MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఎలాంటి పాపాయి కావాలి?_ What kind of child is there?



ఎలాంటి పాపాయి కావాలి?
 What kind of child is there?



‘ఇంకొక్క రెండంగుళాలు పొడవుంటేనా... మోడలింగ్‌లో అదరగొట్టేవాణ్ని’ 
‘అమ్మ రంగూ నాన్న పొడవూ వచ్చి ఉండొచ్చు కదా నాకు... అమ్మ హైటూ నాన్న రంగూ వచ్చాయి...’ 
‘అమ్మానాన్నల పోలిక అంటే అనుకోవచ్చు. నాకెందుకిలా మేనత్త పోలిక వచ్చింది?’ 
‘చక్కెర వ్యాధి మా ఫ్యామిలీలో మూడు తరాలుగా ఉంది. నాకు మాత్రం రాకుండా ఎక్కడికి పోతుంది’. 
‘కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్‌ ఉంటే మిగిలినవాళ్లు అప్రమత్తంగా ఉండడం అవసరం’. 
ఇలాంటి మాటలు నిత్యం ఎక్కడో చోట వినపడుతూనే ఉంటాయి. మనకి వారసత్వంగా వచ్చేది తాత ముత్తాతల ఆస్తులే కాదు, ఇంకా చాలా. రూపమూ గుణగణాలూ వంశానుగత వ్యాధులూ... అన్నీ మన పెద్దల చలవే!
పెరిగే క్రమంలో నేర్చుకునే కొన్ని పద్ధతులను మార్చుకోగలం కానీ జన్మతః వచ్చిన సహజస్వభావాన్ని మనం మార్చుకోలేం. అందుకే పెద్దల నోట ‘పుట్టుకతో వచ్చిన బుద్ధి...’ అన్న సామెత పుట్టుకొచ్చింది. పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అటు ఏడు తరాలూ ఇటు ఏడుతరాలూ చూసుకోవాలనేదీ అందుకే. ఒకే గోత్రమో ఒకే ఇంటిపేరో ఉన్న వాళ్ల మధ్య సంబంధాలు కలుపుకోకపోవడానికి కారణమూ ఇదే.
అయితే సైన్సు ఎంతో అభివృద్ధి చెందింది. చెందుతూనే ఉంది. అటువంటప్పుడు ఇలాంటి సమస్యలను అధిగమించలేమా..! టెస్ట్‌ట్యూబ్‌ బేబీలను తయారుచేశాం. సంక్లిష్టమైన ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్‌ (ఐవీఎఫ్‌) చికిత్స చేస్తున్నాం. అటువంటప్పుడు మనం కోరుకున్న లక్షణాలతో పిల్లల్ని పుట్టించడం సాధ్యం కాదా? ఇటీవల వెలువడిన ఓ పరిశోధన కోరుకున్న లక్షణాలతో పిల్లలు అంటే ‘డిజైనర్‌ బేబీస్‌’ని పొందడం సాధ్యమేనన్న చర్చను తెరపైకి తెచ్చింది.
***
క్రీ.శ.2030 
ఓ అధునాతన ఆస్పత్రి లాంజ్‌లో ఓ జంట కూర్చుని ఉంది. రిసెప్షనిస్టు వారికి ఒక పెద్ద ఫోల్డర్‌ ఇచ్చి వెళ్లింది. మొదటి పేజీలో... 
* అబ్బాయి. శాట్‌(మేధస్సును కొలిచే స్కాలస్టిక్‌ యాప్టిట్యూడ్‌ టెస్ట్‌) పరీక్షలో తొలి యాభైలో ఉండే అవకాశం 40 శాతం. నల్లటి కళ్లు, కొంచెం గోధుమ రంగు జుట్టు. ఆరడుగుల పొడవు. తీవ్రమైన వ్యాధులేవీ వచ్చే అవకాశం లేదు. ప్రవర్తనాపరమైన సమస్యలకు కారణం కాగల ఒకే ఒక్క జన్యువు ఆనవాళ్లు కన్పిస్తున్నాయి కానీ దాని వల్ల అంత ప్రమాదమేమీ ఉండదు. టైప్‌ 2 మధుమేహం, జీర్ణాశయ సమస్యలు వచ్చే అవకాశం సగటు కన్నా కొంచెం ఎక్కువ. 

* అమ్మాయి. తెల్లని ఛాయ. నీలి కళ్లు. నల్లని శిరోజాలు. మధురమైన గొంతు. చక్కటి ఆకృతి. సున్నితమైన స్వభావం. ప్రవర్తనాపరమైన సమస్యలూ తీవ్ర అనారోగ్యాలూ లేవు. ఆస్తమా లాంటి వూపిరితిత్తుల సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం .001 శాతం మాత్రమే.

ఇలాంటి 20కి పైగా పిండాల వర్ణనలు అందులో ఉన్నాయి. ఆ దంపతుల నుంచీ సేకరించిన అండాలూ శుక్రకణాలను ఐవీఎఫ్‌ ప్రక్రియ ద్వారా ఫలదీకరించి వాటిలోని నాణ్యమైన జన్యువులను వివిధ లక్షణాల కాంబినేషన్లతో కలిపి రూపొందించినవే అవన్నీ. దంపతులు తమకు ఎలాంటి బిడ్డ కావాలో నిర్ణయించుకోవడానికి వీలుగా రూపొందించిన కేటలాగ్‌ అది. వారు ఎంపిక చేసుకున్న లక్షణాలున్న పిండాన్ని మాత్రమే గర్భంలో ప్రవేశపెట్టి బిడ్డగా పెరిగేలా చేస్తారు.
మీకు అందంగా గ్రీకువీరుడిలా ఉండే బిడ్డ కావాలో, ఒలింపిక్‌ పతకం సాధించగల అథ్లెట్‌ కావాలో, ఐన్‌స్టీన్‌లాంటి మేధావి కావాలో, ఐశ్వర్యారాయ్‌ అందం, ఎస్‌.జానకి మధురమైన గొంతు కలబోసిన అమ్మాయి కావాలో ఆ పట్టిక చూసి నిర్ణయించుకోవచ్చన్నమాట. అంటే ఒడ్డూ పొడుగూ ముఖ కవళికలూ దేహఛాయతో సహా మీకు నచ్చినట్లుగా మీ పాపాయిని మీరే డిజైన్‌ చేసుకుంటారన్న మాట.

ప్రస్తుతం జరుగుతున్న జన్యు నిర్మాణమూ, జన్యు సవరణ(జెనెటిక్‌ ఇంజినీరింగ్‌, జీన్‌ ఎడిటింగ్‌)లపై పరిశోధనలు ఇలాగే కొనసాగితే మరో దశాబ్దంలో పైన పేర్కొన్న లాంటి పరిస్థితి అనుభవంలోకి వచ్చేస్తుందంటున్నారు కొందరు శాస్త్రవేత్తలు. కోరుకున్న పోలికలతో, తెలివితేటలూ, వ్యక్తిత్వంతో, ఎలాంటి వంశానుగత వ్యాధులూ లేని ‘సూపర్‌ బేబీ’ని కనవచ్చంటున్నారు. అసలు ఇదంతా ఎలా మొదలైందంటే...

పెంపుడు కుక్క అలా వచ్చిందే! 
జన్యునిర్మాణానికి (జెనెటిక్‌ ఇంజినీరింగ్‌) సంబంధించి మనిషి చేస్తున్న ప్రయోగాలు ఇప్పటివి కావు. దాదాపు 40వేల సంవత్సరాల క్రితమే మనిషి తోడేళ్లను మచ్చిక చేసుకుని వాటి స్వభావాన్ని పరిశీలించాడు. వాటిలో ఎంపిక చేసుకున్న జంటలు జతకట్టేలా (సెలెక్టివ్‌ బ్రీడింగ్‌) చూసి పుట్టిన పిల్లల్ని సాధుజంతువులుగా మార్చాడు. ఇప్పటి మన పెంపుడు కుక్కలన్నీ వాటి వారసులేనట.


అలాగే మరింత మంచి మనుషుల్ని తయారుచేయాలన్న కోరిక కూడా చాలా పాతదే. ప్రభుత్వం సమాజంలో ఉత్తమ పౌరులను ఎంపిక చేయాలనీ వారిలోని స్త్రీ పురుషులు పెళ్లి చేసుకుని బిడ్డల్ని కనేలా ప్రోత్సహించాలనీ అప్పుడే నాణ్యమైన జనాభా పుట్టుకొస్తుందనీ సోక్రటీసు చెప్పినట్లు ప్లేటో ‘రిపబ్లిక్‌’లో రాశాడు. ఆ తర్వాత గ్రీకులు సృష్టించిన ‘యూజెనిక్స్‌’ (మంచి సంతానం పొందడం ఎలాగో చెప్పే శాస్త్రం) పందొమ్మిదో శతాబ్దంలో పెద్ద విప్లవాన్నే లేవదీసింది. దాన్ని నమ్మిన పలు దేశాలు హడావుడిగా చట్టాలు కూడా చేసేశాయి. భౌతిక, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నవారూ, వ్యసనపరులూ, దివ్యాంగులూ పిల్లల్ని కనకుండా శస్త్రచికిత్స చేయించుకోవాలంటూ రెండో ప్రపంచ యుద్ధానికి ముందు అమెరికాలోని 30 రాష్ట్రాలు చట్టాలు చేశాయి. అప్పుడే ఆరోగ్యకరమైన జనాభాతో దేశం కళకళలాడుతుందని భావించాయి. హిట్లర్‌ సామూహిక హత్యాకాండ తర్వాతే ప్రపంచం యూజెనిక్స్‌ మౌఢ్యం నుంచీ బయటపడింది. జన్యుపరమైన వ్యాధులను నివారించే వైద్యంగా మాత్రమే యూజెనిక్స్‌ మిగిలింది. అయితే ప్రయోగాలు చేయడానికి ఇష్టపడే కొందరు మాత్రం తమ మానాన తాము చేస్తూనే ఉన్నారు. రాబర్ట్‌ గ్రాహమ్‌ అనే యూజెనిసిస్ట్‌ అసాధారణ తెలివితేటలు గల పిల్లలు కావాలని కోరుకునే తల్లిదండ్రుల కోసం 1980 నుంచీ 1999 వరకూ ‘వీర్యనిధి’ (స్పెర్మ్‌ బ్యాంక్‌) నిర్వహించాడు. ఓ నోబెల్‌ గ్రహీతతో సహా 19 మంది అత్యధిక ఐక్యూ ఉన్న మేధావులు ఈ స్పెర్మ్‌ బ్యాంక్‌కి వీర్యదాతలుగా వ్యవహరించారు. అయితే అలా పుట్టిన ‘జీనియస్‌ బేబీస్‌’ 200 మంది ఐక్యూ సాధారణ వ్యక్తుల ఐక్యూకి ఏ మాత్రం భిన్నంగా లేకపోవడం కొసమెరుపు. సైన్సులో ఎంత ప్రగతి సాధించినా జన్యుశాస్త్రం దగ్గరికి వచ్చేసరికి మన నియంత్రణలో ఉండేది చాలా చాలా తక్కువ అంశాలు మాత్రమేనని ఇలాంటి ప్రయోగాలు నిరూపించాయి.

ముగ్గురు అమ్మానాన్నలు 
గత జనవరిలో ఉక్రెయిన్‌లోని కీవ్‌లో ఒక పాపాయి పుట్టింది. ఆ పాపాయికి తల్లిదండ్రులు ముగ్గురని శాస్త్రవేత్తలు ప్రకటించారు. అంతకు ముందు ఏడాది మెక్సికోలో కూడా ఇలాంటి పాపాయి పుట్టింది. కృత్రిమ గర్భధారణ విధానాలతో పుట్టిన బిడ్డకూ తల్లిదండ్రులు ఇద్దరే ఉంటారు. ఆఖరికి అద్దెగర్భం పద్ధతి అనుసరించినా బిడ్డకు జన్యుపరంగా అద్దె తల్లితో ఎలాంటి సంబంధమూ ఉండదు. మరి ఈ ముగ్గురమ్మానాన్నల కథ ఏమిటీ అంటే... కొన్ని రకాల అనారోగ్యాల వల్ల తల్లికి గర్భం నిలవదు. ఒక వేళ నిలిచినా తల్లిద్వారా ఆ అనారోగ్యాలు బిడ్డకూ సంక్రమిస్తాయి. వీటిని నివారించడం కోసం మూడో వ్యక్తి సహాయం తీసుకుంటున్నారు శాస్త్రవేత్తలు. కీవ్‌లో జరిగిన సంఘటననే చూస్తే... 15 ఏళ్లపాటు సంతానం లేక బాధపడుతున్న ఓ మహిళ ఈ త్రీపేరెంట్‌ టెక్నిక్‌ సహాయంతో తల్లి కాగలిగింది. మన శరీరంలోని ప్రతి కణంలోనూ మైటోకాండ్రియా అనే భాగం ఉంటుంది. ఇది ఆహారాన్ని శక్తిగా మార్చి కణానికి అందిస్తుంది. అండకణాల్లోని మైటోకాండ్రియా దెబ్బతినడం వల్ల ఆ మహిళకు ఇన్నాళ్లూ గర్భం నిలవలేదు. అందుకని దాత కణంలోని ఆరోగ్యకరమైన మైటోకాండ్రియాను తీసుకుని ఆ మహిళ అండకణంలో ప్రవేశపెట్టి ఫలదీకరణం జరిపారు. ఈ చికిత్స ఫలితంగా బిడ్డ ఆరోగ్యంగా పుట్టింది. తల్లికి ఉన్న మైటోకాండ్రియా సమస్యలు బిడ్డకు రాలేదు. శుక్రకణం, అండకణం ఫలదీకరణం చెందినప్పుడు పిండానికి సంబంధించిన తొలి కణం ఏర్పడుతుంది. ఈ కణం న్యూక్లియస్‌లో మాత్రమే ఇద్దరి డీఎన్‌ఏ ఉంటుంది. మైటోకాండ్రియాలో మాత్రం తల్లి డీఎన్‌ఏ నేరుగా బిడ్డకు సంక్రమిస్తుంది. తల్లికి మైటోకాండ్రియా సమస్యలు ఉండడం వల్ల పిల్లలకూ అవి సరఫరా అయ్యి పలు రకాల అనారోగ్యాలకు దారి తీస్తున్నాయి. అందుకని సంతానరాహిత్య సమస్యల పరిష్కారంతో పాటు, తల్లి నుంచి బిడ్డకు సంక్రమించే ఈ అనారోగ్యాల నివారణకీ ఈ టెక్నిక్‌ని వినియోగిస్తున్నారు. అయితే మూడో వ్యక్తి వల్ల చట్టపరమైన సమస్యలు తలెత్తకుండా ఆయా దేశాలు నిర్దిష్టమైన చట్టాలు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకూ ఇలాంటి ప్రక్రియ వల్ల వివిధ దేశాల్లో 30 మందికి పైగా పిల్లలు పుట్టారు. వీరిలో 99 శాతానికి పైగా జన్యువులు పూర్తిగా సొంత తల్లిదండ్రులవే ఉంటాయి. మిగిలిన ఆ ఒక్క శాతంలోనే మూడో వ్యక్తి జన్యువులు ఉంటాయి. ఐవీఎఫ్‌ ప్రక్రియలో ఇంత సంక్లిష్టమైన మైటోకాండ్రియల్‌ రిప్లేస్‌మెంట్‌ కూడా సాధ్యమైంది కాబట్టి అంచెలంచెలుగా ఇంకా చాలా సాధించవచ్చన్న ఆశకు ఈ విధానం జీవం పోస్తోంది.

జన్యుమార్పిడి పిల్లలు! 
హైబ్రిడ్‌ పంటలు మనకు తెలుసు. మరొకడుగు ముందుకేసి జన్యుమార్పిడి పంటలూ(జీఎం- జెనెటికల్లీ మోడిఫైడ్‌) పండిస్తున్నాం. అదే పద్ధతిలో ఇప్పుడు జీఎం కిడ్స్‌ రానున్నారా... జీన్‌ ఎడిటింగ్‌ (జన్యు సవరణ) నిపుణుల పరిశోధనలు ఈ ప్రశ్నను రేకెత్తిస్తున్నాయి. 2012లో అభివృద్ధి చేసిన క్రిస్పర్‌-కాస్‌9(క్లస్టర్డ్‌ రెగ్యులర్లీ ఇంటర్‌ స్పేస్డ్‌ షార్ట్‌ పాలిండ్రోమిక్‌ రిపీట్స్‌) అనే విధానంలో సహజ ఎంజైములను ఉపయోగించి జన్యువులను అత్యంత జాగ్రత్తగా, చాలా కచ్చితంగా సవరించడం(ఎడిటింగ్‌) సాధ్యమైంది. తాజాగా ఈ విధానాన్ని ఉపయోగించి గుండెపోటుకు కారణమయ్యే ప్రాణాంతక ఉత్పరివర్తనలను తొలగించగలిగారు. దాంతో భవిష్యత్‌ తరాలకు ప్రమాదకర జన్యువులు సంక్రమించకుండా చర్యలు తీసుకోవడం సాధ్యమేనని తేలింది. ఈ కోణంలో మరింత లోతుగా వైద్య ప్రయోగాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ పరిశోధనే ఇప్పుడు మళ్లీ ‘కోరుకున్న లక్షణాలతో పిల్లల్ని పుట్టించడమూ సాధ్యమేనా’ అన్న చర్చకు తెరలేపింది. చైనాలో ఇదే విధానాన్ని మానవ పిండాలపై(జీవం ఉన్నా కొన్ని కారణాల వల్ల ప్రాణిగా రూపుదిద్దుకోలేని పిండాలు) ప్రయోగించారు. అక్కడ మిశ్రమ ఫలితాలు వచ్చాయంటున్నా ప్రోత్సాహకరంగా మాత్రం లేవు. ‘ఇలాంటి పరిశోధనలతో జన్యుపరంగా సంక్రమించే వ్యాధుల్ని నివారించగలిగే అవకాశం ఉన్నప్పుడు వాటిని కొనసాగించడం శాస్త్రవేత్తలుగా మా ధర్మం కాబట్టి మా పరిశోధనలు కొనసాగుతూనే ఉంటాయి’ అంటున్నారు కొందరు శాస్త్రవేత్తలు. ఇంగ్లాండ్‌లోని ఫ్రాన్సిస్‌ క్రిక్‌ ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన కేథీ నియాకన్‌ అనే శాస్త్రవేత్త కూడా ఈ ప్రయోగాలు చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి పొందారు. కొద్ది రోజుల వయసున్న మానవ పిండాలపై క్రిస్పర్‌ క్యాస్‌9 విధానాన్ని ఉపయోగించి ఆమె ప్రయోగాలు చేస్తున్నారు. పిండం ఎదుగుదల తొలి దశలో గర్భస్రావం జరగడం, ఇతరత్రా సమస్యలను ఆమె పరిశోధిస్తున్నారు. బ్రిటన్‌ ఈ విషయంలో చాలా కచ్చితమైన విధానాలను అనుసరిస్తోంది. చట్టాన్ని అతిక్రమించడం, దుర్వినియోగం చేయడం జరిగితే తీవ్రమైన శిక్షలే ఉన్నాయక్కడ. అమెరికాతో సహా చాలా దేశాలు ఇంకా మానవ పునరుత్పత్తిపై ఇటువంటి జన్యు మార్పిడి ప్రయోగాల గురించి ఎలాంటి చట్టాలూ చేయలేదు. పైగా కొన్ని దేశాలు నిషేధించాయి కూడా. ప్రాణాంతక వ్యాధుల నివారణకు సరళమైన, చౌకైన ప్రత్యామ్నాయ విధానాలను అభివృద్ధిచేయడానికే ఆయా దేశాలు మొగ్గు చూపుతున్నాయి.

భిన్న వాదనలు 
సైన్సులో ప్రతి కీలకమైన ముందడుగూ సమాజంలో ముందుగా లేవనెత్తేది నైతికపరమైన ప్రశ్నలనే. ఆ కోణంలోనే వైద్య పరిశోధక బృందాలు దాదాపుగా అన్ని దేశాల్లోనూ క్రిస్పర్‌ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి. తొలుత వైద్య కారణాలకోసమే అని చెప్పినా తర్వాత వైద్యంతో సంబంధంలేకుండానూ మానవ పునరుత్పత్తి విధానంలోనూ దీన్ని వాడే ప్రమాదం ఉందన్నది వారి వాదన. ప్రస్తుతానికి ఒక్క జన్యుపరివర్తనను తొలగించే విషయంలో విజయం సాధించినంత మాత్రాన దీంతో ఎన్నో చేయవచ్చని నమ్మలేమంటారు న్యూహ్యాంప్‌షైర్‌కి చెందిన శాస్త్రవేత్త రొనాల్డ్‌ గ్రీన్‌. జీన్‌ ఎడిటింగ్‌ అంత తేలికైన పనేమీ కాదనీ తాజా పరిశోధనకు సంబంధించి సరైన ఆర్‌ఎన్‌ఏను గుర్తించడానికే పదిసార్లు ప్రయత్నించాల్సి వచ్చిందనీ అంటారు మరో జన్యు శాస్త్రవేత్త హువాన్‌ కార్లోస్‌. జన్యు సవరణ గురించి ఇప్పటివరకూ తెలిసింది చాలా తక్కువనీ ఇంకా తెలియని కోణాలూ సమస్యలూ చాలా ఉండే ప్రమాదం ఉంది కాబట్టి మరో రెండు దశాబ్దాల దాకా జన్యుపరమైన వ్యాధుల విషయంలో కానీ కోరుకున్న లక్షణాలతో పిల్లల్ని కనే విషయంలో కానీ దీన్ని వాడే ప్రసక్తి రాదంటారు గ్రీన్‌. అయితే భవిష్యత్తులో మాత్రం దీని ప్రస్తావన రాకుండా ఉండదనీ బహుశా ఈ శతాబ్దపు రెండో సగంలో ఇది చర్చనీయాంశం కావచ్చనీ ఆయన అభిప్రాయం. అదే సమయంలో జన్యు సవరణ ద్వారా జన్మించిన పిల్లల్లో మరో రకమైన తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చనీ ఆయన అంటున్నారు.

మనుషుల్లో అంత తేలిక కాదు 
మొక్కల్లో జన్యుపరమైన మార్పులు చేయడం ద్వారా ఇప్పటికే ఆశించిన ఫలితాలు పొందŒగలుగుతున్నాం. అయితే మనుషుల విషయానికి వచ్చేసరికి అలాంటి అవకాశాలు చాలా పరిమితం. డిజైనర్‌ బేబీ లక్షణాలుగా పేర్కొంటున్న అందమూ, తెలివితేటలూ, రంగూ, పొడుగూ, బలమైన కండరాలూ, మంచి జ్ఞాపకశక్తీ తదితరాలను మార్చడం మాత్రం అంత తేలిక కాదు. ఎందుకంటే వీటిల్లో ఒక్కో లక్షణానికీ కొన్ని వందల వేల జన్యువులు, వాటి ఉత్పరివర్తనలూ కారణమవుతాయి. ఉదాహరణకి ఒక్క పొడుగు విషయమే చూద్దాం. మనిషి ఎత్తుని ప్రభావితం చేసే జన్యు వైవిధ్యాలు 93,000 ఉంటాయని కొందరు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఇప్పటివరకూ జరిగిన అధ్యయనాల్లో వాటిలో 697 మాత్రమే గుర్తించగలిగారు. జన్యు పరివర్తన ఎంత సంక్లిష్టమైన వ్యవహారమో దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ‘డిజైనర్‌ బేబీస్‌’ అన్న మాట ప్రస్తుతానికి సైన్స్‌ ఫిక్షన్‌కే పరిమితం అని తేల్చేస్తున్నారు కొందరు శాస్త్రవేత్తలు. పైగా ఇప్పటివరకూ మనం జన్యువుని సవరించగలుగుతున్నామే(జీన్‌ ఎడిటింగ్‌) కానీ మెరుగుపరచడం(ఎన్‌హాన్స్‌మెంట్‌) గురించి మనకేమీ తెలియదు... అంటున్నారు హ్యాంక్‌ గ్రీలీ. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్త అయిన ఆయన ‘ఈ బిడ్డ పెరిగి శాట్‌ పరీక్షలో ఇన్ని మార్కులు తెచ్చుకోగలుగుతుంది’ అని పిండదశలోనే చెప్పడం ఇప్పటికైతే అసాధ్యం అంటారు.

జన్యువులకు సందేశం ఇవ్వడమనేది కొద్ది పదాల్లో చెప్పే ట్వీటు కాదు, బీరువా నిండా పుస్తకాలూ, వందలాది అధ్యాయాలూ, వాటికి ఫుట్‌నోట్సులూ... అబ్బో చాలా ఉంటాయి. వాటన్నిటినీ అధ్యయనం చేస్తే కానీ - సైన్సులో ఓ చిన్న ముందడుగు పడదు. ఒక్క వ్యాధి కారక జన్యు పరివర్తనని మార్చగలిగినంత మాత్రాన అన్ని వ్యాధులనూ అదే రీతిలో అరికట్టవచ్చనుకోవడం అత్యాశే. సంక్లిష్టంగా లేని జన్యువులను సవరించడం ద్వారా వ్యాధుల నివారణకు కృషిచేసే విషయంలో కూడా ఇంకా ఎన్నో ప్రయోగాలు జరగాల్సి ఉంది.

మంచీ చెడూ... 
సాధ్యాసాధ్యాలను పక్కనపెడితే ఈ ‘డిజైనర్‌ బేబీ’లను నిజంగానే తయారుచేయగలిగారనే అనుకుందాం. అప్పుడేమవుతుంది? జన్యుపరమైన, ఆనువంశిక వ్యాధులు లేని ఆరోగ్యవంతులైన పిల్లలు పుడతారు. ఎలాగూ తెలివిగల పిల్లలు కాబట్టి జీవితంలో నిస్సందేహంగా విజయం సాధిస్తారు. ఆయుఃప్రమాణం పెరుగుతుంది. తల్లిదండ్రుల్లో లేని నాణ్యమైన కొత్త జన్యువులు వీరికి ఉంటాయి కాబట్టి తర్వాతి తరానికి ఎలాంటి వ్యాధులనూ, అక్కరలేని గుణగణాలనూ అందించరు. ఇది నాణేనికి ఒక వైపు.
మరోవైపు నుంచీ చూస్తే... నేటి భ్రూణ హత్యల్లాగా కోరుకున్నట్లుగా అన్నీ మంచి జన్యువులతో తయారుకాని పిండాలను చిదిమేయడం ఎక్కువవుతుంది. పుట్టిన పిల్లలకు తమ ఇష్టాయిష్టాలంటూ ఏమీ ఉండవు. ఎందుకంటే వాళ్లు ఎలా ఉండాలో ముందుగానే నిర్ణయమైపోయింది కాబట్టి ప్రోగ్రామ్‌ చేసిన రోబోలా పెరుగుతారు. దాంతో వ్యక్తి స్వాతంత్య్రం, స్వేచ్ఛ లాంటి పదాలకు అర్థం ఉండదు. ఈ పిల్లలకూ మామూలు పిల్లలకూ మధ్య సమాజంలో తీవ్ర అంతరం ఏర్పడుతుంది. ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ధనికులు మాత్రమే ఇలాంటి పిల్లల్ని పొందగలుగుతారు. ఇప్పుడు బీదా గొప్పా తేడా ఉన్నట్లే అప్పుడు మేధోపరంగా రెండు వర్గాలు ఏర్పడతాయి. ‘శాస్త్రీయ వైద్య విజ్ఞానం ఏదైనా సరే ప్రయోగశాల దాటి ప్రజల్లోకి వచ్చిందంటే అది అందరికీ అందుబాటులో ఉండాలి అంతేకానీ సమాజంలో అసమానతల సృష్టికి కారణం కాకూడదు’ అన్న డాక్టర్‌ కార్లోస్‌ మాటలు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సైన్సుకి సంబంధించిన ఏ ఆవిష్కరణ అయినా శాస్త్రవేత్తలు చూసే కోణానికీ ప్రజలు చూసే కోణానికీ చాలా తేడా ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలు తమ కుటుంబంలోని వారినే పోలి ఉండాలనుకుంటారు కానీ వేరెవరి పోలికలతోనో ఉండడాన్ని ఇష్టపడతారా? ప్రమాదకర వ్యాధుల నిరోధం వంటి తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప వారు తమ జన్యువులను సరిచేయడానికి అంగీకరించరన్నది మానవ సంబంధాలూ అనుబంధాల గురించి ఆలోచించే వారి అభిప్రాయం.
దాదాపు 40 ఏళ్ల క్రితం తొలి టెస్ట్‌ట్యూబ్‌ బేబీ పుట్టినప్పుడు విజయం సాధించామని శాస్త్రవేత్తలు మురిసిపోతే సమాజం మాత్రం విస్తుపోయింది. ఎన్నో నైతిక ప్రశ్నలను లేవనెత్తింది. మానవ శరీరానికి బయట బిడ్డ ప్రాణం పోసుకోవడం అనే అంశాన్ని నాటి సమాజం జీర్ణించుకోవడానికి చాలా సమయం పట్టింది. కానీ అదే విధానం ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెంది పలు కారణాల వల్ల సంతానం పొందలేనివారికి వరంగా మారింది. అలాగే రేపటి రోజున - అందం విషయంగా ఆరోగ్య పరంగా ఎలాంటి లోటుపాట్లూ లేని అద్భుతమైన డిజైనర్‌ బేబీలు కూడా మన కళ్లముందు నిలుస్తారేమో... చూద్దాం!
ఆ పుస్తకంలో ఎప్పుడో రాశారు!
దాదాపు వందేళ్ల క్రితం సంగతి. జేబీఎస్‌ హల్డేన్‌, జులియన్‌ హక్స్‌లీ అనే ఇద్దరు బయాలజిస్టులు పునరుత్పత్తి ప్రక్రియలో చోటుచేసుకోబోతున్న సాంకేతిక మార్పుల గురించి సంచలన విషయాలు ప్రకటించారు. వాటినుంచీ స్ఫూర్తి పొందిన హక్స్‌లీ సోదరుడు ఆల్డస్‌ హక్స్‌లీ ‘బ్రేవ్‌ న్యూ వరల్డ్‌’ అనే పుస్తకం రాశాడు. 1932లో ప్రచురితమైన ఈ పుస్తకంలో క్రీ.శ.2540లోని సమాజం గురించి ఉంటుంది. అప్పుడు మనుషులు ఇప్పట్లా పిల్లల్ని కనరనీ, పునరుత్పత్తికి ఓ ప్రయోగశాల విడిగా ఉంటుందనీ అందులో రసాయనాలతో పిండాలను తయారుచేస్తారనీ రాశాడు. తెలివితేటల ఆధారంగా ఐదు వర్గాల పిల్లల్ని తయారుచేస్తారనీ తెల్లటి దుస్తులు ధరించిన కొందరు మనుషులు ఆ పిల్లలకు పోషకాహారం ఇచ్చి పెంచుతారనీ... ఇలా పలు విషయాలుంటాయి అందులో. పునరుత్పత్తి ప్రక్రియకు సంబంధించిన కొత్త ఆవిష్కరణ ఏది వచ్చినా ఆ వార్తల్లో ఈ పుస్తకం ప్రస్తావన రాకుండా ఉండదు. ఇప్పుడు డిజైనర్‌ బేబీల ప్రస్తావన మళ్లీ ఆ పుస్తకాన్ని తెరమీదికి తెచ్చింది. హక్స్‌లీ చెప్పినట్లు పిల్లల్ని ప్రయోగశాలలో పుట్టిస్తారా అన్న చర్చ మొదలైంది. ఆ తర్వాత కూడా ఇదే అంశం మీద నెవర్‌ లెట్‌ మి గో, పర్‌ఫెక్ట్‌ పీపుల్‌, డిజైనర్‌ బేబీస్‌, జీఎంవో సాపియెన్స్‌ లాంటి పుస్తకాలు వచ్చాయి.
రోగాలు సరే, మేధావులూ ఉండరు!
జన్యు సవరణ వల్ల రోగాలను తుడిచిపెట్టడమే కాదు, స్టీఫెన్‌ హాకింగ్‌, థామస్‌ ఎడిసన్‌ లాంటి మేధావులనూ కోల్పోతామంటున్నారు జిమ్‌ కొజుబెక్‌ అనే శాస్త్రవేత్త. అమెరికాకి చెందిన ఈ సైన్సు రచయిత జీన్‌ ఎడిటింగ్‌పై ‘మోడరన్‌ ప్రొమిథియస్‌’ అనే పుస్తకం రాశారు. చాలా మంది మేధావులు ఏదో ఒకరకమైన ఆరోగ్య సమస్యలున్నవారేనని ఆయన గుర్తుచేస్తున్నారు. జన్యుపరమైన విశ్లేషణ చేస్తే రచయితలకు బైపోలార్‌ డిజార్డర్‌(కాసేపు ఉత్సాహంగా, కాసేపు కుంగుబాటుకు లోనైనట్లు తీవ్ర నిస్పృహతో ఉండడం) అనే సమస్య వచ్చే అవకాశం సాధారణ వ్యక్తులకన్నా పది రెట్లు ఎక్కువుండగా, కవులకు నలభై రెట్లు ఎక్కువని ఆయన రాశారు. సాధారణ వ్యక్తులు ఆటిజాన్ని అనారోగ్యంగా చూస్తే మేధావులకు అదే గొప్ప బహుమతిగా మారిందంటారాయన. ‘మేధావులను కాపాడండి’ అన్న నినాదంతో పాటు ఆయన చెప్తున్న మరో అంశమూ ఆలోచించదగినదే. ‘ప్రస్తుతానికి జన్యు సవరణ చేసి సాధించేశామని పొంగిపోతున్నాం కానీ ఇలా డీఎన్‌ఏని మన ఇష్టం వచ్చినట్లు మార్చుకోవడం వల్ల జరిగే పరిణామాలేమిటో కూడా చూడాలిగా...’ అంటున్నారు కొజుబెక్‌. 
26 జన్యుమార్పిడి పంటలు 
డీఎన్‌ఏను సవరించడం ద్వారా జన్యు నిర్మాణంలో చిన్న మార్పులు చేసి గత రెండు దశాబ్దాల్లో 26 రకాల పంటలను అభివృద్ధి చేశారు. చీడపీడలను తట్టుకునేందుకూ, అధిక దిగుబడి సాధించేందుకూ, పండ్లజాతుల్లో కాయలు త్వరగా పండిపోకుండా నిల్వ ఉండేందుకూ... ఇలా రకరకాల ప్రయోజనాలకోసం ఆయా వంగడాల్లో మార్పులు చేశారు. జన్యుమార్పిడి పంటల్లో చాలా దేశాలు అన్నిటికన్నా ఎక్కువగా పండిస్తున్నది సోయాబీన్‌. అమెరికాలో బొప్పాయి, మొక్కజొన్న సహా 9 రకాల జీఎం పంటలు పండిస్తుండగా మన దేశంలో పత్తి పండిస్తున్నాం. జన్యు మార్పిడి ఆవాలు పండించడానికీ చర్చలు జరుగుతున్నాయి.
ఏకంగా 62 జన్యువులు మార్చారు!
పాడి పశువుల్లో పాల దిగుబడి పెంచేందుకూ, వ్యాధులను తట్టుకునేందుకూ జన్యు సవరణను ఉపయోగించడానికి ప్రయోగాలు కొనసాగుతున్నాయి. మనుషుల్లో అవయవ మార్పిడి అవసరాలు తీర్చడం కోసం పందుల్ని సిద్ధం చేస్తున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. ఆ అవయవాలను మానవ శరీరం తిరస్కరించకుండా, పందికి చెందిన వైరస్‌లు మనిషికి రాకుండా చూసేందుకుగాను జన్యుమార్పిడి ప్రయోగాలు అవిశ్రాంతంగా కొనసాగుతున్నాయి. హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌కి చెందిన జన్యు శాస్త్రవేత్త జార్జ్‌ చర్చ్‌ క్రిస్పర్‌ సాంకేతికత ఉపయోగించి పంది పిండ కణంలో ఏకంగా 62 జన్యు సవరణలు చేశారు. ఇప్పటివరకూ ఏ జంతువులోనూ ఇన్ని సవరణలు చేయలేదు. అయితే ఈ ప్రయోగాలన్నీ కూడా ఇంకా ఆయా దేశాల్లో చట్టపరమైన అనుమతులు పొందాల్సి ఉంది. 
- పద్మశ్రీ యలమంచిలి












No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list