MohanPublications Print Books Online store clik Here Devullu.com

బాహుబలి_Bahubali

బాహుబలి Bahubali prabhas
     
మహేంద్ర బాహుబలి పాలనలో మాహిష్మతి రాజ్య  ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారు. కొంతకాలం గడిచాక మాత్రం  రాజ్యంలో దోపిడీలు, దొమ్మీలు ఎక్కువయ్యాయి. ఇదంతా ఒక ఎత్తయితే ప్రజలు ప్రజాస్వామ్యం కోసం ఉద్యమించడం మరో ఎత్తు. ‘డెమోక్రసీ మూమెంట్‌’లో ప్రజలు  చురుగ్గా పాల్గొంటున్నారు. సకల జనుల సమ్మెతో మాహిష్మతి పాలనా యంత్రాంగం స్తంభించిపోయింది. ఈ ఉద్యమాలకు సింగమలై అనే వ్యక్తి నాయకత్వం వహిస్తున్నట్లు ఇంటెలీజెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
‘‘ఎన్నాళ్లీ  రాజుల పాలన? అమరేంద్ర బాహుబలి పోతే మహేంద్ర బాహుబలి, అతడు పోతే సురేంద్ర బహుబలి అతడు  పోతే వీరేంద్ర బాహుబలి...ఇదేనా వరుస? కామన్‌ మెన్‌ కామన్‌ మెన్‌గానే ఉండాలా? మన ఎల్లయ్యో, పుల్లయ్యో ఈ మాహిష్మతికి ఎందుకు రాజు కాకూడదు? సిక్స్‌ప్యాక్‌ ఉన్నవాళ్లు మాత్రమే సీటు మీద కూర్చోవాలని  ఏ  శాసనం చెబుతుంది?’’ అంటూ నిప్పులు చెరుగుతున్నాడు సింగమలై. ‘రాజుల పాలన అంతరించాలి. ప్రజాస్వామ్యం వర్థిల్లాలి’ అంటూ ప్రజలు పెద్ద పెట్టున నినాదాలు ఇస్తున్నారు. ‘‘ఈ సింగమలై ఎవడు? అసలు ఈ పేరు మన రాజ్యప్రజలు పెట్టుకునే పేరులా లేదే? అతను ఎవరో,  అతని పుట్టుపూర్వోత్తారాలు ఏమిటో నాకు తక్షణం తెలియాలి’’ అని ఇంటెలీజెన్స్‌  డిపార్ట్‌మెంట్‌ను ఆదేశించాడు మహేంద్రబాహుబలి. కానీ నెలరోజులు గడిచినా ఈ ‘సింగమలై’ గురించి సింగిల్‌ వర్డ్‌ కూడా కనిపెట్టలేకపోయింది ఇంటెలీజెన్స్‌ డిపార్ట్‌మెంట్‌. ఒకరోజు...
‘‘మీ దర్శనం కోసం ఎవరో యువకుడు వేచి చూస్తున్నాడు. లోనికి రమ్మంటారా?’’ మహేంద్ర బాహుబలిని అనుమతి కోరాడు  భటుడు.‘‘నా మూడ్‌ ఏమీ బాగలేదు. అయినా సరే రమ్మను. ఎవడి బుర్రలో ఏ ఐడియా ఉందో’’ ఆదేశించాడు రాజు. ఆ యువకుడు వచ్చి  మహేంద్ర బాహుబలి ముందు నిలుచున్నాడు.‘‘ఎవరు నువ్వు?’’ ఉక్కు స్వరంతో అడిగాడు మహేంద్ర బాహుబలి.‘‘రాజా...బాహుబలి–1 ఏ ప్రశ్నతో ముగిసింది?’’ రాజును సూటిగా అడిగాడు ఆ యువకుడు.‘‘ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. అయినా సరే నీ ప్రశ్నకు జవాబు ఇస్తున్నాను... బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ప్రశ్నతో ‘బాహుబలి–1’ ముగుస్తుంది. ఇప్పుడు చెప్పు నువ్వు ఎవరు?’’ అడిగాడు రాజు. అప్పుడు స్వరం పెంచిన ఆ యువకుడు ఇలా అన్నాడు...
‘‘బాహుబలి–2 మాత్రం ఏ ప్రశ్నతోనూ ముగియలేదు. పైగా కన్‌క్లూజన్‌ అని కూడా చెబుతుంది. కానీ అది నిజం కాదు మహారాజా...ఒక సంచలన రహస్యం చెప్పకుండానే బాహుబలి–2 ముగిసింది. ఇది రాజమౌళి కుట్ర అని నేను అనుకోవడం లేదు. కచ్చితంగా కరణ్‌ జోహార్‌ కుట్రే’’ ‘‘సరే, ఆ కుట్ర గురించి  సుత్తి లేకుండా సూటిగా చెప్పు’’ ఆదేశించాడు మహేంద్ర బాహుబలి.‘‘అలాగే చెబుతాను మహారాజా... ముందు నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు మట్టప్ప’’ అన్నాడు యువకుడు.‘‘కొంపదీసి మా కట్టప్పకు దూరపు చుట్టం కాదు కదా?’’ ఆశ్చర్యంగా ఆరా తీశాడు  మహేంద్ర బాహుబలి.‘‘దూరపు బంధువుని కాదు... దగ్గరి బంధువుని కాదు... స్వయానా కట్టప్ప  కన్న కొడుకును. నాకు మట్టప్ప అని ఆయనే పేరు పెట్టారు. నా బుర్రలో  ఉందంతా మట్టేనని ఈ పేరు పెట్టలేదు మహారాజా... ఎదురొచ్చిన శత్రువులను ధైర్యంగా మట్టుపెట్టాలని మట్టప్ప అని పేరు పెట్టారు’’ వివరించాడు మట్టప్ప.
‘‘నీ బ్రెయిన్‌ దొబ్బినట్లుంది. కట్టప్పకు మ్యారేజ్‌ కాలేదన్న విషయం మాహిష్మతికే కాదు...యావత్‌ ప్రపంచానికి  తెలుసు’’ విసుగ్గా అన్నాడు రాజు.‘‘అదే పొరపాటు. కట్టప్పగారు సుట్టమ్మ అనే యువతిని ప్రేమించాడు. ఈ విషయం  రమ్యకృష్ణకు తెలిస్తే బాగుండదని రహస్య వివాహం చేసుకున్నాడు. కట్టప్ప–సుట్టమ్మలకు పుట్టిన సంతానమే నేను. మీకు డౌటు ఉంటే డీఎన్‌ఏ టెస్ట్‌ కూడా చేసుకోవచ్చు మహారాజా’’ సవాలు విసిరాడు మట్టప్ప.‘‘హండ్రెడ్‌ పర్సంట్‌ నమ్ముతున్నాను. అది సరే, ఇలా సడన్‌గా ఊడిపడ్డావేమిటి?’’ అడిగాడు బాహుబలి.‘‘ ఇంట్లో  ఖాళీగా కూర్చునే బదులు  ఏదైనా ఉద్యోగం చూసుకోవచ్చు కదా! అని అమ్మ తిడుతుంటే ఉద్యోగం వెదుక్కోవడానికి  ఇలా వచ్చాను. ఏదైనా ఉద్యోగం ఇప్పించండి మహారాజా’’ దీనంగా వేడుకున్నాడు మట్టప్ప.
‘‘నీకు ‘ప్ర.ర.అ’ అనే పదవి ఇస్తున్నాను’’ అన్నాడు బాహుబలి.‘‘అదేం పోస్ట్‌ మహారాజా... ప్ర.ర.అ అంటే పాగల్‌గా అన్నట్లుగా వినిపిస్తోంది’’ సందేహంగా అడిగాడు మట్టప్ప. ‘‘ప్ర.ర.అ అంటే ప్రజా రక్షణ అధికారి అని. ఇది క్యాబినెట్‌ ర్యాంక్‌ పోస్ట్‌. పండుగచేస్కో’’ అని మట్టప్ప భుజం తట్టాడు బాహుబలి. ఆనందభాష్పాలతో రాజుకు కృతజ్ఞతలు తెలిపాడు మట్టప్ప.‘‘నువ్వు అర్జంటుగా చేయాల్సిన పని ఆ సింగమలై ఎవడో  కనిపెట్టడం. ఆ పనిలోనే ఉండు. వెళ్లు’’ అని ఆదేశించాడు మహేంద్ర బాహుబలి. రెండో రోజు బాహుబలి దగ్గరకు వచ్చిన మట్టప్ప ‘‘ఆ సింగమలై ఎవడో కనిపెట్టేశా మహారాజా’’ అన్నాడు ఆనందంగా.
‘‘తండ్రికి తగ్గ కొడుకువు అనిపించావు మట్టప్పా. ఇంతకీ ఆ సింగమలై ఎవరు?’’ ఆసక్తిగా అడిగాడు బాహుబలి.‘‘బాహుబలి–2 గురించి తెలుసుకదా మీకు. అందులో భల్లాలదేవకు పెళ్లికాకుండానే భద్ర అనే కొడుకు ఉంటాడు. ఇదేలా సాధ్యం? అని అప్పట్లో పెద్ద చర్చ కూడా జరిగింది. భద్ర అనేవాడు ఫేక్‌ సన్‌. అనగా నకిలీ కుమారుడు. నిజానికి భల్లాలదేవకు పెళ్లి అయింది. అది కూడా మా నాన్నలాగే సీక్రెట్‌ మ్యారేజ్‌. ఎమీ జాక్సనీ అనే యువతిని భల్లాలదేవ రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. వారికి పుట్టిన సంతానమే ఈ సింగమలై. వీడి అసలు పేరు...ప్రభుదేవా! యుద్ధంలో ఎలాగు మీతో గెలవలేడు కాబట్టి, ప్రజలను ఆయుధంగా మలుచుకొని సింగమలై పేరుతో ముందుకు వచ్చాడు.
 వీడిని చంపడం మాట అలా ఉంచండి... చిన్న మాట అన్నాసరే... మనోభావాలు దెబ్బతింటాయి. ప్రజలు ఆగ్రహోదగ్రులవుతారు. రాజ్యం అల్లకల్లోలం అవుతుంది. ముందు నుయ్యి వెనుక గొయ్యి అంటే ఇదే మహారాజా’’ తాను చెప్పాల్సింది చెప్పాడు మట్టప్ప.మహేంద్ర బాహుబలి కళ్లు అగ్నిగుండాల య్యాయి. పిడికిళ్లు గట్టిగా బిగుసుకున్నాయి. 
‘అశుభం’ అనే కార్డు తెర మీద పడడంతో ‘బాహుబలి–3’  సినిమా ముగిసింది.
– యాకూబ్‌ పాషా

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list