GRANTHANIDHI blog Posts updates, Followకై Facebook MOHAN PUBLICATIONS Page LIKE చెయ్యగలరు

గరుత్మంతుడు-GARUTHMANTUDU

గరుత్మంతుడు
సృష్టిలో ప్రతి జీవికి స్వేచ్ఛను అనుభవించే హక్కును భగవంతుడు ప్రసాదించాడు. తమకు, తమవారి స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు భంగం కలిగినప్పుడు దానిని పరిరక్షించుకోవడం ధీరుల లక్షణం. మన పురాణంలోని గరుత్మంతుడు కూడా తనకు తన తల్లికి స్వేచ్ఛ కావాలని పోరాడి గెలిచిన ధైర్యవంతుడు. కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య వినత కొడుకు గరుత్మంతుడు. తండ్రి తపశ్శక్తి కారణంగా పుట్టుకతోనే మహాబలవంతుడు. ఇక కద్రువకు పాములే సంతానం. సహజ వైరులైన సర్పాలు, గరుడుని మధ్య ఎప్పుడూ యుద్ధం జరుగుతుండేది. సాధారణంగా బలశాలియైన గరుడునిదే పైచేయిగా ఉండేది. తన కుమారుల శక్తిహీనతకు, ఓటమికి కద్రువ కోపంతో మండిపోతూ వినతపై ద్వేషం పెంచుకుంది. వినత ద్వారా గరుడుని పొగరు అణచాలని అనుక్షణం ఆలోచించేది.
ఒకనాటి సాయంత్రం వినత, కద్రువలు వనవిహారం చేస్తున్నారు. దూరంగా దేవతల అశ్వం నీరెండలో పచ్చిక మేస్తూ ఉంది. దాని తెల్లని శరీరం నిగ నిగమని మెరుస్తూ ఆకర్షణీయంగా ఉంది. ఆ గుర్రం తెలుపు వర్ణాన్ని వినత పొగుడుతుంటే కద్రువ దానితోక నల్లగా ఉందని ఇలా ఇరువ్ఞరూ తమదే ఒప్పని వాదించుకున్నారు. ఆ వాదం కాస్తా ముదిరి పందెంలోకి దిగింది. ఓడిపోయి వారు గెలిచిన వారికి దాస్యం చెయ్యాలని పందెం వేసుకున్నారు. మరునాటి ఉదయం వినత, కద్రువ ఆ గుర్రం ఉన్నచోటుకు చేరుకున్నారు.
అయితే కద్రువ పథకం ప్రకారం ఆమె బిడ్డలైన నల్లపాములు ఆ గుర్రం తోకను చుట్టుకుని ఆ తోక నల్లదే అన్న భ్రాంతి కలిగించాయి. పందెం ప్రకారం వినత కద్రువకు దాసి అయింది. ఏదో సరదాకు వేసిన పందెం కనుక ఒక్కరోజు అనుకున్నది కద్రువ దురాలోచన వల్ల శాశ్వతమైంది. వినతతో పాటు గరుత్మంతుడు కూడా కద్రువకు, ఆమె సంతానానికి దాసులయ్యారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. గరుడుని అతని తల్లిని కద్రువ ఆమె పుత్రులు పెట్టే బాధలు ఎక్కువ కాసాగాయి. తమకు స్వేచ్ఛ కల్పించమని గరుడుడు పినతల్లిని కోరాడు. తన పిల్లలకు అమృతం తెచ్చిచ్చే పక్షంలో మీకు స్వేచ్ఛ కల్పిస్తానని షరతు విధించింది. మార్గం దొరికిందని ఆనందించిన గరుడుడు తల్లి ఆశీర్వాదం పొంది స్వర్గానికి ఎగిరాడు. స్వర్గలోకంలో ప్రవేశించి అమృత కలశాన్ని అందుకుని బయలుదేరుతుంటే దేవతలు అడ్డుకున్నారు.
తన రెక్కల తాకిడితో వారందరినీ ఎగరగొట్టాడు. ఆఖరుగా ఇంద్రుడు వజ్రాయుధం చేతబట్టి వచ్చాడు. వజ్రాయుధానికి కూడా చలించని అతని పరాక్రమానికి ఆశ్చర్యపడి అమృతం తాగమన్నాడు. కానీ గరుత్మంతుడు అమృతం తనకు అవసరం లేదనీ, తన తల్లికి దాస్య విముక్తి కలిగించడానికై పినతల్లికి ఇవ్వాలని అమృత భాంఢాన్ని ప్రసాదించమని ప్రార్థించాడు. విషసర్పాలకు, ఈర్ష్యాసూయలు కలిగిన వారికి అమృతపానం అనర్హమని ఇంద్రుడు నిరాకరించాడు. వారికి ఇచ్చినట్లే ఇచ్చి, తిరిగి తీసుకువస్తానని ఒప్పించి, గరుత్మంతుడు అమృత కలశంతో పినతల్లి వద్దకు వచ్చాడు. అతి పవిత్రమైన అమృతాన్ని శుచిగా స్వీకరించాలని, వారిని స్నానంచేసి రమ్మని చెప్పి కద్రువతో తనకు తన తల్లికి దాస్యవిముక్తి కలిగించమన్నాడు. అమృతాన్ని చూసిన సంతోషంతో వినత, గరుత్మం తులకు పంచభూతాల సాక్షిగా దాస్యవిముక్తి అయిందని కద్రువ ప్రకటించింది.
వెంటనే గరుత్మంతుడు అమృత కలశాన్ని దర్బ పొదలపై ఉంచాడు. నాగులు వడివడిగా అమృత కలశానికి దగ్గరకు రాగానే ఒక్క ఉదుటున అమృతాన్ని తీసుకుని స్వర్గానికి వెళ్లి ఇంద్రునికి అప్పగించాడు. ఎంతో ఆశతో వచ్చిన కద్రువ సంతానం నిరాశతో గరికలపై అమృతం చిందిందేమో అన్న ఆత్రుతతో నాకడం మొదలుపెట్టాయి. పదునైన గరికలు వాటి నాల్కలను చీల్చివేశాయి. తల్లికి తనకు స్వేచ్ఛను పొందే ప్రయత్నంలో గరుత్మంతుడు చూపిన నేర్పును, సాహసాన్ని మెచ్చుకుని దేవతలు పూలవాన కురిపించి ఆనందించారు. శ్రీమహావిష్ణువ్ఞ గరుడుని ధైర్యసాహసాలకు, బలానికి, వినయ, విధేయతలకు మెచ్చి, శాశ్వతంగా తన వాహనం చేసుకుని గరుడవాహనుడిగా కీర్తిపొందాడు.
– ఉలాపు బాలకేశవులు

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

MOHAN PUBLICATIONS Price List

జాతకచక్రం