MohanPublications Print Books Online store clik Here Devullu.com

డివిడెండ్.. గ్రోత్‌.. మదుపరికి ఏది సరి-Demand Growth(Siri)


డివిడెండ్.. గ్రోత్‌..
మదుపరికి ఏది సరి?
స్టాక్‌ మార్కెట్లు కొత్త స్థాయులను చేరుతున్నాయి. మంచి రాబడులను అందిస్తుండటంతో చాలామంది ఇప్పుడు ఈక్విటీలు, ఈక్విటీ ఆధారిత పథకాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసే వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. మొదటిసారి ఫండ్లలో మదుపు చేయాలని ప్రయత్నిస్తున్న వారికైనా.. ఇప్పటికే మదుపు చేస్తున్నవారికైనా తరచూ ఒక విషయంలో సందేహం ఉంటుంది.. అదే.. గ్రోత్‌, డివిడెండ్‌ ఐచ్ఛికాల్లో దేన్ని ఎంచుకోవాలి? ఈ సందేహానికి సమాధానం తెలుసుకుందామా! 
క్రమానుగత పెట్టుబడి విధానం ద్వారా దీర్ఘకాలంలో మంచి సంపదను సృష్టించేందుకు మ్యూచువల్‌ ఫండ్లు ఒక మార్గం. రకరకాల ఫండ్లు.. అందులో పలు రకాల ఆప్షన్లు ఉంటాయి. ఇందులో ఏది మనకు సరైనదో నిర్ణయించుకోవడమే కీలకం. అందులోనూ గ్రోత్‌ ఆప్షన్‌, డివిడెండ్‌ ఆప్షన్‌ను ఎంచుకోవడంలో పూర్తి అవగాహనతో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. 
ఏది ఎంపిక చేసుకోవాలి? 
గ్రోత్‌, డివిడెండ్‌ ఆప్షన్లను ఎంచుకునేందుకు రెండు కీలక అంశాలను పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. 
* నగదు అవసరం, ఎంత వ్యవధిలో కావాలి 
* పన్ను ప్రయోజనాలు. 
చాలామంది పన్ను ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే ఆప్షన్‌ ఎంపికను నిర్ణయించుకుంటారు. ఇది, ప్రధానమే అయినప్పటికీ.. దీనితోపాటు పరిశీలించాల్సిన ఇతర విషయాలూ కొన్ని ఉన్నాయి. 
ఈక్విటీ ఫండ్లలో.. 
సులభంగా అర్థం చేసుకునేందుకు ఈక్విటీ ఫండ్ల పనితీరును పరిశీలిద్దాం.. సాధారణంగా ఈక్విటీలు, ఈక్విటీ ఆధారిత పెట్టుబడులు అంటే.. దీర్ఘకాలానికి ఉద్దేశించినవి. వీటిని ఎంపిక చేసుకునేప్పుడే ఏదైనా కొన్ని సంవత్సరాల తర్వాత నిర్ణీత ఆర్థిక లక్ష్యాన్ని సాధించేందుకు వీలుగా క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టేందుకు అని భావించాలి. అంటే, ఈ ఫండ్లలో మదుపు చేసినప్పుడు పెట్టుబడులను కొనసాగిస్తూనే ఉండాలి. కానీ, వెనక్కి తీసుకునే ప్రయత్నాలు చేయకూడదు. అప్పుడే ఈ ఫండ్ల ద్వారా వచ్చే చక్రవడ్డీ ప్రభావం మనకు మంచి లాభాలను సంపాదించి పెడుతుంది. అదే సమయంలో దీర్ఘకాలిక మూలధన లాభానికి ఎలాంటి పన్నూ వర్తించదు. అందుకే.. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లను ఎంచుకునేప్పుడు.. గ్రోత్‌ ఆప్షన్‌ను లేదా డివిడెండ్‌ రీ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్‌ను ఎంచుకోవడమే ఉత్తమం.
అయితే ఇక్కడా కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఇందులో ఒకే రంగానికి పరిమితమయ్యే సెక్టార్‌ ఫండ్లు, థీమ్‌ ఫండ్లను ఎంచుకునేప్పుడు డివిడెండ్‌ పే ఔట్‌ ఐచ్ఛికాన్ని ఎంచుకోవడమే మంచిది. లేదా సమయానుకూలంగా మంచి రాబడులు వచ్చినప్పుడు ఆ లాభాలను స్వీకరిస్తుండాలి. సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపు పొందేందుకు ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాల్లో (ఈఎల్‌ఎస్‌ఎస్‌) మదుపు చేసినప్పుడు కనీసం మూడేళ్లపాటు పెట్టుబడిని కొనసాగించాల్సి ఉంటుంది. ఈ లాకిన్‌ వ్యవధిలో వచ్చిన రాబడులు వెంటవెంటనే స్వీకరించేందుకు డివిడెండ్‌ పేఔట్‌ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ముఖ్యంగా 50ఏళ్లకు పైబడినవారు, నష్టభయాన్ని భరించే శక్తి తక్కువగా ఉన్నవారు ఈ ఆప్షన్‌ను ఎంచుకోవడం మేలు. 
యువ మదుపరులు ఈఎల్‌ఎస్‌ఎస్‌లలో గ్రోత్‌ ఆప్షన్‌ను ఎంచుకోవడమే సరైనది. 
డెట్‌ పథకాల్లో.... 
ఈక్విటీ పథకాల్లో ఏ ఆప్షన్‌ను ఎంచుకోవాలో అర్థం చేసుకోవడం సులభమే. కానీ, డెట్‌ పథకాల విషయానికి వచ్చే సరికి ఇందులో కొంత సంక్లిష్టత ఉంటుంది. ఇందులో అందే డివిడెండుకు.. డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ (డీడీటీ) వర్తిస్తుంది. అంటే మరేమిటో కాదు.. మీకు అందే డివిడెండ్లపైన పన్ను అన్నమాట. అయితే, ఇది మీకు అందిన డివిడెండ్ల నుంచి కాకుండా.. ఎన్‌ఏవీ నుంచి తగ్గిస్తారు. ఈ నేపథ్యంలో.. డివిడెండ్‌ పేఔట్‌, డివిడెండ్‌ రీ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్లు పన్ను పరంగా అంత కలిసొచ్చే వీలుండదు. మరి, ఇలాంటప్పుడు ఏ ఆప్షన్‌ ఎంచుకోవడం కలిసొస్తుంది? 
* ఎప్పటికప్పుడు నగదు తీసుకోవాలనుకుంటే.. డెట్‌ పథకాల్లో మదుపు చేసిన తర్వాత.. నిర్ణీత వ్యవధుల్లో కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలని భావించే వారు డెట్‌ ఫండ్లలోని ఈక్విటీ ఆప్షన్‌లో మదుపు చేసి, క్రమానుగతంగా వెనక్కి తీసుకోవడాన్ని (ఎస్‌డబ్ల్యూపీ) పరిశీలించవచ్చు. ముఖ్యంగా 10%, 20% పన్ను శ్లాబులో ఉన్నవారు దీన్ని పాటించడం కలిసొస్తుంది. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మీరు వెనక్కి తీసుకునే మొత్తానికి అమ్మకపు రుసుము లేకుండా చూసుకోవాలి. దీనికోసం ఫండ్‌ ఎన్నాళ్ల తర్వాత అమ్మకపు రుసుము విధించడం లేదనే విషయాన్ని తెలుసుకోవాలి.
30శాతం పన్ను శ్లాబులో ఉన్నవారు.. మూడేళ్లలోపే పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలని భావించినప్పుడు డివిడెండ్‌ చెల్లింపు ఐచ్ఛికాన్ని ఎంచుకోవచ్చు. అదే సమయంలో మూడేళ్లకు మించి పెట్టుబడులను కొనసాగించాలనుకున్నప్పుడు గ్రోత్‌ ఆప్షన్‌ను ఎంచుకోవడమే మంచిది. దీనిద్వారా మూలధన రాబడిపై ద్రవ్యోల్బణ సూచీ సర్దుబాటు ప్రయోజనం లభిస్తుంది. ఇలాంటి సందర్భంలో క్రమం తప్పకుండా పెట్టుబడిని వెనక్కి తీసుకునేందుకు ఎస్‌డబ్ల్యూపీని ఎంచుకోవచ్చు. మీరు పెట్టిన ప్రతి పెట్టుబడీ మూడేళ్లకు మించి కొనసాగేలా చూసుకోండి. 
ఆప్షన్లలో ఒకదాని నుంచి మరొకదానికి మారే అవకాశం ఉన్నప్పటికీ.. లాభాలు ఆర్జించినప్పుడు అనవసరంగా పన్ను చెల్లించాల్సిన అవసరం రావచ్చు. దీన్ని నివారించేందుకు పెట్టుబడులు ప్రారంభించేప్పుడే.. దాన్ని ఎంత వ్యవధి వరకూ కొనసాగిస్తారనే అంశంలో ఒక స్పష్టత ఉండాలి. 
డెట్‌ ఫండ్లలో దీర్ఘకాలం కొనసాగుతూ.. పెట్టుబడులను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేదనుకున్నప్పుడు వ్యూహం వేరే విధంగా ఉంటుంది. ఇలాంటి వారు డివిడెండ్‌ చెల్లింపు, ఎస్‌డబ్ల్యూపీలను ఎంచుకోవాల్సిన అవసరం లేదు. గ్రోత్‌ లేదా డివిడెండ్‌ రీ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్‌ను పరిశీలించాలి. 
పెట్టుబడిని కొనసాగించాలని భావించే వారు గ్రోత్‌ ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంది. మూడేళ్లలోపే వెనక్కి తీసుకోవాలని భావించే 30శాతం పన్ను శ్లాబులో ఉన్నవారు.. డివిడెండ్‌ రీ ఇన్వెస్ట్‌మెంట్‌ను పరిశీలించవచ్చు. వీరితోపాటు స్వల్పకాలిక వ్యవధికి లిక్విడ్‌, అల్ట్రా షార్ట్‌ టర్మ్‌ ఫండ్లను ఎంచుకోవాలని భావించేవారికి డీడీటీ 28.33
(సర్‌ఛార్జి, సెస్సులతో కలిపి) వర్తిస్తుంది. 30.9శాతం ఆదాయపు పన్ను శ్లాబు కన్నా ఇది కొంత తక్కువే. 
మీరు కొత్తగా పెట్టుబడి పెడుతూ.. ఏ ఆప్షన్‌ను ఎంచుకోవాలనే ప్రశ్న వచ్చినప్పుడు ఈ అంశాలన్నీ పరిశీలించండి. ఒకవేళ ఇప్పుడు ఫండ్‌ ఆప్షన్‌ను మార్చుకోవాలనుకుంటే.. వర్తించే రుసుములను, పన్ను భారాన్నీ పరిశీలించండి.
- విద్యా బాల, హెడ్‌, మ్యూచువల్‌ ఫండ్‌ రీసెర్చ్‌, 
FundsIndia.com

తీవ్ర వ్యాధులు వచ్చినా.. చింత లేకుండా!
తీవ్ర వ్యాధులు సోకితే ఉండే మానసిక, శారీరక బాధలు వర్ణనాతీతం. దీంతోపాటు ఆర్థికంగా వచ్చే ఇబ్బందులు కోలుకోలేని దెబ్బ తీస్తాయి. గుండె, క్యాన్సర్‌కు సంబంధించిన వ్యాధులు వచ్చినప్పుడు అటు సంపాదనపై ప్రభావం పడుతుంది. ఇటు వైద్య చికిత్సలకు లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు ఆర్థికంగా ఆదుకునే ప్రత్యేక బీమా పాలసీల అవసరం ఎంతైనా ఉంది. 
నేటి యువత కాలంతోపాటు పోటీ పడుతోంది. ఈ నేపథ్యంలో సంపాదన గురించి ఆలోచిస్తూ.. వారు తమ ఆరోగ్య విషయాలను పట్టించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆహార అలవాట్లు మారుతున్నాయి. జీవన శైలిలో తేడా వస్తోంది. ఈ నేపథ్యంలో గుండె, క్యాన్సర్‌ సంబంధిత వ్యాధుల బారిన పడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దాదాపు 50శాతం మరణాలు ఈ రెండు వ్యాధులతోనే అనేది ఆందోళన కలిగించే విషయమే. నివేదికల ప్రకారం మన దేశంలో అత్యధిక గుండెపోటు కేసులు నమోదవుతున్నాయి. ఏటా దాదాపు 2లక్షలకు మించి గుండె శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. ఇక క్యాన్సర్‌ కూడా మన దేశంలో తీవ్రంగానే ప్రభావం చూపిస్తోంది. 2020నాటికి క్యాన్సర్‌ కేసులు 25శాతం పెరిగే ప్రమాదం ఉందని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. 
క్యాన్సర్‌, గుండె వ్యాధులకు సంబంధించిన ఈ గణాంకాలు ఆందోళన కలిగించే మాట వాస్తవమే. అయితే, వీటిని ఎదుర్కోవడానికి వైద్య పరిశోధనలు కూడా తీవ్రంగానే కొనసాగుతున్నాయి. వీటికి చికిత్స కూడా ఇప్పుడు పూర్తిస్థాయిలో సాధ్యమే. సరైన సమయానికి సరైన వైద్యం అందడమే ఇక్కడ ముఖ్యం. అయితే, ఈ వైద్యం కాస్త ఖరీదైనదే. ఈ రెండు వ్యాధులను కూడా తీవ్ర వ్యాధులుగానే పరిగణించాలి. పైగా వీటికి దీర్ఘకాలంపాటు వైద్య చికిత్స, ఔషధాలను వాడాలి. తరచూ ఆసుపత్రికి వెళ్లాలి. పూర్తిస్థాయిలో కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందన్నది కూడా కచ్చితంగా చెప్పడం కష్టమే. 
ఒకసారి ఇవి సోకితే.. చికిత్స కోసం ఎంత ఖర్చవుతుందనేది ప్రతి కుటుంబానికీ తెలిసి ఉండాలి. ఆర్జించే ప్రతి వ్యక్తీ తాను దీనికి సిద్ధంగా ఉన్నానా అనేది పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. గుండెపోటు వచ్చినప్పుడు ఆసుపత్రిలో చేరితే.. బైపాస్‌లాంటివి అవసరం అయినప్పుడు దాదాపు రూ.10లక్షల వరకూ ఖర్చవుతుంది. క్యాన్సర్‌ బారినపడ్డప్పుడు కీమోథెరపీ కోసం దాదాపు రూ.15లక్షల వరకూ కావాల్సి వస్తుంది. చేరిన ఆసుపత్రి, కీమోథెరపీలను బట్టి, ఇంతకన్నా అధికంగానే అవసరపడొచ్చు. 
కుటుంబంలో ఆర్జించే వ్యక్తికే ఇలాంటి వ్యాధులు వస్తే.. పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. కుటుంబానికి క్రమం తప్పకుండా రావాల్సిన ఆదాయం కూడా ఆగిపోవచ్చు. అదే సమయంలో భవిష్యత్తులో ఆర్జన శక్తి కూడా సన్నగిల్లే అవకాశం లేకపోలేదు. దీనివల్ల కుటుంబం ఆర్థిక జీవన శైలి దెబ్బతింటుంది. 
ఆరోగ్య బీమా ఉన్నా.. 
ప్రతి వ్యక్తికీ ఆరోగ్య బీమా ఉండాలనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అయితే, సాధారణంగా ఒక వ్యక్తి దాదాపు రూ.2లక్షల నుంచి రూ.3లక్షల వరకూ మాత్రమే ఆరోగ్య బీమా తీసుకుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఏ మాత్రం సరిపోదనే చెప్పుకోవాలి. ముఖ్యంగా గుండె, క్యాన్సర్‌ సంబంధిత వ్యాధులు వచ్చినప్పుడు అయ్యే ఖర్చుకూ.. ఉన్న బీమాకూ ఏ మాత్రం పొంతన ఉండదు. అందులోనూ ఆరోగ్య బీమా పాలసీ ఆసుపత్రిలో చేరినప్పుడు అయ్యే ఖర్చులకు మాత్రమే పరిహారం ఇస్తుంది. దీర్ఘకాలిక అవసరాలకు సరిపోయేలా ఆర్థిక భద్రత లభించదు. ఈ నేపథ్యంలోనే గుండె, క్యాన్సర్‌ వ్యాధులకు ప్రత్యేక పాలసీల అవసరం పెరుగుతోంది. ఇవి అందుబాటు ధరల్లోనే లభిస్తాయి. ఉదాహరణకు 30ఏళ్ల పొగతాగని వ్యక్తి ఏడాదికి రూ.1200 వరకూ చెల్లిస్తే చాలు.. రూ.10లక్షల హార్ట్‌ కవర్‌ తీసుకోవచ్చు. అదే క్యాన్సర్‌ కవర్‌ అయితే రూ.20లక్షల వరకూ లభిస్తుంది.
* ప్రస్తుతం కొన్ని జీవిత బీమా సంస్థలు గుండె, క్యాన్సర్‌ సంబంధిత వ్యాధులను గుర్తించగానే పరిహారం అందించేలా పాలసీలను అందిస్తున్నాయి. దీనివల్ల పాలసీదారుడు తనకు ఇష్టం వచ్చిన చోట మంచి చికిత్స పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది. పెట్టుబడులు, పిల్లల చదువులకు దాచుకున్న మొత్తం, ఇంటి కొనుగోలు, పదవీ విరమణకు దాచుకున్న మొత్తాలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసుకోవచ్చు. 
* ప్రస్తుత డిజిటల్‌ యుగంలో సరైన పాలసీని ఎంపిక చేసుకోవడం ఏమంత కష్టం కాదు. సరైన పాలసీని, సరైన మొత్తానికి క్షణాల్లో ఎంచుకోవచ్చు. పాలసీలను ఎంచుకునేప్పుడు ఈ వ్యాధులు సోకినప్పుడు పూర్తి స్థాయిలో పరిహారం లభించే పాలసీలను పరిశీలించడం తప్పనిసరి.
- పునీత్‌ నందా, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌,
- ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list