిక సమాజాన్ని సాంకేతికత ఎలా తయారుచేస్తుంది, ఇందుకోసం తెలుగు ప్రభుత్వాలు ఏ చర్యలు చేపట్టాలి అనే విషయాలపై సదస్సులు జరిపి తీర్మానాలు చేయాలి.

చర్చలు... చర్యలు
ప్రస్తుత ప్రపంచ మహాసభల్లో ఇలాంటి సదస్సులు ఎలా నిర్వహిస్తారో చూడాలి. వివిధ సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు, సాహిత్యంలోని వివిధ విభాగాలకు కమిటీలను వేశారు. అవధానాలు సాంస్కృతిక ప్రదర్శనలూ జరగనున్నాయి. ప్రవాస తెలుగువారి పరిస్థితి, భాషాపరమైన అంశాలపై చర్చలు, గోష్ఠులు ఏ విధంగా జరుగుతాయో చూడాలి. భాషపై అధ్యయనాలు చేసినవారు, భాషాభ్యుదయానికి ప్రత్యేకంగా కృషిచేసినవారు రెండు రాష్ట్రాల్లోనూ ఉన్నారు. వారిని ఈ సదస్సుకు ఆహ్వానించడం అభిలషణీయం. తెలుగు భాషలో మహానిఘంటువు నిర్మాణం ఇప్పటికీ మాటల్లోనే మిగిలింది. బృహన్నిఘంటువు నిర్మాణంలో, భాషాపరమైన ఇతర విషయాల్లో రెండు రాష్ట్రాలూ సమన్వయంతో కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇందుకోసం ఒక ప్రత్యేక గోష్ఠిని నిర్వహించాలి. ఉమ్మడిగా పథకాలు అమలు చేసుకోవాలి. ప్రాచీన తెలుగు సంస్థ వ్యవస్థాపన విషయంలోనూ ఈ మహాసభ ఉమ్మడిగా చర్చించడమే మంచిది. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.

చాలా జానపద కథలు పెండ్లితోగాని, సింహాసనం పొందడంతోగాని ముగుస్తాయి. మన సినిమాలు కూడా దాదాపు అన్నీ ప్రేమ సఫలం కావడంతో కానీ, పెండ్లితోకాని ముగుస్తాయి. కాని, జీవితం అనేది పెండ్లితోనే మొదలవుతుంది. జీవిత పోరాటాన్ని చూపించే కథలు కానీ, సినిమాలు కాని అరుదు. తెలుగు మహాసభల నిర్వహణతో తెలుగు భాషాభ్యున్నతి దిశలో ముందడుగు పడుతోంది. ఈ కృషి ఇక్కడే ముగియకూడదు. ఈ మహాసభలను ఆరంభంగా భావించి, మంచి చర్చలు జరిపి, తీర్మానాలు చేయాలి. వాటిని ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వాలు అమలు చేసినప్పుడే ఈ కోట్ల రూపాయల ఖర్చు, మానవ పరిశ్రమ ఫలవంతం అవుతాయి. ఒక ప్రజాస్వామిక హక్కు సాకారం అవుతుంది!











No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list