MohanPublications Print Books Online store clik Here Devullu.com

కృష్ణాష్టమి_Krishnashtami_శ్రీకృష్ణ జన్మాష్టమి_



కృష్ణాష్టమి ప్రత్యేకత ఏమిటి


హిందూ సంప్రదాయంలో కృష్ణుని ప్రత్యేకతే వేరు. తల్లులకు బాలకృష్ణునిగా, చిన్నవారికి చిలిపి కృష్ణునిగా, స్త్రీలకు గోపికా వల్లభునిగా, పెద్దలకు గీతాకారునిగా... ఇలా ప్రతి ఒక్కరి మదిలో ఏదో ఒక రూపాన కొలువై ఉంటాడు. అందుకే కృష్ణుని జన్మదినం అంటే, మన ఇంట్లో మనిషి పుట్టినరోజు అన్నంత ఘనంగా నిర్వహించుకుంటాం. ఇంతకీ ఆ రోజు కృష్ణుని పూజ ఎలా జరుగుతుందో తెలుసుకుందామా!

శ్రావణబహుళ అష్టమి రోజున, రోహిణి నక్షత్రంలో కృష్ణుడు జన్మించాడు. ఈ కృష్ణాష్టమి రోజు ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. గుమ్మానికి తోరణాలు, గడపకు పసుపుకుంకుమలు, పూజగదిలో ముగ్గులు అద్ది పూజకు సిద్ధం కావాలి. ఆ బాలకృష్ణుని ఇంటికి ఆహ్వానిస్తూ, ఇంటి బయట నుంచి లోపలివరకు కృష్ణుని పాదాలను ముగ్గుతో వేయాలి. ఇతర పూజలకు భిన్నంగా కృష్ణాష్టమి పూజను మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభించడం ఆనవాయితీ. వీలైతే ఆ సమయానికే పూజ సాగేలా చూసకోవాలి.


కృష్ణునికి తులసి అంటే చాలా ఇష్టం. అందుకని పూజలో ఆచమనం చేసే నీటిలో తులసి ఆకులు వేసుకుంటే మంచిదని చెబుతారు. ఆయన ప్రతిమను కూడా తులసిమాలతో అలంకరించమని సూచిస్తారు. కృష్ణునికి పొన్నచెట్టుతోనూ అనుబంధం ఉంది. వీలైతే ఆ పొన్న పూలతో ఆయనను పూజిస్తే మంచిది. ఆయనకు ఇష్టమైన తెలుపు లేదా పసుపు రంగు పూలతో పూజించినా శుభమే! కృష్ణాష్టకమ్‌, కృష్ణ అష్టోత్తరం వంటి స్తోత్రాలను చదువుతూ, పరిమళభరితమైన పుష్పాలతో ఆయనను అర్చించాలి.


కృష్ణాష్టమి రోజున ఉపవాసం, జాగరణ చేసే ఆచారం ఉంది. కాబట్టి కృష్ణునికి కూడా సాత్వికమైన ఆహారాన్నే నివేదిస్తారు. వడపప్పు, పానకం, పళ్లు వంటి నివేదనలు సాధారణం. వీటితో పాటు ఆయనకు ఇష్టమైన పాలు, వెన్న, మీగడను కూడా ప్రసాదంగా సమర్పించవచ్చు. మరికొందరు... బాలింతలకు పెట్టే మినపపిండి, పంచదార కలిపి పెడతారు. కృష్ణుడు అప్పుడే జన్మించాడు కాబట్టి, ఆయన తల్లిని బాలింతరాలుగా భావిస్తూ ఈ ఆచారం మొదలై ఉండవచ్చు. చలికాలానికి శరీరాన్ని సిద్ధం చేయడం కూడా ఈ ప్రసాదం వెనుక పరమార్థంగా కనిపిస్తుంది.

కృష్ణాష్టమి రోజు పూజతో పాటుగా ఆయన స్మరణ కూడా ముఖ్యమే! ఆ గోపాలుని వైభవాన్ని తెలియచేసే భాగవతం, భగవద్గీతలను ఈ రోజు ఎంతో కొంత పఠించాలి. అలా కృష్ణుని తలుస్తూ, కొలుస్తూ, భజిస్తూ కృష్ణాష్టమి రాత్రిని గడపాలి. కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి, కొందరు రాత్రివేళ్లే కృష్ణపూజ చేస్తారు. అలా కృష్ణుని పూజించాలనుకునే ప్రదేశంలో బియ్యం పోసి.... దాని మీద ఒక కుండని పెడతారు. ఆ కుండ మీద కృష్ణుని ప్రతిమను ఉంచి, పూజని నిర్వహిస్తారు. అర్ధరాత్రి వేళ శంఖంలో నీటిని తీసుకుని చంద్రునికి, కృష్ణునికి అర్ఘ్యమిస్తారు. మర్నాడు ఉదయాన్నే దగ్గరలోని వైష్ణవాలయాన్ని దర్శించి ఉపవాసాన్ని విరమిస్తారు.

ఇక కృష్ణాష్టమి రోజు రాత్రి జరిగే ఉట్టి కార్యక్రమం గురించి తెలిసిందే. బాలకృష్ణుని చిలిపి చేష్టలను తల్చుకుంటూ... పాలు, పెరుగు, వెన్న, అటుకులు, పళ్లులాంటి పదార్థాలు ఉంచిన ఈ ఉట్టిని కొడతారు. మరికొందరు హోళీ తరహాలో గులాల్‌ చల్లుకుంటూ తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. ఇంకొందరు చిన్న బాలకృష్ణుని ప్రతిమను మనసారా అలంకరించిచి, ఊయలలో ఉంచి రాత్రంతా ఆయన కోసం కీర్తనలు, భజనలు పాడుతూ ఉంటారు. మరి ఈ కృష్ణాష్టమిని మీరెలా జరుపుకోవాలని అనుకుంటున్నారు?


యశో గుణ సంపన్నుడు

పురుషునిలో ఏమేమి లక్షణాలుంటే స్త్రీలందరికీ అతడు పరిపూర్ణంగా నచ్చుతాడో శ్రీకృష్ణుడు స్వయంగా ఆచరించి చూపాడు. తాను పరమాత్ముడయినప్పటికీ, ఒక సాధారణ బాలకునిలా ఎన్నో చిలిపి చేష్టలు చేశాడు. అమాయక బాలునిలా మన్ను తిన్నాడు. అదేమని అడిగిన తల్లికి నోటిలో పదునాలుగు భువనభాండాలు చూపించాడు. తల్లి ప్రేమపాశానికి లొంగిపోయి, గÆ ధర్వులకి శాపవిముక్తి కావించాడు. మేనమామ కంసుడు పంపిన రాక్షసులనెందరినో మట్టి కరిపించాడు. గోవులు కాచాడు. గోవర్థనగిరిని చిటికెన వేలిపై నిలిపి గోకులాన్ని రక్షించాడు. కాళియుడి పీచమణిచాడు. ఉట్టికొట్టాడు, వెన్న దొంగిలించాడు. గోపికల చీరలు ఎత్తుకెళ్లాడు. తోటిగోపాలకుల ఆనందం కోసం మురళి వాయించాడు. రాధను పరిపూర్ణంగా ప్రేమించాడు.


తననే గుండెల్లో నింపుకుని, తండ్రి బలవంతం మేరకు ఇష్టంలేని పెండ్లికి తలవంచిన రుక్మిణి కోసం అందరినీ ఎదిరించాడు. ఇష్టసఖి సత్యభామ కోపంతో తన్నిన తన్నుకు కూడా చిరునవ్వే సమాధానంగా చూపాడు. చివరకు ఆమెకోసం తులాభారం తూగాడు. ద్రౌపదికి మాన సÆ రక్షణ చేశాడు. సుభద్రా తనయుడైన అభిమన్యుని ప్రేమను గెలిపించాడు. తననే అన్నీ అనుకున్న పాండవులకు అన్నింటా తానే అయి నిలిచాడు. వారికోసం దౌత్యం కూడా నడిపాడు. చివరికి అర్జునునికి రథసారథిగా మారాడు. ఆత్మస్థైర్యం కోల్పోయిన అర్జునుని కోసం గీతాచార్యునిగా మారాడు.

కొన్నితరాల వరకు స్థిరంగా నిలబడిపోయేటటువంటి లోకోత్తరమైన భగవద్గీతను మానవాళికి అందించాడు. తాను అండగా నిలచిన పాండుపుత్రులకోసం మంత్రాంగం నడిపి కురుక్షేత్ర సంగ్రామంలో నెగ్గేలా చేశాడు. లోకానికి కంటకంగా మారిన కంస, నరకాసురాది రక్కసులను సంహరించాడు. చివరకు తానే దూర్వాసుని శాపానికి కట్టుబడి మామూలు మానవునిలా బోయవాని చేతిలో మరణించిన కృష్ణుడు యశోగుణ సంపన్నుడు.

ఈ పండగను ఇలా జరుపుకోవాలి
శ్రావణ బహుళ అష్టమినాటి అర్ధరాత్రిపూట సాక్షాత్తూ ఆ పరమాత్ముడే దేవకీదేవి అష్టమగర్భాన జన్మించాడు. భూభారాన్ని తగ్గించడానికి అవతరించినప్పటికీ తన దివ్యప్రేమతో అందరినీ ఉద్ధరించిన అమృతమూర్తి. ఆబాలగోపాలం ఆయన పుట్టినరోజునే జన్మాష్టమిగా జరుపుకుంటారు. ఇది యావద్భారతం చేసుకునే పండుగ. ఈ వ్రతం చేసుకునేవారు ఉదయాన్నే లేచి పరిశుద్ధులై, షోడశోపచారాలతో కృష్ణుని పూజించాలి. పగలంతా ఉపవసించి సాయంకాలం చిన్నికృష్ణుని విగ్రహాన్ని ఊరేగించి, తర్వాత ఊయలలో ఉంచి, ఊపాలి. దేవకీదేవి బాలకృష్ణునికి స్తన్యమిస్తున్నట్లుగా ఉండే విగ్రహాన్ని పూజించినా మంచిదే. అనంతరం కృష్ణునికి ప్రీతికరమైన పాలు, వెన్న, పండ్లు, అటుకులు మొదలైన వాటిని నైవేద్యం పెట్టి, వాటిని ప్రసాదంగా ఆరగించడం వల్ల అన్నింటా జయం సిద్ధిస్తుందని పురాణోక్తి. ఈ పుణ్యతిథి నాడు కృష్ణుని పూజించి, భాగవత గ్రంథాన్ని పఠించినా, దానం చేసినా సకల పాపాలూ తొలగి, చతుర్విధ ఫల పురుషార్థాలు అంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం ప్రాప్తిస్తాయని స్కాందపురాణం చెబుతోంది.


శ్రీకృష్ణ జన్మాష్టమి 
(Krishnashtami)

   సృష్టి స్థితి కారుడైన శ్రీకృష్ణుడి జన్మ దినాన్ని ''కృష్ణాష్టమి''గా వేడుక చేసుకుంటాం. శ్రావణ బహుళ అష్టమి రాత్రి రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. కృష్ణాష్టమిని "గోకులాష్టమి", "అష్టమి రోహిణి", "శ్రీకృష్ణ జన్మాష్టమి", "శ్రీకృష్ణ జయంతి", "శ్రీ జయంతి", "సాతం ఆతం", "జన్మాష్టమి" - ఇలా రకరకాలుగా వ్యవహరిస్తారు
.
    శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కృష్ణుడు ఇంట్లోకి రావాలని ఆశిస్తూ వాకిట్లో బియ్యప్పిండి లేదా ముగ్గుతో బాల గోపాలుడి పాదాలను తీర్చిదిద్దడంతో పండుగ వాతావరణం మొదలవుతుంది. ద్వారాలకు మావిడాకులు, వివిధ పూవులతో తోరణాలు కట్టి, కృష్ణుని విగ్రహాన్ని తడి వస్త్రంతో శుభ్రపరచి, చందనం, కుంకుమలతో తిలకం దిద్దుతారు. కృష్ణుని విగ్రహాన్ని, పూజా మందిరాన్ని పూవులతో అలంకరిస్తారు. అక్షింతలు, ధూపదీపాలతో పూజిస్తారు.
పాయసం, వడపప్పు, చక్రపొంగలి లాంటి ప్రసాదాలతో బాటు శొంఠి, బెల్లంతో చేసిన పానకం, వెన్న, మీగడ, పాలు నైవేద్యంగా పెడతారు. ముఖ్యంగా అటుకులను తప్పనిసరిగా సమర్పిస్తారు. కృష్ణుడికి కుచేలుడు ప్రేమగా అటుకులను ఇచ్చాడు. ఆ అటుకులు తీసుకుని, కుచేలునికి సర్వం ప్రసాదించాడు గనుక, ఈ పర్వదినాన బెల్లం కలిపిన అటుకులను పూజలో తప్పకుండా ఉంచుతారు.

   శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని, అష్టమి నాడు ఉపవాసం ఉండి, నవమి ఘడియల్లో పారణతో ముగిస్తారు. ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి.

మమాఖిల పాప ప్రశమనపూర్వక సర్వాభీష్ట సిద్ధయే
'శ్రీ జన్మాష్టమీ వ్రతమహం కరిష్యే
అనే మంత్రాన్ని స్మరిస్తూ పూజ చేసుకోవాలి. శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు వీధుల్లో ఉట్లు కట్టి ఆడే ఆట రక్తి కడుతుంది. ఆ ఉట్టిని పైకీ, కిందికీ లాగుతూ ఉంటారు. ఒక్కొక్కరూ పోటీ పడుతూ ఉట్టిని కొట్టేందుకు ప్రయత్నిస్తారు.

శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని కృష్ణ లీలల్ని స్మరించుకుందాం.
ద్రౌపది, తనకు వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు తన భర్తలను సాయం అర్ధించలేదు. మరెవర్నీ ప్రాధేయపడలేదు. "కృష్ణా.. నన్ను నువ్వే కాపాడాలి" అంటూ శ్రీకృష్ణుని వేడుకుంది. తనను నమ్మి, శరణు వేడినవారిని దైవం ఎన్నడూ విడిచిపెట్టదు. కృష్ణుడు అందించిన దివ్య వస్త్రంతో ద్రౌపది అవమానం నుండి బయటపడింది.

కాళియ నాగుపాము యమునా నదిలో నివాసం ఏర్పరచుకుంది. ఆ పాము చిందించే విషంతో యమునా జలం కలుషితం అయింది. అంతేనా.. ఆ విషపు వేడికి నీలు మరుగుతూ, నదిపై ఎగిరే పక్షులకు కూడా హాని చేస్తోంది. ఆ వేడి సేగాలకు తట్టుకోలేక పక్షులు, నదిలో పడి చనిపోసాగాయి. ఇది చూసిన బాల కృష్ణుని మనసు ఆర్ద్రమైంది.

దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ దైవ లక్షణం కదా! యమునా జలాలకు కాలుష్యం నుండి విముక్తి ప్రసాదించాలని, కాళీయుని కోరల్లోంచి వెలువడుతోన్న విషం నుండి పశుపక్ష్యాదులను కాపాడాలని, యమునా జలాన్ని తిరిగి మంచినీటిగా మార్చాలని అనుకున్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు యమునా నదిలో దూకాడు.

కాళీయ సర్పం కృష్ణుని చూసింది. తనకు అపకారం తలపెట్టిన బాలకుడు ఎవరు అని ఆశ్చర్యపోయింది. తక్షణం బుద్ధి చెప్పాలని, తన పొడవాటి శరీరంతో కృష్ణుని చుట్టేసింది.ఒడ్డున ఉన్నగోప బాలికలు, యశోదమ్మ అందరూ కంగారుపడ్డారు. భయాందోళనలకు లోనయ్యారు. దాంతో కృష్ణుడు నవ్వుతూ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.

శ్రీకృష్ణుని ఆకృతి పెరగడంతో కాళీయ సర్పం పట్టు విడిపోయి, కోపంతో బుసలు కొట్టింది. ఇక కృష్ణుడు కాళీయుని నూరు పడగలపై నృత్యం చేశాడు. శ్రీకృష్ణుడు ఒక్కో పడగమీదికి లంఘిస్తూ కాళియ మర్దనం చేస్తోంటే కాళీయుడు తగ్గిపోయాడు. పడగలు దెబ్బతిన్నాయి. రక్తం ధారలు కట్టింది.

కాళీయుడు పశ్చాత్తాపానికి లోనయ్యాడు. శ్రీకృష్ణుని శరణు వేడాడు. కాళీయుని భార్యలు కూడా కృష్ణుని పాదాలపై పడి, కాళీయుని క్షమించమని కోరాయి. కృష్ణుడు దయ తలచాడు.. కాళీయుని వెంటనే యమునానది వదిలి వెళ్ళి, రమణక ద్వీపానికి వెళ్ళమన్నాడు. కాళీయుడు కుటుంబ సమేతంగా యమున వదిలి వెళ్లడంతో యమునాజలం పవిత్రమైంది. అందరూ ఆనందించారు.
కృష్ణ లీలలకు అంతేముంది? ఎవరైనా, ఎన్నయినా తలచుకోవచ్చు.








No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list