GRANTHANIDHI blog Posts updates, Followకై Facebook MOHAN PUBLICATIONS Page LIKE చెయ్యగలరు

ఛాయా_సోమేశ్వరాలయం!-CHAYA-SOMESWARALAYAM

     
ఛాయా_సోమేశ్వరాలయం!-
CHAYA-SOMESWARALAYAM

ఛాయా సోమేశ్వరాలయం కుందూరు చోడుల కాలం నాటిది.దీనిని వాస్తుశాస్త్ర అద్భుతంగా పేర్కొంటారు చరిత్రకారులు. ఛాయా సోమేశ్వరాలయానికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి.. ఈ ఆలయ గర్భగుడిలో గోడపై ఎప్పటికీ కదలకుండా ఒకేస్థానంలో ఉన్నట్లుగా కనిపించే నీడ. రెండోది అక్కడికి దగ్గర్లోని చెరువులో నీరుంటే గర్భగుడిలో కూడా నీరు ఉబికి వస్తుంది.                          -మురళి రాగి, 7702510250

ఎక్కడ ఉంది?: నల్లగొండ పట్టణానికి సుమారు 
4 కిలోమీటర్ల దూరంలో పానగల్లులో ఉంది. 
విశిష్టత ఏంటి?: నిరంతర ఏక నిశ్చలాకార నీడ గర్భగుడిలో కనిపించడమే ఈ ఆలయ విశిష్టత. గర్బగుడి ముఖద్వారం ముందు రెండు స్తంభాలున్నా అన్నివేళలా ఒకే నీడ పడుతుంది. అది వెలుతురు ఉన్నంత సేపు కదలకుండా ఒకే స్ధానంలో ఉంటుంది. సూర్యుని గమనంలో మార్పు ఆ నీడను మార్చదు. 

నిర్మాణం ఏ కాలం?: క్రీస్తుశకం 11, 12 శతాబ్దకాలానికి చెందినదిగా చెప్తుంటారు. కుందూరు చోడులు దీనిని నిర్మించినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.
పేరెలా వచ్చింది?: సోమేశ్వరుడి ఆలయ గర్భగుడిలో నేరుగా నీడ పడటం వల్ల ఈ ఆలయానికి ఛాయా సోమేశ్వరాలయం అనే పేరొచ్చిందని కొందరంటే.. మరికొందరేమో.. శ్రీ సూర్యభగవానుడు తన సతీమణి ఛాయాదేవితో వచ్చి సోమేశ్వరుడిని పూజించాడనీ అందుకే ఛాయా సోమేశ్వరాలయం అనే పేరొచ్చిందని అంటున్నారు. 

ఛాయా మహత్యం: ఛాయా సోమేశ్వరాలయం త్రికూటాలయంగా కూడా ప్రసిద్ధి. తూర్పు వైపు ముఖం ఉన్న గర్భగుడిలో శివలింగం మీదుగా స్తంభాకారంలో ఏక నిశ్చలాకార నిరంతర ఛాయ సూర్యుని స్థానంతో సంబంధం లేకుండా ఏర్పడడం ఇక్కడి వింత. ఈ నీడ ఏ వస్తువుదన్న విషయం ఇంతవరకూ అంతు చిక్కలేదు. ఆలయ మధ్యభాగం చతురస్రాకారంలో ఉండి దానికి మూడువైపులా అంటే.. తూర్పు, పడమర, ఉత్తర దిశల్లో మూడు గర్భగుడులు ఉంటాయి. మూడు గర్భగుడులు ఒకేరీతి నిర్మాణ శైలిని కలిగి ఉన్నప్పటికీ కేవలం తూర్పువైపు ముఖం ఉన్న గర్భగుడిలో మాత్రమే ఏక నిశ్చల ఛాయ కనిపిస్తుంది. వాస్తవానికి ఈ నమూనా ప్రకారం.. కాంతి అంతరాలయంలోకి ప్రవేశించే క్రమంలో ప్రతీ గది కూడా ఎదురుగా ఉన్న గదిలో ఏకఛాయ ఏర్పడాలి. నాలుగు గదులలోనూ ఏకఛాయను వీక్షించే అవకాశం ఏర్పడేది. కానీ నీడలను ఏర్పరచడానికి శిల్పి సూర్యకాంతిని నేరుగా ఉపయోగించకుండా పరిక్షేపణం చెందిన సూర్యకాంతిని ఉపయోగించడం విశేషం.
శిల్పకళా కేంద్రం: ఛాయా సోమేశ్వరాలయానికి రాళ్లతో కూడిన పునాదిని ఎంచుకున్నారు. భూకంపాల వంటి ఉపద్రవాలు వచ్చినా కూడా నీడ చెదరకుండా ఉండేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందనేది శిల్పి ఆలోచన అయుండొచ్చు అని గ్రామస్థుల అభిప్రాయం. ఇక్కడ అద్భుతమైన శైలితో చెక్కిన కళా శిల్పాలతో కూడిన సంపద నిండి ఉన్నది. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే శిల్పాలను విభిన్న రీతిలో ప్రతిష్టించారు. మధ్యయుగపు ఛాయలతో శిల్ప కళానైపుణ్యానికి ప్రతీకగా నల్లరాతిలో చెక్కిన శిల్పకళాకృతులతో పశ్చిమ చాళుక్యులు.. కుందూరు చోడులు.. కాకతీయుల కళాతృష్ణకు నిదర్శనంగా ఛాయా సోమేశ్వరాలయం నిలిచింది. ఆలయానికి ముందు ఉదయ సముద్రమనే చెరువును తవ్వించారు నాటి రాజులు. దీనిద్వారా సాగునీరు.. తాగునీరు అందేది. పొలాల మధ్యలో నిర్మితమైన ఈ ఆలయం త్రికూటాలయంగా మూడు గర్భాలయాలతో ప్రసిద్ధి చెందింది. ఆలయ దర్శనానికి వెళ్లిన భక్తులకు చెరువునీళ్లు పంటచేళ్లు నిండి దేవాలయ మార్గంలోకి, ఆలయ ప్రాంగణంలోకి పొంగి పొర్లడం గమనించవచ్చు.

ప్రత్యేక ఆలయం: పానగల్లులోని అన్ని దేవాలయాల్లో అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో నిర్మించిన ఆలయం ఛాయా సోమేశ్వరాలయం. పురాతన కట్టడాలలో ప్రత్యేకమైందిగా.. విశిష్ట నేపథ్యమున్న ఆలయంగా దీనిని పిలుస్తారు. ప్రతిరోజూ భక్తులు ఇక్కడకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. పానగల్లు చెరువు.. ఆలయాలు.. చరిత్రను దృష్టిలో ఉంచుకుని దీనిని పర్యాటక కేంద్రంగా గుర్తించాల్సిన అవసరం ఉన్నది.                                 -సిలివేరు లింగస్వామి

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

MOHAN PUBLICATIONS Price List

జాతకచక్రం