MohanPublications Print Books Online store clik Here Devullu.com

బంగారం కొనేముందు... ఒక్క క్షణం!_Before buying gold ... One moment!

      

బంగారం కొనేముందు... 
ఒక్క క్షణం!

లక్ష్మీ పూజలో బంగారానికీ ప్రాధాన్యం ఎక్కువే. అందుకే ఈ సమయంలో కొనుగోళ్లూ వూపందుకుంటాయి. దుకాణాలు రాయితీలను ప్రకటిస్తుంటాయి. బంగారానికి ఇంత ప్రత్యేకత ఎందుకొచ్చింది అంటే అటు సంప్రదాయాన్నీ వైభవాన్ని, ఇటు హోదానీ, భద్రతనీ ఏకకాలంలో అందిస్తుంది. అందుకే అతివలు రూపాయి రూపాయి పొదుపు చేసి మరీ నగలు చేయించుకుంటారు. ఆపదలో ఆర్థిక భరోసా ఇచ్చేందుకు ఇది సరైన మార్గమనీ భావిస్తుంటారు. కానీ విలువ తగ్గని వన్నె తరగని బంగారం ఎప్పుడూ తన ధరలతో వినియోగదారులతో దోబూచులాడుతుంది. అసలు బంగారం విలువెంత.. దాన్ని ఎలా లెక్కేయాలి. నాణ్యతను గుర్తించే మార్గాలు ఏంటి?
ఉన్నత వర్గాల వారు తమ హోదాకు తగినట్లుగా వజ్రాల కొనుగోలు వైపు మొగ్గు చూపుతుంటే ఎగువ, దిగువ మధ్యతరగతి వారు మాత్రం బంగారానికే ఓటేస్తున్నా. అందుకే బంగారాన్ని వస్తువుగానా లేక నాణెంగానా.. ఎన్ని గ్రాముల్లో, డబ్బు.. ఇవన్నీ ఆలోచిస్తే చాలదు. వాటికే పరిమితం కాకుండా మోసపోకుండా..స్వచ్ఛమైన బంగారం తీసుకుంటున్నామా లేదా అన్నది గమనించాలి. అలానే ఆయా షాపుల రాయితీలు అందిస్తోన్న విధానం కూడా గమనించుకోవాలి. గ్రాము బంగారం కొన్నా సరే ఎంతో అప్రమత్తంగా ఉండాలి. వీటన్నింటికంటే ముందు నగలు కొనాలనుకున్న రోజు బంగారం ధర ఎంత ఉందో తెలుసుకోవాలి.
* స్వచ్ఛత ఎలా... కొత్తగా కొనేవి వందశాతం స్వచ్ఛమైనవో కాదో చూడాలి. అవన్నీ మనకి ఎలా తెలుస్తాయి అనుకుంటున్నారు కదూ! ఇప్పుడూ 22 క్యారెట్‌ల బంగారంలో 91.6 స్వచ్ఛత ఉంటుంది. 24 క్యారెట్‌ల బంగారంలో 99.9 శాతం స్వచ్ఛత ఉంటుంది. అలా ఉన్న వాటిమీద హాల్‌మార్క్‌ గుర్తు ఉంటుంది.
* గుర్తింపు ఎవరిస్తారు... దీన్ని బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్స్‌(బీఐఎస్‌) నిర్ణయిస్తుంది. నగ తయారైన వెంటనే హాల్‌మార్క్‌ ముద్రణ కేంద్రాలకు వెళతాయి. నాణేల రూపంలో కొంటే 999 గుర్తు ఉంటుంది.
* హాల్‌మార్క్‌ని ఎలా గుర్తించొచ్చు... నగల మీద ఏదో ఒక చోట హాల్‌మార్క్‌ లోగో, నాణ్యత(916 నాణ్యత ఉందా, ఇంకా తక్కువా అనేది), హాల్‌మార్కు ముద్ర వేసిన సంస్థ లోగో, ఏ సంవత్సరంలో హాల్‌మార్క్‌ ముద్ర వేశారు, నగ అమ్మిన సంస్థ లోగో ఇలా.. మొత్తం ఐదు గుర్తులు ఉంటాయి. వీటిని కొనేముందు సరి చూసుకోవాలి. కొన్నిసార్లు వీటిని బూతద్దంలో మాత్రమే చూడగలం.
ఎలా లెక్కకడతారు... 
నగ ఎంపిక తరవాత అతి ముఖ్యమైంది బిల్లు. ప్రస్తుతం పెద్ద పెద్ద దుకాణాల్లో.. వేస్టేజ్‌, మజూరీ కలిపి వాల్యూ యాడెడ్‌ ఛార్జీగా లెక్కేస్తారు. ఇది ఆరు శాతం నుంచి నగను బట్టి ముప్ఫై శాతం వరకూ వేస్తారు. మొత్తం బిల్లుపై జీఎస్‌టీ ఉంటుంది. దీన్ని 1.5% సీజీఎస్‌టీ, మరో 1.5%ఎస్‌జీఎస్‌టీగా విభజిస్తారు. ఇవన్నీ లెక్క వేస్తే తీసుకున్న వస్తువుని బట్టి అదనంగా గ్రాము నుంచి రెండు మూడు గ్రాముల బంగారానికి అదనంగా చెల్లించాల్సి వస్తుంది.
తరుగు సంగతో... 
అన్ని వస్తువుల మీదా తరుగు విలువ ఒకేలా ఉండదు. తరుగు ఏ నగకు ఎంత ఉంటుందనేది నగను బట్టి ఉంటుంది. ఉదాహరణకు ఐదు నుంచి ఇరవై రెండు శాతం వరకూ వరకూ ఉంటుంది. యంత్రాల మీద తయారు చేసిన నగలకంటే చేతిపనితనంతో చేసినవాటి ఖరీదు కాస్త ఎక్కువ. వస్తువు కొనేప్పుడు తరుగూ, మజూరీల ఖరీదు వేస్తే వాటిని తిరిగి మార్చుకునేప్పుడు అసలు బంగారానికి మాత్రమే లెక్కలు వేసి వంద శాతంగా రిటర్న్‌ చేసి ఇస్తారు.
పాత నగల విషయంలో... 
వారసత్వంగా బంగారాన్ని తమ తరవాతి తరాలకు అందించడం భారతదేశంలో అనవాయితీ. కానీ అప్పట్లో హాల్‌మార్క్‌ లేదు. అందుకే దాన్ని మార్చాలనుకున్నప్పుడు మీకు మీరే నగ ఎన్ని గ్రాములుందీ, ధర ఎంత ఉందీ అన్నది చూసుకుని సొంతంగా లెక్కలు వేసుకోవద్దు. ముందు ఆ బంగారం స్వచ్ఛత తెలుసుకోవాలి. దాన్ని పరిశీలించి వారిచ్చే ధ్రువపత్రాన్ని తీసుకోండి. దాన్నే ట్రాంచ్‌ సర్టిఫికేట్‌ అంటారు. వీలైనంతవరకూ పాత బంగారాన్ని కరిగించడం కంటే కాస్త కొత్తగా అదనపు హంగులు చేర్చుకోవడం మేలు.
రాళ్ల లెక్కలు వేరే... 
రాళ్ల నగల బరువుతోపాటూ ఆ రోజు ధరకి.. ఎంత ఖర్చు అవుతుందో లెక్క కడతారు. అది అదనం. వాస్తవానికి మామూలు రాళ్లకు విలువ ఉండదు. కొన్ని దుకాణాల వారు రాళ్లకీ భారీగా ధర వేస్తుంటారు. నిజానికి మనం తిరిగి రాళ్ల నగలు అమ్మినప్పుడు రాళ్లకి రీసేల్‌ ఉండదు. కాబట్టి రాళ్లకు సంబంధించి.. ధర వేసినప్పుడు పక్కాగా మాట్లాడుకోవాలి. ఒకవేళ దుకాణదారులు రాళ్లకు రీసేల్‌ ఉంటుంది అని డబ్బులు కట్టించుకుంటే మాత్రం.. వారి చేత మనం తిరిగి నగలు అమ్మినప్పుడు రాళ్లకు వాళ్లు విలువ చెల్లించేలా హామీ పత్రం రాయించుకోవాలి. వజ్రాలకు మాత్రం రీసేల్‌ ఉంటుంది. వీటిని కొనేప్పుడు ఆయా షాపుల వారు ఇచ్చే గుర్తింపు కన్నా.. జీఐఏ ముద్ర ఉండేలా చూసుకోండి.
మోసపోతే డబ్బులు తిరిగి వస్తాయా?
దుకాణం వివరాలూ, రిజిస్ట్రేషన్‌ ఉన్న ఇన్‌వాయిస్‌ కాగితం మీదే బిల్లు వేయించాలి. ఇక, అరగ్రాము బంగారం కొన్నా సరే దానికి వచ్చే బిల్లును తప్పనిసరిగా దాచుకోవాలి. భవిష్యత్‌లో బంగారం మార్చేటప్పుడైనా, అమ్మేటప్పుడైనా ఆ బిల్లు ఉపయోగపడుతుంది. అంతేకాదు నగలు కొన్నాక ఏదైనా అనుమానం వచ్చినప్పుడు హాల్‌మార్క్‌ గుర్తింపు కేంద్రాలకు వెళ్లి మళ్లీ పరీక్షించుకోవచ్చు. ఒకవేళ అక్కడ తీసుకున్న బంగారం 916 స్వచ్ఛమైన బంగారం కాదని తేలితే.. వినియోగదారుల కోర్టును ఆశ్రయిస్తే డబ్బులు తిరిగి పొందొచ్చు. ఇందుకూ బిల్లు తప్పనిసరిగా ఉండాలి. బిల్లు ఉన్నప్పుడే వినియోగదారుడు చట్టాలూ, హక్కుల గురించి గట్టిగా మాట్లాడటానికి వీలవుతుంది.
-మనీష్‌ గుప్తా, బాలాజీ జ్యుయలరీ, పంజాగుట్టరం కొనేముందు...
ఒక్క క్షణం!

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list