MohanPublications Print Books Online store clik Here Devullu.com

అభిజిత్ ముహూర్తం_abhijit

 అభిజిత్ ముహూర్తం_abhijit


అభిజిత్ ముహూర్తం

     మనకు తెలియని మరో నక్షత్రం! 
 బ్రహ్మవైవర్త మహాపురాణం శ్రీకృష్ణజన్మ ఖండం తొంభై ఆరో అధ్యాయంలో ఉన్న విషయం.

నక్షత్రాలు మొత్తం ఇరవై ఏడు. ఇవన్నీ దక్షప్రజాపతి కుమార్తెలు. దక్షుడు ఈ నక్షత్ర కన్యలను చంద్రుడికిచ్చి పెళ్లిచేశాడు. చంద్రుడు తన భార్యలందరిలోకి రోహిణి మీద ఎక్కువ అనురాగాన్ని పెంచుకొని ఆమెతోనే ఎక్కువకాలం గడుపుతుండేవాడు. ఓసారి వసంత రుతువులో చంద్రుడు ఒక్క రోహిణి దగ్గరే ఉంటూ మిగతా నక్షత్రాలను నిర్లక్ష్యం చేశాడు. దాంతో మిగిలిన నక్షత్రాలు కొంత ­రుకున్నా శ్రవణా నక్షత్రం మాత్రం సహనాన్ని కోల్పోయింది. ఓపిక పట్టలేక తన నుంచి తనలాగే ఉండే ఒక ఛాయను తీసి తన స్థానంలో ఉంచి చంద్రుడి విషయాన్ని గురించి తన తండ్రికి చెప్పేందుకు వెళ్లింది. ఆ శ్రవణా నక్షత్రపు ఛాయ ఒక నక్షత్రమైంది. దానిపేరు అభిజిత్తు.


అలా ఇరవైఏడు నక్షత్రాలే కాక అభిజిత్తు అనే ఇరవై ఎనిమిదో నక్షత్రం ఏర్పడింది. ఆ తర్వాత కాలాలలో శ్రవణం చెప్పిన విషయాన్ని దక్షుడు వినటం, ఒకటికి రెండుసార్లు ఆయన చంద్రుడిని హెచ్చరించినా చంద్రుడు వినకపోయేసరికి ఆయన శపించటం ఇవన్నీ జరిగాయి. అయినా అభిజిత్తు మాత్రం ఓ పవిత్రమైన స్థానాన్నే పొందింది.

అభిజిత్ లగ్నాన్ని పల్లెటూళ్ళలో "గడ్డపలుగు"ముహూర్తం అని అంటారు. గడ్డపలుగు భూమిలో పాతిన దాని నీడ మాయమయ్యే మిట్ట మధ్యాన్న సమయాన్ని అభిజిత్ ముహూర్తంగా, మంచి ముహూర్తంగా నిర్ణయించారు. పూర్వకాలంలో బ్రాహ్మణులు పంచాంగం చూడటం రాని పల్లె ప్రజలకు ఎటువంటి గందరగోళం లేకుండా స్ధూలమైన మంచి ముహూర్తం ఈ విధంగా ఎన్నుకోవచ్చని తెలియజేశారు. ఈ ముహూర్తంలో సూర్యుడు దశమకేంద్రంలో ఉంటాడని ఈ యోగం ముహూర్తంలోని చాలా దోషాలను పోగొడుతుందని తెలియజేసేవారు.

అభిజిత్తు అంటే మధ్యాహ్నం 11-45నుండి 12-30వరకు ఉన్న సమయాన్ని అభిజిన్ముహూర్తం అని, సూర్యోదయం నుండి లేదా సూర్యాస్తమయం నుండి ఎనిమిదవ ముహూర్తం అభిజిత్ ముహూర్తం అంటారు. పగటి భాగం లో ఎనిమిదవ ముహూర్తం ఇది .దీనికే ‘’విజయ ముహూర్తం ‘’అంటారు. ఈ అభిజిత్ ముహూర్తం లోనే శివుడు త్రిపురాసుర వధ చేశాడు. ఇదే ముహూర్తం లో దేవతలు సముద్ర మధనం మొదలు పెట్టారు. ఈ శుభ ముహూర్తం లోనే దేవరాజు ఇంద్రుడు దేవ సింహాసనం అధిరోహించాడు. శ్రీరాముడు జన్మించినది, సీతారాముల కల్యాణం, భీష్మ పితామహుడు ధ్యాన స్థితుడై ప్రాణాలను విడిచిపెట్టింది . ఇన్ని మంచి పనులు ఈ గొప్ప ముహూర్తం లో జరిగాయి.

అభిజిత్ లగ్నం (మధ్యాహ్న లగ్నం) లో పెళ్ళి జరిగింది కనుక ఇలా కష్టాలు వచ్చాయని అనుకోవడం కూడా తప్పే. అసలు ఆ లగ్నంలో ఏ శుభకార్యం చేపట్టినా, ఇక మిగతా విషయాలు ఏవీ ఆలోచించాల్సిన అవసరమే లేదు. అంతటి దివ్యమైన ముహూర్తం ఇది.ఇవ్వాళ పెళ్ళి చేసుకుని, రేపు విడిపోదామనుకునే జంటలు, ముహూర్త బలాన్నీ, పెద్దల ఆశీర్వాదాలను తప్పుబట్టడం అవివేకం. శుభముహూర్తమేదైనా జీవితాంతం ఆనందంగా ఉండాలనే నిర్దేశించబడుతుంది. అయితే, ముహూర్తం అందించే బలాన్ని జంటలు ఎంతగా పెంచుకుంటున్నాయన్నది ఆలోచించాలి.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list